న్యూఢిల్లీ: అనధికార కాలనీల్లో నివసించేవారిని బీజేపీ, ఆప్... తప్పుదారి పట్టిస్తున్నాయని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. బదర్‌పూర్‌లో సోమవారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కాలనీల్లో నివసించేవారు ఆ రెండు పార్టీల వలలో చిక్కుకుపోయేందుకు అంగీకరించబోమన్నారు. ఈ కాలనీల్లో నివసిస్తున్న వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంటోందన్నారు. ఈ కాలనీల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రహదారుల నిర్మాణం, మురుగుకాల్వల ఏర్పాటు, విద్యుత్ సరఫరా తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
అయితే గత ఏడాదికాలంగా అటువంటిదేమీ జరగడం లేదన్నారు. తప్పుడు వాగ్దానాలు, అబద్ధాల ద్వారా ఈ కాలనీల్లో నివసించేవారిని బుట్టలో వేసుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎంసీడీల్లో అవినీతి జోరు: బీజేపీ నేతృత్వంలోని నగర పాలక సంస్థల్లో అవినీతికి అడ్డూఅదుపు లేదని లవ్లీ ఆరోపించారు. దేశంలోని అన్ని ప్రాంతాలు పరిశుభ్రతతో కళకళలాడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని, అయితే ఈ మూడు కార్పొరేషన్లలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందన్నారు. ఎక్కడ చూసినా చెత్తే దర్శనమిస్తోందన్నారు. నగరంలో అభివృద్ధి జరగాలంటే ఈసారి జరిగే ఎన్నికల్లో స్థానికులంతా తమ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
అనధికార కాలనీ వాసులను పెడదారి పట్టిస్తున్నాయి
Published Sun, Jan 4 2015 10:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement