ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీదే హవా
రెండు రాష్ట్రాల్లోనూ హంగ్ అసెంబ్లీ
అధికారంలోకి వచ్చే చాన్స్ కమలానికే ఎక్కువ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి ప్రారంభమైంది. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లోనూ హంగ్ అసెంబ్లీ తప్పదని తేలింది. ఏ పార్టీకి కూడా మెజారిటీ స్థానాలు రావని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ ఫలితాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు భారీ ఎత్తున నష్టపోతుండగా.. ఆ మేరకు బీజేపీ లాభపడనుందని, శివసేన రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని అవి పేర్కొంటున్నాయి. ‘ఏసీ నీల్సన్’, ‘టుడేస్ చాణక్య’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి మెజారిటీ వస్తుందని తేలింది.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి మోదీ ప్రచారభారాన్ని మొత్తం తనమీదే వేసుకుని మహారాష్ట్రలో 27 బహిరంగ సభల్లో, హర్యానాలో 11 సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళిని పరిశీలిస్తే.. మోదీ కృషి ఫలించి మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల చరిత్రలోనే మొదటిసారి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.