byline
-
విసుగెత్తించడమే పరిష్కారం
బైలైన్ భారత్-పాక్ క్రికెట్ సిరీస్ విజయవంతంగా జరగడమే అందరికీ కావాలి. అయితే క్రికెట్ ఒక సంబరం కానట్లయితే, అంతటి ప్రమాదానికి సిద్ధపడాలా? క్రీడ ఆనందం కోసమే తప్ప, యుద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ విషయంలో నెలకొన్న బాధా కరమైన ప్రతిష్టంభనకు పరి ష్కారం ఒక్కటే. ఎవరూ పట్టించుకోనంత మహా విసుగెత్తించేదిగా దాన్ని మార్చేయడం. హాకీ ఆ పని ముందే చేసి చూపింది. ఒకానొకప్పడు ఎప్పుడో గతంలో ఒలింపిక్ లేదా ఆసియా హాకీ స్వర్ణం కోసం భారత్, పాక్ జట్లు తలపడుతుంటే ఉపఖండమంతా ఆ క్రీడకు దాసోహమనేది. రెండు జట్లు మొదటి స్థానం కోసం గాక, చివరి స్థానం కోసం పోటీ పడటం మొదలు కావడంతోనే ఆ ఉత్సాహోద్వేగాలన్నీ తుస్సుమని పోయాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య క్రికెట్ గురించిన చర్చ నత్తనడక నడుస్తోంది. అసలు అలాంటి చర్చే సంఘ వ్యతిరేకమైనదన్నట్టుగా సోషల్ మీడియా ఉద్రేకపడుతోంది. భారత్, పాక్‌లు హాకీ ఆడుతుంటే గుసగుసైనా వినిపించదు. అదే క్రికెట్ అయితే కల్లోలం రేగుతుంది. కాబట్టి సమస్య క్రీడ కాదు, దానికి లభించే ప్రతిస్పందన. ఆసక్తిని చంపేస్తే, వివా దమూసమసిపోతుంది. కాకపోతే ఇరు దేశాల క్రికెట్ జట్లూ విసుగెత్తించ నిరాకరిస్తుండటమే సమస్య. రెండు జట్లూ ఏ శుభ దినానైనా ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగలిగేవే. సహజంగానే, ఏదీ నిలకడగా ఆడే బాపతు కాదు. ఉపఖండం స్వభావానికే అది విరుద్ధం. రెండు జట్ల ఆట తీరూ ఊహింపశక్యం కానిదే. అదే ఉద్విగ్నతకు కారణం. భారత్-పాక్ టెస్ట్ సిరీస్ విషయంలోని ఆచర ణాత్మక సమస్యలను గురించి ఆలోచించండి. హాకీ అయితే ఓ రెండు గంటల్లో ఆట ముగిసిపోతుంది. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులుంటుంది. సిరీస్ మన దేశంలో జరుగుతుంటే మన మైదానాల అధికారులు ఆట మూడు రోజుల కంటే ముందే ముగిసిపోయేలా చేసి, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు కర్త వ్యాన్ని నిర్వర్తిస్తారు. భారత్, పాక్‌తో ఆడుతున్న ప్పుడు ఆ పద్దెనిమిది గంటల క్రీడా సమయం సైతం అనంతంలా అనిపిస్తుంది. శాంతికాముకులైన పౌరుల ఉద్వేగాలను నియంత్రించడం నిజానికి అతి చిన్న సమస్య. కానీ క్రీడాకారుల భద్రతకు ఎవరూ హామీని కల్పించలేరు. కాబట్టి పాకిస్తాన్ జట్టు పాక్‌లో ఆడలేదు. ఆ దేశం తన ‘సొంత మైదానాల’ను యునెటైడ్ ఎమిరేట్స్‌కు ఔట్‌సోర్స్ చేసింది. పాక్‌లో క్రికెట్‌ను అసాధ్యం చేసిన ఉగ్రవాదులు, మరెక్కడైనా పాక్, భారత్‌తో తలపడుతుంటే చూస్తూ ఊరుకుం టారా? ఆట జరిగేచోట కాకున్నా మరెక్కడైనా దాడి జరిగితే ఏం చేయాలి? మీడియా ఉన్మాదాన్ని రేకె త్తిస్తుంది కాబట్టి, ప్రభుత్వాలు సంతృప్తిపరచే విధా నాన్ని అవలంబిస్తున్నాయని విమర్శలను ఎదుర్కో వాల్సి ఉంటుంది. కాబట్టి ఆటను పూర్తిగా కట్టిపెట్టే యాలా? ఇటీవల ఈ సిరీస్‌ను ఇంగ్లండ్‌లో ఏర్పాటు చేయాలనే మాట వినిపిస్తోంది. పారిస్ ఉగ్రదాడి తదుపరి లార్డ్స్‌లో ఈ ప్రదర్శన జరగడానికి ఆ మైదానం యజమాని ఎమ్సీసీగానీ, బ్రిటన్ గూఢచార సంస్థ ఎమ్16గానీ సుముఖత చూపితే ఆశ్చర్య పోవాల్సిందే. భారత్-పాక్ క్రికెట్లో ఏ మూల చూసినా, ఏదో ఒక ఊహించని సమస్య పొంచి ఉంటుంది. ఉదాహ రణకు, గత టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరిగిన ప్పుడు భారత టీవీ చానళ్లలో చూపిన పలు ప్రకటనలు రెచ్చగొట్టేవిగా, ప్రమాదకరమైనవిగా, వివేకరహిత మైనవిగా, జాతీయోన్మాద పూరితమైనవిగా ఉన్నాయి. అవి లెక్కలేనంతమంది వీక్షకులను భారత్‌కు వ్యతి రేకంగా మార్చాయి. నాడు జరిగిన నష్టం ఇంకా కనిపిస్తూనే ఉంది. భారత క్రికెట్‌కు బాధ్యత వహిం చాల్సిన బీసీసీఐ అప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకునే అవకాశమూ తక్కువే. దానికి పట్టేది ఒక్కటే, కాసుల గలగలలు. ఇక చారిత్రకంగా అత్యంత వివాదాస్పద అంశమైన అంపైరింగ్‌ను చూద్దాం. అంపైరింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విషయంలో భారత్‌ది... తప్పంటూ జరిగితే అది మానవ తప్పిదమే కానిద్ధామనే యంత్ర విధ్వంసకుల(లుడ్డైట్ల) వైఖరే. ఇది మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ వారసత్వంలో భాగం. జనం యంత్రాలను క్షమిస్తారే తప్ప, మనిషిని క్షమించలేరనే చిన్న విషయం పెద్దపెద్ద క్రికెట్ బుర్రలకు ఎందుకు బోధపడదు? యంత్రానికి లంచం ఇవ్వలేం. క్రికెట్ భారీగా డబ్బుతో ముడిపడినదిగా మారడం, దాన్ని అనుసరించి వచ్చిన బెట్టింగ్ తమాషా నేపథ్యంలో ప్రతిచోటా అవినీతి వాసనలు వ్యాపిస్తూనే ఉన్నాయి. అలా అని అంపైర్లు అవినీతి పరులని ఆరోపిస్తున్నట్టు కానే కాదు. వాళ్లు తమపైన తామే నిరంతర నిఘాను ఉంచుకుంటారు. అయితే పుకార్లకు, ఊసుపోని కబుర్లకు వాస్తవాలలో ఆసక్తి ఉండదు. పాక్‌తో మనం క్రికెట్ ఆడటం అంటూ జరిగితే అది, మనం కూడా మిగతా ప్రపంచంలాగా అనుమానం వస్తే కెమెరాను సంప్రదించడం మొదలు పెట్టాకనే. విసుగెత్తించేటప్పుడైనా నాకు క్రికెట్ అంటే ప్రేమే. అదీ, ఇంగ్లిష్ ప్రీమియర్ ఫుట్‌బాల్ మాత్రమే టీవీ కొనడానికి నాకు ముఖ్య కారణం. భారత్-పాక్ క్రికెట్ సిరీస్ విజయవంతంగా జరగడం కంటే ఎక్కువ ఎవరూ ఆశించరు. క్రికెట్ ఒక సంబరం కానట్లయితే, అంత ప్రమాదాన్ని ఆహ్వానించాలా? క్రీడ ఆనందం కోసమే తప్ప యుద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. క్రీడ అంటే స్త్రీపురుషులు తమ అత్యున్నత స్థాయి ప్రతిభను ప్రదర్శించి, మహోత్కృష్ట మనోహర కళా కౌశలాన్ని ప్రదర్శించే రంగస్థలి. క్రీడ అంటేనే పోటీ పడటం ఉంటుంది. నాటకీయతను అత్యున్నత స్థాయికి చేర్చేది అదే. అయితే వివేకవంతులైన క్రీడాకారులెవరూ పోటీని శత్రుత్వమనే రొచ్చుగుంటలోకి దిగజారిపోని వ్వరు. క్రీడల మౌలిక సూత్రాలకే అది విరుద్ధం. చూస్తు న్నదాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నామంటే, అది ఆటే కాదు. ఈ చలికాలంలో భారత్, పాక్‌తో ఆడాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి. -
రాహుల్ జోరు.. నిరర్థక పోరు
బైలైన్ ఇదేదో నమ్మశక్యం కాని ఆలోచన అనిపిస్తే అనిపించొచ్చుగానీ... ఇది భారంగా గడుస్తున్న కాలం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల పేరు మారిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజునే వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. కాబట్టి వీటిని ‘ఆజాదీ సమావేశాలు’ అని పిలుచుకుంటే ఎలా ఉంటుంది? అలా పేరు మారిస్తే, స్వతంత్ర భారతానికి పునాదులు వేసిన తరం జ్ఞాపకాలైనా... ప్రజాస్వామ్యా నికి గుండెకాయలాంటి సంస్థల విశ్వసనీయత తుడిచిపెట్టుకుపోయేలా గలాభాను సృష్టించడాన్నే నమ్ముకున్న వారికి నచ్చజెబుతాయేమో. మన తర్వాతి తరాలకు మనం ఇచ్చిపోవాలనుకుంటున్న వారసత్వం ఇదేనా? 1947 నాటి ఆ గొప్ప తరాన్ని మనం ఎంతో గౌరవంతో స్మరించుకుంటూ ఉంటాం. 2084 నాటి తరాలు కూడా 2015 నాటి నేటి తరాన్ని అలాగే గుర్తుకు తెచ్చుకుంటాయా? మొత్తంగా చూస్తే ఇప్పటివరకు సాపేక్షికంగా ప్రశాంతంగా సాగినవి ఒక్క పార్లమెంటు సమావేశాలు మాత్రమే. ఇక్కడ ముఖ్యమైన పదం సాపేక్షికమైనదేగానీ, ప్రశాంతంగా కాదు. బడ్జెట్ క్రమాన్ని స్తంభింపజేస్తే ప్రభుత్వం ప్రతిష్టంభించిపోతుందని సభలోని అన్ని పక్షాలకూ తెలుసు. కాబట్టి ఎవ రూ ఆ సమావేశాలకు అంతరాయం కలిగించలేదు. గందరగోళం కొనసాగుతూ పోతే ప్రజాస్వామ్యమే స్తంభించిపోవచ్చని మనం గుర్తించే దెన్నడు? రంధ్రాన్వేషణతో రచ్చ చేసే రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ గత రాజ్యసభ సమావేశాల కార్యకలాపాలను ప్రతి రోజూ పాడు చేయాలని, లోక్‌సభ సమావేశాలను తీవ్రంగా దెబ్బతీయాలని నిర్ణయించింది. అంతర్థాన మైపోతున్న ఓ ప్రతిపక్షం సుపరిపాలనతో, కోలుకున్న ఆర్థిక వ్యవస్థతో తలపడేటప్పుడు... ఆ పోరాటం సముచితత్వం కోసం చేసేదిగానే ఉండాలి. ఇది అర్థం చేసుకోగలిగినదే. కాకపోతే తల్లి సోనియాగాంధీ ప్రేరేపించగా రాహుల్‌గాంధీ అసహనాన్ని, అపరిణతిని, అన్నిటినీ తప్పు పట్టేతత్వాన్ని, ప్రతికూలతత్వాన్ని ప్రదర్శించిన సన్నివేశమే అర్థంకానిది. ఇది ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుందని, కాంగ్రెస్‌ను క్షీణింపజేస్తుందని వారికి చెప్పేవా రెవరూ లేకపోయారు. ఈ కథ ఈ ఏడాది మేలో మోదీ ప్రభుత్వ తొలి వార్షికోత్సవంతో మొద లైంది. తొలుత పరిస్థితి కాంగ్రెస్‌కే అనుకూలించింది. ప్రత్యేకించి, నూతన ప్రభుత్వ వ్యవస్థలో తమకు తగు పాత్రను ఇవ్వ నిరాకరించారని భావించిన ప్రముఖుల నుంచి దానికి అనూహ్యమైన మద్దతు లభించింది. మోదీవి అన్నీ మాటలే తప్ప, చేసి చూపేది ఏదీ లేదనే అంశం చుట్టూనే వారి దాడి సాగింది. సంఘటితం కావడానికి ప్రభుత్వానికి కొంత సమయం పట్టిందే తప్ప, అది స్థిమితాన్ని కోల్పోలేదు. ఇంతవరకయితే అది సాధారణంగానే ఉంది. మన వ్యవస్థలో ఐదేళ్ల పాలనకు సంబంధించి ఉన్న నియమాలు తార్కికమైనవి. మూడేళ్లపాటూ మీరు పోట్లాడుతూ గడిపేస్తే, ఆ తర్వాత... ప్రతి పదవీ కాలపు చివరి ఏడాదిలోనూ సాగే జీవన్మరణ పోరాటానికి సన్నద్ధం కావడాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. కానీ, రాహుల్‌గాంధీ ఇప్పుడు కాకపోతే మరెన్న డూ సాధ్యం కాదన్నట్టు ఆ పోరాటాన్ని ఇప్పుడే ప్రారంభించేశారు. తన దగ్గరున్న ఆయుధాలు ఏమంత ఘనమైనవి కావు, తమ మందుగుండంతా నిరర్థకమైనది అనే వాస్తవం అందుకు ప్రతిబంధకం కాలేదు. ప్రధానిని తగినంత బలంగా దెబ్బతీసేస్తే, ఆయన మద్దతుదార్లైన ఓటర్ల పునాదిలో గండి ఏర్పడుతుందని, దాన్ని తానూ, తన బిహార్ మిత్రులు నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లూ కలసి అక్టోబర్ శాసనసభ ఎన్నికల్లో వాడుకోవ చ్చనేది ఆయన యోచన కావచ్చు. అలాంటి సన్నివేశంలో వారు రాజకీయ అనుకూలతను కైవసం చేసుకోగలుగుతారు. తద్వారా దేశ ఆర్థిక పునర్వికాసాన్ని, మోదీ అభివృద్ధి కార్యక్రమాన్ని దెబ్బతీసి, మిగతా పదవీ కాలమంతటా ఆయన ప్రభుత్వం నిర్వీర్యమైపోయేలా చేయగలుగుతారు. రాహుల్‌గాంధీ, నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌ల త్రయం రెండు తప్పులు చేసింది. వారు ప్రధాని కోలుకునే స్థితిని తక్కువగా అంచనా వేశారు. పైగా వాస్తవాలు తమ పక్షానికి వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించ నిరాకరించారు. రాజకీయ చర్చ ముగిసిపోయాక మిగిలేవి వాస్తవాలే. వాక్చాతుర్యం కంటే వాస్తవాలే ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎన్నికల క్రీడలో వాస్తవాలే పెద్ద క్రీడాకారులు. అందుకే మనం వాస్తవాలనే స్వయంగా మాట్లాడనివ్వాలి. ‘మింట్’ అనే ఇంగ్లిష్ స్వతంత్ర వ్యాపార పత్రిక ఆగస్టు 14న, ప్రధాని మోదీ తన తొలి 14 నెలల పదవీ కాలంలో ఏమి సాధించారో వాటి జాబితా ను పట్టికలతో నిష్పక్షపాతమైన ఆచరణాత్మక పద జాలంతో రెండు పేజీలలో విస్తరించి ప్రచురించింది. ద్రవ్య సమ్మిళితానిదే (ఫైనాన్షియల్ ఇంక్లూషన్) ఆ జాబితాలో అగ్రస్థానం. పేదల జీవన నాణ్య తను మెరుగు పరచడమే ఈ ప్రభుత్వపు మౌలిక కార్యక్రమం. ‘జన్ ధన్ యోజన’ ద్వారా దిగ్భ్రాంతికరంగా 17.45 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలను తెరిచారు. మొట్టమొదటి సారిగా, కోట్లాది మందికి బ్యాంకు సేవలు అందుబాటు లోకి వచ్చాయి. అవి, వారి భద్ర తకు, అవకాశాలకు వాహికలు కాగలుగు తాయి. ఆగస్టు 15న, ప్రధాని అవకాశానికి అర్థమేమిటో వివరిం చారు. ఆది వాసీలు, దళితులు, మహిళల యా జమాన్యంలో కొత్తగా ప్రారంభిం చే వ్యాపార సంస్థలకు తేలికపాటి షరతులతో రుణాలను మంజూ రు చేయాలని ఆయన దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,25,000 బ్యాంకు బ్రాంచీలను కోరారు. పేదల దృష్టిలో దీని అర్థం ఏమిటీ అని, కొత్త సంస్థలు, ఇప్పటికే అమలవుతున్న పథకాలు పునాది స్థాయిలో సృష్టించే ఉద్యోగాల సంఖ్య ఎంత అనీ ఆలోచించి చూడండి. ‘ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకం’ కింద ఇప్పటికే 8 కోట్ల మంది ప్రజలు బీమా సౌకర్యాన్ని పొందారు. దాదాపు మూడు కోట్ల మంది కారుచౌకకు జీవిత బీమా పాలసీలను తీసుకున్నారు. అత్యవసరమైనవారి కోసం ప్రారంభించిన మొట్టమొదటి సామాజిక భద్రత పథకం ఇదే. ‘ముద్రా ప్లాన్’ ఇప్పటికే రూ.137 కోట్ల విలువైన నిధులను కూరగాయల బళ్లవారి వంటి స్వయం ఉపాధితో జీవిక సాగిస్తున్నవారికి పంపిణీ చేశారు. ఆర్థిక సాధికారత కోసం చేపట్టిన పథ కాలను అన్నిటినీ తిరిగి ఏకరువు పెట్టాలన్నా, లేదా కనీసం వాటి జాబితానంతా ఇవ్వాలన్నా ఈ కాలమ్ కంటే ఎక్కువ స్థలం పడుతుంది. అయితే, కనీసం వివిధ శీర్షికలనైనా చెప్పాల్సి ఉంది: ద్రవ్య సమ్మిళితం (ఫైనాన్షియల్ ఇంక్లూషన్), పోటీతత్వం, ఆరోగ్యం, పరిశుభ్రత, గ్రామీణ భారత పునరుజ్జీవం, సబ్సిడీల సంస్కరణలు, పట్టణ భారత పునరుజ్జీవం. కపట రాజకీయాలు భారత ఓటరును ఏ మాత్రమూ మెప్పించలేకపో యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దెబ్బతీయాలని రాహుల్‌గాంధీ చేసే నిస్పృహపూరిత ప్రయత్నాలు కాంగ్రెస్‌కు చెరుపు చేశాయి. ఆ పార్టీకి, ఒక వంశం బాగే.. దేశం కోలుకోవడంకంటే మరింత ఎక్కువ ముఖ్యమైనది. ఏదో ఒక రోజున, బహుశా త్వరలోనే, భారత చరిత్రలోని చిట్టచివరి రాజ వంశం ఈ విషయాన్ని గుర్తిస్తుంది. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
భుజంగ ‘సోదర’ పరిష్వంగం
బైలైన్ రాజకీయ కలన గణితంలో లాలూ ప్రాభవం వసివాడి పోయింది. ఒక రాష్ట్ర నాయకుని హోదా నుంచి నేడు ఆయన ఒక కుల నాయకుని స్థాయికి జారిపోయారు. సంప్రదాయక ఓటు బ్యాంకులు క్షీణ ప్రతిఫలాలను ఇస్తున్నాయి. కుల లేదా జాతి విధేయత ఫలాలు కొందరికే పరిమితం. కాబట్టి ఆర్థిక వృద్ధి నేడు కులం లేదా జాతి విధేయతకంటే ముందు నిలుస్తోంది. ఊకదంపుడు మాటలు, దిశ మారాలని బిహార్ కోరుకుంటోంది. కంటికి కనిపించే ఫలితాల ఆశను కలిగించగల పార్టీ వెంటే బిహార్ నడుస్తుంది. శత్రువుల సహోదరత్వానికి కాలం చెల్లింది. అమూల్ వెన్న వ్యాపార ప్రకటనలు పదే పదే ద్వంద్వార్థ పదప్రయోగం (శ్లేష) చేయడం చికాకే. కానీ అంతటి చమత్కార భరితమైన ప్రచార కార్యక్రమం దేన్నయినా శ్రద్ధగా పట్టించుకోవాల్సిందే. అమూల్ ప్రకటనల్లోని మాటలు ప్రజాభిప్రాయం నాడిని కచ్చితంగా అంచనా వేస్తాయి. కాబట్టే అవి అంతగా విజయవంతం అవుతుంటాయి. ‘భజరంగీ భాయిజాన్’ రాజకీయాలు చేసిన లోతైన విభజనపై మానన ఆత్మ స్థయిర్యం సాధించిన విజయోత్సవ వేడుక. ఆ సినిమాను ప్రశంసల్తో ముంచె త్తేవారిలో ఇప్పుడు అమూల్ వాళ్లు కూడా చేరారు. అంటే దీనర్థం, భారత, పాకిస్తాన్ల ప్రజలు తమ రెండు దేశాల మధ్య సమస్యలున్నాయని గుర్తిస్తున్నా, అత్యధికుల సెంటిమెంటు మాత్రం సంఘర్షణకంటే సయోధ్యనే కోరుకుంటోందని గ్రహించడం తేలికే. అలా అని అదేదో ఇప్పుడే జరిగి పోతుంద ని కాదు, ప్రజలు ఆశను కోల్పోలేదని మాత్రమే. అమూల్ తన తదుపరి వ్యాపార ప్రకటన కు ‘భుజంగీ భాయ్‌జాన్’ శీర్షిక పెట్టి... బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన దీర్ఘకాల శత్రువు, నేటి ‘పెద్దన్న’ లాలూ ప్రసాద్ యాదవ్‌కు దండ వేస్తున్నట్టు చూపిస్తే బావుం టుందని నా సూచన. భుజంగ్ అంటే సంస్కృతంలో పాము అని, భాయ్‌జాన్ అంటే ఉర్దూలో అన్న అని అర్థం. అయితే దీనికి కొంత నేపథ్యాన్ని చెప్పడం ఉపయోగకరం. అప్పుడే మరపున పడిపోయిన కొన్ని వారాల క్రితం, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్‌యాదవ్‌లు ఓ చిన్న మూకీ ప్రహసనాన్ని ప్రదర్శించారు. రాబోయే బిహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం కోసం పరస్పర విరుద్ధమైన తమ రెండు పార్టీల విలీనాన్ని ప్రకటించారు. ఇది, ఒంటరిగా అయితే తమ గెలుపునకు ఎలాంటి అవకాశమూ లేదని బహిరంగంగా అంగీకరించడమే. అలాంటి గత్యంతరం లేని పరిస్థితి సైతం...ఆ విలీనోత్సవ వేడుకల మేళతాళాలు పూర్తిగా సద్దుమణగక ముందే పెళ్లి పథకాలు విచ్ఛిన్నమైపోవడాన్ని నివారించలేకపోయింది. అయితే పెళ్లికి బదులు కలిసి సహజీవనం సాగించడానికి అంగీకారం కుదిరింది. ఎక్కువమంది మంచి కోసం ఎవరో ఒకరు హాలాహలాన్ని మింగక తప్పదంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఏర్పాటును గురించి తన అనుచరులకు వివరించారు. నితీష్ కుమార్ అప్పుడయితే ఏమీ అనలేదు గానీ, ఆయనకు ఆ వ్యాఖ్య చురుక్కున అంటుకుంది. గతవారం ఆయన ను వారి కూటమిలోని ఇబ్బందుల గురించి ప్రశ్నించగా ‘‘విష సర్పాలు చుట్టుకున్నంత మాత్రాన చందన వృక్షం పరిమళం క్షీణించిపోదు’’ అనే సుప్రసిద్ధ నానుడిని వల్లించారు. తద్వారా ఆయన... లాలూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఉండొచ్చు, అయినా నా సుగంధం మాత్రం అలాగే పరిమళిస్తుంటుంది అనే సందేశాన్ని పంపారు. దీనికి పర్యవసానంగా తొలుత లాలూ శిబిరం హోరెత్తి పోయింది. దాని పర్యవసానంగా ‘నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని ప్రకటించి, నితీష్ కుమార్ జూలై 23 అర్ధరాత్రి దాటాక లాలూప్రసాద్ యాదవ్‌తో సమావేశమయ్యారు. నితీష్, లాలూను తన అగ్రజునిగా అభివర్ణించడంతో సమావేశం ముగిసింది. 'భుజంగ’ సహోదరత్వమంటే ఇదే. ప్రజా జీవితంలో మీరు ఏం చెబుతారనేది ముఖ్యమైనదే. కానీ ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారనేదే నిర్ణయాత్మకం. నాలుక జిత్తులమారిది. ఒక్కోసారి మెదడు మాటను విధేయంగా పాటిస్తుంది, ఒక్కోసారి హృదయం మాట వింటుంది, ఇంకొన్ని సార్లు అంతరాంతరాల్లోని సహజాతం మాట వింటుంది. సహజాతం ఉద్వేగపూరితమైన ముడి భావనలను భద్రపరచే గది. నితీష్, లాలూల మధ్య సంబంధం అనేక ఏళ్లుగా విషపూరితమై ఉంది. వ్యక్తిగత ఆశ, మద్దతుదార్ల పునాదులు ప్రత్యామ్నాయ ధ్రువాలు కావడం, రాజనీతి, శైలి, లక్ష్యాల వంటి పలు అంశాలు అందుకు కారణం. ఒకరు మరొకరి సహజాతాన్ని సైతం ద్వేషించుకుంటూనే ఉంటారు. ఒక రాజకీయ కూటమిని ఏర్పరచడానికి మత్తెక్కి ఉద్వేగభరితులై ఉండాల్సిన అవసరమేమీ లేదు, నిజమే. కానీ ఇద్దరు ప్రబల ప్రత్యర్థుల శత్రువుల మధ్యన ఏర్పడే ఎలాంటి భాగస్వామ్యమైనాగానీ ఎన్నడూ స్థిరంగా ఉండదు. అలాంటి వారి మధ్య కూటమి ఏర్పాటంటే ఆందోళన కలగక తప్పదు. ఈ ఎన్నికలు జరగబోతున్నది అభివృద్ధి వాగ్దానం ప్రాతిపదికపైనే. సుస్థిరత అభివృద్ధికి ఆవశ్యమని బిహార్ ఓటర్లకు అర్థమవుతుంది. తొలి మాటల పోరే దాన్ని రుజువు చేసింది. జూలై 25న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్‌లు వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్స వాల సందర్భంగా ఒకే వేదికపై నుంచి మాట్లాడారు. గతంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలోని రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన నితీష్... వాజ్‌పేయి ప్రభుత్వం 2004లో మరో ఆరు నెలలు అధికారంలో ఉండివుంటే నేడు ప్రారంభిస్తున్న ఆ పథకం అప్పుడే సాకారమై ఉండేదని అన్నారు. వెంటనే ప్రధాని ఆ మాటను అంగీకరించేసి, ఓ చిన్న ప్రశ్న వేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడి చిందెవరు? సమాధానం లాలూ. సోనియాగాంధీ నేతృత్వంలోని మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా ఆయన పనిచేశారు. కాబట్టి, బిహార్‌కు అభివృద్ధిని నిరాకరించిన వ్యక్తి సాంగత్యంతో నితీష్ కుమార్ ఏం చెస్తున్నట్టు? బిహార్ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక ప్రధాన చర్చనీయాంశం అవుతుందని మీరు ఏ చింతా లేకుండా పందెం కాయొచ్చు కూడా. నితీష్ వ్యాఖ్యలు ఖండించాల్సిన వాటి కోవలోకి వచ్చేవి కావు. వాటిలో వ్యంగ్యోక్తి ఏమీ లేదు. పైగా పెద్ద ప్రజా సమూహం, మీడియా బృందం, టీవీ వీక్షకుల ముందు ఆయన మాట్లాడారు. చందన వృక్షం మీది భుజంగానికి ఇదే సాక్ష్యం. లాలూ ప్రసాద్ యాదవ్‌ను ‘‘జంగల్ రాజ్’’ ముఖ్యమంత్రిగా పదేపదే అభివర్ణించినది నితీష్ కుమారే. ఆ వాస్తవాన్ని ఆ ఇద్దరిలో ఎవరైనా మరచారంటే నాకు అనుమానమే. సీట్ల పంపకంతో అంతర్గత ఆధిపత్యం కోసం ఆ ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. ఇద్దరికిద్దరూ గెలవగలిగే సీట్లు తమకే ఎక్కువగా దక్కడానికి హామీ ఉండాలని ప్రయత్నిస్తారు. రాజకీయ కలన గణితంలో, లాలూ ప్రసాద్ యాదవ్ బ్రాండ్ ప్రాభవం కూడా వసివాడి పోయింది. ఒక రాష్ట్ర నాయకుని హోదా నుంచి ఆయన నేడు ఒక ప్రత్యేక కుల నాయకుని స్థాయికి జారిపోయారు. స్థిర రూప పెట్టుబడులు నిష్ఫలమైనవిగా మారే విధంగానే సంప్రదాయక ఓటు బ్యాంకులు సైతం క్షీణ ప్రతిఫలాలను ఇస్తున్నాయి. కుల లేదా జాతి పరమైన విధేయతా కార్యక్రమం ఫలాలు ఉన్నత శ్రేణిలోని కొందరికే పరిమితం. కాబట్టి ఆర్థిక వృద్ధి నేడు కులం లేదా జాతి విధేయతకంటే ముందు నిలుస్తోంది. ఊకదంపుడు మాటలు, దిశ మారాలని బిహార్ కోరుకుంటోంది. కంటికి కనిపించే ఫలితాల ఆశను కలిగించగల పార్టీ వెంటే బిహార్ నడుస్తుంది. శత్రువుల సహోదరత్వా నికి కాలం చెల్లింది. ఎంజె. అక్బర్ సీనియర్ సంపాదకులు. -
బాపూ చింతనకు చోటుందా?
బైలైన్ నేటి భారతదేశాన్ని చూడండి. మహాత్ముని మాటలు, ముందుచూపు, ప్రవచనాలు లేని లోటు ఎంతగా ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధ బీభత్సాన్ని చవిచూసిన నేలపైన అహింస అత్యంత సమంజసమైన భావనగా కనిపిస్తుంది. కానీ హీనపరిచే పేదరికాన్ని నిర్మూలించడం అంతకంటే తక్కువ ప్రాధాన్యం గలిగినది ఎలా అవుతుంది? మతం పేరిట హత్యలు, అల్లర్లు విచ్చలవిడిగా జరుగుతుండగా... మతాన్ని శాంతి, సామరస్యాల శక్తిగా చూపడం ఎంత కీలకమైనది? మహాత్ముడు జనవరి 2015లో తిరిగి మన పత్రికల్లో దర్శనమిస్తున్నాడు. ఇంచుమించుగా ఇది, జనవరి 2015లో మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ మాతృభూమికి రావడమంతటి స్వాగతించదగిన పరిణామం. 1915, దేశ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన మైలు రాయిగా నిలిచిపోతుంది. గాంధీజీ జోక్యంతో భారత స్వాతంత్య్ర ఉద్యమం యూరోపియన్ వలస పరిపాలనాశకాన్ని అంతం చేసింది. మూడు వందల ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న యూరోపియన్ వలసీకరణ 20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నట్టు కని పించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమని అనడం సుప్రసిద్ధం. గాం ధీ దేశానికి తిరిగి వచ్చాక ఏ సామ్రాజ్యంపైనా రవి ఉదయించడం ఎరుగం. 1869లో జన్మించిన గాంధీ 24 ఏళ్ల వయస్సులో అబ్దుల్లా సేథ్ అనే వ్యాపారి తరఫు న్యాయవాదిగా పనిచేయడం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. మోకాళ్ల కింది వరకు పొడవాటి కోటు, చారల ప్యాంటు, నల్ల తలపాగా, వాచీ, గొలుసు ధరించి ఆయన 1893 జవవరి 23న దర్బన్‌లో దిగారు. అక్టోబర్ 1901లో ఆయన ఏడాదిపాటు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే దేశం లోని ఉన్నత వర్గాల్లో ఆయన ఖ్యాతి వా్యిప్తి చెందడం ప్రారంభమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కలకత్తా సమావేశానికి ఆయన హాజరయ్యారు. వెళ్లేటప్పుడు దిన్షా వాచా (మహాసభకు అధ్యక్షత వహించాల్సిన వారు), ఫిరోజ్‌షా మెహతా, చిమన్లాల్ సెతల్వాద్ వంటి గొప్ప వ్యక్తులతో పాటూ కలిసి ఒకే రైలులో వెళ్లారు. అక్కడ మొదటి రాత్రి గడిపిన గాంధీ, ఉదయాన్నే వరండాలో ప్రతినిధులు మూత్ర విసర్జన చేసి ఉండటాన్ని చూసి నిర్ఘాంత పోయారు. అప్పటికింకా ‘అంటరానివారు’గానే పరిగణిస్తున్న దళితులు వచ్చే వరకు మిగతా వారిలాగా వేచి చూడలేదు. ఓ చీపురు అందుకొని ఆ పని ఆయనే చేసేశారు. 1901లో ఆయన బాటలో నడచినవారు ఎవరూ లేరు. గాంధేయవాద ఉద్యమం అంతటికీ మూల సారమైన ప్రతిపాదన ఒక్కటే. భారతదేశం ఓడిపోయినది బ్రిటన్ బలాధిక్యత వల్ల కాదు. స్వీయ బలహీనతల వల్ల వంచిత కావడం వల్లనే. అంటరానితనమనే శాపం, అజ్ఞా నం, మూఢవిశ్వాసం అనే చెడులను సమాజం నుంచి నిర్మూలించినప్పుడే దేశం కోలుకొని, ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే, అలాంటి కర్తవ్య నిర్దేశనకు నాంది పలికినది కలకత్తాకే చెందిన స్వామి వివేకానంద. ఆ మేధావిని కలుసుకోవాలని గాంధీ బేలూరు మఠానికి వెళ్లారు. కానీ స్వామి అప్పటికే బాగా అస్వస్థులై ఉండటంతో కలుసుకోలేకపో యారు. ‘‘భారతదేశం ‘మ్లేచ్ఛ’ (నీచ జాతి) అనే పదాన్ని కనిపెట్టిననాడే సరిగ్గా దాని పతనం లిఖితమైపోయింది... దేశం గుడిసెలోనే బతుకుతోందని గుర్తుంచు కోండి’’ అన్న వివేకానందుని బోధనను ఆయన అప్పటికే ఆచరిస్తున్నారు. అదే విధమైన ఆలోచన ధ్వనించేలా ‘‘ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్’’లో (సెప్టెంబర్ 1909) బ్రిటిష్ రచయిత జీకే చెస్టర్టన్, నాటి భారత జాతీయవాదులపై రాసిన ఈ విషయాలను గాంధీ చదివారు: ‘‘నాకు వారం టే విసుగు పుడుతోంది. వారిపట్ల అనుమానం కలుగుతోంది. వారు కోరేది భారతీయమైనదీ కాదు, జాతీయమైనదీ కాదు... ఉదాహరణకు ఒక భారతీ యుడు ఇలా అంటాడు: ‘భారతదేశం తెల్లవారి నుంచి, వారి పనుల నుండి ఎల్లప్పుడూ దూరంగానే ఉండాల్సింది. వారిదైన ప్రతిదాన్లో ఏవో తప్పులు న్నాయి. అంతకంటే మా సొంతవే మేం కోరుకుంటాం... మా జీవిత విధానం మీకు (బ్రిటిష్‌వారికి) నచ్చకపోతే, మా దారిన మమ్మల్ని వదిలేయండి. వెళ్లండి, మీరిక సెలవు పుచ్చుకోండి.’’ చెస్టర్టన్ చాలా సరిగ్గానూ, ముందుచూపుతోనూ అలా అన్నారు. నిజమైన స్వరాజ్, స్వయంపాలనల మార్గం ఏదో తెలిసిన నిజమైన నేత ఆవిర్భవిస్తాడు. అతి కొందరు భారతీయులు మాత్రమే మాటల్లో పెట్టగలగడం కాదు... ఊహించ గలిగిన విషయాలను ఒక ఇంగ్లిషువాడు చెప్పాడు. గాంధీ జోహన్నెస్‌బర్గ్‌లో ప్రాక్టీసు కొనసాగించడానికి తిరిగి వెళ్లారు. కానీ ఆయన మనస్సు, హృదయం మరెన్నడూ భారతదేశాన్ని వీడి వెళ్లింది లేదు. హిందువులలో సంస్కరణ ప్రక్రియకు నేతృత్వం వహించాలంటే, ముందుగా హిందూతత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలని గుర్తించారు. సంస్కృత, ఆంగ్ల భాషలలో భగవద్గీతను అధ్యయనం చేయడంలో మునిగిపోయారు. గీతాభక్తునిగా మారి, పద్దెనిమిది అధ్యాయాలలో పదమూ డింటిని కంఠతా పట్టారు. అందులోని అపరిగ్రహణం అనే (తనకంటూ ఏదీ కోరుకోరాదనే భావన) అంశం ఆయనను వివశుడ్ని చేసింది. భారతదేశం తన స్వీయ పాపాల నుంచి, భరింపశక్యం కాని వలస పాలనా భారం నుంచి విముక్తం కావడానికి పన్నెండేళ్లకు పైగా అత్యంత జాగ్రత్తగా సోపానాలను రూపొందించడం ద్వారా గాంధీజీ అందుకు తనను తాను సన్నద్ధం చేసుకున్నారు. ప్రతి మతానుయాయులకు ఒక నూతన సామాజిక కొలబద్ధను ఇచ్చి, మతాన్ని శక్తివంతమైన సాధనంగా ఆయన మలచారు: ప్రతి మత వ్యవస్థ సారం ఒక్కటే... శాశ్వత సత్వం. కాబట్టి మతం ఐక్యతకు మూలమేగానీ విరోధాలకు కాదు. 1915లో కలకత్తా విశ్వవిద్యాలయంలో, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో, 1915లో బెనారస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో గాంధీ జీ మూడు ప్రధాన ఉపన్యాసాలు చేశారు. 1916లో ఆయన తన రాజకీయ తాత్వికతలోని మూడు మౌలిక సూత్రాలను వివరించారు: 1) అహింస, 2) దేశంలోని అన్ని మతాల వారి మధ్య ఐక్యత, సంస్కరణ, త్యాగం, అంకితభావం, పరిశుభ్రత, 3) భవిష్యత్తు ఆకలితో, దరిద్రంతో అలమటిస్తున్నవారిదే. బెనారస్ విశ్వ విద్యాలయంలో ఆయన, వేదిక మీద ఆశీనులైన ‘‘గొప్పగా అలంకరించుకున్న ప్రభువుల’’ను అపహాస్యం చేశారు. భారత దేశాన్ని పరిరక్షించేది రైతే తప్ప న్యాయవాదులో లేక కులీనులో కారని ఆయన అన్నారు. 1916లో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన. వందేళ్ల తర్వాత నేటి భారతదేశాన్ని చూడండి. ఆయన మాటలను, ముందుచూపును, సూత్ర ప్రవ చనాలను మనం ఎంతగా కోల్పోయామోనని ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధ బీభత్సాన్ని చవిచూసిన నేలపైన అహింస అత్యంత సమంజసమైన భావనగా కనిపిస్తుంది. కానీ హీనపరిచే పేదరికాన్ని నిర్మూలించడం అంతకంటే తక్కువ ప్రాధాన్యం గలిగినది ఎలా అవుతుంది? మతం పేరిట హత్యలు, అల్లర్లు విచ్చలవిడిగా జరుగుతుండగా... మతాన్ని శాంతి, సామరస్యాల శక్తిగా చూపడం ఎంత కీలకమైనది? గాంధీ దేశానికి తిరిగి వచ్చిన శతాబ్ది వత్సరంలోనే గాంధీ మొహం ప్రజా ప్రసార మాధ్యమాలలోకి తిరిగి వచ్చింది. ఇక కావాల్సిందల్లా గాంధీ చింతనకు, హృదయానికి చోటే. -
అన్నీ తెలిసిన అధినాథుడు
నిరర్థక యథార్థాలకు ఉండే సమ్మోహనమైన ఆకర్షణశక్తిని వివేచనాపరులు ఎవరైనా ఎలా విస్మరించగలరు? పాశ్చాత్య దేశాల్లో లాంఛనంగా జరిగే విందుల్లో భోజనాల బల్ల వద్ద కుర్చీల ఏర్పాటు ఒక మంచి నియమాన్ని అనుసరించి... ఇద్దరు మగాళ్ల మధ్య ఒక మహిళ ఉండేలా జరుగుతుంది. మగాళ్లు మర్యాదకరంగా ప్రవర్తించడానికి హామీ ఉండాలంటే వాళ్లు ఓ మహిళ సమక్షంలో ఉండటం అవసరమనేదే ఆ నియమం. మత యుద్ధాల కాలంలో దాన్ని కనిపెట్టారు. లాటిన్ కవులలో ఏ ఒక్కరూ రోమ్‌లో పుట్టలేదు. చంకల్లో నిమ్మకాయలను రుద్దుకోవడం హ్యాంగ్ ఓవర్‌కు (తాగిన మత్తు దిగాక ఉండే ఇబ్బందికరమైన స్థితి) పోర్టోరికన్ల చిట్కా వైద్యం. ఇక కాసనోవాకు (18వ శతాబ్దపు ఇటాలియన్ శృంగార పురుషుడు) కూడా నిమ్మకాయలతో అంతే ఉపయోకరమైన అవసరం ఉండేది. అయితే అదేమిటో కుటుంబ వార్తా పత్రికలో రాయలేం. 2005 వింబుల్డన్ పోటీల్లో రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా కోర్టులో పెద్దగా పెట్టిన కేక 101.2 డెసిబల్స్ శబ్దాన్ని వెలువరించిందని కొలిచారు. మగరాయుళ్ల మోటర్ సైకిల్ చప్పుడు కంటే అది ఎక్కువ. ప్రయాణంలో కాలాక్షేపంగా ఓ పుస్తకం చదువుతూ క్రమపద్ధతేమీ లేకుండా అక్కడక్కడి నుంచి నేను సేకరించిన ఇలాంటి జ్ఞానం ఎందుకైనా ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నలో కేథలిక్కు విస్తృతిలోని అతి పరిశుద్ధవాదంతో పాటూ రవంత డాబుసరి నిగారింపు కూడా ఉంది. అనవసరమైనది ఏదో తెలియకపోతే, అవసరమైనది ఏదో మనకెలా తెలుస్తుంది? శాస ్తప్రరిశోధకులంతా, తత్వవేత్తలంతటి ఆసక్తిపరులే. పైన నేను తెలిపిన యథార్థాలు ‘అల్ప’ ఆసక్తికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు. అది కూడా ‘ఉత్తమ’ ఆసక్తి అంతగానూ నిమగ్నమయ్యేట్టు చేసేదే. ఆ మాటకొస్తే దానికి మరింత ఆచణనాత్మక విలువ ఉంటుంది. మీలో నిజంగానే కాసనోవా నిమ్మకాయాలతో ఏమి చేసేవాడనే ఆసక్తి రేకెత్తిందని పందెం కాస్తాను. నా కొలమానాల దృష్టితో చూస్తే ఆసక్తి ఎన్నడూ ఏ పిల్లినీ చంపి ఎరుగదు. ఒక వేళ పిల్లి చచ్చిందీ అంటే , అది తొందరపడి నిర్ధారణలకు గంతు వేయడం వల్లనే. ఒక పదబంధంగా ‘నిర్ధారణలకు గంతు వేయడం’ అనేది ప్రత్యేకించి మహా ముచ్చటైనది. తెలియని దాన్ని గురించిన విచారణ చేయడమే ఏ సాహస కృత్యానికికైనాగానీ ఆరంభ స్థానం, ఏ సాహసానికీ ఒడిగట్టకపోతే మనం సాధించగలిగేది ఏదీ లేదు. ‘నూతన ప్రపంచాన్ని’ కనుగొన్న ఒక్కొక్క ‘కొలంబస్’కు పదుల కొలదీ సముద్ర గర్భంలో సమాధై పోయారు. అయితే ఏమిటి? వైఫల్యం తర్వాతి తరానికి ప్రోత్సహకం మాత్రమే. అమెరికాను కనుగొన్న పాత క్రిస్టొఫర్ కొలంబస్ ఏమైనా తప్పు చేశాడంటే అది యూరప్ నుంచి మశూచి వంటి ప్రాణహానికరమైన అంటువ్యాధులు నూతన ప్రపంచానికి వ్యాపించే మార్గాన్ని తెరవడమే. అంతకుముందు అక్కడి వారు ఆ వ్యాధులను ఎరుగనే ఎరుగరు. ఎందుకంటే వాళ్లకు ప్రకృతి ప్రసాదించిన సంపదకు మానవ అవసరాలు పరిమితం కావాలనే స్పృహ వారికి ఉండేది. కొత్తది కనుగొనడం... దురాక్రమణ, దోపిడీలకు ఆజ్యం పోసినప్పుడు శాపం అవుతుంది. అవి మనిషిలోని అంతులేని క్రౌర్యానికి పరిపూర్ణ వ్యక్తీకరణను ఇవ్వగలుగుతాయి. అంగాకరక గ్రహ శోధనకు భారత్‌సహా పలువురు చేపట్టిన అంతరిక్ష యాత్రలు అక్కడ ఏమి కనుగొననున్నాయో ఎవరికీ తెలియదు. అయితే మనం అంగారకుడ్ని మరొక భూమిగా మార్చాలని కోరుకోవడం మాత్రం మహా మూర్ఖత్వం. ఎప్పటికైనా మనం అంగారక వాసులను కనుగొంటే తప్పకుండా వారికి కించపరిచే పేరే పెడతాం. ఆ తర్వాత వారి ఖనిజ సంపదలను దొంగలించడానికి వారిపై మారణహోమం చేపడతాం. అమెరికన్ ప్రైవేటు కంపెనీలు అప్పుడే అంగారకునిపై ఊహాత్మక ప్రాంతాలను మదుపర్లకు అమ్మజూపుతున్నాయి కూడా. ఆసక్తికి ఉన్న అసలు సిసలు ఆకర్షణ అంతా చిట్కాల్లాగా ఉండే వాస్తవాల్లోనే ఉంది. భారతీయులకన్నా ఎక్కువగా ఆసక్తిని కనబరిచే జాతి మరొకటి లేదు. అందుకే ఉపఖండంలోని రైలు ప్రయాణం లేదా బస్సు ప్రయాణం మౌనంగా ఎప్పుడూ ఉండదు. సంభాషణ జన సామాన్యానికి ప్రేరణగా ఉంటుంది. కొత్త వారితో సంభాషణ ఇక్కడ మంచి నడవడికి గుర్తు. బ్రిటన్ వంటి దేశాల్లో అది ఇతరుల వ్యవహారాల్లో అమర్యాదకరంగా తల దూర్చడం. భారతదేశం గురించిన నిజాన్ని భారతీయులు మన మీడియా ద్వారా ఎన్నడూ తెలుసుకోలేరు. అయితే మన మీడియా అందుకు విరుద్ధంగా భావిస్తూ ఉండి ఉండవచ్చు. మీడియా ద్వారా అందే వార్త వక్రీకరణకు గురికాలేదనే భరోసా వారికి ఎప్పుడూ ఉండదు. ఏదేమైనా వాస్తవాలను (గణాంక) మించిన నిజం ఏమిటో జనసామాన్యానికి తెలుసు. ఏ రైల్లోనో లేదా బస్సులోనే పక్క సీట్లో కూచున్న వారితో సంభాషణల్లో రాజకీయాల గురించి, అధికారం గురించి వారు ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న విషయాలను టీ బడ్డీ దగ్గరో లేదా అఫీసులోనో ఒకరి నుంచి మరొకరికి అందించుకుంటారు. మనకు కలిసే గుర్తు తెలియని వ్యక్తికి పక్షపాతంతో కూడిన ప్రయోజనాలు ఏవీ ఉండవు. సాంకేతిక పరిజ్ఞానం మన అరి చేతిలో తళుక్కున మెరవడానికి ముందే మన దేశానికి సోషల్ మీడియా ఉంది. ప్రతి భారతీయుని ఫేసూ ఓ బుక్కే. ప్రతి భారతీయుని వాణి ట్విట్టరే. కాబట్టి భారతీయులు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి, అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చే బాపతు కాదు. వాళ్లు ఏ అభిప్రాయాన్నయినా ఒక అభిప్రాయంగా మాత్రమే స్వీకరిస్తారు. సాధికారత సాధనకు దాన్ని ఒక సాధనంగా భావిస్తారు. ఎంతో శక్తివంతులను సైతం వాళ్లు క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా తగు శ్రద్ధతో నిర్ణయం తీసుకుంటారు. అందుకు వాళ్లు సమయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్లకు బోలెడు సమయం ఉంది. ఒకసారి వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చారూ అంటే, అంత తేలిగ్గా మార్చుకోరు లేదా అసలే మార్చుకోరు. తీర్పు చెప్పే రోజు వరకు అంటే పోలింగ్ రోజు వరకు అందుకు సమయం ఉంటుంది. జనసామాన్యం ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణాన్ని ప్రేమిస్తారు. దానితోపాటే దాన్ని నిలిపి ఉంచే రెండు ఆధారాలను కూడా ప్రేమిస్తారు. ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ఒక వైపు నుంచి భావప్రకటనా స్వేచ్ఛ, మరో వైపు నుంచి ఎంచుకునే స్వేచ్ఛ కాస్తుంటాయి. తీర్పు చేప్పే రోజు తమ ప్రాథమిక హక్కని వారికి తెలుసు. దాన్ని వాయిదా వేయడం లేదా అర్ధంతరంగా నిలిపేయడం జరిగేది కాదు. వారికి వారం వారం కాగడాల ప్రదర్శనలు లేదా మైదానాల్లో సభలు అక్కర్లేదు. వారి ఆగ్రహాగ్ని పర్వతం బద్ధలయ్యే ఒక రోజు వస్తుంది, పాత స్థానంలో కొత్త ఆశల మొలకలను నాటుతుంది. ప్రజాస్వామ్యం కర్మకు సజీవ వ్యక్తీకరణ. భారతీయుడు ఒక రోజుపాటూ సకల లోకాలకు అధినాధుడు అవుతాడు. అంతకంటే అతడికి ఏం కావాలి? ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తూ రాజకీయ నేతలు నరాలు తెగిపోయేటంత ఉద్విగ్నతకు గురవుతారు. కానీ ఓటరు మాత్రం ఫలితం పట్ల ఎన్నడూ ఆసక్తిని చూపడు. ఆసక్తిని చూపాల్సిన అవసరమూ లేదు. ఎన్నికలకు చాలా ముందుగానే ఫలితం ఏమిటో ఓటరుకు తెలుసు. బైలైన్ ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
‘క్షణికోద్రేక’ వంటకానికే గిరాకీ!
స్వీయ అభినందనకు సావకా శం ప్రతి పరిశ్రమకూ ఉండా ల్సిందే! ఇతరులెవరూ గౌరవిం చడానికి ఉత్సాహం కనబరచ నప్పుడు అది మరింత తప్పసరి అవుతుంది. పురస్కారాలతో ఏటేటా తమను తాము గౌరవిం చుకునే సంప్రదాయానికి పునా దులు హాలీవుడ్ సినిమా పరిశ్ర మలో ఉన్నాయి. 19వ శతాబ్దం చివరినాళ్లలో బ్రహ్మచర్యా న్ని ఒక ఆదర్శంగా ప్రజాబాహుళ్యంలో వ్యాప్తి చేసేందుకు లోక రీతికి భిన్నంగా ఆలోచించే ఓ కోటీశ్వరుడు సృష్టిం చిన హాలీవుడ్ చివరకు ఆ ఆదర్శానికి విరుద్ధంగా నడు చుకున్న సంగతి తెలిసిందే. మంచి ఉద్దేశాలు మంచి ఫలి తాలకే దారితీయవలసిన అవసరం లేదని ఈ దృష్టాంతం స్పష్టం చేస్తున్నది. హాలీవుడ్ పెరిగి పెద్దదై తారలతో, సెక్స్‌తో, మద్యం తో తనను తాను గౌరవించుకునే దశకు చేరుకున్నాక, సినిమా కళారూపానికి గుర్తింపుగా ఏదైనా ఒక చిహ్నాన్ని రూపొందించి తన ఉనికికి శాశ్వతత్వాన్ని ఆపాదించుకోవా లని యోచన చేసింది. కొంత కాలానికి ఆ యోచన ఫలించి స్త్రీ మూర్తి రూపంలో ఆస్కార్ అవార్డు రూపుతీసుకుంది. ఆస్కార్ శిల్పాకృతికి తరువాతి కాలంలో మరెన్నో నకలు ప్రతులు పుట్టుకొచ్చాయి. శిల్పాలకు పిల్ల శిల్పాలే పుడతా యని సామెత. సినిమా కళ పుట్టే నాటికి ఏ ఒక్క అవార్డు మనుగడలోలేకపోవడం ఎంత నిజమో, ఈ రోజున లెక్క కు మిక్కిలి అవార్డులు తామరతంపరగా పుట్టుకురావడం కూడా అంతే నిజం. సృజనాత్మకతలో హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని పాత్రికేయవృత్తి ఇన్నేళ్లు గడచినా, ఉత్తమ వార్తా కర్మాగా రాలకు అవార్డును నెలకొల్పకపోవడం ఆశ్చర్యకరం. పత్రి కలకు అనంతంగా ప్రకటనలను విడుదల చేసి ప్రాచు ర్యంలోకి వచ్చే రాజకీయ నాయకులకు కూడా అవార్డు లేక పోవడం విచిత్రం. జర్నలిజం అవార్డులకు పోటీ చేసేవారి సంఖ్య పరిమితంగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్య మైన రాజకీయ పార్టీలకు డజనుకు మించి పోటీదారులు ఉండే అవకాశం లేదు. వీరిలో అత్యధికులు అధికారిక అభ్యర్థులే అయి ఉంటారు. కాని పోటీ నియమాలు వర్తిం చని ప్రముఖులు కొందరైనా ఉంటారు. అధికారంలో ఉన్న వారికి సన్నిహితుడు కావడం మూలంగానో, ఇంతకు ముందు ఉన్న వృత్తిలో తెచ్చుకున్న పేరు మూలంగానో వారు పోటీలో గెలుపునకు చేరువగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇంగ్లిష్ భాషను ఔపోసన పట్టిన హాస్యరచయిత పి.జి. ఉడ్‌హౌస్ మాటల్లో చెప్పాలంటే మొదటివారు సంతుష్టులు... రెండోవారు అసంతుష్టులు. పాత్రికేయులకు, రాజకీయ నేతలకు ఇచ్చే అవార్డు లను ఉత్తమ ఏకవాక్య వ్యాఖ్యకు ఇచ్చే అవార్డుతో ప్రారం భించవచ్చు. క్రమంగా ఈ అవార్డుల సంఖ్యను పెంచుతూ పోవచ్చు: ఉద్దేశించని పరిణామాల సూత్రానికి ఉత్తమ ఉదాహరణ; రాజ్యసభ సీటు అన్వేషణలో ఉత్తమ వృద్ధ ప్రముఖుడు; ఆంగ్లానువాదంలో అర్థం అనర్థమైపోయిన ఉత్తమ హిందీ యాస మాట. ముచ్చటగా మరికొన్ని ఇదే అదనుగా ఉదహరిస్తాను. అవార్డులు ఇవ్వడానికి అనుగు ణమైన సందర్భాలు నా కంటికి చాలా కనిపిస్తున్నాయి: ఇంగ్లిష్ వ్యాకరణానికి, భారతీయ అర్థానికి మధ్య పొసగని ఉత్తమ భాషా ప్రయోగం; ట్విట్టర్‌కు ఉన్న పరిమితులకు లోబడి చేసిన ‘చెత్త’ వక్రీకరణ; పొగడ్తల పుణ్యమా అని కాలుజారి కిందపడిన ఉత్తమ విన్యాసం; మైనారిటీల ఓట్లను దండుకునే పోటీలో మేలిరకం స్వీయ ఓటమి; రేపటినాడు మిత్రుడయ్యే అవకాశం ఉన్న ఈ నాటి శత్రు వును దూషించడంలో సృజనాత్మక అభివ్యక్తి. ఈ అవార్డుల ఉత్సవాలను నిర్వహించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చే స్పాన్సర్లకు కూడా కొదవ ఉండదు. ఎందుకంటే అవార్డుల బహుకరణ ఘట్టం ప్రేక్షకులకు చాలినంత వినోదాన్ని పంచిపెడుతుంది. రాజకీయ నాయకులు ఈ అవార్డులు తీసుకునేం దుకు ముందుకువస్తారా అనే సందేహం సంశయవాదు లకు కలిగితే నేను ఆశ్చర్యపోను. అవార్డు గ్రహీత అవా ర్డును తీసుకున్నాక ముక్తసరిగా పలికే పలుకుల్లో పార్టీ అధినాయకినో, సతీమణినో, స్త్రీ అయితే పతిదేవుడినో, జన్మనిచ్చిన తల్లిదండ్రులనో, తనకు ప్రసంగాలు రాసిపెట్టే ఘోస్ట్ రైటర్‌నో, ఓటరు మహాశయులనో లేదా అంతి మంగా ఈ అవార్డు ప్రహసనాన్ని కలలో గని కనిపెట్టిన తెలివైన మిత్రుడినో తలచుకుని కృతజ్ఞతలు చెప్పకపోతే ఆడిటోరియం లోపలా బయటా ఉన్న ప్రేక్షకులు అచ్చెరు వొందకమానరు. సంశయవాదులు ఎప్పుడూ తప్పులో కాలేస్తుంటారు. రాజకీయ నాయకులు వారికన్నా తెలివైన వారు. 90 శాతం టీవీ వీక్షకులు అవార్డు ఎవరికి వచ్చిం దనేది మాత్రం గుర్తుంచుకుంటారు తప్ప ఎలా వచ్చిందో గుర్తుంచుకోరనే సంగతి మన రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అవార్డు తీసుకునేందుకు రాజకీయ నాయకులు బహుశా ఒక షరతు విధించవచ్చు. తమకు అవార్డులు ప్రదానం చేసేవారు సినిమా తారలను పోలిన ప్రముఖులై ఉండాలని, వారు తమ రంగంలో డిమాండ్ కలిగి ఉండా లని, సినిమా తారలే అయితే భారీ చిత్రాలలో అవకాశాలు పొందే వారై ఉండాలని వారు కోరుకుంటారు. ఓ విధంగా ఇది ఆమోదయోగ్యమైన షరతే! అవార్డు ప్రదానానికి ఆహ్వానం పొందే ప్రముఖుల్లో ఒకవేళ అమితాబ్ బచ్చన్ అందుబాటులో లేకుంటే, కత్రినా కైఫ్ తీరికలేకుండా ఉంటే మరెవైరనా పరవాలేదు. కేవలం కళాత్మక, లోబడ్జెట్ సినిమాలకు పరిమితమైన వారి నుంచి అవార్డు పుచ్చుకో వడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే అది నిష్ఫలం. అంతకన్నా ఘోరం మరొకటుంది. అది రాజ్‌బబ్బర్ ముఖాన నవ్వు పులుముకొని శత్రుఘ్నసిన్హాకు అవార్డు ఇవ్వడం, అందుకు ప్రతిగా శత్రుఘ్నసిన్హా రాజ్‌బబ్బర్‌కు అవార్డు ఇవ్వడం. వీరిద్దరూ రాజకీయ నాయకులే కావడం ఇక్కడ గమనార్హం. దిగ్విజయ్‌సింగ్, షకీల్ అహ్మద్ పబ్లిగ్గా ఒకరివీపు ఒకరు పరస్పరం గోక్కున్నా ఎవరికీ ఆసక్తి ఉండదు. బహుమతులకే బహుమతిని తొందరగా వండే ఉత్తమ వంటకానికి రిజర్వ్ చేయాలి. ఇది అన్ని బహు మతులకన్నా ఉత్తమమైనది. కనురెప్పలు నిదర మత్తులో మూతపడి తెరుచుకునేలోగా ‘రసాలూరే’ మాటల వంట కం వండేవారికి ఈ అవార్డు బహుకరించాలి. పొద్దుపోని మధ్యాహ్నం వేళ తీరిగ్గా నాలుగు వాక్యాలను పేర్చేవారికి కాదు ఈ అవార్డు. స్వాభావికంగా వ్యక్తిగత స్థాయిలో కనబరిచే సామర్థ్యానికి ఈ పరీక్ష. వంటకం రుచిని బట్టి న్యాయమూర్తులు అవార్డు గ్రహీతను ఎంపిక చేయాలి. అది ఆరోగ్యానికి మేలు చేసేదా? చేటు చేసేదా? అనేది వారు పట్టించుకోకూడదు. తమ నలభీములు హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, జ్ఞానాన్ని సమపాళ్లలో జోడించి వండే తక్షణ వంటకం తిని బాధపడేది రాజకీయ నాయకులు తప్ప వేరొకరు కాదు. అటువంటి విలక్షణ ఆహారం దొరికే ఉత్తమ రెస్టారెంటు జర్నలిజమే అంటే అతిశయోక్తి కాదు. రాజకీయ నాయకులపై పాత్రికేయులకు భక్తిప్రపత్తులు ఉండటానికి కారణం ఇదే. తమకు తాముగా చేసుకున్న గాయాలతో రాజకీయ నాయకులు నెత్తురోడే వార్తలకే గిరాకీ అధికం. టీవీ తెరపై ఈ హంగామా అంతా చూస్తూ ప్రేక్షకులు నవ్వే నవ్వు ఉచితమే కాదు, అది ఇతరులకు అంటుకుంటుంది కూడా. సోషల్ మీడియా హాట్‌కేక్ అంత పాపులర్ కావడం తో దానితో పోటీపడే క్రమంలో ‘ఫాస్ట్‌ఫుడ్’ తయారు చేసే కోరికను అణచుకోలేకపోవడమే తాము విధించుకున్న ఉన్నత ప్రమాణాల నుంచి వంటలరాయుళ్లు జర్రున జారి పోవడానికి కారణం. సోషల్ మీడియా నగ్నత్వం లాం టిది. సూటైనది. అది ఏదీ దాచుకోదు. ఏ వ్యాఖ్య అయినా 140 అక్షరాలకు మించితే అది అసాంఘికమైనదిగా పరి గణించే కాలంలో మనం ఉన్నాం. సంభాషణను ఇవాళ అవగాహన కోసం కాక ఆరోపణకు ఉద్దేశిస్తున్నాం. టీవీ తెరపై సాగే సంభాషణ పర్వం సంక్షిప్తతకు, ఉన్మాదానికి మధ్యన వారధి కడుతున్నది. అంతకన్నా ఎక్కువ ఆశించే వారిని విసుగు అనే చెత్తబుట్టలోకి విసిరేస్తున్నాం. ఇందుకు పాత్రికేయులను తప్పుపట్టి ప్రయోజనం లేదు. వీక్షకుడు కోరుకుంటున్నది ఇదే, పొందుతున్నది కూడా ఇదే. అత్య ధిక ప్రభావం చూపే అతి కురచ వాక్యానికి, ఆ వాక్యం రాసిన వాడికి తప్పనిసరిగా ‘లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు’ ఉండాలి. ఈ అవార్డు కింద ఆస్కార్ వంటి శిల్పా న్ని బహుకరించడం అంత సమంజసంగా ఉండదు. కాబట్టి దానికి బదులు ‘పట్టుకారు’ ఇవ్వడం మంచిది!