బైలైన్
పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల పాత్రలు ఆసక్తికరంగా తారుమారు కావడమే గత ఏడాదిలో చాలా కాలాన్ని మింగేసింది. ఆగ్రహంతో ఒళ్లు మరచి ఊగిపోయే పరిస్థితులు ఏర్పడటమంటే పార్లమెంటరీ వ్యవస్థ ఆరోగ్యానికి కీడు జరుగుతున్నదని సంకేతం. స్వల్పకాలిక సమావేశాలను నిర్వహించడంలో ప్రభుత్వానికేమైనా స్వార్థ ప్రయోజనాలు ఉండవచ్చునని ఊహించడం తర్కబద్ధమైనదే. పెద్దగా చర్చలేకుండానే చట్టాలు చేసేయడం దానికి ఆదర్శప్రాయం కావచ్చు.
ప్రభుత్వాలంటే సువ్యవస్థితమైన పాలనా యంత్రాంగాలు కాబట్టి, అవి కనీస పరిశీలనకు గురవుతూ, గరిష్ట వెసులుబాటును కోరుకుంటాయి. అందుకు బదులుగా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమనే ఒత్తిడిని తెచ్చే వేదికగా పార్లమెంటు అందించే పలు అవకాశాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీయే స్వయంగా కాలరాచివేయాలనే కృత నిశ్చయంతో ప్రవర్తించింది. హేళనగా కూతలు పెట్టడం, గావుకేకలు వేసి అడ్డగించడం ద్వారా కాంగ్రెస్ పదే పదే ప్రశ్నోత్తరాల సమయాన్ని హతం చేసింది.
బోర్డింగ్ స్కూల్లో ఇలాంటి ప్రవర్తనకు టర్మ్ ముగిసేసరికి తీవ్రమైన మందలింపులు తప్పవు. కొన్ని బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సహకరించిన మాట నిజమే. అయితే అవి కూడా చాలా వరకు ప్రతికూల ప్రజాభి ప్రాయమంటే భయంతో పెద్దగా చర్చ లేకుండా ఆమోదించినవే. అయితే కాంగ్రెస్ ఏకాకి కావడం గమనించదగ్గ వాస్తవం. మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ అలాంటి ఎత్తుగడలకు దూరంగా ఉన్నాయి. ఇదేమైనా కాంగ్రె స్ ప్రవర్తనలో ముందు ముందు పెద్దగా తేడాను కలుగజేస్తుందా? నిర్హేతు కమైన వ్యూహం ఏ మలుపు తీసుకుంటుందో ముందుగా చెప్పడం కష్టం.
ఈ ఏడాది మాటగా చెప్పుకోవాల్సిన సూక్తి ఒక పెద్ద విషయంగానే విస్తరింపజేయగలిగినది. అయితే మొన్ననే సెలవు పలికి నిష్ర్కమించిన ఏడాది అనుభవంపై ఆధారపడి ఆ సూక్తి ఉత్పన్నార్థాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్ దేవుని పట్ల పెద్దగా విధేయత గలవాడుగా సుప్రసిద్ధుడు కాడు. అయినా ఆయన ఆకాశం వైపు తలెత్తి చూసినప్పుడల్లా భగవంతుడా! అంటూ అత్యంత అర్థస్ఫోరకమైన ఓ మంచి మాట చెప్పేవాడు. ఓసారి ఆయన ‘‘ఓ ప్రభువా, నా శత్రువులను పరిహాసాస్పదులను చేయుము’’ అన్నాడు. ఉత్సాహంగా పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే ప్రజా జీవితంలో ఎవరైనాగానీ అంతకంటే ఎక్కువగా కోరగలిగేది ఏముంది?
కాలక్రమానుగుణంగా పుట్టుకొచ్చే ఆందోళనలు కూడా కొన్ని ఇతర చర్చల్లాగే తయారు చేయాల్సినవి. అయితే అవి భోజనానికి అనుబంధంగా ఉండాల్సిన రుచికరమైన పదార్థాలేగానీ, ఆవశ్యకం కానివి. కానీ పసందైన భోజనానికి అవి అనుబంధంగా ఉండాల్సిందే. లిటరరీ క్రిస్‌మస్ క్రాకర్ (క్రిస్‌మస్ సందర్భంగా పత్రికలు ఒకప్పుడు ప్రచురిస్తుండే సాహిత్య అనుబంధంలోని చమత్కారాల శీర్షిక) ఏమైపోయింది? లిటరరీ అనే ముందు మాటను బట్టే ఇదేదో టపాకాయలా ఇలా పేలి, అలా చచ్చిపోయేది కాదని తెలుస్తోంది. చమత్కారపూరితమైన ప్రశ్న, అనూహ్యమైన సమాధానం రూపంలో దాగిన మేధోపరమైన సృజనాత్మక పదప్రయోగ చమత్కారం అది. ఆ సమాధానం అర్థం స్ఫురింపజేసేదానికంటే ఒకింత ఎక్కువ అర్థాన్నే అది కలిగి ఉంటుందనేది స్పష్టమే.
విసుగుదనం లేదా అంతకంటే అధ్వానమైనదైన నైతికత నుంచి సమాచారాన్ని కాపాడి, బోధించడమేగాక ఉల్లాసపరుస్తుంది. కళలు, పుస్తకాలకు వార్తా పత్రికలు ఎక్కువ స్థలాన్ని కేటాయించి, వాటిని సంకలనపరిస్తే అవే తదుపరి ఏడాదికి పాఠకులకు నూతన సంవత్సర కానుకలవుతాయి. బ్రిటన్ వార్తా పత్రికలు ఇంకా ఆ అద్భుత వినోదానికి శ్రద్ధను, సమయాన్ని కేటాయిస్తున్నాయి. మన దేశం నుంచి అది నిష్ర్కమించడం చింతించాల్సిన విషయం. సీమట పాకాయ పెరిగి పెద్దదై క్విజ్‌గా మారిందని, అన్ని కాలాలూ అందుబాటులో ఉంటోందని ఆశావాదులు వాదించొచ్చు. అయినా గతంలో ఉండే మంచి ఉండనే ఉంది. అందుకు నేనో ఉదాహరణ చెబుతాను. లీనింగ్ టవర్ ఆఫ్ పీసాను (ఇటలీలోని ఒరిగి ఉండే సుప్రసిద్ధ కట్టడం) నిటారుగా నిలపాలని ఎవరు అనుకుంటారు? ముస్సోలినీ. మరింత విడమర్చి చెప్పాలంటే... ప్రజాస్వామ్యంలేని అధికారం వెర్రి.
క్రిస్‌మస్ ఒక జననానికి సంబంధించినది. అది పరిరక్షకుని పుట్టుకకు సంబంధించిన పండుగ. మనకంటే దురదృష్టవంతులైనవారిపట్ల దయ, దాతృత్వం చూపడమే క్రైస్తవ మత లక్ష్యం. ప్రిసిల్లా చాన్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్‌లే 2015 క్రైస్తవులు. వారు తమ తొలి సంతానం పుట్టుక సందర్భాన తమ అపార సంపదలో 99 శాతాన్ని చాన్ జుకెర్‌బర్గ్ ఇనిషియేటివ్‌కు ఇచ్చేస్తామని వాగ్దానం చేశారు. అది నమ్మశక్యం కానంతటి మొత్తం. దాదాపు 45 బిలియన్ల (4,500 కోట్లు) డాలర్లు. ఉన్నదున్నట్టుగా చెబుతున్నా, నాకైతే బిలియన్ డాలర్లంటే ఎంతో తెలీదు. 45 బిలియన్లంటే ఓ చిన్న దేశం వార్షిక రాబడంత కావచ్చు.
ప్రిసిల్లా, మార్క్‌లు జీవితంలో వచ్చే జన్మ కోసం బీమా పాలసీలను తీసుకోవాలని ఆరాటపడాల్సిన దశలో లేరు. ఇంకా యవ్వనంలోనే ఉన్నారు. అమెరికాలోని కొత్తా, పాతా బిలియనీర్లలో వారు ఒంటరివారు కారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా 44 బిలియన్ డాలర్ల ట్రస్టు ఆర్థిక సహాయంతో నడిచే గేట్స్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఇతర దేశాలతోపాటూ మన దేశంలో కూడా అద్భుతమైన కృషి చేస్తోంది. భారతదేశంలో అలాంటి బిలియనీర్లు కనబడేదెన్నడు?
ఈ ఏడాది అత్యుత్తమ కొటేషన్ ఖ్యాతి మాత్రం మరుపున పడిపోయిన హాలీవుడ్ స్టార్ బర్డ్ రేనాల్డ్స్ ఆత్మకథకే దక్కుతుంది. ఇటీవలే ప్రచురితమైన అందులో ఆయన, అలనాటి గ్లామరస్ నటి జోన్ క్రాఫోడ్ మరణాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం జరిగిన ఒక పార్టీకి, క్రాఫోడ్ బద్ధ శత్రువైన మరో నటి బెట్టీ డెవిస్ కూడా హాజరైంది. విలేకర్లతో మాట్లాడుతూ ఆమె ఇలా అంది... ‘‘చనిపోయిన వారి గురించి మంచే తప్ప, చెడు మాట్లాడకూడదు, జోన్ క్రాఫోడ్ చనిపోయింది. మంచిది! ’’
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు
వ్యాసకర్త బీజేపీ అధికార ప్రతినిధి