నేతాజీ ఉంటే మన చరిత్ర మరోలా... | Our indian history may be different if Subhash chandra bose still alive | Sakshi
Sakshi News home page

నేతాజీ ఉంటే మన చరిత్ర మరోలా...

Published Sun, Apr 12 2015 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

Our indian history may be different if Subhash chandra bose still alive

బోస్ మరణించినట్టు రూఢిగా తెలిసి ఉంటే నెహ్రూ ఆయన కుటుంబంపై నిఘా  ఎందుకు పెట్టినట్టు? బోస్ నాడు బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారు?  ఎక్కడ మరణించాడు? నిజం...మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు.
 - ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు
 
 కాలం ఆనాడు బోస్ పక్షాన ఉంది. ఆయనే ఉండి ఉంటే జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమికి అయస్కాంతమై నిలిచేవాడు. 1962 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం.
 
ఇంటెలిజెన్స్ సంస్థలుగా పిలిచే గూఢచార సంస్థలు మహా ఇంటెలిజెంటే కాదు, నిగూఢ మైనవి కూడా. రహస్య సమాచారం పేరిట ప్రభుత్వాలు ప్రధాన వ్యక్తి లేదా సమస్య మరణించేంత వరకు మూడు లేదా నాలు గు దశాబ్దాలపాటూ ఫైళ్లను దాచేస్తాయి. అతి కొన్ని సందర్భాల్లో అలా దాచేసిన పత్రాలు బెడిసికొడతాయి. మృతులను మేల్కొల్పుతాయి. అనుభవిస్తున్న అధికారం మూల్యాన్ని చెల్లించి మరీ సంపాదించినదని గుర్తు చేయడానికి మేక్‌బెత్ విందులో ప్రత్యక్షమైన బాంకో దెయ్యంలా సుభాష్ చంద్రబోస్ హఠాత్తుగా ఇప్పుడు తెరపైకి వచ్చాడు. భారత జాతీయ సైన్యపు (ఐఎన్‌ఏ) సుప్రసిద్ధ నేత బోస్ పయనిస్తున్న విమానం 1945 ఆగస్టు 18న తైపీలో కూలిపోయిందన్న వార్త యుద్ధకాలపు మబ్బు తెరల మధ్య నుంచి వెలువడింది.
 
 అప్పటి నుంచీ ఆయన  ఏమయ్యారనే విషయంపై... ‘మృతి’, ‘అదృశ్యం’ అనే రెండు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో మొద టిది అధికార వర్గాలు కోరుకున్నది కాగా, రెండోది ప్రజల ఆకాంక్ష. ఒక ఘటనపై వ్యాఖ్యానంలో ఇలాంటి నాటకీ యమైన సంఘర్షణ ఎందుకు? అది అర్థం కావాలంటే 1945 నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత సరిగ్గా మూడు రోజులకు బోస్ విమానం కూలి పోయింది. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిట న్‌లతో కూడిన యునెటైడ్ నేషన్స్ జర్మనీ, జపాన్, ఇటలీ లతో కూడిన యాక్సిస్ శక్తులపై విజయాన్ని లాంఛ నంగా ఇంకా ప్రకటించుకోవాల్సి ఉంది.
 
 భారత్ కూడా విజయం సాధించిన యూఎన్ కూటమి భాగస్వామే. కానీ భారత ప్రజలను సంప్రదిం చలేదని గాంధీ బ్రిటన్ సాగిస్తున్న యుద్ధానికి  కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించారు. కానీ చట్టబద్ధ భారత ప్రభుత్వమైన బ్రిటిష్ రాజ్ నేతృత్వంలోని భారత సేనలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. అవి ఆఫ్రికాలో జర్మనీకి వ్యతి రేకంగా, ఆగ్నేయ ఆసియాలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. అధికారికంగా కాంగ్రెస్ వైఖరి యుద్ధానికి వ్యతిరేకం. అయినా అది బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను దెబ్బతీయడం, తిరుగుబాటు లేవదీయ డం చేయలేదు. 1939లో గాంధీతో, కాంగ్రెస్‌తో తెగదెం పులు చేసుకున్న బోస్ ఆ పని చేశాడు.
 
 నాటి భారతీయుల, ప్రత్యేకించి యువతరం ఆలోచ నలను బోస్ గొప్పగా ప్రభావితం చేశాడు. అసాధారణ మైన రీతిలో 1941లో ఆయన  కలకత్తా నుంచి,  బెంగాల్ నుంచి తప్పించుకుని అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియాల మీదుగా బెర్లిన్‌కు చేరారు. అక్కడ బోస్ ఆక్సిస్ శక్తుల అధినాయకులతో సమావేశమయ్యారు. జలాంతర్గామి లో రహస్యంగా జపాన్‌కు పయనించి, అక్కడ బందీలు గా ఉన్న భారత సైనిక పటాలాలను కనీవినీ ఎరుగని రీతిలో సంఘటితం చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రా మం పీడకలలు ఇంకా వెన్నాడుతున్న బ్రిటిష్ పాలకు లకు ఆ తదుపరి ఈ ‘తిరుగుబాటు’ కంటే ఎక్కువగా ఆగ్రహం కలగజేసింది మరేమీ లేదు. భారత్‌లో బ్రిటిష్ పాలన సైన్యం విధేయతపైనే ఆధారపడి ఉంది. ఆ విధేయతకు తూట్లు పడితే బ్రిటిష్ సామ్రాజ్యమే విచ్ఛిన్న మైపోతుందని వారికి తెలుసు.
 
 యుద్ధం తర్వాత జరిగిన బొంబాయి నావికాదళం తిరుగుబాటులో బోస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నావికా తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన అంతానికి నాంది పలికింది.  యుద్ధంలో ఐఎన్‌ఏ ఓడిపోయి ఉండొచ్చు. కానీ అది ఒక సువర్ణాధ్యాయంగా నమోదైన మరింత పెద్ద విజయాన్ని సాధించింది. బోస్ వంటి యుద్ధ వీరుడ్ని శతాబ్ద కాలంగా నాటి భారతదేశం చూసి ఎరుగదు. 1946లో ఐఎన్‌ఏ సైన్యాన్ని రాజద్రోహ ఆరోపణపై విచారించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడిక క్కడ ప్రజా తిరుగుబాట్లు చెలరేగాయి. భారతీయుల దృష్టిలో వారు ద్రోహులు కారు, అమరజీవులు.
 
 నాడు బ్రిటిష్‌వారు దేశాన్ని విడిచివెళ్లడానికి సిద్ధమే. కానీ వారికి ఇక్కడ అమలు చేయాల్సిన పథకాలున్నా యి. బోస్ దేశంలోలేకపోవడమనే సాధారణాంశం ప్రాతి పదికగా ఆసక్తికరమైన రాజకీయ కుమ్మక్కు జరిగింది.
 బోస్ బ్రిటిష్ వారికి బద్ధ శత్రువు. కాంగ్రెస్ మచ్చిక చేయడానికి వీలైనదిగా ఉండేది. కానీ బోస్ అలాం టివాడు కాడు. ఆయన భారత జాతీయ సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులను ఉత్తేజకరమైన రీతిలో ఐక్యం చేసి, వారికి నేతృత్వం వహించాడు. ఐఎన్‌ఏ బోస్ కలలుకన్న భారతావనికి నమూనా అనేది స్పష్టమే. కాబట్టి ఆయన ముస్లిం లీగ్‌కు అక్కర్లేదు. బోస్ నాడు భారత్‌లో ఉండి ఉంటే దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. బోస్ తమ సంస్థలోకి తిరిగి రావడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదనే ది స్పష్టమే. ఎందుకంటే ఆయనే వస్తే వారు నాయకునిగా కోరుకుంటున్న జవహర్‌లాల్ నెహ్రూకు పోటీదారు అవుతారు.
 
 బోస్ చనిపోయాడని రూఢియైతే బోస్ కుటుం బంపై నెహ్రూ నిఘాను ఎందుకు కొనసాగించారు? 1957లో జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు నెహ్రూ ఎందుకు అంతగా గాభరా పడ్డారు? ఆయన గాబరా పడ్డట్టు ఆధార పత్రాలు ఉన్నాయి. బోస్ బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకె ళ్లారు? ఆయన ఎక్కడ మరణించాడు? నిజమేమిటో మనకు తెలియదు. ఆ నిజం, మిత్రదేశాలతో సంబం ధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. ఆ మిత్ర దేశాల్లో బ్రిటన్ ఒకటనేది తథ్యం. ఎందుకంటే బోస్‌కు వ్యతిరేకంగా మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ దేశ గూఢచార సంస్థతో చేయి కలిపింది.
 
 స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ రష్యా సంబం ధాలు దెబ్బతింటాయన్న ఆ రెండో మిత్ర దేశమనే గుసగుస కూడా ఉంది. 1945లో అది బ్రిటన్‌కు మిత్ర దేశం. బోస్ పాశ్చాత్తాపమెరుగని ఫాసిస్టని స్టాలిన్ ప్రచారం చేసినట్టనిపిస్తుంది. ఏదేమైనా రహస్య ఫైళ్లు బయటపడేవరకు ఆ విషయం మనం ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం.  రాజకీయ కలన గణితం అంత సరళమైందేమీ కాదు. నెహ్రూ బోస్‌కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. కాలం ఆయన పక్షాన ఉంది. ఆయన లేదా ఆయన పార్టీ 1952లో బెంగాల్, ఒరిస్సాలలో అధికారాన్ని గెలుచు కునేది. బోస్, జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి ఏర్పా టుకు అయస్కాంతమై నిలిచేవాడు. 1957 నాటికి కాం గ్రెస్‌ను గట్టి దెబ్బ తీసి ఉండేవాడు. 1962 సార్వత్రిక ఎన్ని కల నాటికి దాన్ని తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement