ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు
బైలైన్
నేటి భారతదేశాన్ని చూడండి. మహాత్ముని మాటలు, ముందుచూపు, ప్రవచనాలు లేని లోటు ఎంతగా ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధ బీభత్సాన్ని చవిచూసిన నేలపైన అహింస అత్యంత సమంజసమైన భావనగా కనిపిస్తుంది. కానీ హీనపరిచే పేదరికాన్ని నిర్మూలించడం అంతకంటే తక్కువ ప్రాధాన్యం గలిగినది ఎలా అవుతుంది? మతం పేరిట హత్యలు, అల్లర్లు విచ్చలవిడిగా జరుగుతుండగా... మతాన్ని శాంతి, సామరస్యాల శక్తిగా చూపడం ఎంత కీలకమైనది?
మహాత్ముడు జనవరి 2015లో తిరిగి మన పత్రికల్లో దర్శనమిస్తున్నాడు. ఇంచుమించుగా ఇది, జనవరి 2015లో మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ మాతృభూమికి రావడమంతటి స్వాగతించదగిన పరిణామం.
1915, దేశ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన మైలు రాయిగా నిలిచిపోతుంది. గాంధీజీ జోక్యంతో భారత స్వాతంత్య్ర ఉద్యమం యూరోపియన్ వలస పరిపాలనాశకాన్ని అంతం చేసింది. మూడు వందల ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న యూరోపియన్ వలసీకరణ 20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నట్టు కని పించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమని అనడం సుప్రసిద్ధం. గాం ధీ దేశానికి తిరిగి వచ్చాక ఏ సామ్రాజ్యంపైనా రవి ఉదయించడం ఎరుగం.
1869లో జన్మించిన గాంధీ 24 ఏళ్ల వయస్సులో అబ్దుల్లా సేథ్ అనే వ్యాపారి తరఫు న్యాయవాదిగా పనిచేయడం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. మోకాళ్ల కింది వరకు పొడవాటి కోటు, చారల ప్యాంటు, నల్ల తలపాగా, వాచీ, గొలుసు ధరించి ఆయన 1893 జవవరి 23న దర్బన్‌లో దిగారు. అక్టోబర్ 1901లో ఆయన ఏడాదిపాటు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే దేశం లోని ఉన్నత వర్గాల్లో ఆయన ఖ్యాతి వా్యిప్తి చెందడం ప్రారంభమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కలకత్తా సమావేశానికి ఆయన హాజరయ్యారు. వెళ్లేటప్పుడు దిన్షా వాచా (మహాసభకు అధ్యక్షత వహించాల్సిన వారు), ఫిరోజ్‌షా మెహతా, చిమన్‌లాల్ సెతల్వాద్ వంటి గొప్ప వ్యక్తులతో పాటూ కలిసి ఒకే రైలులో వెళ్లారు. అక్కడ మొదటి రాత్రి గడిపిన గాంధీ, ఉదయాన్నే వరండాలో ప్రతినిధులు మూత్ర విసర్జన చేసి ఉండటాన్ని చూసి నిర్ఘాంత పోయారు. అప్పటికింకా ‘అంటరానివారు’గానే పరిగణిస్తున్న దళితులు వచ్చే వరకు మిగతా వారిలాగా వేచి చూడలేదు. ఓ చీపురు అందుకొని ఆ పని ఆయనే చేసేశారు.
1901లో ఆయన బాటలో నడచినవారు ఎవరూ లేరు.
గాంధేయవాద ఉద్యమం అంతటికీ మూల సారమైన ప్రతిపాదన ఒక్కటే. భారతదేశం ఓడిపోయినది బ్రిటన్ బలాధిక్యత వల్ల కాదు. స్వీయ బలహీనతల వల్ల వంచిత కావడం వల్లనే. అంటరానితనమనే శాపం, అజ్ఞా నం, మూఢవిశ్వాసం అనే చెడులను సమాజం నుంచి నిర్మూలించినప్పుడే దేశం కోలుకొని, ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే, అలాంటి కర్తవ్య నిర్దేశనకు నాంది పలికినది కలకత్తాకే చెందిన స్వామి వివేకానంద. ఆ మేధావిని కలుసుకోవాలని గాంధీ బేలూరు మఠానికి వెళ్లారు. కానీ స్వామి అప్పటికే బాగా అస్వస్థులై ఉండటంతో కలుసుకోలేకపో యారు. ‘‘భారతదేశం ‘మ్లేచ్ఛ’ (నీచ జాతి) అనే పదాన్ని కనిపెట్టిననాడే సరిగ్గా దాని పతనం లిఖితమైపోయింది... దేశం గుడిసెలోనే బతుకుతోందని గుర్తుంచు కోండి’’ అన్న వివేకానందుని బోధనను ఆయన అప్పటికే ఆచరిస్తున్నారు.
అదే విధమైన ఆలోచన ధ్వనించేలా ‘‘ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్’’లో (సెప్టెంబర్ 1909) బ్రిటిష్ రచయిత జీకే చెస్టర్టన్, నాటి భారత జాతీయవాదులపై రాసిన ఈ విషయాలను గాంధీ చదివారు: ‘‘నాకు వారం టే విసుగు పుడుతోంది. వారిపట్ల అనుమానం కలుగుతోంది. వారు కోరేది భారతీయమైనదీ కాదు, జాతీయమైనదీ కాదు... ఉదాహరణకు ఒక భారతీ యుడు ఇలా అంటాడు: ‘భారతదేశం తెల్లవారి నుంచి, వారి పనుల నుండి ఎల్లప్పుడూ దూరంగానే ఉండాల్సింది. వారిదైన ప్రతిదాన్లో ఏవో తప్పులు న్నాయి. అంతకంటే మా సొంతవే మేం కోరుకుంటాం... మా జీవిత విధానం మీకు (బ్రిటిష్‌వారికి) నచ్చకపోతే, మా దారిన మమ్మల్ని వదిలేయండి. వెళ్లండి, మీరిక సెలవు పుచ్చుకోండి.’’ చెస్టర్టన్ చాలా సరిగ్గానూ, ముందుచూపుతోనూ అలా అన్నారు. నిజమైన స్వరాజ్, స్వయంపాలనల మార్గం ఏదో తెలిసిన నిజమైన నేత ఆవిర్భవిస్తాడు. అతి కొందరు భారతీయులు మాత్రమే మాటల్లో పెట్టగలగడం కాదు... ఊహించ గలిగిన విషయాలను ఒక ఇంగ్లిషువాడు చెప్పాడు.
గాంధీ జోహన్నెస్‌బర్గ్‌లో ప్రాక్టీసు కొనసాగించడానికి తిరిగి వెళ్లారు. కానీ ఆయన మనస్సు, హృదయం మరెన్నడూ భారతదేశాన్ని వీడి వెళ్లింది లేదు. హిందువులలో సంస్కరణ ప్రక్రియకు నేతృత్వం వహించాలంటే, ముందుగా హిందూతత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలని గుర్తించారు.
సంస్కృత, ఆంగ్ల భాషలలో భగవద్గీతను అధ్యయనం చేయడంలో మునిగిపోయారు. గీతాభక్తునిగా మారి, పద్దెనిమిది అధ్యాయాలలో పదమూ డింటిని కంఠతా పట్టారు. అందులోని అపరిగ్రహణం అనే (తనకంటూ ఏదీ కోరుకోరాదనే భావన) అంశం ఆయనను వివశుడ్ని చేసింది. భారతదేశం తన స్వీయ పాపాల నుంచి, భరింపశక్యం కాని వలస పాలనా భారం నుంచి విముక్తం కావడానికి పన్నెండేళ్లకు పైగా అత్యంత జాగ్రత్తగా సోపానాలను రూపొందించడం ద్వారా గాంధీజీ అందుకు తనను తాను సన్నద్ధం చేసుకున్నారు.
ప్రతి మతానుయాయులకు ఒక నూతన సామాజిక కొలబద్ధను ఇచ్చి, మతాన్ని శక్తివంతమైన సాధనంగా ఆయన మలచారు: ప్రతి మత వ్యవస్థ సారం ఒక్కటే... శాశ్వత సత్వం. కాబట్టి మతం ఐక్యతకు మూలమేగానీ విరోధాలకు కాదు. 1915లో కలకత్తా విశ్వవిద్యాలయంలో, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో, 1915లో బెనారస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో గాంధీ జీ మూడు ప్రధాన ఉపన్యాసాలు చేశారు.
1916లో ఆయన తన రాజకీయ తాత్వికతలోని మూడు మౌలిక సూత్రాలను వివరించారు: 1) అహింస, 2) దేశంలోని అన్ని మతాల వారి మధ్య ఐక్యత, సంస్కరణ, త్యాగం, అంకితభావం, పరిశుభ్రత, 3) భవిష్యత్తు ఆకలితో, దరిద్రంతో అలమటిస్తున్నవారిదే. బెనారస్ విశ్వ విద్యాలయంలో ఆయన, వేదిక మీద ఆశీనులైన ‘‘గొప్పగా అలంకరించుకున్న ప్రభువుల’’ను అపహాస్యం చేశారు. భారత దేశాన్ని పరిరక్షించేది రైతే తప్ప న్యాయవాదులో లేక కులీనులో కారని ఆయన అన్నారు. 1916లో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన. వందేళ్ల తర్వాత నేటి భారతదేశాన్ని చూడండి. ఆయన మాటలను, ముందుచూపును, సూత్ర ప్రవ చనాలను మనం ఎంతగా కోల్పోయామోనని ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధ బీభత్సాన్ని చవిచూసిన నేలపైన అహింస అత్యంత సమంజసమైన భావనగా కనిపిస్తుంది. కానీ హీనపరిచే పేదరికాన్ని నిర్మూలించడం అంతకంటే తక్కువ ప్రాధాన్యం గలిగినది ఎలా అవుతుంది? మతం పేరిట హత్యలు, అల్లర్లు విచ్చలవిడిగా జరుగుతుండగా... మతాన్ని శాంతి, సామరస్యాల శక్తిగా చూపడం ఎంత కీలకమైనది?
గాంధీ దేశానికి తిరిగి వచ్చిన శతాబ్ది వత్సరంలోనే గాంధీ మొహం ప్రజా ప్రసార మాధ్యమాలలోకి తిరిగి వచ్చింది. ఇక కావాల్సిందల్లా గాంధీ చింతనకు, హృదయానికి చోటే.