
‘తలరాత’ను తేల్చే తీర్పు
ఎనిమిదవ తేదీన వచ్చే వార్త కాంగ్రెస్‌కు చేదు విషంగానే పరిణమిస్తే... పరిపాలన సాగించడం అసాధ్యంగా మారినందున సార్వత్రిక ఎన్నికలకు దిగడం మాత్రమే మార్గమని చెప్పడం మాత్రమే అది చేయగల గౌరవమైన పని.
ఎనిమిదవ తేదీన వచ్చే వార్త కాంగ్రెస్‌కు చేదు విషంగానే పరిణమిస్తే... పరిపాలన సాగించడం అసాధ్యంగా మారినందున సార్వత్రిక ఎన్నికలకు దిగడం మాత్రమే మార్గమని చెప్పడం మాత్రమే అది చేయగల గౌర వమైన పని.
కాంగ్రెస్ ప్రతి సమస్యకూ మన్మోహన్‌ను తప్పు పట్టాలని చూస్తుంది. అవినీతి మీద నుంచి చర్చను ఆర్థిక వ్యవస్థ వైఫల్యంపైకి మరలుస్తుంది. ప్రభుత్వం అంత పనికిమాలినదే అయితే కాంగ్రెస్ దాన్ని ఎందుకు సహిస్తూ వచ్చింది? అని ఓటర్లు అడుగుతారు.
నేటి మన ప్రజాస్వామ్య పోరాట రుతువులో పరస్పర విరుద్ధమైనవిగా కనిపిస్తూనే పరస్పరం ఆధారపడి ఉండే రెండు విరుద్ధాంశాలు సూటిగా మన కళ్ల ముందే నిలిచాయి. అయితే అవి స్పష్టంగా కనిపించేటంత సమీపానికి ఇంకా రాలేదనుకుంటాను. ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటిసారిగా షీలాదీక్షిత్ బొమ్మ కంటే సోనియాగాంధీ బొమ్మ చిన్నదిగా కనిపించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కాంగ్రెస్ భాగ్యవిధాత బాధ్యతలను స్వీకరించిన నెహ్రూ-గాంధీ కుటుంబం కంటే అంతా గౌరవించే షీలాదీక్షిత్ అయితేనే ఓట్లు పడే అవకాశం ఎక్కువ కావడమే అందుకు కారణమనేది స్పష్టమే.
ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఎన్నికల బహిరంగ సభకు సిగ్గుపడాల్సినంత పలచగా వచ్చిన ప్రజలను షీలా... అసలు స్టార్ రాహుల్ మాట్లాడే వరకు ఆగాలని ప్రాథేయపడాల్సి వచ్చింది. ఇందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి. శంకర్రాపు ఏర్పడే అవకాశమున్న తెలంగాణ రాష్ట్రానికి సోనియా పేరు పెట్టాలని కోరుతున్నారు. పైపైకి ఎగబాకాలని ఆశలు పెట్టుకున్న శంకర్రాపు సోనియాను ‘తెలంగాణ తల్లి’ అని పిలవాలని కూడా కోరుతున్నారు. ప్రతి పార్కులోనూ ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాలంటున్నారు.
ఒక కుటుంబం పేరు పెట్టుకున్న దేశం సౌదీ అరేబియా ఒక్కటే. సౌదీలుసహా ఎవరూ అందుకు అభ్యంతరం తెలపలేదు. తెలంగాణ రాష్ట్రానికి సోనియా పేరును పెట్టడానికి అంగీకరించనివారు కాంగ్రెస్‌లో ఎవరూ ఉండరనే అనుకోవచ్చు. కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా ‘ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర’ అని ఒకప్పుడు ప్రకటించారు. దేశం పేరును కూడా అలా మార్చేలా రాజ్యాంగ సవరణను తేవాలని కోరకుండా నిగ్రహాన్ని ప్రదర్శించారు. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలిచి ఉంటే ఆయన అంత పనీ చేసి ఉండేవారు.
ముఖస్తుతిని పక్కనబెట్టి చూస్తే శంకర్రావు నాటకీయమైన వ్యాఖ్యలు... సోనియా తెలంగాణలో ఓట్లు సంపాదించగలవారే అనే వాస్తవానికి అనుగుణంగానే ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన నినాదాన్ని కాంగ్రెస్ అందుకోవడానికి చాలా ముందు నుంచే అక్కడ ఒక ప్రాంతీయపార్టీ ఆ లక్ష్యంతోనే పనిచేస్తోంది, ఆ పార్టీ తెలంగాణలో సోనియాకు పోటీగా ఉంది. ఆ విషయాన్ని విస్మరించి మాట్లాడటమే శంకర్రావు వ్యాఖ్యలలోని అతిశయోక్తి, ఆర్భాటం. కాబట్టి సోనియా తెలంగాణలో ఎదురులేని ఘనవిజయాన్ని సాధించే అవకాశం లేదు. పైగా తెలంగాణ మినహా మిగతా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలుకావడమనే ప్రతికూలత ఉంది.
ఐదు రాష్ట్ర శాసనసభల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న గానీ మనకు తెలియవు. ముందస్తు అంచనాలు ప్రమాదకరం. అయితే కాంగ్రెస్ ప్రాబల్యం మరింత శుష్కించి పోతుందనడం సురక్షితమైన అంచనాయే కావొచ్చు. ఆ పార్టీ బహిరంగంగా అంగీకరించలేనంత తీవ్రంగా ఈ క్షీణత ఉండవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో నరేంద్రమోడీ ఎన్నికల సభలకు హాజరయ్యే ప్రజలను ఆకట్టుకోగలగడమే అక్కడి కథను చెబుతుంది. ఒక్క రాష్ట్రాన్ని... బహుశా ఛత్తీస్‌గఢ్‌ను గెలుచుకున్నా అదే పది వేలని, ఢిల్లీ దక్కితే బ్రహ్మాండమైన విజయమేనని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రైవేటు సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గ ఢ్, ఢిల్లీలలో ఓటమి అనే పీడకల నేడు కాంగ్రెస్‌ను పగలు కూడా పట్టి పీడించే ఆందోళనగా మారింది. అదే జరిగితే కాంగ్రెస్ వద్ద ఉన్న వాదనలన్నీ అడుగంటిపోతాయి, ఆధారాలు వెంటబడి తరుముతుంటాయి. నేడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఉన్న అంతరం సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఇది ప్రజాభిప్రాయ సేకరణల నివేదికలను తయారు చేసేవారి సంభాషణల నుంచి తెలుస్తున్న విషయం. అతి సుదీర్ఘంగా సాగిన ఈ ఐదేళ్ల కాలంలోని చివరి అంకం సార్వత్రిక ఎన్నికలతో ముగుస్తుంది. ఈ చివరి అంకంలో కాంగ్రెస్ చేయగలిగేది ఏం ఉంది?
పార్టీ తప్పు ఏదీ లేదన్నట్టుగా ధరలు పెరగడానికి అనుమతించిన దివాలాకోరు ప్రభుత్వం మొదలుకొని ప్రతి సమస్యకూ మన్మోహన్‌సింగ్‌ను తప్పు పట్టాలని అది ముందుగా ఉబలాట పడుతుంది. అలా అది అవినీతి మీద నుంచి ప్రధాన చర్చను ఆర్థిక వ్యవస్థ వైఫల్యంపైకి మరలుస్తుంది.
అవినీతి వల్ల లబ్ధిని పొందినవారు ‘ఆ కుటుంబానికి’ అతి చేరువ వరకు వ్యాపించి ఉన్నారు. కాబట్టి ప్రధానిని తప్పుబట్టే వాదన టీవీ యాంకర్ల నుంచి కాస్త సమయాన్ని సంపాదించడానికి మాత్రమే పనికొస్తుంది. ప్రభుత్వం అంత పనికిమాలినదే అయితే ఇంతకాలంపాటూ కాంగ్రెస్ దాన్ని ఎందుకు సహిస్తూ వచ్చింది? అని ఓటర్లు అడుగుతారు. అందులో ఉన్న వెక్కిరింత స్పష్టమే...ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మార్చలేకపోతే ఓటర్లు మార్చగలుగుతారు. కాబట్టి సోనియా కొత్త ప్రధానిని నియమించాలా? రాహుల్‌ను ప్రధానిని చే యాలని కొందరు ఇప్పటికే కొందరు ఉత్సాహవంతులైన కాంగ్రెస్ నేతలు ప్రతిపాదిస్తున్నారు.
లోక్‌సభలో కాంగ్రెస్‌కు సాధారణ మెజారిటీ ఉంటే అదేం సమస్య కాదు. మన్మోహన్ అందుకు ఎప్పుడూ అడ్డంకి కారు. చరణ్‌సింగ్ 1979లో ప్రధాని అయినా పార్లమెంటును ఎదుర్కొనే ధైర్యం చూపలేకపోయారు. మరో చరణ్‌సింగ్ కావాలనుకునేవారు తప్ప మరెవరు ప్రధాని అయినాగానీ పార్లమెంటు విశ్వాసాన్ని పొందడం అవసరం. అసలు రాహుల్‌కు యూపీఏ 2లోని కాంగ్రెస్ మిత్ర పక్షాల నుంచి అవసరమైన మద్దతును పొందగలననే విశ్వాసం ఉందా? ఎంతోకాలంగా కాంగ్రెస్ చేతుల్లో తిప్పలు పడుతున్న మిత్రపక్షాలకు అది తమ అసంతృప్తిని ప్రదర్శించే సందర్భం అవుతుంది. అంతేకాదు తాము కాంగ్రెస్‌కు సమర్థకులమేగానీ ఆ పార్టీ అనుయాయులం కాదని ఓటర్లకు చాటే సందర్భం కూడా అదే అవుతుంది. సంతోషంగానే ఉన్న మిత్రుడు శరద్‌పవార్ సైతం తాను రాహుల్‌ను సమర్థించకపోవచ్చనే సూచనను అందించారు.
ఎనిమిదవ తేదీన వచ్చే వార్త కాంగ్రెస్‌కు చేదు విషంగానే పరిణమిస్తే... పరిపాలన సాగించడం అసాధ్యంగా మారినందున సార్వత్రిక ఎన్నికలకు దిగడం మాత్రమే మార్గమని చెప్పడం మాత్రమే అది చేయగల గౌర వమైన పని. ఏమీ జరగలేదన్నట్టు ఇలాగే కొనసాగుతూ ఏప్రిల్, మే మాసాలకల్లా ఏదో మంచి జరుగుతుందని ఆశించడం అది చేయగలిగిన హేతువిరుద్ధమైన పని. ఈ రెంటిలో ఏది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?
-ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు