పోలీసుస్టేషన్‌లో ఆ రెండూ తప్పనిసరి! | gym and national flag are must in police station | Sakshi
Sakshi News home page

పోలీసుస్టేషన్‌లో ఆ రెండూ తప్పనిసరి!

Published Wed, Aug 17 2016 9:59 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

పోలీసుస్టేషన్‌లో ఆ రెండూ తప్పనిసరి! - Sakshi

పోలీసుస్టేషన్‌లో ఆ రెండూ తప్పనిసరి!

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్‌పై జాతీయ జెండాతోపాటు ఠాణా లోపల ఓ వ్యాయామశాల(జిమ్) ఏర్పాటు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఒకప్పుడు కేవలం స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవాల సందర్భంలోనే జాతీయ జెండాలు ఎగిరేవి. అయితే, నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో మాత్రం నిత్యం ఈ పతాకం ఎగురుతూ కనిపించేది. దీనికి భిన్నంగా సిటీలోని అన్ని పోలీసుస్టేషన్లతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయాలు, డివిజన్‌ ఏసీపీ, జోన్‌ డీసీపీ కార్యాలయాలపై జాతీయ జెండాను నిత్యం కచ్చితంగా ఎగురవేయాలంటూ కొత్వాల్‌ స్పష్టం చేశారు. నగరంలోని అన్ని ఠాణాలు, పోలీసు కార్యాలయాలకు వీటిని సరఫరా చేశారు.

 నామ్‌కే వాస్తేగా ఎగురవేస్తే సరిపోదని, ఏ దశలోనూ ఫ్లాగ్‌ కోడ్‌ ఉల్లంఘనకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ హెచ్ వోలకు కొత్వాల్‌ స్పష్టం చేశారు. దీంతో ఈ జెండాల పర్యవేక్షణ బాధ్యతల్ని స్థానిక అధికారులు ఆయా కార్యాలయాల్లో పని చేసే సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఠాణా, పోలీసు కార్యాలయంపై జాతీయ జెండా ఎగురుతూ కనిపిస్తోంది. మరోపక్క పోలీసు అధికారులు, సిబ్బందికి ఫిట్‌నెస్‌కు ఎంతో కీలకమని కమిషనర్‌ భావించారు. పని ఒత్తిడి నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్ల వద్ద వ్యాయామం చేసుకోవడం, వ్యాయామ శాలలకు వెళ్లడం సాధ్యం కాదు. వీరు పని చేసే చోటే వ్యాయామశాల అందుబాటులోకి తెస్తే అత్యధికులు వినియోగించుకునే ఆస్కారం ఉంటుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకున్న కొత్వాల్‌.. ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసుస్టేషన్లలోనూ జిమ్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆధునికీకరణ జరుగుతున్న, నిర్మిస్తున్న ఠాణాల్లో అధికారులు, సిబ్బంది కార్యాలయాలతో పాటు  జిమ్‌ కోసం ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. మిగిలిన చోట్ల దశల వారీగా ఏర్పాటుకు నిర్ణయించారు. ఉన్నతాధికారుల కార్యాయాల్లో వారు విశ్రాంతి తీసుకునే గదుల్లోనే ఉపకరణాలు అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు నగరంలోని అన్ని కార్యాయాలకు ఈ ఉపకరణాలు అందుతున్నాయి. మరో రెండు నెలల్లో ఠాణా పైనా జాతీయ జెండా, లోపల జిమ్‌ కచ్చితం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement