#మీటూ : అక్బర్‌ అత్యాచార పర్వం..వైరల్‌ స్టోరీ | As a young journalist in India, I was raped by M.J. Akbar | Sakshi
Sakshi News home page

#మీటూ : అక్బర్‌ అత్యాచార పర్వం.. వైరల్‌ స్టోరీ

Published Fri, Nov 2 2018 12:25 PM | Last Updated on Sat, Nov 3 2018 7:46 AM

As a young journalist in India, I was raped by M.J. Akbar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  మీటూ ఉద్యమం భాగంగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు  ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీసాయి.  జర్నలిస్టు ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్‌పై తీవ్రమైన ఆరోపణలతో  మీటూ అంటూ సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి  వచ్చారు.  ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా, ప్రియా రమణిపై పరువు నష్టం కేసు లాంటి పరిణామాలు చోటు  చేసుకున్నాయి. మరోవైపు ఆయన ఒక పాత్రికేయుడుగా ఎంతటి ప్రతిభావంతుడో.. మహిళలను వేధించడంలో అంతే స్థాయికి దిగజారి ప్రవర్తించేవాడు అనేది ఆయా ఆరోపణల సారాంశం.  ఇవన్నీ ఒక ఎత్తయితే.. అమెరికాలో ప్రముఖ జర్నలిస్టుగా స్థిరపడిన, నేషనల్‌  పబ్లిక్‌ రేడియోలో చీఫ్‌ బిజినెస్‌ ఎడిటర్‌ పల్లవి గొగోయ్‌ పంచుకున్న  లైంగిక వైధింపులు, అత్యాచారం  ఆరోపణలు  మరో ఎత్తు. 23 సంవత్సరాలుగా తన గుండెను మెలిపెడుతున్న, తన  జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలను వాషింగ్‌ పోస్ట్‌లో షేర్‌ చేశారు. 

ముఖ్యంగా భారతదేశంలో అక్బర్‌పై చెలరేగిన ఆరోపణలు, వాటిని ఆయన ఖండించిన తీరు చూసిన తరువాత తన స్టోరీని కూడా చెప్పాలనుకుంటున్నానంటూ ఎడిటర్‌ ఇన్‌ ఛీప్‌గా అక్బర్‌ తను మానసికంగా, శారీరంగా వేధించిన వైనాన్ని పల్లవి వెల్లడించారు. అక్బర్‌ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు మీటూ అంటూ ముందుకు వచ్చిన తీరు, ఆక్రోశం కదిలించింది. అందుకే అక్బర్‌పై పోరుకు సిద్దమైన మహిళలందరికీ మద్దతుగా తన గాథను చెబుతున్నాన్నారు. ఇకనైనా తానేం చేసినా చెల్లుతుంది అనే అక్బర్  లాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలని ఈ సందర్బంగా ఆమె కోరుకున్నారు. 

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశానికి చెందిన విదేశాంగశాఖలో ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిగా అక్బర్‌ పనిచేశారు. బేటీ బచావో అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న  పాలక పార్టీకి ఇప్పటికీ సభ్యుడుగా, ఎంపీగా ఉన్నారని పల్లవి ఎద్దేవా చేశారు. 

ఏసియన్‌ ఏజ్‌లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు నాకు 22ఏళ్లు. అక్కడ చాలామంది మహిళలున్నారు. జర్నలిజంలో ఓనమాలు కూడా రాని సమయమది.  కొద్దికాలంలోనే, చిన్నవయసులోనే ఏసియన్‌ ఏజ్‌లో ఆపోజిట్‌ ది ఎడిటోరియల్‌ పేజ్‌ ఎడిటర్‌గా పెద్ద బాధ్యత నిర్వహించాను. భారతీయ రాజకీయ ప్రముఖులు, ప్రముఖ రచయితలు, మేధావులు,  ముఖ్యంగా జస్వంత్ సింగ్, అరుణ్ శౌరీ, నళినీ సింగ్ వంటి ప్రముఖులతో మాట్లాడేదాన్ని. న్యూఢిల్లీలో ఎంజే అక్బర్ లాంటి గొప్ప జర్నలిస్టుతో పనిచేయడం గర్వంగా భావించే దాన్ని.  ఆయన స్థాయికి ఎదగాలని కలలు కనేదాన్ని. కానీ  తన కెంతో ఇష్టమైన ఉద్యోగం కోసం భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చిందంటూ అక్బర్‌  నిజస‍్వరూపం గురించి ఈ  ఇండో అమెరికన్‌ జర‍్నలిస్టు పల్లవి వాషింగ్టన్ పోస్టులో షేర్‌ చేశారు.

మొదటి సంఘటన
1994 సంవత్సరంలో తన పేజీ చూపించడానికి ఆయన క్యాబిన్‌కి వెళ్లాను. ఆయన నన్నుపొగుడుతూనే. అకస్మాత్తుగా ముద్దుపెట్టుకోవడానికి ముందుకొచ్చాడు. తీవ్ర గందరగోళం, అవమానం మధ్య బయటికి పరుగెత్తాను. ఈ విషయాన్ని నా ఫ్రెండ్‌ తుషితకు వెంటనే (ఆమె ఒక్కదానికే)  చెప్పుకున్నాను. 

రెండవ సంఘటన
కొన్ని నెలల తర్వాత మరో సంఘటన. ఈసారి ముంబైలో. ఒక పత్రికను ప్రారంభించటానికంటూ ముంబైలోని తాజ్ హోటల్‌లోని తన గదికి అక్బర్‌ నన్ను పిలిచాడు. అక్కడ మళ్ళీ ముద్దు పెట్టుకోవటానికి వచ్చినప్పుడు , తీవ్రంగా ప్రతిఘటించి పారిపోయాను. ఆ సందర్భంలో హోటల్‌ దగ్గర పడిపోయాను, దెబ్బలు  కూడా తగిలాయి. దీంతో ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత అక్బర్‌ నాపై ఎగిసి పడ్డాడు.  తనకు లొంగకపోతే ఉద్యోగంనుంచి తీసేస్తానని బెదిరించాడు.  అయినా నేను వెరవలేదు. 

అత్యాచార పర్వం
ఉదయం 8 గంటలకే ఆఫీసుకు చేరుకుని పని పూర్తి చేసుకుని, ఎడిటోరియల్‌ పేజీలు సిద్ధంగా ఉంచి  ఆయన్నుంచి తప్పించుకుని పారిపోయేదాన్ని.  చాలాసార్లు రిపోర్టింగ్‌ వెళ్లిపోయేదాన్ని. ఈ క్రమంలోనే ఢిల్లీకి దూరంలో ఒక  ప్రేమజంట(వేరు వేరు కులాలు)ను  కుటుంబ  సభ్యులు ఉరితీసిన భయానక ఉదంతాన్ని  రిపోర్ట్‌ చేయడానికి వెళ్లాను.  ఈ ఎసైన్‌మెంట్‌ జైపూర్‌లో పూర్తి చేసుకొని, తిరిగి వచ్చేలోపు అక్బర్‌నుంచి కాల్‌. స్టోరీ గురించి మాట్లాడాలని హోటల్‌కు రమ్మన్నాడు. భయపడుతూనే వెళ్లాను. హోటల్ గదిలో అతను విలాసంగా. మళ్లీ ఎటాక్‌ చేశాడు. కానీ ఈసారి ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. శారీరకంగా బలవంతుడైన అక్బర్‌  నన్ను వశం చేసుకుని, రేప్ చేశాడు. ఈ విషయంలో పోలీసులకు  ఫిర్యాదు చేయలేనంత అవమానంతో కుంగిపోయాను. దీని గురించి ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా చెబితే నమ్ముతారా? అసలు  హోటల్ గదికి ఎందుకు వెళ్ళానంటూ నన్ను నేను నిందించుకుంటూ మిన్నకుండిపోయాను. దీంతో నాపై మరింత పట్టు బిగించిన అక్బర్‌ తన దాడి కొనసాగించాడు.  పురుష సహోద్యోగులతో మాట్లాడటం చూస్తే చాలు..రెచ్చిపోయేవాడు. డెస్క్‌లో అందరిముందే గట్టి అరవడం, తిట్టడం చేసేవాడు.

జీవితంలో అన్నింటిపైనా పోరాడిన నేను అతనితో ఎందుకు పోరాడలేకపోయాను? ఎందుకంటే..అతను నాకంటే అన్నివిధాలుగా శక్తివంతుడు. ఎన్నడూ ఊహించని ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. పైగా ఈ విషయంలోఅంతకుముందు పోరాడిన వాళ్లు నాకు ఎవరూ కనిపించలేదు. ఒకపక్క ఉద్యోగం పోతుందన్న భయం. మరోపక్క ఎక్కడో దూరంగా ఉన్న  తల్లిదండ్రుల వద్ద నా నిజాయితిని ఎలా నిరూపించుకోవాలన్న  ఆవేదన.  తెలిసిందల్లా ఒకటే.. నన్ను నేను ద్వేషించుకుంటూ ప్రతిక్షణం చస్తూ బతకడం.

రిపోర్టింగ్‌ కోసం ఎపుడెపుడు దూరంగా పోదామా అని చూస్తూ ఉండేదాన్ని. ఇంతలో డిసెంబరు, 1994 కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. ఈ సందర్భంగా పొలిటికల్‌ రిపోర్టింగ్‌లో పట్టును, గుర్తింపును, అనుభవాన్ని సాధించాను. దీనికి గుర్తింపుగా విదేశీ కరస్పాండెంట్‌గా యూఎస్‌, యూకే పంపిస్తున్నానని అక్బర్‌ చెప్పాడు. ఆశ్చర్యపోయాను. అలాగైనా అతని వేధింపులనుంచి దూరంగా వెళ్లొచ్చని సంబరపడ్డాను. కానీ అది తప్పని తరువాత  తెలిసింది.  దూరంగా ఉంటే నాకు రక్షణ ఉండదు కనుక తన వేట నిరాటంకంగా కొనసాగించవచ్చనేది అక్బర్‌ ప్లాన్‌.  మళ్లీ వేట షురూ.

ఒకసారి లండన్ ఆఫీసులో పురుష కొలీగ్‌తో మాట్లాడుతుండగా నాపై అక్బర్‌ మరోసారి విరుచుకుపడ్డాడు. డెస్క్‌లో పేపర్‌ వెయిట్‌, కత్తులు, చేతికి ఏది దొరికితే అది తీసుకొని నా మీదకు విసిరి పారేశాడు. దీంతో భయపడి లండన్‌​ ఆఫీసునుంచి పారిపోయి సమీపంలోని ఒక పార్క్‌లో ఒక గంట దాక్కుని ఇంటికి చేరాను. ఆ మర్నాడు తుషిత, సుపర్నతో నా బాధను షేర్‌ చేసుకున్నాను. మానసికంగా, శారీరకంగా  చితికిపోయాను.  దుర్మార్గుడి నుంచి పారిపోతున్నానని చెప్పాను. లండన్‌ నుంచి వచ్చేయాలనుకుంటున్నానని అమ్మానాన్న, చెల్లికి కూడా  చెప్పాను. 

విదేశీ ప్రతినిధిగా వీసా వుంది కదా అమెరికాలో కొంతమంది సీనియర్‌ ఎడిటర్ల సాయంతో పని చేసుకుందాం అనుకున్నా..కానీ ఇంతలో ముంబైకి తక్షణమే రమ్మంటూ అ‍క్బర్‌ ఆజ్ఞాపించాడు. దీంతో ఇక ధైర్యంగా రిజైన్‌ చేశాను. ఆ తరువాత డౌజోన్స్‌లో అసిస్టెంట్‌ రిపోర్టర్‌గా జాయిన్‌ అయ్యాను. నేనిష్టపడే జర్నలిజాన్ని దక్కించుకున్నాను. ముక్కలుగా విరిగిపోయిన జీవితాన్ని తిరిగి దక్కించుకున్నాను. కృషి, పట్టుదల, టాలెంట్‌తో ఉన్నత స్థాయికి ఎదిగాను.  ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో ఛీప్‌గా ఉన్నాను. పెళ్లికి ముందే నా భర్తకు ఇవన్నీ చెప్పాను. ఇపుడు ఇద్దరు బిడ్డలకు తల్లిని.

బాధిత మహిళలకు మద్దతుగా ఉండటంతోపాటు యవ్వనంలో ఉన్న నా కొడుకు, కూతురుకోసం కూడా ఇది రాస్తున్నా. ఎవరైనా వేధిస్తున్నపుడు, బాధిస్తున్నపుడు తిరగబడాలని వారూ  తెలుసుకోవాలి.  నా గురించి ఎవరు ఎలా అయినా అనుకోనీ, ఆ  చీకటి క్షణాలనుంచి బయటపడ్డాను. ఇలాగే ముందుకు సాగుతాను. ఇది పల్లవి గొగోయ్‌ ఆవేదన. 

మరోవైపు ఈ ఆరోపణలను ఎంజే అక్బర్‌ తిరస్కరిస్తున్నారని ఆయన న్యాయవాది సందీప్‌ కపూర్‌ వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement