ప్రతి ఒక్కరూ చాంపియనే | Prime Minister Narendra Modi congratulated the Olympic team | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ చాంపియనే

Published Fri, Aug 16 2024 4:21 AM | Last Updated on Fri, Aug 16 2024 12:12 PM

Prime Minister Narendra Modi congratulated the Olympic team

ఒలింపిక్‌ బృందాన్ని అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ  

స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అథ్లెట్లు 

ఒలింపిక్స్‌ నిర్వహించడం భారత్‌ కల అని వెల్లడి 

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం న్యూఢిల్లీలోని తన నివాసంలో అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిస్‌ క్రీడల్లో రెండు పతకాలు సాధించి కొత్త చరిత్ర లిఖించిన షూటర్‌ మనూ భాకర్‌.. ఒలింపిక్స్‌లో వినియోగించిన పిస్టల్‌ ను ప్రధానికి చూపించింది. ఇక వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. 

ఇటీవల కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్, కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌తో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీతో పాటు ఓ హాకీ స్టిక్‌ను ప్రధానికి అందించారు. పారిస్‌ క్రీడల్లో కాంస్య పతకం అందుకున్న రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌తో కలిసి కాంస్య పతకం గెలిచిన సరబ్‌జ్యోత్‌ సింగ్, 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో కాంస్యం నెగ్గిన స్వప్నిల్‌ కుసాలేను కూడా ప్రధాని అభినందించారు. 

అనంతరం క్రీడాకారుల మధ్య కలియదిరిగిన ప్రధాని వారితో సంభాíÙంచారు. ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. ‘పారిస్‌ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. విశ్వక్రీడల్లో వారి అనుభవాలు వినడం.. వారి విజయాలను ప్రశంసించడం తృప్తినిచ్చింది. 

పారిస్‌కు వెళ్లిన ప్రతీ భారత క్రీడాకారుడు చాంపియనే. ప్రభుత్వం క్రీడలకు మద్దతునిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటుంది’ అని ప్రధాని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. పారిస్‌ క్రీడలు ముగిసిన వెంటనే చికిత్స కోసం జర్మనీకి వెళ్లడంతో అతడు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. త్రుటిలో పతకానికి దూరమైన షట్లర్‌ లక్ష్యసేన్, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌తో పాటు ఇతర అథ్లెట్లతోనూ ప్రధాని సంభాషించారు. 

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో దేశానికి ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలు వచ్చాయి. అంతకుముందు ఎర్రకోట వద్ద జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఒలింపిక్‌ అథ్లెట్ల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రధాని ‘పారిస్‌’ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే.. పారాలింపిక్స్‌కు వేళ్లనున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం భారత్‌ కల అని.. 2036లో విశ్వక్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు.  

ఫీల్డ్‌ గోల్స్‌తోనే అది సాధ్యం: శ్రీజేశ్‌ 
న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో నిలకడగా పతకాలు సాధించాలంటే.. ఫీల్డ్‌ గోల్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ అన్నాడు. ఒలింపిక్స్‌ వంటి మెగా టోర్నీల్లో సత్తా చాటాలంటే.. పెనాల్టీ కార్నర్‌లను వినియోగించుకోవడంతో పాటు.. ఫీల్డ్‌గోల్స్‌ ఎక్కువ చేయాలని శ్రీజేశ్‌ పేర్కొన్నాడు. పారిస్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు మెగా టోరీ్నలో మొత్తం 15 గోల్స్‌ చేసింది. 

అందులో 9 పెనాల్టీ కార్నర్‌లు, మూడు పెనాల్టీ స్ట్రోక్స్‌ ఉన్నాయి. అంటే కేవలం మూడే ఫీల్డ్‌ గోల్స్‌ చేయగలిగింది. అదే సమయంలో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్స్‌ 14 ఫీల్డ్‌ గోల్స్, రజతం నెగ్గిన జర్మనీ 15 ఫీల్డ్‌ గోల్స్‌ చేశాయి. కాంస్య పతక పోరులో భారత్‌ చేతిలో ఓడి నాలుగో స్థానంలో నిలిచిన స్పెయిన్‌ కూడా 10 ఫీల్డ్‌ గోల్స్‌తో ఆకట్టుకుంది. 

‘పెనాల్టీ కార్నర్‌ల విషయంలో మన ప్లేయర్ల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరముంది. వరుస విజయాలు సాధించాలంటే మనం ఎందులో మెరుగ్గా ఉన్నామో దానిపైనే కాకుండా.. ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఫీల్డ్‌ గోల్స్‌లో సత్తా చాటితే హాకీలో పూర్వవైభవం సాధ్యమే’ అని శ్రీజేశ్‌ అన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement