న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల నిర్వహణ విషయమై సెప్టెంబరు 27న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నవంబరు 2న హర్యానా అసెంబ్లీ గడువు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9న ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అదే విధంగా ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 27 మొదలై.. అక్టోబరు 4 నాటికి ముగుస్తుందని తెలిపారు. అక్టోబరు 21న పోలింగ్ జరుగుతుందని.. అదే నెల 24న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందిగా రాజకీయ పార్టీలకు విఙ్ఞప్తి చేశారు.
64 స్థానాలకు ఉప ఎన్నికలు
దేశ వ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, అసోం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు స్థానాలకు అక్టోబరు 21న ఉప ఎన్నికలు జరుగుతాయని, అదే నెల 24న కౌంటింగ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణలోని హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి ఉత్తమ్ ఉప ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment