హాకీ లెజెండ్ శ్రీజేశ్‌కు ప్రధాని మోదీ లేఖ‌.. | PM Narendra Modi writes heartwarming letter to hockey legend PR Sreejesh | Sakshi
Sakshi News home page

హాకీ లెజెండ్ శ్రీజేశ్‌కు ప్రధాని మోదీ లేఖ‌..

Published Thu, Sep 12 2024 11:24 AM | Last Updated on Thu, Sep 12 2024 12:27 PM

PM Narendra Modi writes heartwarming letter to hockey legend PR Sreejesh

న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, మాజీ గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. అతని కెరీర్‌ సాఫల్యతలో ఎదురైన ఆటుపోట్లు... పడిన కష్టం... చిందించిన చెమటను కీర్తిస్తూ ఆ లేఖలో ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. 

త్వరలో భారత జూనియర్‌ జట్టుకు కోచ్‌గా సరికొత్త ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనున్న శ్రీజేశ్‌కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. గోల్‌కీపర్‌గా విజయవంతమైనట్లే... కోచ్‌గానూ జూనియర్లను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. 

‘ఆటలో నీ అంకితభావం, నిబద్ధత నాకు తెలుసు. ఇకపై కోచ్‌గానూ ఇదే పంథా కొనసాగిస్తావని ఆశిస్తున్నా. కోచ్‌ పాత్రలో జూనియర్‌ జట్టును ప్రభావంతంగా, స్ఫూర్తిదాయకంగా మలుస్తావని విశ్వసిస్తున్నాను.

సుదీర్ఘకాలం పాటు భారత హాకీకి సేవలందించిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’నని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. కేవలం పతకాలు, ఘన విజయాలే కాదు... లెక్కలేనన్ని స్మృతులెన్నో అతని కెరీర్‌లో ఉన్నాయని ప్రధాని కొనియాడారు. 

అతనేంటో అతన్ని వరించిన అవార్డులు, పతకాలే తెలియజేస్తాయని ప్రశంసించారు. ప్రధాని లేఖ తన గుండెని తాకిందని శ్రీజేశ్‌ బదులిచ్చాడు. ‘హాకీనే నా జీవితం. అందుకే ఆట కోసమే ఇన్నాళ్లు శ్రమించాను. ఇకపై కూడా శ్రమిస్తాను. ప్రపంచ హాకీలో భారత్‌ బలీయమైన శక్తిగా అవతరించేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు.   

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యం గెలుపొందడంలో కృషి చేసిన శ్రీజేశ్‌ తన కెరీర్‌కు పతకంతో గుడ్‌బై చెప్పాడు. గోల్‌పోస్ట్‌ ముందు పెట్టని గోడలా నిలబడే శ్రీజేశ్‌ 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో రెండు ఆసియా క్రీడల స్వర్ణాలతో పాటు చాంపియన్స్‌ ట్రోఫీ రజత పతకాలు కూడా ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement