
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీటూ’ లో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తదుపరి చర్యలకుపక్రమించారు. ఆరోపణలు అన్నీ అవాస్తవమని కొట్టి పారేసిన ఆయన తాజాగా జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారని చేశారంటూ క్రిమినల్ డిఫమేషన్ నమోదు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో సోమవారం ఆయన ఈ కేసు దాఖలు చేశారు. సుదీర్ఘమైన, విలువైన తన కరియర్‌ను నాశనం చేసేందుకే ప్రియా రమణి తనపై తప్పుడు, హానికరమైన ఆరోపణలు చేశారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
విదేశీ పర్యటనముగించుకొని స్వదేశానికి చేరుకున్న కేంద్రమంత్రి తనపై వచ్చిన ఆరోపణలపై ఆదివారం స్పందించారు. జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఈయన తోసిపుచ్చారు. రాజకీయ కారణాలతో తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేస్తున్నవారు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ ఆయన చేశారు. లేదంటే తనపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేసింది. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోరు విప‍్పకపోవడంపై మండిపడుతోంది.
కాగా ఎంజే అక్బర్ ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ లాంటి ప్రముఖ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. సంపాదకుడుగా ఉన్నప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ విదేశీ మహిళా జర్నలిస్టులతో సహా పలువురు మహిళా పాత్రికేయులు 'మి టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా జర్నలిస్టు ప్రియా రమణి తొలిసారిగా ట్విటర్ వేదికగా ఎంజే అక్బర్‌పై ఆరోపణలు చేసిన సంగతి విషయం తెలిసిందే.
ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన 14మంది : ప్రియ రమణి, షుమా రాహా, ప్రేరణ సింగ్, కనికా గెహ్లాట్, సుపర్ణ శర్మ, హరీందర్ బవేజ, సబా నక్వి, షుతప పాల్, గజలా వహాబ్, అంజు భారతి, కాదంబరి వాడే, రూత్ డేవిడ్, మాలిని భూప్తా , మాజైల్ డి పే కంప్.