‘అనువంశికత’ అంతం ఇలాగే! | opinion on congress party leadership by bjp mp mj akbar | Sakshi
Sakshi News home page

‘అనువంశికత’ అంతం ఇలాగే!

Published Tue, Apr 5 2016 1:53 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

‘అనువంశికత’ అంతం ఇలాగే! - Sakshi

‘అనువంశికత’ అంతం ఇలాగే!

బైలైన్
జాతీయవాదం పట్ల  నిబద్ధత విషయంలో రాహుల్ రాజీపడ్డ విధంగా మరే కాంగ్రెస్ నేతా రాజీపడలేరని చెప్పగలను. ఒక విద్యార్థి కార్యకర్త... మన సైనికులు యూనిఫామ్‌లో ఉన్న రేపిస్టులని, సైన్యం మావోయిస్టులకన్నా అధ్వానమైనదని మూర్ఖంగా వ్యాఖ్యానిస్తే... ఉత్సాహంగా వాటికి ఆమోదం తెలిపేటంతటి మూర్ఖత్వాన్ని ఆయన ప్రదర్శించారు.
 
సఫలత శక్తిసామర్థ్యాలకు కొలబద్ద. సంక్షోభం వ్యక్తి లేదా సంస్థ పరిణతికి, అది తిరిగి కోలుకునే శక్తికి పరీక్ష. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద విస్ఫోటనాన్ని చవి చూసింది. అది ఆ పార్టీ భావజాల ముసుగును తునాతునకలు చేసి, దాని పునాదులను తూట్లు పొడిచిన చెదలను బహిర్గతం చేశాయి. దేశ చరిత్రలోనే ఉద్విగ్నభరితమైన, ఆకాంక్షాపూరితమైన కాలంలో దాన్ని ముందుకు నడిపించగలిగిన పున రుజ్జీవనామృతాన్ని సూచించే సూక్ష్మబుద్ధియైన నేత ఆవిర్భావం అవసరమైన సమయం అది.

 అందుకు బదులుగా, కాంగ్రెస్ తన ప్రాణాంతకమైన  తప్పును కొనసాగించడాన్నే నమ్ముకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ విస్ఫోటనాన్ని వెన్నంటి ఆ పార్టీలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించాయి. రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవడం, నడవడికి సంబంధించిన నిర్వహణా దక్షత కొరవడటం కలసి అంతర్గత  వివాదాన్ని పగుళ్లుగా, ఆ పగుళ్లు చీలికగా మారేలా విషమింపజేశాయి. ఉత్తరాఖండ్‌లోని ఆ పార్టీ శిథిలాలు అంత ప్రత్యేకమైనవేమీ కావు. అవి ఒక క్రమంలో భాగం. అస్సాం, అరు ణాచల్‌ప్రదేశ్ లు అంతకు ముందటి ఉదాహర ణలు.

తరుణ్ గొగోయ్ ప్రభుత్వం ఆ చీలికను తట్టుకోగలిగినా, 2014 ఉపద్రవంలో కాంగ్రెస్‌తో నిలచిన  ప్రాంతీయ పార్టీలకు ఆ పార్టీ దీర్ఘకాలిక గందరగోళంలో చిక్కుకు పోయిందని అర్థమైంది. తమ కోసం కేటాయించడానికి రాహుల్ గాంధీకి సమయం లేదని, ఒకవేళ కొన్ని నిముషాల సమయం చిక్కినా ఆయన తమ మాటలు వినడం లేదనేది వారి సాధారణ ఫిర్యాదు.  అమెరికాలో రిపబ్లికన్లు ఎలా తమ గందరగోళం నుంచి బయటపడలేక పోతున్నారో గత వారాంతంలో ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్టు డేవిడ్ బ్రూక్ విశ్లేషించారు. శాస్త్రీయ విప్లవాల గురించిన థామస్ ఖాన్ సిద్ధాంతాన్ని బ్రూక్ అన్వయించారు. ప్రజాస్వామ్యాన్ని సవివరంగా విశ్లేషించడం కోసం ఆయన మార్క్సిస్టు సిద్ధాంతంలా ధ్వనించే ఆ పదబంధాన్ని ప్రయోగించారు. మేధోపరమైన  పురోగతి నిలకడగా సాగదని ఆయన ప్రతిపాదన. అది సాఫల్యతా నమూనా నుంచి అంతా సజావుగా సాగుతున్నట్టుగా అనిపిస్తుండగా,  వైరుధ్యాలు, క్రమరాహిత్యాలు బయటపడేసరికి ‘‘నమూనా వెంబడి కొట్టుకుపోవడం’’ దిశగా సాగుతుంది.  నమూనా కుప్పకూలేసరికి అది అనివార్యంగా ‘‘నమూనా సంక్షోభం’’గా మారుతుంది: ‘‘నమూనా వైఫల్యానికి అతుకులు వేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. అంతా వ్యథ చెందుతారే తప్ప ఏం చెయ్యాలో ఎవరికీ తెలియదు’’.

 ఊహింపశక్యంకాని రిపబ్లికన్ పార్టీ ప్రవర్తనకు కారణం ‘‘మానసికంగా ఓటమికిగురవుతుండటం’’, అది విధానపరమైన స్థానభ్రంశానికి, క్రమరాహిత్యానికి దారితీస్తుండట మేనని బ్రూక్స్ ప్రతిపాదన. ‘‘తన చరిత్రను తానే నిరాకరించుకోవడ’’మే అయినా జరిగేది మాత్రం అదే.
 2009-2014 మధ్య ఐదేళ్ల కాలంలో తిరిగి ఎన్నిక కావడంతో లభించిన ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ సాఫల్యత నుంచి నమూనా సంక్షోభంలోకి జారిపోయింది. దీని గురించి ఆ పార్టీలో అంతులేని వ్యథ ఉంది, స్థానికమైన తేడాల వల్ల ఎవరూ దానికి పరిష్కారాలను అన్వేషించే ప్రయత్నం చేయరు సరికదా అసలు అంగీకరించనే అంగీకరించరు. వంశపారంపర్య పాలన విజయవంతంగా సాగుతున్నప్పుడు అది పదిలంగా ఉంటుంది. కాబట్టి కొంత వెసులుబాటును అనుమతిస్తుంది. ముప్పును ఎదుర్కొంటున్నప్పుడు మాత్రం మేధ తలుపులను  మూసేసుకుంటాయి.

 కాంగ్రెస్ తన చరిత్రను తానే నిరాకరించుకున్న వైనాన్ని ఇటీవలే మనం చూశాం. జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రను నేను అధ్యయనం చేశాను, ఇందిరాగాంధీ హయాం నుంచి మన్మోహన్‌సింగ్ దశాబ్దివరకు ఆ ప్రాజెక్టుకు సంపాదకత్వం వహించాను. జాతీయవాదం పట్ల  నిబద్ధత విషయంలో రాహుల్ గాంధీ రాజీపడ్డ విధంగా మరే కాంగ్రెస్ నేతా రాజీపడలేరని నేను ఘంటాపథంగా చెప్పగలను. హఠాత్తుగా సుప్రసిద్ధు డైపోయిన ఒక విద్యార్థి కార్యకర్త... భారత సైనికులు యూనిఫామ్‌లో ఉన్న రేపిస్టులని, భారత సైన్యం మావోయిస్టులకన్నా అధ్వాన్నమైనదని మూర్ఖంగా వ్యాఖ్యానించాడు. దిగ్భ్రాంతిగొలిపే ఆ వ్యాఖ్యలకు ఉత్సాహంగా ఆమోదం తెలిపేటంత మూర్ఖత్వాన్ని రాహుల్ గాంధీ ప్రదర్శిం చారు. భారత ప్రజలకే కాదు, ఆయన పూర్వీకులకు సైతం భారత సైన్యం అంటే ఏమిటో తెలియకుండానే ఆయన మధ్య వయస్కులయ్యారు.

 ఒక ఎత్తుగడగా చూసినా ఇది ప్రతికూల ఫలితాలనిచ్చేదే. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకునేవారి పక్షాన నిలిచి కాంగ్రెస్ ఎన్నో ఓట్లను సంపాదించుకోలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభాలను చీలిక ద్వారా పరిష్కరించుకోగలిగింది. వాటిలో అత్యంత సుప్రసిద్ధమైనది, అత్యంత ఫలదాయకమైనది. 1969లో ఇందిరాగాంధీ చాకచక్యంగా తెచ్చిన చీలికే. అయితే 1969 నాటికి వారసత్వపాలన వల్ల  కాంగ్రెస్ చేష్టలుడిగి పోయిలేదనే ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1970ల మధ్యలోనే ఈ జబ్బు మొదలైంది. నేడు కాంగ్రెస్‌లోని ఆలోచనాపరులైన, సీనియర్ నేతలు జనాంతికంగా చేప్పే ఆ విషయాన్ని, బహిరంగంగా అంగీకరించరు. అలా చేయడం, వారి వ్యక్తిగత అవకాశాలకు సంబంధించి ఆత్మహత్యాసదృశమైనదే.
 

టీఎస్ ఇలియట్ వంశపారంపర్య పాలనలు చివరికి ఎలా అంతమవుతాయని చెప్పి ఉండేవాడో అలాగే... ‘బ్రహ్మాండమైన ధ్వనితో గాక, గుసగుసతోనే అంతమవుతాయి’.      

(వ్యాసకర్త : ఎంజే అక్బర్, పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement