
న్యూఢిల్లీ : బాలీవుడ్‌లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాల్లో, రాజకీయాల్లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారి ముసుగులు తొలగించింది. ఎంజే అక్బర్ ఏకంగా మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మీద ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియా రమణి మీద అక్బర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేస్తూ పటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రియా రమణి న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘ఇక ఇప్పుడు నా వంతు.. నా కథను ప్రపంచానికి వినిపించే సమయం వచ్చింది. నిజమే నా ఆయుధం’ అని పేర్కొన్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. (#మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ)