కాంగ్రెస్ ‘చే’జారిన యువత! | congress lose youth | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ‘చే’జారిన యువత!

Published Sat, Apr 5 2014 11:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కాంగ్రెస్ ‘చే’జారిన యువత! - Sakshi

కాంగ్రెస్ ‘చే’జారిన యువత!

బైలైన్, ఎంజే అక్బర్
 
 
 గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఆర్థిక రంగంలో తన సత్తాను నిరూపించుకుని జాతీయ స్థాయిలో ఒక బలమైన శక్తిగా ఎదిగారు. కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆర్థిక రంగంలో వైఫల్యాలను మూటకట్టుకుంటే అదే దశాబ్దిలో గుజరాత్‌లో మోడీ జైత్రయాత్ర కొనసాగింది.
 
 ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో జరిగిన ‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్ తర్వాత కాంగ్రెస్ పట్ల యువతకు వ్యతిరేకత పెరిగిపోయింది. ముఖ్యంగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్ల కూడా యువతీయువకులలో విశ్వాసం కరువయ్యింది. దేశరాజధానిలో కదిలే బస్సులో ఒక యువతి అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి గురికావడం, ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోవడం ఈ దేశంలో యువతరంపై ఎంతో ప్రభావం చూపింది. ఈ సంఘటనను ప్రస్తావించిన 30 ఏళ్ల మీడియా ప్రొఫెషనల్ ఎంతో విచారం వ్యక్తం చేశాడు. రాహుల్ యువత మద్దతు కోల్పోతున్నట్టు స్పష్టమయ్యిందని అతను వ్యాఖ్యానించాడు. గ్యాంగ్‌రేప్ సంఘటన తర్వాత ‘నిర్భయ’ ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఢిల్లీలో యువతీయువకులంతా ఢిల్లీ ప్రధానవీధుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. అదే సమయంలో బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచారు. ‘నిర్భయ’ మళ్లీ అందరిలా జీవించాలని భారతావని అంతా కోటి దేవుళ్లకు మొక్కుతుంటే.... అలాంటి కీలక తరుణంలో రాహుల్ గాంధీ తమవెంట ఉండాలని యువతరం కోరుకుంది. కానీ అలా జరగలేదు.

 

సంఘటన స్థలి నుంచి యువరాజావారు అదృశ్యమయ్యారు! ఆ తర్వాత దానికి సంబంధించిన చర్చలో తనకే ప్రమేయం, పాత్ర లేకుండా చూసుకున్నారు. అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే 2012 డిసెంబర్‌లో రాహుల్ ఢిల్లీలోని తన ఇంట్లో ఉన్నారా లేక సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నారా అన్నది అప్రస్తుతం. ఢిల్లీ నగరవాసులు ‘నిర్భయ’ కోసం రోడ్లపై ఉద్యమించినప్పుడు మాత్రం ముఖం చాటేశారు. ఇది ఢిల్లీలో జరిగిన సంఘటనకు వివరణ మాత్రమేనా? బహుశా అదే కావచ్చు. రాహుల్ గాంధీ తీసుకునే చర్యలను ఢిల్లీ ప్రజలు ఎలా గమనిస్తారోకాని, కేంద్రం తీసుకునే నిర్ణయాలను మాత్రం దేశ ప్రజలు కచ్చితంగా పట్టించుకుంటారు.
 
 అసలు తప్పేమిటి? డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, రాహుల్ అనే ముగ్గురు పాలకులకు ఈ దేశంలోని యువతరం 2009లో అధికారం కట్టబెట్టింది. ఆ తర్వాత వారిపట్ల ఈ త్రిమూర్తులు అనుసరించిన అవధుల్లేని నిర్లక్ష్యం ఎన్నోసార్లు బయటపడింది. 2009లో కాంగ్రెస్‌కు సొంతంగా 206 సీట్లు వచ్చాయంటే కచ్చితంగా పెద్ద సంఖ్యలో యువతీయువకులు ఓట్లు వేయడమే కారణమని చెప్పవచ్చు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. నగరాలు, చిన్న పట్టణాలలో ఈ యువత ఓటింగ్ ధోరణి స్పష్టంగా కనిపించింది. భౌగోళిక పరిమితులకూ, కులాలు, తెగలకూ అతీతంగా వీరంతా ఓట్లు వేశారు. వీరందరి లక్ష్యం ఒక్కటే... సామాజిక కట్టుబాట్ల పేరిట కొందరు మూఢత్వంతో ఆంక్షలు విధించే పద్ధతులకు దూరంగా స్వేచ్ఛగా జీవించాలనీ, సాంస్కృతిక స్వేచ్ఛను అనుభవించాలనీ, ఉద్యోగాలను దక్కించుకోవాలని వీరంతా కోరుకున్నారు. ఈ ధోరణిపై ఎవరికైనా ఎలాంటి అనుమానం ఉన్నా ఈ ఎన్నికల తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ఈ సార్వత్రిక ఎన్నికలలో 15 కోట్ల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  
 
 ప్రభుత్వం చేసే తప్పిదాలను క్షమించని ఓటర్లు పాలకపార్టీకి దుర్వార్తను అందిస్తారు. చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా నమ్మకద్రోహానికి పాల్పడితే ఎన్నికల్లో కఠినంగా శిక్షిస్తారు. ఈ తరహా ఓటర్లు ఆవేశకావేశాలకు లోనుకాకుండా తమ పరిణతిని ప్రదర్శిస్తారు.
 ప్రభుత్వ పాలనలో మంచిచెడ్డలను కూడా ఓటర్లు నిశితంగా అధ్యయనం చేస్తారు. ఈ దేశంలోని యువతీయువకులకు యూపీఏ, కాంగ్రెస్ పట్ల నిరాశానిస్పృహలు ఆకస్మికంగా ఏర్పడలేదు.  కోట్లాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే ందుకు తగినస్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి సాధించలేకపోయిందని యువతరం క్రమంగా గ్రహించింది. ఈ లక్ష్యంపై కేంద్రానికి ఆసక్తి లేదని కూడా యువత గుర్తించింది.
 
 రాహుల్ గాంధీ నక్క తోకను తొక్కాడు. అతనికి పట్టిన అదృష్టం అంతాఇంతా కాదు. పదేళ్లపాటు అతని అదుపాజ్ఞల్లో కేంద్ర ప్రభుత్వం నడిచింది. కేంద్ర కేబినెట్‌లో చేరకుండానే పెత్తనం చేశాడు. ఎన్నికలు ముంచుకొచ్చేసరికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను తలకెత్తుకున్నాడు. ఎందుకంటే ప్రాజెక్టులు అమలు జరిగితే ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు ఓటర్ల ముంగిట్లోకి వస్తాయన్నది ఆయన ఆలోచన.
 
 ప్రభుత్వంలో అవినీతి గబ్బు బయటపడడంతో పార్టీలో వివిధస్థాయిల్లో పెరుగుతున్న అసంతృప్తుల, నిరాశానిస్పృహలు క్రమంగా తీవ్రతరమై అగ్నిపర్వత లావాలు ఎగజిమ్ముతున్నాయి. కామన్వేల్త్ క్రీడలలో మరుగుదొడ్లలో వాడిన టాయిలెట్ పేపర్‌ను ఎంత భారీ ఖరీదుకు కొనుగోలు చేశారో తెలిస్తే నవ్వు వస్తుంది.
 
 డిసెంబర్ రెండో వారంలో  ‘ప్యూ’ అనే అమెరికా సంస్థ ఒకటి  సర్వే జరిపింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 63 శాతం మంది కోరుకుంటుండగా, 19 శాతం మంది మాత్రమే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలతో కూడిన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఓటర్లలో యువత సంఖ్య గణనీయంగా ఉండడం, పాలకపార్టీకి యువతీయువకులు దూరం కావడం వల్లనే ఎన్‌డీఏ కూటమికీ, యూపీఏ కూటమికీ ఇంత వ్యత్యాసం ఉంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాలలో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించారంటే ఆయన ఆర్థిక రంగంలో తన సత్తాను నిరూపించుకోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమంటే... కేంద్రంలో అధికారంలో కొనసాగిన పదేళ్ళ కాలంలో ఆర్థిక రంగంలో కాంగ్రెస్ వైఫల్యాలను మూటకట్టుకుంటే.... అదే దశాబ్దిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ జైత్రయాత్ర కొనసాగించారు. రెండు ప్రభుత్వాలూ ఒకే వాతావరణంలో పనిచేశాయి. ఒకే  తరహా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన ఆర్థికశాఖ అధికారులూ, గుజరాత్ సర్కారులో పనిచేసిన ఆర్థిక అధికారులూ ఒక తానులోని ముక్కలే. అయితే తేడా ఒక్కటే. నిర్ణయాలు తీసుకోవడంలోనే. గుజరాత్‌లోని అధికారులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇక కేంద్రంలోని అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనని  భయభ్రాంతులవుతుంటారు.
 
 ఇప్పుడు కొత్తగా వాగ్దానాలు చేస్తే వినే ఓపిక ఓటర్లకు లేదు. గత పదేళ్ళుగా ప్రజలలో పాలకపార్టీ పట్ల నెలకొన్న కారుచీకట్లను పోగొట్టేందుకు వచ్చే పది రోజుల్లో చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి వచ్చే ఐదేళ్ళలో 10 కోట్ల ఉద్యోగాలిస్తామని రాహుల్ గాంధీ అకస్మాత్తుగా వాగ్దానం చేస్తే వెనువెంటనే ఒక అనుమానం కలుగుతుంది. గత పదేళ్ళపాటు ఆయన అధికారంలో కొనసాగినప్పుడు ఈ పని ఎందుకు చేయలేకపోయారు? నరేంద్ర మోడీ తప్పకుండా కాంగ్రెస్‌పై ప్రజలకున్న అక్కసును సొమ్ము చేసుకుంటారు. కానీ దీనిలో ఒక చిక్కు ఉంది. అంతకముందు పాలకుల కన్నా ఆయన వేగంగా చేసి చూపించాల్సి ఉంటుంది. అధికారంలోకి వస్తే హామీలను నెరవేర్చడంలో పడే ఇబ్బందులతో పోల్చితే ప్రస్తుత ఎన్నికలు గెలవడంలో పడే కష్టాలు పెద్ద కష్టాలు కావు.    
 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement