రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జాతీయ పతాక స్తంభాన్ని నగరంలో నెలకొల్పారు. దానికి కట్టిన జాతీయ పతాకాన్ని ఇక్కడి ఇందిరా గాంధీ జాతీయ పార్కు (జాతీయ సైనిక స్మారకం)లో గవర్నర్ హెచ్‌ఆర్.
- రాష్ట్రంలో ఎత్తైన జాతీయ జెండా స్తంభం
- ఆవిష్కరించిన గవర్నర్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జాతీయ పతాక స్తంభాన్ని నగరంలో నెలకొల్పారు. దానికి కట్టిన జాతీయ పతాకాన్ని ఇక్కడి ఇందిరా గాంధీ జాతీయ పార్కు (జాతీయ సైనిక స్మారకం)లో గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ గురువారం ఆవిష్కరించారు. పతాక స్తంభం ఎత్తు 207 అడుగులు. జాతీయ పతాకం పొడవు 72 అడుగులు, వెడల్పు 48 అడుగులు, బరువు 31 కిలోలు. ముంబైలో దీనిని డేనియర్ పాలిస్టర్‌తో తయారు చేశారు. దరిమిలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ జాతీయ జెండా రెప రెపలాడుతుంటుంది.
జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం భారత పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దీనిని ఆవిష్కరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఇదే రోజు కావ డం విశేషం. ఈ కార్యక్రమంలో ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎంపీ నవీన్ జిందాల్, బెంగళూరు దక్షిణ ఎంపీ అనంత కుమార్, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రభృతులు పాల్గొన్నారు.
ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలుత 207 అడుగుల జాతీయ పతాక స్తంభాన్ని హర్యానాలోని కైతాల్‌లో నెలకొల్పారు. దేశంలో ఇంకా తొమ్మిది చోట్ల కూడా ఇంతే ఎత్తై పతాక స్తంభాలను ఏర్పాటు చేశారు. 50 కిలోమీటర్ల దూరం నుంచే దీనిని చూడవచ్చు. ఇప్పటి వరకు బళ్లారి జిల్లా విజయ నగరలోని జిందాల్ స్టీల్ వర్క్స్ కర్మాగారంలో నెలకొల్పిన వంద అడుగుల పతాక స్తంభమే రాష్ట్రంలో ఎత్తయినది.