The national flag
-
పోలీసుస్టేషన్లో ఆ రెండూ తప్పనిసరి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్‌పై జాతీయ జెండాతోపాటు ఠాణా లోపల ఓ వ్యాయామశాల(జిమ్) ఏర్పాటు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఒకప్పుడు కేవలం స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవాల సందర్భంలోనే జాతీయ జెండాలు ఎగిరేవి. అయితే, నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో మాత్రం నిత్యం ఈ పతాకం ఎగురుతూ కనిపించేది. దీనికి భిన్నంగా సిటీలోని అన్ని పోలీసుస్టేషన్లతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ కార్యాలయాలు, డివిజన్ ఏసీపీ, జోన్ డీసీపీ కార్యాలయాలపై జాతీయ జెండాను నిత్యం కచ్చితంగా ఎగురవేయాలంటూ కొత్వాల్ స్పష్టం చేశారు. నగరంలోని అన్ని ఠాణాలు, పోలీసు కార్యాలయాలకు వీటిని సరఫరా చేశారు. నామ్‌కే వాస్తేగా ఎగురవేస్తే సరిపోదని, ఏ దశలోనూ ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ హెచ్ వోలకు కొత్వాల్ స్పష్టం చేశారు. దీంతో ఈ జెండాల పర్యవేక్షణ బాధ్యతల్ని స్థానిక అధికారులు ఆయా కార్యాలయాల్లో పని చేసే సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఠాణా, పోలీసు కార్యాలయంపై జాతీయ జెండా ఎగురుతూ కనిపిస్తోంది. మరోపక్క పోలీసు అధికారులు, సిబ్బందికి ఫిట్‌నెస్‌కు ఎంతో కీలకమని కమిషనర్ భావించారు. పని ఒత్తిడి నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్ల వద్ద వ్యాయామం చేసుకోవడం, వ్యాయామ శాలలకు వెళ్లడం సాధ్యం కాదు. వీరు పని చేసే చోటే వ్యాయామశాల అందుబాటులోకి తెస్తే అత్యధికులు వినియోగించుకునే ఆస్కారం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కొత్వాల్.. ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసుస్టేషన్లలోనూ జిమ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆధునికీకరణ జరుగుతున్న, నిర్మిస్తున్న ఠాణాల్లో అధికారులు, సిబ్బంది కార్యాలయాలతో పాటు జిమ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. మిగిలిన చోట్ల దశల వారీగా ఏర్పాటుకు నిర్ణయించారు. ఉన్నతాధికారుల కార్యాయాల్లో వారు విశ్రాంతి తీసుకునే గదుల్లోనే ఉపకరణాలు అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు నగరంలోని అన్ని కార్యాయాలకు ఈ ఉపకరణాలు అందుతున్నాయి. మరో రెండు నెలల్లో ఠాణా పైనా జాతీయ జెండా, లోపల జిమ్ కచ్చితం కానున్నాయి. -
కార్పొరేటర్ గొల్లూరిపై పోలీసులకు ఫిర్యాదు
-విచారణాంనంతరం తదుపరి చర్యలు -అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు కుషాయిగూడ జాతీయ జెండాను అవమానపరిచాడంటూ మీర్పేట్-హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు గొల్లూరి అంజయ్యపై చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ నాయకుడు మహేశ్ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల సందర్బంగా రాజీవ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయజెండాను ఆవిష్కరించిన ఆయన ఓ చేత్తో జెండా కర్రను పట్టుకొని జాతీయ గీతాన్ని పాడిన తీరును అవమానకరంగా ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ జాతీయ జెండాను అవమానపరచడంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగేశ్వర్రావు తెలిపారు. కాగా ఈ విషయంపై గొల్లూరి అంజయ్యను వివరణ కోరగా జెండా ఎగురవేయగానే అంతా జాతీయ గీతం పాడటం మొదలుపెట్టారని, ఆ తొందరలో యాదృచ్చికంగా జరిగిందే కాని, జాతీయ జెండాను అవమానపరిచే సంస్కారహీనులం కామన్నారు. జెండాను చేత్తో పట్టుకోవడం కూడ అవమానపరచడమే అవుతుందాని ఆయన ప్రశ్నించారు. నిరంతరం అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడే మాలాంటి వారిపై బురదజల్లేందుకు అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. మమ్మల్ని అగౌరవ పరిచిన వారిపై మేము కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. -
231 అడుగుల జాతీయ జెండా
కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట ప్రాంతంలోని వంశధార మోడల్ స్కూల్ విద్యార్థులు 231 అడుగుల (70 మీటర్ల) జాతీయ జెండాతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆంజనేయ నగర్ నుంచి మూసాపేట వరకు ర్యాలీ సాగింది. శాసనసభ్యుడు మాదవరం కృష్ణారావు దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పన్నాల కావ్యహరీష్రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. -
పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైన జఫర్‌గఢ్ కోట
జఫర్‌గఢ్ : చారిత్రక నేపథ్యమున్న జఫర్‌గఢ్ కోటపై తొలిసారి జాతీయ పతాకం రెపరెపలాడనుంది. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలో ఉన్న కోట కట్టడాల్లో ఒకటైన ఖమ్మం దర్వాజపై జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య ఇటీవల హరితహారంలో భాగంగా జఫర్‌గఢ్‌కు వచ్చిన సందర్భంలో కోటను పరిశీలించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో గోల్కొండ కోట మాదిరిగా ఈ కోటపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించిన ఆయన తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ మేరకు దర్వాజపై జాతీయ జెండా ఆవిష్కరించేందుకు గద్దె నిర్మించడమే కాకుండా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే రాజయ్య ఇక్కడ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. -
రికార్డు జెండా..
- 343 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ - అమర సైనికులకు ఘన నివాళి వెంకటాపురం(వరంగల్ జిల్లా) దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికులకు నివాళులు ఆర్పిస్తూ వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జోహర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 343 మీటర్ల జాతీయజెండాతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్ నుండి గ్రామంలోని చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. పఠాన్కోటిలో అమరులైన వీరసైనికులకు 343 మీటర్ల జాతీయ పతకాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆనంతరం జోహర్ పాఠశాలలో పఠాన్‌కోట్ లో మరణించిన ఆరుగురు వీరసైనికుల చిత్రపటాలను ఉంచి, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీతో పాటు ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, సీఆర్పీఎఫ్ ఎస్సై చరణ్‌సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ జాహీద్, సర్పంచ్ మహ్మద్ రహీమొద్దిన్ తదితరులు పాల్గొన్నారు. -
గణతంత్ర దినోత్సవంలో అపశ్రుతులు
నల్లబెల్లి/మరిపెడ/పరకాల/హన్మకొండ అర్బన్ :ఎగురవేసే సమయంలో అపశ్రుతులు దొర్లారుు. నల్లబెల్లి మండ గణ తంత్ర దినోత్సవం వేళ పలు పార్టీలు, ప్రభుత్వ కార్యాలయూలు, పాఠశాలలో జెండ ల కేంద్రం లోని టీడీపీ కార్యాల యం ముందు జాతీయ జెండాను ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మామిండ్ల మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. జెండా తాడును కర్రకు సరిగా ముడివేయకపోవడంతో మధ్యాహ్న సమయంలో కిందికి జారింది. మరిపెడ మండల పరిషత్ కార్యాలయంపైజాతీయ జెండాను ఎంపీపీ తాళ్లపెల్లి రాణీశ్రీనివాస్ ఆవిష్కరిస్తుండగా... ఇనుప స్థంబానికి ఏర్పాటు చేసిన చక్రం పగిలిపోయిం ది. జెండా విచ్చుకోక ముందే భవనంపై గల పోర్టుకోపై పడింది. కార్యాలయ సిబ్బంది తక్షణమే జెండా మూటను తీసి స్తంభానికి అమర్చారు. పరకాల న్యూ దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో జెండాను తలకిందులుగా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిం చారు. సమావేశం నిర్వహించుకుని వెళ్లిపోయారు. కాలనీకి చెందిన కొందరు గుర్తించి సమాచారం అందించడంతోపాటు దాన్ని సరి చేసి ఎగురవేశారు. హన్మకొండ కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో పీడీ రాము జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. విషయం తెలుసుకున్న అధికారులు కొద్దిసేపటి తర్వాత జెండా అవనతం చేసి మళ్లీ ఎగురవేశారు. కలెక్టరేట్లో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. -
విమోచన దినోత్సవాన ఎగిరిన జాతీయ జెండా
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిరసనలు వెల్లువెత్తా యి. జాతీయ జెండాను ఎగురవేసేందుకు బీజేపీ, ఏబీవీపీ ఇతర సంఘా లు పోటీపడ్డాయి. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో పలు చోట్ల వాగ్వివాదాలు జరిగాయి. కొంతమేరకు ఉద్రిక్తత ఏర్పడింది. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ సహా బీజేపీ నాయకులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలను దాటి రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరోవైపు ఏబీవీపీ నాయకులు కూడా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ప్రవేశమార్గం వద్ద పోలీసులతో వాగ్విదానికి దిగారు. మరి కొందరు ఇనుప కంచెను దాటడానికి యత్నించారు. ఇద్దరు ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ప్రధాన ద్వారంపైకి ఎక్కి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి పట్టణ ఒకటవ ఠాణాకు తరలించారు. భారీ భద్రత అంతకుముందే పోలీసులు కలెక్టరేట్ చుట్టు పక్కల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి ఎవరూ ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఏబీవీపీతోపాటు టీజీవీపీ నాయకులు కూడా కలెక్టరేట్ వద్ద జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. టీఎన్జీఓస్ భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం నిర్వహించారు. మహిళా కళాశాలలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తపస్ ఆధ్వర్యం లో సంఘం కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు జాతీయ జెండాను ఎగురవేశారు. సదస్సులు, సభలు బోధన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు. ఏబీ వీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. టీజీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు తహశీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాస్తారోకో నిర్వహించారు. కోటగిరి తహశీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేస్తుండగా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ నాయకులు ర్యాలీలు తీసి, బస్టాండ్ ఎదురుగా జాతీయ జెండాను ఎగురవేశారు. బాన్సువాడలో సీపీఎం, బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. మానవహారం నస్రుల్లాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వర్నిలో పీడీఎస్‌యూ నాయకులు ధర్నా చేపట్టారు. ఆర్మూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. నందిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఏబీవీపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. జేఏసీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. బాల్కొండ, మద్నూరు, బిచ్కుంద, జుక్కల్ మండల కేంద్రాలలో ఏబీవీపీ, బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశా రు. ఎల్లారెడ్డిలో మండల కేంద్రంతోపాటు పలు చోట్ల జాతీయ జెండాలను ఎగురవేశారు. కామారెడ్డి ఆర్టీ ఓ కార్యాలయంపై ఏబీవీపీ నాయకులు జాతీయ జెం డాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. నిజాంసాగర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మాచారెడ్డి, భిక్కనూరు మండల కార్యాలయాల లో బీజేపీ నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయం పరిపాలన విభాగ భవ నంపై, కళాశాల భవనంపై ఏబీవీపీ నాయకులు జా తీయ జెండాను ఎగురవేశారు. డిచ్పల్లి మండలం గన్నారం ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ గ్రామస్తులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. సిరికొండలో న్యూడెమోక్రసీ నేతలు అవగాహన సదస్సు నిర్వహిం చారు. -
మరింత ఎత్తులో జాతి గౌరవం
రాష్ట్రంలో ఎత్తైన జాతీయ జెండా స్తంభం ఆవిష్కరించిన గవర్నర్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జాతీయ పతాక స్తంభాన్ని నగరంలో నెలకొల్పారు. దానికి కట్టిన జాతీయ పతాకాన్ని ఇక్కడి ఇందిరా గాంధీ జాతీయ పార్కు (జాతీయ సైనిక స్మారకం)లో గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ గురువారం ఆవిష్కరించారు. పతాక స్తంభం ఎత్తు 207 అడుగులు. జాతీయ పతాకం పొడవు 72 అడుగులు, వెడల్పు 48 అడుగులు, బరువు 31 కిలోలు. ముంబైలో దీనిని డేనియర్ పాలిస్టర్‌తో తయారు చేశారు. దరిమిలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ జాతీయ జెండా రెప రెపలాడుతుంటుంది. జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం భారత పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దీనిని ఆవిష్కరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఇదే రోజు కావ డం విశేషం. ఈ కార్యక్రమంలో ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎంపీ నవీన్ జిందాల్, బెంగళూరు దక్షిణ ఎంపీ అనంత కుమార్, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రభృతులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలుత 207 అడుగుల జాతీయ పతాక స్తంభాన్ని హర్యానాలోని కైతాల్‌లో నెలకొల్పారు. దేశంలో ఇంకా తొమ్మిది చోట్ల కూడా ఇంతే ఎత్తై పతాక స్తంభాలను ఏర్పాటు చేశారు. 50 కిలోమీటర్ల దూరం నుంచే దీనిని చూడవచ్చు. ఇప్పటి వరకు బళ్లారి జిల్లా విజయ నగరలోని జిందాల్ స్టీల్ వర్క్స్ కర్మాగారంలో నెలకొల్పిన వంద అడుగుల పతాక స్తంభమే రాష్ట్రంలో ఎత్తయినది. -
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన విజయమ్మ
-
ఎర్రకోట పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు మువ్వన్నెలమయం
సాక్షి, న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకలతో రాజధాని నగరం మువ్వన్నెలమయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసినా జాతీయపతాక రెపరెపలు కనిపిస్తున్నాయి. పంద్రాగస్టు వేడుకలు నిర్వహించనున్న ఎర్రకోట పరిసరాలను జాతీయ పతాకాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇండియాగేట్ పరిసరాల్లోనూ పెద్ద సంఖ్యలో జాతీయ పతాకాలను ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్ అంతా మువ్వన్నెల రెపరెపలతో కొత్త శోభను సంతరించుకుంది. యువతీ యువకులు సైతం దేశభక్తిని చాటుతూ తమ ముఖాలపై జాతీయ జెండాలను పెయింట్ చేయించుకున్నారు. అన్ని దుకాణాల్లోనూ జాతీయ జెండాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నగర వాసులు ఇప్పటికే జెండా పండుగ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరోవైపు పంద్రాగస్టు ఏర్పాట్లలో భాగంగా నగరంలో అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట పరిసరాలను భద్రతా సిబ్బంది పూర్తిస్థాయిలో తమ చేతుల్లోకి తీసుకుంది. అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాయుధ బలగాలతో పహారా కాస్తున్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లోనూ ప్రత్యేక దృష్టిసారించారు. అన్ని రైల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, ఐఎస్బీటీల్లో తనిఖీలు విస్తృతం చేశారు. నగరాన్ని ప్రతిక్షణం భద్రతా సిబ్బంది డేగకళ్లతో కాపలా కాస్తున్నారు. ఢిల్లీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సంబరాలు.. ఢిల్లీ టూరిజం ఆధ్వర్యంలో మువ్వన్నెల రంగుల్లో ఉన్న గాలిపటాలను ఎగురవేశారు. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్స్ పరిసరాల్లో పతంగులు ఎగురవేయడంలో నిష్ణాతుైడె న మియాన్ ఆధ్వర్యంలో జాతీయపతాకం రంగుల్లో ఉన్న వంద పతంగులను కలిపి ఎగురవేశారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. వైద్య సిబ్బంది సిద్ధం.... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అత్యవసర పరిస్థితిలో వైద్య సహాయం అందించడానికి ఎర్రకోట వద్ద అంబులెన్స్‌లు, వైద్యులను పెద్ద ఎత్తున నియమించారు. ఇందుకోసం జాతీయ రాజధానిలో వివిధ ఆస్పత్రుల నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లను సమీకరించారు. ఎర్రకోట చుట్టూర ఒక కిలోమీటరు పరిధిలో ఆధునిక వైద్య పరికరాలతో కూడిన 16 అంబులెన్స్‌లను వీవీఐపీలు, వీఐపీల కోసం సిద్ధంగా ఉంచారు. ఏడు సైనిక విభాగం అంబులెన్స్లతోసహా మరో 60 అంబులెన్స్‌లు సాధారణ ప్రజా అవసరాల కోసం అందుబాటులో ఉంచారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన ఆరు ప్రాంతాల్లో వీటిని నిలిపి ఉంచుతారు. వీటికి తోడు 11 ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక అంబులెన్స్‌తోపాటు ఐదు నుంచి ఆరుగురు వైద్యులుంటారు. వీరిలో జాతీయ రాజధానిలో ప్రముఖ ఆస్పత్రులకు చెందిన శస్త్రచికిత్స నిపుణులు, మత్తుమందు ఇచ్చే నిపుణులు ఉంటారు. అత్యవసర చికిత్స కోసం సర్ గంగారామ్, రామ్ మనోహర్ లోహియా, సఫ్దర్‌జంగ్, పంత్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, హిందూరావు, గురుతేజ్ బహుద్దూర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 18 మంది ఢిల్లీ పోలీసులకు పతకాలు... స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 18 మంది ఢిల్లీ పోలీసులు గౌరవ పతకాలను అందుకోనున్నారు. అదనపు పోలీస్ కమిషనర్(నైరుతి) అనిల్‌కుమార్ ఓజా, ఏసీపీ హరీసింగ్లు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డులకు ఎంపిక కాగా మిగతా 16 మంది పోలీస్ మెడల్స్‌ను అందుకోనున్నారు. వీరిలో ఇన్స్పెక్టర్లు జితేందర్‌సింగ్, రితాంబ్ర ప్రకాశ్, ఎస్ఐ చాంద్సింగ్, ఏఎస్ఐ శీలవతి తదితరులున్నారు. తీహార్ జైలు అధికారులకు పతకాలు... తీహార్ జైలుకు చెందిన ముగ్గురు అధికారులు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా వీరు ఈ పతకాలను అందుకోనున్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ రిషి కుమార్, హెడ్ వార్డర్ యశ్పాల్ నేగీ, వార్డర్ సునీల్ కుమార్‌లు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైనట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు.