న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. తప్పు చేసిన వారు ఒప్పుకుని బహిరంగంగా క్షమాపణలు చెబుతుంటే, మరికొంతమంది తామే తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. ఇంకా కొంతమంది వారిపై వస్తున్న ఆరోపణలపై స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. గత రెండు రోజుల క్రితం విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ గురించి వెలుగులోకి వచ్చిన చీకటి కోణాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఎంజే అక్బర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించడానికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించకుండా నిరాకరిస్తే.. కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ మాత్రం ఎంజే అక్బర్ ఈ విషయంపై ముందుకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై వస్తున్న ఆరోపణలపై ఆ జెంటిల్‌మ్యాన్ ముందుకు వచ్చిన మాట్లాడాలని స్మృతీ ఇరానీ అన్నారు.
అంతేకాక, లైంగిక వేధింపులపై ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మహిళా జర్నలిస్ట్‌లను ఆమె అభినందించారు. ఈ విషయంపై మాట్లాడుతున్న మహిళలకు ఆమె సపోర్టు కూడా ఇచ్చారు. ‘వేధింపులకు పాల్పడితే, వారు వర్క్ చేయడానికి వెళ్లలేరు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు వర్క్ చేయడానికి వెళ్తారు. అలాగే గౌరవప్రదంగా జీవించాలనుకుంటారు. ప్రస్తుతం ఈ విషయంపై పోరాటం చేస్తున్న మహిళలందరికీ న్యాయం వస్తుందని ఆశిస్తున్నా’ అని స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. కాగా, గతంలో ఒక పత్రికకు ఎడిటర్‌గా ఉన్న సమయంలో ఎంజే అక్బర్, తనను లైంగికంగా వేధించాడని ప్రియా రమణి అనే మహిళ జర్నలిస్ట్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రియా రమణి ముందుకు వచ్చిన తర్వాత, మరికొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై ఎంజే అక్బర్ ఇప్పటి వరకు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment