The Red Fort
-
జనహృదయమెరిగిన ప్రధాని
పోటీదారుల కన్నా మెరుగ్గా నిలవటం మోడీకి సమస్య కాదు. ఎన్నికల ప్రచారంలో తాను నెలకొల్పిన అసాధారణ ప్రమాణాలనే ఆయన అధిగమించాల్సి ఉంది. దేశానికి గమ్యాన్ని నిర్దేశించి, ప్రాధాన్యాలను ఎంచుకుని, వాటిని నెరవేర్చగలిగే రూట్ మ్యాప్‌ను తయారు చేయాల్సి ఉంది. గమ్యం లేకుండా ఎంత ఎగిరినా మిగిలేది సుదీర్ఘ ప్రయాణ ప్రయాసే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలోని ఉపన్యాస వేదికకు తరలేటప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా మూడిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ప్రసంగించడం లేదా తమలో తాము గొణుక్కోవడం లేదా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం. మొదటిది సులువు. ఎందుకంటే ప్రభుత్వమే అందులో కథనమూ, కథకుడూ కూడా. మేం ఇది చేశాం (చప్పట్లు), మేం ఇది చేయబోతున్నాం (తప్పనిసరి చప్పట్లు) అంటూ ఏకరువు పెట్టి స్వీయ ప్రశంసల మిథ్యా సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం అందులో ఉంది. ఇక రెండోది, ఆత్మవిశ్వాసం కొరవడటం పర్యవసానమే తప్ప ఆత్మావలోకనం కొరవడటం కాదు. మన్మోహన్ సింగ్ దాన్ని అలవాటుగా మార్చుకున్నారు. తాను సంకోచించవ లసినది చాలానే ఉన్నదని ఆత్మావలోకనం ద్వారానే బహుశా ఆయనకు బోధపడి ఉండాలి. అధినేతతో అనుబంధం చెడి పోయినా ఆమెకు మోకరిల్లక తప్పని విలక్షణమైన ప్రధాని మన్మోహన్. అధికారాన్ని సోనియాగాంధీ, ఆమె చపల చిత్తపు కుమారుడు రాహుల్‌గాంధీ అనుభవిస్తుండగా, ఆయన బాధ్యతలకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. నష్టం వాట్లిలింది దేశానికి. ప్రధాని నరేంద్రమోడీ దేనిని ఎంపిక చేసుకున్నారో చెప్పిన వారికి బహు మానాలు లభించే అవకాశమేమీ లేదు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లా డారు. పోటీదారుల కన్నా మెరుగ్గా నిలవటం ఆయన సమస్య కాదు. ముమ్మ రంగా సాగిన ఎన్నికల ప్రచారంలో తాను నెలకొల్పిన అసాధారణ ప్రమాణా లనే ఆయన అధిగమించాల్సి ఉంది. ఇప్పుడాయన గమ్యాన్ని నిర్దేశించాల్సి ఉంది. ఆ దృష్టి నుండీ ప్రాధాన్యాలను ఎంచుకోవాలి. వాటిని నెరవేర్చడానికి తగిన రూట్ మ్యాప్‌ను తయారు చేసుకోవాలి. గమ్యం అంటూ లేకుండా ఎంత ఎగిరినా సుదీర్ఘ ప్రయాణపు ప్రయాస తప్ప ఎక్కడికీ చేరలేరు. మోడీ అసలు సారం ఏమిటో ఆగస్టు 15 ఉదయాన విన్నాం, కన్నాం. ఆయన హృదయం ఆకాశపు అంచును నిర్దేశిస్తే, బుద్ధి దిక్సూచీలోని అయస్కాంతమైంది. దేశ ప్రగతి ప్రభుత్వ కార్యక్రమమేమీ కాదు, ప్రజలందరి కార్యక్రమం అనే అంశం చుట్టే ఆయన సందేశపు ఉరవడి తిరిగింది. ఒక్క పోలికతో ఆయన ఆ విషయాన్ని చక్కగా చెప్పారు. 125 కోట్ల మంది భారతీయులు ఒక్కొక్కరూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే, దేశం 125 కోట్ల అడుగులు ముందుకు పోతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధాని ప్రసంగం షేర్ హోల్డర్ల వార్షిక సమావేశంలో సమర్పించే పద్దుల చిట్టాలా ఉండేది. మోడీ దానిని నిశిత పరిశీలన అనే ఇరుసుపై తిరుగాడే ముల్లుగా మార్చారు. మన జాతీయ స్వభావంలో ఏవైనా చెడులు ఉంటే వాటిని ఎత్తి చూపటంతోపాటు, అది పేదరికం లేదా లైంగిక వివక్షతతో కూడిన నేరాల వంటి శాపాలు లేదా అప్రతిష్టలపైకి వెలుగును ప్రసరింపచేసింది. ఇది నిరాశావాదం కాదు, వాస్తవిక వాదం. లక్ష్యం సాధించగలిగినది మాత్రమే కాదు, చేతికి అందుబాటులోనే ఉంది అనే విశ్వాసంతో మోడీ దేశ మానసిక స్థితిని మార్చేశారు. ఆ దార్శనికతనే ఆయన ప్రజలకు అందించారు. ఎర్రకోట దగ్గర మారుమోగిన చప్పట్లలో అతి గట్టిగా ధ్వనించినవి టీనేజీ బాలల చప్పట్లే. అవి దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలలోని కోట్లాది మంది ప్రజల ఆశల ప్రతిధ్వనులు. పెల్లుబికిన ఆనందోత్సాహాలు వివరణకు అందేవే. మన దేశానికి ప్రధానమంత్రి మాత్రమే కాదు, నేత దొరికాడు. ప్రధాని మోడీ ఎవరూ అడగని ప్రశ్నలను లేవనెత్తారు. కూతుళ్లను నిర్లక్ష్యం చేస్తూ మనం కొడుకుల పట్ల ఎందుకు గారం చేస్తున్నాం? ఆడపిల్లలను పిండదశలోనే చిదిమేసే అత్యంత అవమానకరమైన స్థితికి బాధ్యులు ఎవరు? మన ఇళ్లను, వీధులను, దేశాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి మనకు చట్టాలు అవసరమా? కుల, మత హింస అనే కాలకూట విషానికి అంతం ఎప్పుడు? ఒక పదేళ్లపాటు సామరస్యాన్ని పాటించి ఫలితాలను మీరే చూడండి అంటూ ఆయన ప్రజలకు సవాలు విసిరారు. ఇలాంటి ప్రశ్నలను సంధించడం బహుశా ఢిల్లీ దర్బారుకు వెలుపలివారికి మాత్రమే సాధ్యమేమో. ప్రధాని మోడీ తనను తాను అలాగే అభివర్ణించుకున్నారు. అందుకే మోడీ ఢిల్లీ దర్బారు లోని భారత ప్రజాస్వామ్యపు అతి శిష్ట వర్గానికి, రాజకీయ-అధికార యంత్రాంగాన్ని నియంత్రించే వర్గం వారికి సంబంధించిన సర్వ సామాన్య సత్యాన్ని విస్పష్టంగా చూడగలరు. తీవ్ర సంస్కరణ తప్ప మరేదీ సరిదిద్దలేనంతగా వారి మధ్య సాగే