న్యూఢిల్లీ: సామాన్యుడికి ప్రతినిధులమని చెప్పుకుంటున్న ఆప్‌ను త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో మట్టికరిపించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులోభాగంగా హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ముఖ్యమంత్రులతో ఎన్నికల ప్రచారం చేయనుంది. రాంలీలా మైదానంలో శనివారం జరిగిన అభినందన్ ర్యాలీలో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మనోహర్‌లాల్‌ఖట్టర్, దేవేంద్ర ఫడణ్‌విస్, రఘబర్‌దాస్‌లు కూడా పాల్గొన్న సంగతి విదితమే. ఢిల్లీని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలంటే తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అవసరమని చెప్పనుంది. ఇందులోభాగంగా ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల పేర్లను పార్టీ అధిష్టానానికి త్వరలో పంపి, ప్రచారానికి అనుమతించాల్సిందిగా కోరనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలియజేశారు.
‘త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ముఖ్యమంత్రులతో ప్రచారం నిర్వహించాలని అనుకుంటున్నాం. వీరినే నిజమైన సామాన్యులుగా ప్రజలకు పరిచయం చేయనున్నాం. తద్వారా ప్రాథమికస్థాయిలో ప్రజల మద్దతు పొందాలని భావిస్తున్నాం’ అని అన్నారు. ఈవిధంగా చేయడంద్వారా సామాన్యుడికి ప్రతినిధినని చెప్పుకునే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను అన్నివిధాలుగా దెబ్బతీయాలనేది బీజేపీ ఎన్నికల వ్యూహంగా కనిపిస్తోంది. కాగా రాంలీలా మైదానంలో శనివారం జరిగిన అభినందన్ ర్యాలీలోనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ... ఈ ముగ్గురు సీఎంలనూ సామాన్యులుగా అభివర్ణించిన సంగతి విదితమే. ఈ మూడు రాష్ట్రాల శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది.
కాగా శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ పేరు ప్రస్తావించకుండా ఆమ్ ఆద్మీనని చెప్పుకునే వారు నిజమైన సామాన్యుడెవరో తెలియాలంటే ఈ ముగ్గురు సీఎంలను గమనించాలని పేర్కొన్న సంగతి విదితమే. ఎన్నికల విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ ఇప్పటివరకూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ ఆప్‌ను ఏవిధంగా ఢీకొట్టాలనే విషయం తమకు తెలుసన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి పదవీబాధ్యతలను చేపట్టిన మనోహర్‌లాల్‌ఖట్టర్, దేవేంద్ర ఫడణ్‌విస్, రఘబర్‌దాస్‌లను ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ప్రచారం చేయాలని కోరనున్నామన్నారు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల పూర్వాపరాలను నగరవాసులకు సవివరంగా తెలియజేస్తామన్నారు. తద్వారా సామాన్యులకు సైతం తమ పార్టీ అవకాశమిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేవిధంగా సందేశం పంపడమే తమ లక్ష్యమన్నారు.
ముగ్గురు సీఎంలతో విధానసభ ఎన్నికల ప్రచారం
Published Sun, Jan 11 2015 10:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement