అందరూ నడిచిన తోవనే వెళ్లడం చాలా సౌకర్యవంతం. ఆనవాయితీ తప్పకపోవడమైనా అంతే... క్షేమదాయకం. బహుశా అందుకే 67 ఏళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవంనాడు జాతినుద్దేశించి ప్రసంగించే ఏ ప్రధాని అయినా ఈ ఆనవాయితీని తప్పిందిలేదు. ఎర్రకోట బురుజు లపై నుంచి చేసే ఆ ప్రసంగం వీలైనంత గంభీరంగా... ఇంకా చెప్పా లంటే దేశ ప్రజలకు ఉద్బోధగా, తాము సాధించిన ప్రగతిని ఏకరువు పెట్టడంగా, మధ్యమధ్యన శత్రు దేశాలకు చేసే హెచ్చరికగా సాగిపో యేది. అందులో అవసరాన్నిబట్టి ఇంకా ఆర్ధికాభివృద్ధి, జీడీపీ, విపక్షాల సహాయ నిరాకరణ వంటివన్నీ వచ్చిచేరేవి. ప్రధానిగా ఎవరొచ్చినా షరా మామూలుగా, లాంఛనంగా సాగే ఈ తరహా ప్రసంగాలు ఎర్ర కోట బురుజులకు కూడా కంఠోపాఠమే. దృశ్యమాధ్యమం వచ్చాక ప్రజ లందరికీ సైతం ఇది అలవాటైపోయింది. కాగితాల కట్టతో వచ్చి అందు లో ఉన్నదంతా పొల్లుపోకుండా చదివి వెళ్లే ఈ సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి బద్దలుకొట్టారు.
ప్రసంగం మొదలుపెట్టినప్ప టినుంచి పూర్తయ్యేవరకూ ఆయన నిజంగా ఈ దేశ ప్రజలనుద్దేశించే మాట్లాడారు. వారి గుండె తలుపు తట్టారు. వారు నిత్యమూ ఎదుర్కొనే సమస్యలను వారి భాషలోనే ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలతో వారిలో కొత్త ఆలోచనలను తీసుకొచ్చారు. ఊకదంపుడు సంప్రదాయానికి వీడ్కోలు పలికి ఉత్తేజాన్ని నింపారు. స్ఫూర్తిని రగిల్చారు. ఏదో చేయగ లమని కాదు... ఏమైనా చేయగలమన్న భరోసాను తీసుకొచ్చారు. ఇం తకాలమూ ‘ఆగస్టు 15’ ప్రసంగాల్లో చోటుచేసుకోని ఎన్నో అంశాలు మోడీ నోటివెంట వెలువడ్డాయి. బహుశా ఆయనన్నట్టు ఢిల్లీకి ‘బయటి నుంచి రావడం’వల్లే ఇది సాధ్యమైందేమో! ఈ ప్రసంగం ద్వారా మోడీ నెలకొల్పిన రికార్డులు ఇంకా ఉన్నాయి. సొంతంగా మెజారిటీ సాధించి న తొలి కాంగ్రెసేతర పక్షం తరఫు ప్రధాని మాత్రమే కాదు... ఆయన స్వాతంత్య్రానంతర తరానికి చెందిన తొలి ప్రధాని కూడా. మూడు దశాబ్దాలుగా ఉంటున్న బుల్లెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని రాత్రికి రాత్రి బురుజులపైనుంచి తీయించేయడమూ కీలకమైనదే.
దేశానికి ప్రధానిగా కాదు... మీ ప్రధాన సేవకుడిగా మాట్లాడుతున్నానంటూ ఆయన ప్రస్తావించిన సమస్యలు, వాటి పరిష్కారానికి సూచించిన మార్గాలు ముఖ్యమైనవి. ఆడపిల్లలపై అత్యాచారాల గురించి ఈమధ్య కాలంలో మాట్లాడని నాయకుడంటూ లేడు. ములాయం నుంచి మురళీ మోహన్ వరకూ అందరూ ఆ నేరాలకు ఆడవాళ్లను బాధ్యుల్ని చేసినవారే. తమ డొల్లత నాన్ని బయటపెట్టుకున్నవారే. ఇదే అంశంలో మోడీ చేసిన సూచన అం దరినీ ఆలోచింపజేసేది. పెంపకం దశలోనే ఆడపిల్లలు, మగపిల్లల విష యంలో కుటుంబాల్లో మొదలవుతున్న వివక్ష ఈ వైపరీత్యానికి ఎలా కారణమవుతున్నదో ఆయన పరోక్షంగా చెప్పారు. ‘మీ ఇంట్లో ఆడపిల్ల బయటకు వెళ్లినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేస్తారు కదా...మగపిల్లలను అలా అడుగుతారా...’అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను ఎలాగూ చేస్తుంది... ముందు కుటుంబంలో మీరు చేయాల్సింది చేయమని తల్లిదండ్రులను కోరారు. ఆడపిల్లను పుట్టనివ్వకుండా చేస్తున్న దిక్కు మాలిన పోకడలనూ ఆయన తడిమారు. పిండ దశలోనే ఆడపిల్లను పొట్టనబెట్టుకునే పనులకు పాల్పడవద్దని డాక్టర్లనూ, తల్లిదండ్రులనూ కోరారు. కుటుంబానికీ, అమ్మానాన్నలకూ ఆడపిల్ల ఆసరాగా ఉంటున్న వైనాన్ని చెప్పారు. మరుగుదొడ్ల సమస్య గురించి కూడా ప్రస్తావిం చారు. ప్రతి ఇంటికీ, ప్రతి పాఠశాలకూ మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని అటు ఎంపీలకూ, ఇటు కార్పొరేట్ సంస్థలకూ ఆయన సూచించారు. ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక ఆదర్శగ్రామాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. అదే జరిగితే ఆ నియోజకవర్గం లోని ఎన్నో గ్రామాలకు అది ఆదర్శప్రాయమవుతుందని చెప్పారు. ఈ కృషిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం భాగస్వామిని చేయొచ్చని సూచిం చారు. ‘మేడిన్ ఇండియా’ సందేశాన్ని కూడా వినిపించారు. ‘ఇక్కడ తయారుచేయండి... ఎక్కడైనా అమ్ముకోండి’ అన్నది ఆయన ప్రధాన నినాదం. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైనా, ఆటోమొబైల్ ఉత్పత్తులైనా వేటి నైనా ఇక్కడే ఉత్పత్తిచేసి ఎగుమతి చేసే స్థితికి చేరాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ ఆచరణాత్మక ప్రతిపాదనలు. పేదలకు బ్యాంకింగ్ సేవలు అందడమే లక్ష్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారం భిస్తున్నట్టు మోడీ ప్రకటించారు. ఈ పథకంకింద ప్రారంభించే బ్యాంకు ఖాతాల్లో పేదలకు రూ. 5,000 వరకూ ఓవర్‌డ్రాఫ్టు సౌకర్యం కూడా ఉండటం విశేషం. పరస్పరం కలహించుకుంటూ వివిధ ప్రభుత్వ విభా గాలు న్యాయస్థానాలకెక్కుతున్న వైనాన్ని వివరించారు. అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం అవసరమన్నారు. కుల, మత, ప్రాంతీయతత్వా లపైనా... హింసపైనా పదేళ్ల మారటోరియం విధించుకుందామని ప్రతిపాదించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవలికాలంలో క్రమేపీ పెరుగుతున్న మత ఘర్షణల నేపథ్యంలో ఈ సూచనకు ఎంతో విలువున్నది.
మోడీ చెప్పినవాటిపైనా, చెప్పకుండా వదిలేసిన అంశాలపైనా విమర్శలున్నాయి. ఇందులో అధిక ధరలు, అవినీతి మొదలుకొని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మోడీ ఎన్నికల ప్రసంగాల్లో ఒకటికి పదిసార్లు వచ్చినవే. అందువల్లనే వీటికి సంబంధించిన కార్యాచరణ గురించి చాలామంది ఎదురుచూశారు. 65 నిమిషాల ప్రసంగంలో అన్నిటినీ చెప్పితీరాలనడం కూడా సరికాదు. అధికారానికొచ్చిన రెండు నెలల్లోనే ఆయన కీలక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి విభిన్నంగా ఆలోచించారని ఎర్రకోట ప్రసంగం తేటతెల్లం చేసింది. ఈ అంశాలన్నీ ఆచరణరూపం దాల్చి మంచి ఫలితాలనిస్తే మోడీ ప్రసంగానికి మరింత విలువ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
విభిన్నం... ఆచరణాత్మకం!
Published Sat, Aug 16 2014 11:49 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement