ఎర్రకోట పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు మువ్వన్నెలమయం
Published Wed, Aug 14 2013 11:40 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
సాక్షి, న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకలతో రాజధాని నగరం మువ్వన్నెలమయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసినా జాతీయపతాక రెపరెపలు కనిపిస్తున్నాయి. పంద్రాగస్టు వేడుకలు నిర్వహించనున్న ఎర్రకోట పరిసరాలను జాతీయ పతాకాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇండియాగేట్ పరిసరాల్లోనూ పెద్ద సంఖ్యలో జాతీయ పతాకాలను ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్ అంతా మువ్వన్నెల రెపరెపలతో కొత్త శోభను సంతరించుకుంది. యువతీ యువకులు సైతం దేశభక్తిని చాటుతూ తమ ముఖాలపై జాతీయ జెండాలను పెయింట్ చేయించుకున్నారు.
అన్ని దుకాణాల్లోనూ జాతీయ జెండాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నగర వాసులు ఇప్పటికే జెండా పండుగ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరోవైపు పంద్రాగస్టు ఏర్పాట్లలో భాగంగా నగరంలో అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట పరిసరాలను భద్రతా సిబ్బంది పూర్తిస్థాయిలో తమ చేతుల్లోకి తీసుకుంది. అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాయుధ బలగాలతో పహారా కాస్తున్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లోనూ ప్రత్యేక దృష్టిసారించారు. అన్ని రైల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, ఐఎస్‌బీటీల్లో తనిఖీలు విస్తృతం చేశారు. నగరాన్ని ప్రతిక్షణం భద్రతా సిబ్బంది డేగకళ్లతో కాపలా కాస్తున్నారు.
ఢిల్లీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సంబరాలు..
ఢిల్లీ టూరిజం ఆధ్వర్యంలో మువ్వన్నెల రంగుల్లో ఉన్న గాలిపటాలను ఎగురవేశారు. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్స్ పరిసరాల్లో పతంగులు ఎగురవేయడంలో నిష్ణాతుైడె న మియాన్ ఆధ్వర్యంలో జాతీయపతాకం రంగుల్లో ఉన్న వంద పతంగులను కలిపి ఎగురవేశారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు.
వైద్య సిబ్బంది సిద్ధం....
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అత్యవసర పరిస్థితిలో వైద్య సహాయం అందించడానికి ఎర్రకోట వద్ద అంబులెన్స్‌లు, వైద్యులను పెద్ద ఎత్తున నియమించారు. ఇందుకోసం జాతీయ రాజధానిలో వివిధ ఆస్పత్రుల నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లను సమీకరించారు. ఎర్రకోట చుట్టూర ఒక కిలోమీటరు పరిధిలో ఆధునిక వైద్య పరికరాలతో కూడిన 16 అంబులెన్స్‌లను వీవీఐపీలు, వీఐపీల కోసం సిద్ధంగా ఉంచారు. ఏడు సైనిక విభాగం అంబులెన్స్‌లతోసహా మరో 60 అంబులెన్స్‌లు సాధారణ ప్రజా అవసరాల కోసం అందుబాటులో ఉంచారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన ఆరు ప్రాంతాల్లో వీటిని నిలిపి ఉంచుతారు. వీటికి తోడు 11 ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇక్కడ ఒక అంబులెన్స్‌తోపాటు ఐదు నుంచి ఆరుగురు వైద్యులుంటారు. వీరిలో జాతీయ రాజధానిలో ప్రముఖ ఆస్పత్రులకు చెందిన శస్త్రచికిత్స నిపుణులు, మత్తుమందు ఇచ్చే నిపుణులు ఉంటారు. అత్యవసర చికిత్స కోసం సర్ గంగారామ్, రామ్ మనోహర్ లోహియా, సఫ్దర్‌జంగ్, పంత్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, హిందూరావు, గురుతేజ్ బహుద్దూర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
18 మంది ఢిల్లీ పోలీసులకు పతకాలు...
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 18 మంది ఢిల్లీ పోలీసులు గౌరవ పతకాలను అందుకోనున్నారు. అదనపు పోలీస్ కమిషనర్(నైరుతి) అనిల్‌కుమార్ ఓజా, ఏసీపీ హరీసింగ్‌లు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డులకు ఎంపిక కాగా మిగతా 16 మంది పోలీస్ మెడల్స్‌ను అందుకోనున్నారు. వీరిలో ఇన్‌స్పెక్టర్లు జితేందర్‌సింగ్, రితాంబ్ర ప్రకాశ్, ఎస్‌ఐ చాంద్‌సింగ్, ఏఎస్‌ఐ శీలవతి తదితరులున్నారు.
తీహార్ జైలు అధికారులకు పతకాలు...
తీహార్ జైలుకు చెందిన ముగ్గురు అధికారులు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా వీరు ఈ పతకాలను అందుకోనున్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ రిషి కుమార్, హెడ్ వార్డర్ యశ్‌పాల్ నేగీ, వార్డర్ సునీల్ కుమార్‌లు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైనట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు.
Advertisement
Advertisement