అంతర్యుద్ధాలు పరిపాలనను పాడు చేశాయని చెప్పగలిగే నాయకత్వం కావాలి. మోడీ అలాంటి నాయకత్వాన్ని అందించగలరు. ప్రణాళికా సంఘం దాని అసలు లక్ష్యానికే కొరగాకుండా పోయింది. ఆ కారణంగానే మోడీ దాని మరణ సంతాప సందేశాన్ని వినిపించారు. అత్యంత తీవ్ర జాతీయ సంక్షోభమైన పేదరికం పట్ల గత పదేళ్లుగా అనుసరించిన స్వయం సంతృప్తికర, నిస్సార వైఖరే, దాని ముఖ్య వైఫల్యం. సామాన్యమైన అంచనాకు సైతం అది కనబడుతుంది. ఆరు దశాబ్దాల ప్రణాళికా బద్ధమైన ఆర్థిక వ్యవస్థలో పేదరిక రేఖకు దిగువనే ఉన్న భారతీయుల సంఖ్య కేవలం అతి స్పల్పంగా, ఏడాదికి అర శాతం (0.5 శాతం) చొప్పున తగ్గుతూ వచ్చింది. ఇది దిగ్భ్రాంతికరమైనదీ, ఆమోదయోగ్యం కానిదీ.రాష్ట్రాలతో సహకారం ద్వారా సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాల్సింది పోయి ప్రణాళికా సంఘం రాచరిక ఆదేశాల పరంపరగా శాసించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అది కేంద్రాన్ని బిచ్చమడుక్కుంటే ఒకటో రెండో మెతుకులు దక్కుతాయని బోధించేది. చట్ట రీత్యా, ఆచరణ రీత్యా కూడా మనది సమాఖ్య దేశం. కొన్ని చిన్న కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే, దేశంలోని మరే ప్రాంతాన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిపాలించడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే అభివృద్ధి పనులు అత్యుత్తమంగా సాగుతాయి. కేంద్రం అందుకు దోహదకారే తప్ప నియంత కాదు. ప్రపంచం మారిపోతోంది. మనం దానికి అతీతంగా ఉండలేం. సాంకేతికపరమైన నూతన ఆవిష్కరణలు, అత్యధునాతన వస్తు తయారీ ప్రధానంగా ప్రైవేట్ రంగంలోనే సాగే శకం ఇది. అందువలన మనకు అంతర్జాతీయ సహకారమనే సృజనాత్మక శక్తి అవసరం. పేదరికానికి అత్యుత్తమ విరుగుడు పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలోని ఉపాధి కల్పనే. వ్యక్తిగత సంక్షేమాన్ని అది జాతీయ వృద్ధితో అనుసంధానిస్తుంది. ప్రధాని మోడీ అన్నట్లుగా భారత్ ప్రపంచ వస్తు తయారీరంగ కేంద్రంగా మారడానికి సన్నద్ధమై తీరాలి. కలలు నిజమయ్యేది మేలుకుని ఉన్నప్పుడు మాత్రమేనని ప్రధాని మోడీకి తెలుసు. నిద్రలో నడకతో అద్భుత స్వప్నం దిశగా మీరు ముందుకు పోజాలరు. జాతిని జడత్వం నుంచి మేల్కొల్పగల అభీష్టశక్తి ఆయనకుంది. రానున్న మాసాల్లో అది ఎలాగో మీరు చూస్తారు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎంజే అక్బర్ -
విభిన్నం... ఆచరణాత్మకం!
అందరూ నడిచిన తోవనే వెళ్లడం చాలా సౌకర్యవంతం. ఆనవాయితీ తప్పకపోవడమైనా అంతే... క్షేమదాయకం. బహుశా అందుకే 67 ఏళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవంనాడు జాతినుద్దేశించి ప్రసంగించే ఏ ప్రధాని అయినా ఈ ఆనవాయితీని తప్పిందిలేదు. ఎర్రకోట బురుజు లపై నుంచి చేసే ఆ ప్రసంగం వీలైనంత గంభీరంగా... ఇంకా చెప్పా లంటే దేశ ప్రజలకు ఉద్బోధగా, తాము సాధించిన ప్రగతిని ఏకరువు పెట్టడంగా, మధ్యమధ్యన శత్రు దేశాలకు చేసే హెచ్చరికగా సాగిపో యేది. అందులో అవసరాన్నిబట్టి ఇంకా ఆర్ధికాభివృద్ధి, జీడీపీ, విపక్షాల సహాయ నిరాకరణ వంటివన్నీ వచ్చిచేరేవి. ప్రధానిగా ఎవరొచ్చినా షరా మామూలుగా, లాంఛనంగా సాగే ఈ తరహా ప్రసంగాలు ఎర్ర కోట బురుజులకు కూడా కంఠోపాఠమే. దృశ్యమాధ్యమం వచ్చాక ప్రజ లందరికీ సైతం ఇది అలవాటైపోయింది. కాగితాల కట్టతో వచ్చి అందు లో ఉన్నదంతా పొల్లుపోకుండా చదివి వెళ్లే ఈ సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి బద్దలుకొట్టారు. ప్రసంగం మొదలుపెట్టినప్ప టినుంచి పూర్తయ్యేవరకూ ఆయన నిజంగా ఈ దేశ ప్రజలనుద్దేశించే మాట్లాడారు. వారి గుండె తలుపు తట్టారు. వారు నిత్యమూ ఎదుర్కొనే సమస్యలను వారి భాషలోనే ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలతో వారిలో కొత్త ఆలోచనలను తీసుకొచ్చారు. ఊకదంపుడు సంప్రదాయానికి వీడ్కోలు పలికి ఉత్తేజాన్ని నింపారు. స్ఫూర్తిని రగిల్చారు. ఏదో చేయగ లమని కాదు... ఏమైనా చేయగలమన్న భరోసాను తీసుకొచ్చారు. ఇం తకాలమూ ‘ఆగస్టు 15’ ప్రసంగాల్లో చోటుచేసుకోని ఎన్నో అంశాలు మోడీ నోటివెంట వెలువడ్డాయి. బహుశా ఆయనన్నట్టు ఢిల్లీకి ‘బయటి నుంచి రావడం’వల్లే ఇది సాధ్యమైందేమో! ఈ ప్రసంగం ద్వారా మోడీ నెలకొల్పిన రికార్డులు ఇంకా ఉన్నాయి. సొంతంగా మెజారిటీ సాధించి న తొలి కాంగ్రెసేతర పక్షం తరఫు ప్రధాని మాత్రమే కాదు... ఆయన స్వాతంత్య్రానంతర తరానికి చెందిన తొలి ప్రధాని కూడా. మూడు దశాబ్దాలుగా ఉంటున్న బుల్లెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని రాత్రికి రాత్రి బురుజులపైనుంచి తీయించేయడమూ కీలకమైనదే. దేశానికి ప్రధానిగా కాదు... మీ ప్రధాన సేవకుడిగా మాట్లాడుతున్నానంటూ ఆయన ప్రస్తావించిన సమస్యలు, వాటి పరిష్కారానికి సూచించిన మార్గాలు ముఖ్యమైనవి. ఆడపిల్లలపై అత్యాచారాల గురించి ఈమధ్య కాలంలో మాట్లాడని నాయకుడంటూ లేడు. ములాయం నుంచి మురళీ మోహన్ వరకూ అందరూ ఆ నేరాలకు ఆడవాళ్లను బాధ్యుల్ని చేసినవారే. తమ డొల్లత నాన్ని బయటపెట్టుకున్నవారే. ఇదే అంశంలో మోడీ చేసిన సూచన అం దరినీ ఆలోచింపజేసేది. పెంపకం దశలోనే ఆడపిల్లలు, మగపిల్లల విష యంలో కుటుంబాల్లో మొదలవుతున్న వివక్ష ఈ వైపరీత్యానికి ఎలా కారణమవుతున్నదో ఆయన పరోక్షంగా చెప్పారు. ‘మీ ఇంట్లో ఆడపిల్ల బయటకు వెళ్లినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేస్తారు కదా...మగపిల్లలను అలా అడుగుతారా...’అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను ఎలాగూ చేస్తుంది... ముందు కుటుంబంలో మీరు చేయాల్సింది చేయమని తల్లిదండ్రులను కోరారు. ఆడపిల్లను పుట్టనివ్వకుండా చేస్తున్న దిక్కు మాలిన పోకడలనూ ఆయన తడిమారు. పిండ దశలోనే ఆడపిల్లను పొట్టనబెట్టుకునే పనులకు పాల్పడవద్దని డాక్టర్లనూ, తల్లిదండ్రులనూ కోరారు. కుటుంబానికీ, అమ్మానాన్నలకూ ఆడపిల్ల ఆసరాగా ఉంటున్న వైనాన్ని చెప్పారు. మరుగుదొడ్ల సమస్య గురించి కూడా ప్రస్తావిం చారు. ప్రతి ఇంటికీ, ప్రతి పాఠశాలకూ మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని అటు ఎంపీలకూ, ఇటు కార్పొరేట్ సంస్థలకూ ఆయన సూచించారు. ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక ఆదర్శగ్రామాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. అదే జరిగితే ఆ నియోజకవర్గం లోని ఎన్నో గ్రామాలకు అది ఆదర్శప్రాయమవుతుందని చెప్పారు. ఈ కృషిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం భాగస్వామిని చేయొచ్చని సూచిం చారు. ‘మేడిన్ ఇండియా’ సందేశాన్ని కూడా వినిపించారు. ‘ఇక్కడ తయారుచేయండి... ఎక్కడైనా అమ్ముకోండి’ అన్నది ఆయన ప్రధాన నినాదం. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైనా, ఆటోమొబైల్ ఉత్పత్తులైనా వేటి నైనా ఇక్కడే ఉత్పత్తిచేసి ఎగుమతి చేసే స్థితికి చేరాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ ఆచరణాత్మక ప్రతిపాదనలు. పేదలకు బ్యాంకింగ్ సేవలు అందడమే లక్ష్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారం భిస్తున్నట్టు మోడీ ప్రకటించారు. ఈ పథకంకింద ప్రారంభించే బ్యాంకు ఖాతాల్లో పేదలకు రూ. 5,000 వరకూ ఓవర్‌డ్రాఫ్టు సౌకర్యం కూడా ఉండటం విశేషం. పరస్పరం కలహించుకుంటూ వివిధ ప్రభుత్వ విభా గాలు న్యాయస్థానాలకెక్కుతున్న వైనాన్ని వివరించారు. అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం అవసరమన్నారు. కుల, మత, ప్రాంతీయతత్వా లపైనా... హింసపైనా పదేళ్ల మారటోరియం విధించుకుందామని ప్రతిపాదించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవలికాలంలో క్రమేపీ పెరుగుతున్న మత ఘర్షణల నేపథ్యంలో ఈ సూచనకు ఎంతో విలువున్నది. మోడీ చెప్పినవాటిపైనా, చెప్పకుండా వదిలేసిన అంశాలపైనా విమర్శలున్నాయి. ఇందులో అధిక ధరలు, అవినీతి మొదలుకొని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మోడీ ఎన్నికల ప్రసంగాల్లో ఒకటికి పదిసార్లు వచ్చినవే. అందువల్లనే వీటికి సంబంధించిన కార్యాచరణ గురించి చాలామంది ఎదురుచూశారు. 65 నిమిషాల ప్రసంగంలో అన్నిటినీ చెప్పితీరాలనడం కూడా సరికాదు. అధికారానికొచ్చిన రెండు నెలల్లోనే ఆయన కీలక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి విభిన్నంగా ఆలోచించారని ఎర్రకోట ప్రసంగం తేటతెల్లం చేసింది. ఈ అంశాలన్నీ ఆచరణరూపం దాల్చి మంచి ఫలితాలనిస్తే మోడీ ప్రసంగానికి మరింత విలువ పెరుగుతుందనడంలో సందేహం లేదు. -
'ఇది ఒక అద్భుతమైన రోజు'
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఒక సాధారణ పార్టీ కార్యకర్తలా ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి పార్టీ కార్యకర్తలకు అద్భుతమైన రోజుగా మలిచారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఇది నిజంగా కార్యకర్తలు గర్వించదగిన రోజని స్పష్టం చేశారు. అంతకుముందు ఒకసారి వాజ్ పేయ్ నేతృత్వంలో బీజేపీ అధికారం చేపట్టినా.. ఈసారి పూర్తి ఆధిక్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ' ఆ ఆనందాన్ని తొలిసారి చూశాం. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యకర్తల వల్ల పార్టీకి మంచి రోజులు వచ్చాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక బీజేపీ కార్యకర్త దేశ జెండాను ఎర్రకోటలో ఎగురవేశారు. ఇది నిజంగా ఒక గొప్ప రోజు' అని షా తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి దిశగా పనిచేస్తుందన్నారు. మరోవైపు కేంద్ర సమాచార, ప్రచారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మోడీ ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు. 'ఆయన హృదయం నుంచి వచ్చిన మాటలు యావత్తు జాతిని హత్తుకున్నాయన్నారు. మోడీ ప్రసంగం ఆద్యంతం స్ఫూర్తి దాయకంగా ఉందని స్పష్టం చేశారు. -
ఆశువుగా మోడీ పంద్రాగస్టు ప్రసంగం!
ఆర్థిక సేవల మిషన్ ప్రకటన 15 కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన తొలి పంద్రాగస్టు ప్రసంగంలోనూ ప్రత్యేకత చాటుకోనున్నారు. ఎర్రకోట పైనుంచి దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని ప్రసంగ పాఠంలోంచి చదవడం ప్రధానులకు ఆనవాయితీగా వస్తుండగా అందుకు భిన్నంగా మోడీ ఆశువుగా ప్రసంగించనున్నారు. తన ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, అనుసరించనున్న విధానాలను మోడీ ఈ ప్రసంగంలో వెల్లడించనున్నారు. విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపైనా మాట్లాడనున్నారు. ముఖ్యంగా పేదల అభ్యున్నతి కోసం ఓ సరికొత్త పథకాన్ని ప్రకటించబోతున్నారు. ఆర్థిక సేవల మిషన్ పేరుతో దేశంలోని 15 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. ఈ ఖాతాలు పొందిన వారికి 5 వేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, లక్ష రూపాయల ప్రమాద బీమా కూడా కల్పిస్తారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన ఈ పథకాన్ని ఈ నెలాఖరు కల్లా మోడీ ప్రారంభించనున్నారు. ఈ నెల 28 లేదా 29న ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2018 ఆగస్టులోగా మొత్తం 15 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరవనున్నారు. -
ఎర్రకోట పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు మువ్వన్నెలమయం
సాక్షి, న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకలతో రాజధాని నగరం మువ్వన్నెలమయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసినా జాతీయపతాక రెపరెపలు కనిపిస్తున్నాయి. పంద్రాగస్టు వేడుకలు నిర్వహించనున్న ఎర్రకోట పరిసరాలను జాతీయ పతాకాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇండియాగేట్ పరిసరాల్లోనూ పెద్ద సంఖ్యలో జాతీయ పతాకాలను ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్ అంతా మువ్వన్నెల రెపరెపలతో కొత్త శోభను సంతరించుకుంది. యువతీ యువకులు సైతం దేశభక్తిని చాటుతూ తమ ముఖాలపై జాతీయ జెండాలను పెయింట్ చేయించుకున్నారు. అన్ని దుకాణాల్లోనూ జాతీయ జెండాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నగర వాసులు ఇప్పటికే జెండా పండుగ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరోవైపు పంద్రాగస్టు ఏర్పాట్లలో భాగంగా నగరంలో అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట పరిసరాలను భద్రతా సిబ్బంది పూర్తిస్థాయిలో తమ చేతుల్లోకి తీసుకుంది. అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాయుధ బలగాలతో పహారా కాస్తున్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లోనూ ప్రత్యేక దృష్టిసారించారు. అన్ని రైల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, ఐఎస్బీటీల్లో తనిఖీలు విస్తృతం చేశారు. నగరాన్ని ప్రతిక్షణం భద్రతా సిబ్బంది డేగకళ్లతో కాపలా కాస్తున్నారు. ఢిల్లీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సంబరాలు.. ఢిల్లీ టూరిజం ఆధ్వర్యంలో మువ్వన్నెల రంగుల్లో ఉన్న గాలిపటాలను ఎగురవేశారు. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్స్ పరిసరాల్లో పతంగులు ఎగురవేయడంలో నిష్ణాతుైడె న మియాన్ ఆధ్వర్యంలో జాతీయపతాకం రంగుల్లో ఉన్న వంద పతంగులను కలిపి ఎగురవేశారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. వైద్య సిబ్బంది సిద్ధం.... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అత్యవసర పరిస్థితిలో వైద్య సహాయం అందించడానికి ఎర్రకోట వద్ద అంబులెన్స్‌లు, వైద్యులను పెద్ద ఎత్తున నియమించారు. ఇందుకోసం జాతీయ రాజధానిలో వివిధ ఆస్పత్రుల నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లను సమీకరించారు. ఎర్రకోట చుట్టూర ఒక కిలోమీటరు పరిధిలో ఆధునిక వైద్య పరికరాలతో కూడిన 16 అంబులెన్స్‌లను వీవీఐపీలు, వీఐపీల కోసం సిద్ధంగా ఉంచారు. ఏడు సైనిక విభాగం అంబులెన్స్లతోసహా మరో 60 అంబులెన్స్‌లు సాధారణ ప్రజా అవసరాల కోసం అందుబాటులో ఉంచారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన ఆరు ప్రాంతాల్లో వీటిని నిలిపి ఉంచుతారు. వీటికి తోడు 11 ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక అంబులెన్స్‌తోపాటు ఐదు నుంచి ఆరుగురు వైద్యులుంటారు. వీరిలో జాతీయ రాజధానిలో ప్రముఖ ఆస్పత్రులకు చెందిన శస్త్రచికిత్స నిపుణులు, మత్తుమందు ఇచ్చే నిపుణులు ఉంటారు. అత్యవసర చికిత్స కోసం సర్ గంగారామ్, రామ్ మనోహర్ లోహియా, సఫ్దర్‌జంగ్, పంత్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, హిందూరావు, గురుతేజ్ బహుద్దూర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 18 మంది ఢిల్లీ పోలీసులకు పతకాలు... స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 18 మంది ఢిల్లీ పోలీసులు గౌరవ పతకాలను అందుకోనున్నారు. అదనపు పోలీస్ కమిషనర్(నైరుతి) అనిల్‌కుమార్ ఓజా, ఏసీపీ హరీసింగ్లు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డులకు ఎంపిక కాగా మిగతా 16 మంది పోలీస్ మెడల్స్‌ను అందుకోనున్నారు. వీరిలో ఇన్స్పెక్టర్లు జితేందర్‌సింగ్, రితాంబ్ర ప్రకాశ్, ఎస్ఐ చాంద్సింగ్, ఏఎస్ఐ శీలవతి తదితరులున్నారు. తీహార్ జైలు అధికారులకు పతకాలు... తీహార్ జైలుకు చెందిన ముగ్గురు అధికారులు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా వీరు ఈ పతకాలను అందుకోనున్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ రిషి కుమార్, హెడ్ వార్డర్ యశ్పాల్ నేగీ, వార్డర్ సునీల్ కుమార్‌లు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైనట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు.