సాక్షి, న్యూఢిల్లీ : చిత్ర పరిశ్రమలోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్ ప్రియా రమణి చేసిన అరోపణలు అప్పట్లో సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. తనపై ప్రియా తప్పుడు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగంకలిగే విధంగా వ్యాఖ్యలు చేశారని ఎంజే అక్బర్ కోర్టును ఆశ్రయించారు. ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక తీర్పునిచ్చింది.
బాధితురాలిపై ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ఎప్పుడైనా బయటకు చెప్పుకోవచ్చని స్పష్టం చేసింది. ఎంజే అక్బర్ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. ఆమె వ్యాఖ్యలతో పిటిషనర్‌కు పరువు నష్టం జరిగిందని భావించేమని పేర్కొంది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రియా రమణికి న్యాయస్థానంలో ఊరట లభించింది.
గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. దీనిని తాజాగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కాగా ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్‌పై తీవ్రమైన ఆరోపణలతో మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment