జంట విజయాలతో నూతనోత్సాహం ఎన్నికలకే కమలం మొగ్గు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి నూతనోత్సాహాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బదులు తాజా ఎన్నికలకే మొగ్గుచూపుతోంది. ఈ విషయమై ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజల మద్దతు తమకే ఉందనే విషయం మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలతో రుజువైంది. అందువల్ల ఢిల్లీ శాసనసభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే మాకే స్పష్టమైన మెజారిటీ వస్తుంది’ అని అన్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, వీలైనంత త్వరగా జరపాలంటూ ఒత్తిడి చేస్తామని అన్నారు. దేశమంతటా మోడీ గాలులు వీస్తున్నాయని, ఢిల్లీ శాసనసభకు కనుక ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే తమకు తిరుగులేని రావడం తథ్యమన్నారు.
మద్దతు బాగా పెరిగింది
గత ఏడాది డిసెంబర్ నాటి శాసనసభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో తమ పార్టీకి మద్దతుపలికేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎంపీ రమేష్ పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలంతా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నారన్నారు.
వక్రమార్గాలను అనుసరించబోం
ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానిస్తే ఏంచేస్తారంటూ మీడియా ప్రశ్నించగా వక్రమార్గాన్ని ఎంచుకోబోమని రమేష్ స్పష్టం చేశారు. ఆయన ఒకవేళ ఆహ్వానించినప్పటికీ తాము తిరస్కరిస్తామన్నారు. ఎన్నికలు జరపాలంటూ ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మరోవైపు వక్రమార్గాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్‌ఎస్‌ఎస్ కూడా సుముఖంగా లేదని బీజేపీ నాయకుడొకరు తెలియజేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సూచించిందన్నారు. కాగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని అనుమతించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ గత నెలలో రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీకి ఓ నివేదిక పంపారు. సదరు నివేదికలో రాష్ర్టంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన సమగ్రంగా వివరించారు. ఎన్నికైన ప్రభుత్వం ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
ఇదిలాఉంచితే ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిం చడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సంబరాలు చేసుకున్న నేతలు, కార్యకర్తలు
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తేలడంతో అశోకారోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం మధ్యాహ్నం వారంతా ఆనంద తాండవం చేశారు. డ్రమ్ములు మోగించారు. మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు కాల్చారు. భారత్ మాతా కీ జై, బీజేపీకీ జై, హర్యానా, మహారాష్ట్ర జీత్ గయా అంటూ దిక్కులు పిక్కటిల్లేవిధంగా నినదించారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీ పాట పాడడంతో ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. ఫలితాలు అనుకూలంగా వస్తుండడాన్ని గమనించి గుంపులుగుంపులుగా వారంతా పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయ నిర్వాహకులు అప్పటికే సిద్ధంగా ఉంచిన పెద్దతెరపై ఫలితాలను ఆసక్తిగా గమనించడం ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లోనూ అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరిండం ఖాయమని స్పష్టమయింది. దీంతో వారంతా సాయంత్రం వరకూ సంబరాలు చేసుకున్నారు.