
న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల గురించి ప్రతీ మహిళ ధైర్యంగా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ పాత్రికేయురాలు ప్రియా రమణి అన్నారు. తమను వేధించిన వారికి ఎదురు తిరిగి యుద్ధం చేసినపుడే ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పలు రంగాల్లో ప్రకంపనలు రేపిన మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ జర్నలిస్టు, మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై ప్రియా రమణి గతేడాది సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జాబ్ ఇంటర్వ్యూలో భాగంగా తనను హోటల్ గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. వికృత చేష్టలతో అక్బర్ తనను మానసికంగా హింసించాడని తెలిపారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళా జర్నలిస్టులు ప్రియను స్పూర్తిగా తీసుకుని అక్బర్ కారణంగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బహిర్గతం చేశారు. దీంతో అక్బర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించింది.
చదవండి: #మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ
ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రియా రమణి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంజే అక్బర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఇందులో భాగంగా ప్రియా రమణి సోమవారం ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫు న్యాయవాది సంధించిన ప్రశ్నలకు బదులుగా...ఎంజే అక్బర్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ‘ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే నేను నిజాలు మాట్లాడాను. మీటూ ఉద్యమంలో భాగంగా నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా.. పని ప్రదేశాల్లో తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి ప్రతీ మహిళా ధైర్యంగా ముందుకు వస్తారనే ఆశతో నిజాలు మాత్రమే చెప్పాను. ఈ కేసు వల్ల వ్యక్తిగతంగా నేనెంతగానో కోల్పోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నిశ్శబ్ధంగా ఉంటే ఇలాంటి కేసుల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అది సరైంది కాదు. నన్ను టార్గెట్ చేయడం ద్వారా ‘అక్బర్ బాధితుల’ నోరు మూయించాలనేదే వారి ఉద్దేశం’ అని ప్రియా రమణి న్యాయమూర్తికి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment