న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియారమణికి విముక్తి లభించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంజే అక్బర్ తనని లైంగికంగా వేధించారంటూ ప్రియారమణి చేసిన ఆరోపణలపై అక్బర్ కోర్టుకెక్కారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రియారమణికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎంజే అక్బర్ వేసిన దావాను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకి దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికలోనైనా తనకు జరిగింది వెల్లడించే హక్కు ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాంజే స్పష్టం చేశారు.
తీర్పుని వెలువరించే సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘంలో హోదా ఉన్న వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. ‘‘లైంగిక వేధింపులపై తమ గళం విప్పిన మహిళల్ని శిక్షించలేము. ఒక వ్యక్తి పరువు తీశారని ఫిర్యాదులు వచ్చినా మహిళల్ని శిక్షించడానికి వీల్లేదు. మహిళల మర్యాదని పణంగా పెట్టి సంఘంలో మరో వ్యక్తి పరువుని కాపాడలేము’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపులతో మహిళల ఆత్మగౌరవం, మర్యాదకి భంగం వాటిల్లుతుంది. తనపై జరిగిన నేరంతో ఆమె తీవ్రమైన మానసిక సమస్యలనెదుర్కొంటుంది. నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలపై ఒక్కోసారి ఆమె పెదవి విప్పలేకపోవచ్చు.
ఒక్కో సారి ఆమెకి అన్యాయం జరిగిందని కూడా బాధితురాలికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే లైంగిక వేధింపులకు గురైన మహిళలు దశాబ్డాల తర్వాత కూడా బయట ప్రపంచానికి వెల్లడించవచ్చు’’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.‘‘లైంగిక వేధింపులతో బాధితురాలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి కూడా మిగిలిన వారిలాగే మన సమాజంలో కలిసిపోతారు. అతనికీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలోనే ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి’’ అని మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. మహిళల్ని గౌరవించాలంటూ రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు రాసిన నేలపై వారి పట్ల జరుగుతున్న అకృత్యాలు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు.
మహిళలు ఇక మాట్లాడాలి
ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పట్ల ప్రియారమణి హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపు మరెందరో మహిళల్ని పెదవి విప్పేలా ప్రోత్సహిస్తుందని ప్రియారమణి వ్యాఖ్యనించారు. ‘‘నేను చేస్తున్న పోరాటం నా ఒక్కదాని కోసం కాదు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరి తరఫున పోరాడుతున్నాను. కేవలం మాట్లాడానని నన్ను ఈ కేసులోకి లాగారు. ఒక బాధితురాలినైన నన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టారు. సమాజంలో పలుకుబడి ఉందని, శక్తిమంతులమని బావించే మగవాళ్లు బాధిత మహిళల్ని కోర్టుకీడ్చడానికి ఇకపై ముందు వెనుక ఆలోచిస్తారు’’ అని ప్రియారమణి అన్నారు. ఈ కేసులో తాను విజయం సాధించేలా శ్రమించిన తన లాయర్లకి ప్రియారమణి ధన్యవాదాలు తెలిపారు.
మీటూ కేసు: రామాయణం, మహాభారతం ప్రస్తావన
Published Wed, Feb 17 2021 7:16 PM | Last Updated on Thu, Feb 18 2021 2:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment