అసాధారణం మోదీ హ్యాట్రిక్
మోదీ వాగ్దానం చేసిన సుదూర గమ్యానికి చేరే దారి సునాయాసమైనదని ఆశించడం అత్యాశ. రాజకీయ వర్గంలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోనూ భారీ ఎత్తున జడత్వం ఉంది. అది అత్యుత్తమ లక్ష్యాలను సైతం నంగితనంగా మార్చేస్తుంది. స్వేచ్ఛ నిరంతర అప్రమత్తతను డిమాండు చేస్తుంది. ఎన్నికల వల్ల శిక్షకు గురవుతామనే భయం, ప్రతిఫలం దక్కుతుందనే ఆశా ఉండటం వల్ల రాజకీయాలు ఇంకా కచ్చితంగానే పనిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలోని ఇతర భాగాలకు ఎన్నికలను విస్తరింపజేయలేం. ప్రజలను నిర్ణేతలుగా వ్యవహరించడానికి అనుమతించలేనప్పుడు వారి తరఫున ప్రధాని ఆ పని చేయాల్సి ఉంటుంది.
అభిప్రాయ సేకరణలు, ఎగ్జిట్ పోల్స్ తప్పు కాజాలవని కచ్చితంగా చెప్పగలమా? వాటి మధ్య వ్యక్తమయ్యే ఏకీభావం ఒక ధోరణిని ధ్రువపరుస్తుంది. కానీ అవి ఎందుకైనా మంచిదని తాము పేర్కొనే నిర్దిష్టమైన అంకెలకు 5 శాతం తేడా ఉండే అవకాశాన్ని బ్రాకెట్లలో ఉంచుకుంటాయి. దురదృష్టకరమైన ఆ పాత రోజుల్లో అది కేవలం 3 శాతంగా మాత్రమే ఉండేది. కానీ నేడు వ్యక్తిగత విచక్షణ సాహసానికి సమానార్థకంగా మారింది.
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు రెంటిలోనూ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలుస్తారనడం ఖాయం. అయితే అది తన సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేక ఇప్పటి లేదా భవిష్యత్ మిత్రులతో కలిసి ఏర్పాటు చేస్తుందా? అనేది వేరే సంగతి. భారత ఓటర్లు ఓటు చేసినప్పుడల్లా నిర్ణయాత్మకంగానే ఓటు చేస్తారనే విషయాన్ని ఇటీవలి ఎన్నికల చరిత్ర రుజువు చేస్తోంది. 2009 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అదే జరిగింది.
అనిశ్చితికి తావు లేని విధంగా లేదా ‘సంకీర్ణం నిర్బంధాల’వల్ల పరిపాలన కష్టమైందంటూ డాక్టర్ మన్మోహన్ చూపిన సుప్రసిద్ధమైన సాకుకు తావు లేకుండా చేయాలన్నట్టుగా ఓటర్ల తీర్పు ఉంటోంది. భారీ ఎత్తున అవినీతిని అనుమతించ డాన్ని మిత్రపక్షాలు అధికారానికి చెల్లించక తప్పని మూల్యాన్ని చేశాయంటూ డాక్టర్ మన్మోహన్ ఇచ్చిన సుప్రసిద్ధమైన వివరణ ప్రజలకు ఏ మాత్రం రుచించలేదు. రాబర్ట్ వాద్రాకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేకూర్చిన మేళ్లను లేదా మిత్ర పక్షాల ప్రమేయమే లేని ఆగస్టా హెలికాప్టర్ల కొనుగోలు వంటి వ్యవహారాలలో కూడా ఆయన అనేకమార్లు ఇదే ప్రముఖ పద ప్రయోగాన్ని వాడారు.
ఇక స్పష్టంగా కనిపిస్తున్న రెండవ అంశం రాజకీయంగా మరింత ప్రాధాన్యం కలిగిన విషయాన్ని వెల్లడించింది. బీజేపీ ఎంత మంచి ఫలితాలను సాధించిందనే దానితో సంబంధం లేకుండానే కాంగ్రెస్ ఓడిపోయిందనేది నిస్సందేహం. కాంగ్రెస్ తన కున్న రెండు కీలకమైన ప్రాంతీయ దుర్గాల్లో మూడు లేదా నాలుగో స్థానంలో మిగిలే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఓటమికి గురైందనడం బహుశా సుతి మెత్తటి పద ప్రయోగమే కావచ్చు. ఢిల్లీ గద్దె దిశగా తిరిగి సాగించాల్సిన సుదీర్ఘ యాత్రను ప్రారంభించడానికి కాంగ్రెస్‌కు ఉన్న చిట్టచివరి సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రే. కాబట్టి ప్రత్యేకించి అక్కడి ఫలితాలు దానికి ముఖ్యమైనవి. ఓట్ల లెక్కింపు ఇంకా ముగియక ముందే ఆ పార్టీలో అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి. తనకు ముందటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, వారి లాబీలే ఈ ఓటమికి కారణమని పృధ్వీరాజ్ చవాన్ బహిరంగంగానే తప్పు పట్టడం ప్రారంభించారు. ఆయనపై వారి ఎదురు దాడులూ మొదలయ్యాయి. అత్యంత అసమర్థుడైన, చిత్రమైన క్విక్జోటిక్ నేత రాహుల్ గాంధీ.
ఆయనకు అండదండగా ఉండి, ప్రోత్సహించినది ఆయన తల్లి సోనియా గాంధీ. ఓటమికి అసలు కారకులు వారిద్దరే. అయినా వారిని తప్పు పట్టే సాహసం మాత్రం ఎవరికీ లేదు. పార్టీ లేదా దేశ ప్రయోజనాలకంటే అత్యున్నత స్థానానికి కుమారుని ఎదుగుదల నిలిచిపోవడమే ముఖ్య సమస్యగా ఆ తల్లి భావిస్తుంది. ఇక హర్యానాకు వస్తే ఎన్నికల మధ్యలో ముఖ్యమంత్రి భూపిందర్ హుడా, వాద్రాకు మేలు చేకూర్చే మరో భూ ఒప్పందానికి ఆమోదం తెలిపినప్పుడే లాంఛనంగా కాంగ్రెస్ ఓటమిని అంగీకరించారు. రాజకీయంగా కుప్పకూలిన పార్టీ శిథిలాల నుండి కాంగ్రెస్ అధికార కుటుంబం మరోసారి వ్యక్తిగత ఆస్తులను ఏరుకోవడం ప్రారంభించింది.
నాలుగు నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణమైన మూడు విజయాలను సాధించారు. మేలో బీజేపీకి లోక్‌సభలో ఉన్న స్థానాలను రెట్టింపు చేయడమే కాదు, 1985 తదుపరి మొదటిసారిగా ఒక్క పార్టీకి ఆధిక్యతను కట్టబెట్టారు. భారత పార్లమెంటరీ చరిత్రలో మరెవరూ అలాంటి భారీ గంతును వేసింది లేదు. రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చారిత్రాత్మకమైన రీతిలో ఆయన ఆయా శాసనసభలలోని బీజేపీ స్థానాలు పెరిగేలా ఆ పెరుగుదల స్థాయి విస్మయం గొలిపేదిగా ఉంది.
ఓటమి గాయాన్ని మిగులుస్తుంది. అయితే విజయం ఆందోళనను కూడా కలిగిస్తుంది. ఎందుకంటే విజయం ఎప్పుడూ ఆకాంక్షల అశ్వాన్ని అధిరోహించే వస్తుంది.శాసనసభలోని అంకెలు ఆవశ్యకమైన బలానికి కొలబద్దే. కానీ అవే సరిపోవు. విషాదకరమైన ఇందిరాగాంధీ హత్య కారణంగా రాజీవ్‌గాంధీకి బహూశా మరెవరూ గెలుచుకోలేనంత ఎక్కువ మంది ఎంపీలు లోక్‌సభలో ఉండేవారు. కానీ ఆ సంఖ్య అనుభవానికి పరిహారం కాలేకపోయింది. తరచుగా ఆయన అనవసరమైన జాగ్రత్తకు, అత్యధికమైన నిశ్చితత్వానికి మధ్య ఊగిసలాడేవారు. షాబానో మనోవర్తి కేసు విషయంలో ఆయన చేసినది మౌలికమైన తప్పు. మితవాద లాబీల ప్రేరణతో పూర్తిగా అనవసరమైన జాగ్రత్త వహించి ఆయన దేశం తనపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీశారు. పైగా ఆ చర్య మార్పు చెందుతున్న మన ఓటరు మానసిక స్థితిని కూడా తప్పుగా అంచనా కట్టింది. శ్రీలంకలో భారత సైనిక జోక్యం ఆవశ్యకమని ఆయన నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇవి రెండూ ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు చేయడానికి రెండు ఉదాహరణ లు.
నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపైకి పైనుంచి ఊడిపడ్డవారేమీ కాదు. జాతీయ స్థాయి గుర్తింపును పొందగలగడానికి తగినంత విజయవంతగా ఆయన గుజరాత్‌లో పరిపాలన సాగించారు. తనకు ఏమి కావాలి? అనే విషయంలో ఆయనకు సంతులన దృష్టి ఉంది. ఫలితాలైనా ప్రకటించక ముందే ఆయన రెండవ దశ అయిన ప్రభుత్వం ఏర్పాటును ప్రారంభించారు. అయితే అలా అని ఆయన వాగ్దానం చేసిన సుదూర గమ్యానికి చేరే దారి సునాయాసమైనదని ఆశించడం అత్యాశ. రాజకీయ వర్గంలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోనూ భారీ ఎత్తున జడత్వం ఉంది. అది అత్యుత్తమ లక్ష్యాలను సైతం నంగితనంగా మార్చేస్తుంది. స్వేచ్ఛ నిరంతర అప్రమత్తతను డిమాండు చేస్తుంది.
మన దేశ స్వాతంత్య్రానికి సంబంధించి పెద్దగా అప్రమత్తత అవసరం లేదు. పరిపాలన విషయంలో మాత్రం అవసరం. మనలోని ఉన్నత వర్గ స్వభావం జవాబుదారీతనం పట్ల విముఖతను కలిగిస్తుంది. ఎన్నికల వల్ల శిక్షకు గురవుతామనే భయం, ప్రతిఫలం దక్కుతుందనే ఆశా ఉండటం వల్ల రాజకీయాలు ఇంకా కచ్చితంగానే పనిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలోని ఇతర భాగాలకు ఎన్నికలను విస్తరింపజేయలేం. ప్రజలను నిర్ణేతలుగా వ్యవహరించడానికి అనుమతించలేనప్పుడు వారి తరఫున ప్రధాని ఆ పని చేయాల్సి ఉంటుంది.
ఎం.జె. అక్బర్