జడత్వం వీడుతున్న ‘జోగీ’లు
బైలైన్
ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏమీ కనిపించకపోవడం కూడా కాంగ్రెస్‌ను ఇందుకు ప్రేరేపించి ఉండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన ద్వితీయ వార్షికోత్సవం నేపథ్యంలో జరిగిన సర్వేల ప్రకారం చూసినా ఆయన వ్యక్తిగత ప్రాభవం ఇప్పటికీ ప్రజలలో అలాగే నిలిచి ఉంది. ఎక్కువ మంది అభిప్రాయమో, లేక గణాంకాలను బట్టో కాకుండా ఆర్థిక వ్యవస్థ పురోగమనం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ చిరకాలంగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఉపఎన్నిక లలో కాంగ్రెస్‌ను చిత్తు చేయగల సత్తాతోనే ఉన్నారు.
ఎన్నికల రాజకీయాలలో సాధించిన విజయం గురించి వివరించడం కష్టమేమీ కాదు. కొన్ని లక్ష్యాల ప్రాతిపదికగా ఆ విజయాన్ని కొలుస్తారు. లక్ష్యాలనేవి స్థూలంగా రెండు. అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఎన్నికలకు వెళితే అప్పుడు గెలిచిన స్థానాలను చూస్తారు. పార్టీ ఎదుగుదలే లక్ష్యంగా ఎన్నికలలో పోటీ చేస్తే అప్పుడు ఓట్ల శాతాలను పోల్చి చూసుకుని, ప్రాభవం అనే గ్రాఫ్‌లో సూచీ ఉత్తర దిశగానో, దక్షిణ దిశగానో ఎత్తుకు వెళ్లిందా లేక, యథాతథంగా సమాంతరంగానే ఉండిపోయిందా అని పరికిస్తారు. ఆ విధంగా 2009 సాధారణ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ విజయంగానే పరిగణిస్తుంది. ఎందుకంటే, ఆ ఎన్నికలలో ఆ పార్టీ 205 స్థానాలు గెలిచి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1989 నాటి ఎన్నికలను అపజయంగా భావిస్తుంది. ఎందుకంటే, 197 మంది ఎంపీలతో అప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది.
ఈ ఫలితాలనే ఓట్ల శాతం ప్రాతిపదికగా విశ్లేషిస్తే మీరు కలవరపడడం అనివార్యం. 1989లో కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు దక్కాయి. కానీ అధికారం చేపట్టడంలో విఫలమైంది. అదే 2009 సంవత్సరంలో ఆ పార్టీ 28.55 శాతం ఓట్లు సాధించింది. అయితే అధికారం చేపట్టగలిగింది. ఇది పార్టీ విస్తృతి ఆధారంగా పాక్షికంగా ఇచ్చిన వివరణ. 1989లో కాంగ్రెస్ మొత్తం లోక్‌సభ స్థానాలకు పోటీ చేసింది. కానీ రెండు దశాబ్దాల తరువాత గణనీయంగా కుంచించుకుపోయి, మిత్రపక్షాల అవసరం కూడా వచ్చింది. అధికారం మాదేనంటూ చాటాలంటే, ఎన్నికలలో అన్ని చోట్లా పోటీ చేసి, పార్లమెంటులో చోటు లేకుండా చేసుకోవడం కంటే, పార్టీ ప్రభావం ఉన్న ఒక ప్రాంతంలో లభించిన సగటు విజయాన్ని గణనీయంగా చూపించడం మంచి ఉపాయం.
ప్రభుత్వ వ్యతిరేక సిద్ధాంతంపైనే నమ్మకం
ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తూ చోటు చేసుకున్న పరిణామం ఏమిటంటే, కాంగ్రెస్‌కు సంబంధించి ఆ పార్టీ ప్రభావం కలిగిన ప్రాంతం, సగటు విజయం - రెండూ కూడా పతనదిశ లోనే ఉన్నాయి. అయితే ఆ పార్టీ అబద్ధపు విశ్లేషణలతో తనను తాను మోసపుచ్చుకోవచ్చు. కానీ ఇలాంటి కొంగజపాలు మనల్ని మరింత లోతైన విశ్లేషణ దగ్గరకు తీసుకు పోలేవు. విశ్లేషకులకీ, రాజకీయవేత్తలకి తేడా ఏమిటంటే, రాజకీయవేత్తలు కేవలం మౌలిక సత్యంతో ప్రతిస్పందిస్తారు. చీర్‌లీడర్లకు మాత్రం అంకెల గారడీయే నచ్చుతుంది.
ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని దింపుడు కల్లం ఆశతో ఉంటుందని పరిశీలకులు ఎవ రైనా వెంటనే ఊిహించవచ్చు. కానీ ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ చీలికలు పేలికలవుతోంది. అత్యంత ప్రభావశీలురైన కాంగ్రెస్ నాయకులలో నిస్సందే హంగా ఒకరని చెప్పదగిన అజిత్ జోగి తిరుగుబాటు ప్రకటించారు. సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించాలన్న యోచనకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. అయితే ఆయన అధిష్టానాన్ని బెదిరించడానికే ఇదంతా చేస్తున్నారన్న ఊహాగానాలు లేకపోలేదు. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీని తమ జాగీరులా ఏలుతున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాలిట ఆ ఊహాగానం కూడా అశనిపాతం వంటిదే. రెండేళ్ల క్రితం వరకు కూడా అధి ష్టానం రాష్ట్రాల నాయకులను క్రమశిక్షణ గురించి బెదిరించేవారు. అలాగే ఢిల్లీ పెద్దలు పార్టీ వ్యవహారాలపై తీసుకున్న నిర్ణయాలు పసలేనివని ఆనాడు వారు చెప్పలేకపోయారు కూడా. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.
ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీనికి సహజంగా వచ్చే సమాధానం - పార్టీ ఆధిపత్యం సోనియా గాంధీ నుంచి మధ్య వయస్కుడైన ఆమె కుమారుడు రాహుల్‌కు బదలాయించే ప్రక్రియ సంధిగ్ధంలో పడింది మరి! దండాన్ని కుమారుడికి అప్పగించాలని సోనియా విస్పష్టంగానే ఆశిస్తు న్నారు. కానీ వారసుడి చేతిలో ఆ దండం స్థిరంగా ఉంటుందన్న నమ్మకం పార్టీకి మాత్రం లేదు. కాంగ్రెసేతర ప్రభుత్వాల పట్ల ప్రబలే వ్యతిరేకత కోసం ఎదురు చూడడం తప్ప పార్టీని పునరుద్ధరించే మరో కార్యక్రమం అటు సోనియా గాంధీ వద్దగానీ, ఇటు రాహుల్ గాంధీ వద్దగానీ ఏదీ లేదు. ఇదొక స్తబ్దత ఆధారంగా తయారైన విధానం.
ఓటరుకు అభివృద్ధే అత్యున్నత ప్రాథమ్యంగా మారిన కాలంలో మళ్లీ అధికారంలోకి రాగోరుతున్న ఒక ప్రతిపక్షం నిర్వర్తించవలసిన ప్రథమ విధ్యుక్త ధర్మం- ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను ఓటర్ల ముందుంచడం. కనీసం ఈ ఆలోచన కూడా కాంగ్రెస్ నాయకులకు రావడంలేదు. వారి వ్యూహం ఏమిటంటే దేనిమీద అయినా, ఎవరి మీద అయినా నిర్దాక్షిణ్యంగా దాడి చేయడమే. ఆర్భాటం నుంచి ఎవరైనా కొంత మేలు పొందవచ్చు. కానీ ఓటర్లు ఆకాంక్షిస్తున్నది మాత్రం వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపు తారనే. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హేతుబద్ధ కార్యక్రమమే. కానీ ఎవరి దృష్టినో ఆకర్షించడానికి గొంతు చించుకోవడం మాత్రం నిర్హేతుకమే.
కనిపించని ప్రభుత్వ వ్యతిరేకత - అదే కాంగ్రెస్ బాధ
ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏమీ కనిపించకపోవడం కూడా కాంగ్రెస్‌ను ఇందుకు ప్రేరేపించి ఉండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన ద్వితీయ వార్షికోత్సవం నేపథ్యంలో జరిగిన సర్వేల ప్రకారం చూసినా ఆయన వ్యక్తిగత ప్రాభవం ఇప్పటికీ ప్రజలలో అలాగే నిలిచి ఉంది. ఎక్కువ మంది అభిప్రాయమో, లేక గణాంకాలను బట్టో కాకుండా ఆర్థిక వ్యవస్థ పురో గమనం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ చిరకాలంగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ను చిత్తు చేయగల సత్తాతోనే ఉన్నారు. ఈ వాస్తవాలు చాలామంది కాంగ్రెస్ నాయకులను మౌనం వైపు తిరోగమించేటట్టు చేస్తు న్నాయి. నిస్సహాయ జడత్వం నుంచే వారు ఉపశమనం పొందుతున్నారు.
కానీ కాంగ్రెస్ నాయకులంతా అలాంటి జడత్వంలో లేరు. తన స్థాన మేమిటో చెప్పగల ఇటీవలి కాలపు కాంగ్రెస్ నాయకులలో ఒకే ఒకరు అజిత్ జోగి. అసోం సహా, కొన్ని ఈశాన్య రాష్ట్రాలలోను, ఉత్తరాఖండ్‌లోను కాంగ్రెస్ చీలిపోయింది. కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నాయకులు ఎటు పోవాలో తోచక పార్టీలోనే కొనసాగుతున్నారు. ఒకప్పుడు దేశాన్ని పాలించిన పార్టీలో ఉండడం కంటే ఒంట రిగా మిగలడంలోనే మంచి భవిష్యత్తును చూసుకుంటున్నారు అజిత్ జోగి.
సముద్రపు ఆటుపోట్లలో ఉపరితలం కిందనే విద్యుత్ ప్రవహిస్తుంది. కానీ అది సృష్టించే కల్లోలం తక్కువేమీ కాదు. అయితే ఉపరితలం ప్రశాంతంగా ఉందికాబట్టి వచ్చే నష్టం ఏమీ లేదని నమ్మే కాంగ్రెస్ నేతలు ప్రళయంలో ఓదార్పు పొందుతారు. కానీ అదొక బాధాకరమైన స్మృతి గీతే అవుతుంది.
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, సీనియర్ సంపాదకులు, బీజేపీ అధికార ప్రతినిధి: ఎం.జె. అక్బర్