నైరాశ్యానికి మోడీ సవాలు
నిరాశావాదులు ఏ స్వప్నమైనా మొగ్గ తొడగక ముందే సమాధి కావాలని కాంక్షిస్తారు. జనాభాలో 65 శాతం యువత ఉన్న నేటి భారతం దీన్ని ఆమోదించదు. భారతీయులపట్ల నమ్మకం ఉంచండి, వాళ్లే చేసి చూపిస్తారని మోడీ అన్నారు. ప్రజల శక్తికి చరిత్రే సాక్షి. మహాత్మాగాంధీ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటన్ జావగారిపోయేట్టు చేయగలిగారు.
ఇంతవరకు పాలకులు ముస్లింల కోసం చేసిన దానికంటే ఎక్కువగా రాశారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ నయవంచనను నోట్లుగా మార్చుకోగలిగితే భారత ముస్లింలు జానపదగాథల్లోని మహారాజులైపోయి ఉండేవారే. ఈ చేదు వాస్తవాన్ని ప్రధాని నరేంద్రమోడీ అంత పరిశుద్ధంగా వడబోసి చెప్పినవారు అరుదు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన అత్యంత శక్తివంతమైన ప్రసంగం చేశారు. అందులో ప్రధాని ఒకే ఒక్క ఉదాహరణను చూపించి ఆ పనిని చేశారు. ఈ మూడు వాక్యాలే చాలు చూడండి ‘‘నా చిన్నప్పుడు ఒక ముస్లిం మెకానిక్కు తన దుకాణంలో సైకిళ్లు బాగు చేస్తూ కనిపించేవాడు. నేడు అతని మూడో తరం కూడా అదే పని చేస్తోంది. వారి పరిస్థితి ఇంకా అంత అధ్వానంగానే ఎందుకున్నట్టు?’’
ఎందుకు? వారలా ఊబిలో ఇరుక్కుపోయారెందుకు? అతని మనవడు సాంకేతిక విద్యలో డిగ్రీ సంపాదించి ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోలేకపోతున్నాడెందుకు? వారి కుటుంబ నైపుణ్యాలు నిలువ నీటిలా ఇలా నిలిచిపోయాయెందుకు? దేశంలోని అలాంటి వందల వేల దుకాణాలకు సంకేతమైన ఆ సైకిల్ షాపు బడ్డీ కొట్టుగానే మిగిలిపోయిందెందుకు? దశాబ్దాల తరబడి ముస్లిం ఓట్లపై ఆధారపడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వద్ద సమాధానాలు లేవు.
ఈ దుస్థితి పర్యవసానాలను కూడా ఆయన అంతే స్పష్టంగా వివరించారు: ‘‘శరీరంలోని ఒక భాగం అనారోగ్యానికి గురైందంటే మొత్తంగా శరీరం అనారోగ్యానికి గురైందనే.’’ శరీరం బలమైనదైతే దానికి బలహీనమైన కాలో, చెయ్యో ఉండజాలదు. ఆ భాగాన్ని బలవత్తరం చేయాలని ప్రధానికి తెలుసు. పేదరికం దేశ పురోగతిని కుంటుపరుస్తుంది. ప్రధాని అన్నట్టు ఇలాంటి శాపగ్రస్త స్థితి ఎక్కడున్నా, పీడిత ప్రజలు, ఆదివాసులు, దళితులు, మైనారిటీలు లేదా మరే ఇతర కుల జనాభాలో ఉన్నా దాన్ని నిర్మూలించడమే ప్రభుత్వపు మొట్ట మొదటి కర్తవ్యం. భారత బాలబాలికల్లో ఏ ఒక్కరికీ ఆకలితో నిదురించే దుర్గతిని కలుగనియ్యరాదు. 2022 నాటికి మన దేశంలో ప్రతి కుటుం బానికి మరుగుదొడ్డి ఉన్న చిన్న ఇల్లు ఎందుకు ఉండకూడదు? రోజంతా కరెంటు ఎందుకు ఉండకూడదు? ప్రకృతిని, జీవితాన్ని కూడా విషపూరితం చేసే చెత్త, మురికినంతటినీ 2019 నాటికి తొలగించి, దేశాన్ని పరిశుభ్రం చేసి మహాత్మాగాంధీకి 150వ జన్మదినోత్సవ నివాళిగా ఎందుకు అర్పించరాదు? 21వ శతాబ్దంలో ఇవేమీ విలాసాలు కావు... కనీస అవసరాలు.
ప్రధాని ప్రతి ఉపన్యాసం, ప్రత్యేకించి నేటి బహుళ ప్రజా ప్రసారమాధ్యమ యుగంలో చాలా మంది శ్రోతలను ఉద్దేశించినదిగానే ఉంటోంది. రాజకీయ అత్యున్నత వర్గీయులు చాలా మందిలో నిరాశావాదం ప్రబలి ఉంది. వైఫల్యంపై వారిది ఎంత గట్టి పక్షపాతమంటే... వారు ఏ స్వప్నమైనాగానీ మొగ్గ తొడగక ముందే సమాధి కావాలని కాంక్షించేవారుగా మారారు. జనాభాలో 65 శాతం యువత ఉన్న నేటి భారతం దీన్ని ఆమోదించదు.
భారతీయులపట్ల నమ్మకం ఉంచండి, వాళ్లే చేసి చూపిస్తారని మోడీ అన్నారు. ప్రజల శక్తికి చరిత్రే సాక్షి. రాజకీయ వర్గ సంకుచిత హద్దుల నుంచి మహాత్మాగాంధీ భారత జాతీయవాదాన్ని పరిరక్షించారు. చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం బ్రిటన్ జావగారిపోయేట్టు చేయగలిగారు. నేడు మరో ప్రజా ఉద్యమం కావాలి. అది పేదరికం నుంచి, గృహ లేమి నుంచి, నిస్సహాయత నుంచి స్వేచ్ఛను సాధించడం కోసం.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధానం లేకుంటే రాజకీయ రంగంలోని నూతన ఆవిష్కరణలు సైతం బీడు బారిన నేలలా మారిపోతాయి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సువిశాలమైన మేధో మైదానాలలోని తెలివితేటల నుంచి మోడీ నూతన భావాలను కోరుతున్నారు. అంతేగాదు ప్రభుత్వ ఆలోచనల మూల మూల్లోంచి ఎంపికకు తగిన సరికొత్త సూచనలను వెలికితీయాలని కూడా భావిస్తున్నారు. నూతన భావాలు క నీస స్థాయి వరకు పోగుబడటం, విప్లవాత్మక భావాల నరాలతో వాటిని ఒక్కటిగా కలిపి ఉంచడం అవసరం. వంద కొత్త ‘గ్రామీణపట్టణ’ నగరాలను వందేళ్ల క్రితం రూపకల్పన చేసిన ఇటుకలతో నిర్మించలేం. నిర్లక్ష్యపూరితమైన అడ్డదారిలో అమలుచేసి ఎంతటి గొప్ప దూరదృష్టితో కూడిన ఆలోచననైనా తూట్లు పడి గాలి పోయినదిగా చేయవచ్చు.
రాష్ట్రపతి ప్రసంగం నూతన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమేమిటో పేర్కొంది: పేదరికం తగ్గించడమనే మూసపోత పదబంధం గత ప్రభుత్వాలన్నిటి వైఖరికి నిర్వచనం. అది సరిపోదు. పేదరికాన్ని నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం అనుకుంటోంది. మన పార్లమెంటు హాలులో అప్పుడున్న ప్రతి ఒక్కరూ ఆ మాటలు విన్నారా? కొందరు ఎంపీల కను రెప్పలు అలసటతో బరువెక్కిపోవడమే ముందు నిలిచిన కర్తవ్యం గురుతరమైనదనడానికి నిదర్శనం. మూసుకున్న మెదళ్ల కంటే మూతలుపడ్డ కళ్లు తక్కువ సమస్యాత్మకమైనవి. అప్పుడే విన్నదాన్ని సైతం వినడానికి ఇచ్చగించని కొందరు మొండి ఘటాల నుంచే అతి పెద్ద అడ్డంకులు ఎదురవుతాయి.
పార్లమెంటు అనే మౌలిక భావనలోనే నిరాసక్తుడైన రాహుల్‌గాంధీకి తాను ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేయాలో కూడా తెలియకపోవడం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ప్రధాని ఉపన్యాసం సాగుతుండగా అతగాడు మొబైల్ ఫోన్‌తో కాలం వెళ్లబుచ్చుతుండటం గురించి మాట్లాడటం లేదు. రాహుల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాబోయే సమస్య, ప్రభుత్వానికి కాదు. ప్రధానంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నది పార్లమెంటు సీటంటే ప్రజాసేవగా కంటే, సొంత ప్రయోజనాలకు వనరుగా భావించేవారి గురించే.
ప్రధాని ‘నేరగ్రస్థ రాజకీయాలు,’ వంటి పదబంధాలు, సాధారణీకరణల మాటున దాగడానికి నిరాకరించారు. నేరారోపణలను ఎదుర్కొంటున్న ఎంపీలకు వ్యతిరేకంగా నిర్దిష్టంగా ఏమి చేయాలనీ లక్షించకుండా అవి ప్రజాభిప్రాయాన్ని మెత్తబరుస్తాయి. చాలా మంది ఎంపీలపై క్రిమినల్ నేరారోపణలున్నాయని విస్తృతంగా వ్యాపించి ఉన్న విశ్వాసం. ఈ సమస్యకు ప్రధాని చూపాల్సిన సరళమైన పరిష్కారం ఒక్కటే: నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు ఏడాదిలోగా ఫాస్ట్ ట్రాక్ తీర్పును కోరాలి. అమాయకులు సభలో ఉంటారు, తప్పు చేసినవారు అంతకంటే తక్కువ సౌకర్యవంతమైన స్థానాలకు బదిలీ అవుతారు. ప్రధాని యథాతథ స్థితికి చెందిన తిరోగామి అంశాలను ఒక్కొక్క ముక్కగా తొలగిస్తున్నారు. ఈ కృషి సంస్కరణ, విప్లవం కాదు. ఇది ప్రజాస్వామిక దేవాలయాన్ని శుద్ధి చేసే యత్నం. దాన్ని పడగొట్టేది కాదు. ఇది తేలికగా అయ్యేదీ కాదు, త్వరగా అయ్యేదీ కాదు. అయితే ఆ క్రమం మొదలైంది.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్