భుజంగ ‘సోదర’ పరిష్వంగం | lalu and nitish at one stage | Sakshi
Sakshi News home page

భుజంగ ‘సోదర’ పరిష్వంగం

Published Sun, Jul 26 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

భుజంగ ‘సోదర’ పరిష్వంగం

భుజంగ ‘సోదర’ పరిష్వంగం

బైలైన్
రాజకీయ కలన గణితంలో లాలూ ప్రాభవం వసివాడి పోయింది. ఒక రాష్ట్ర నాయకుని హోదా నుంచి నేడు ఆయన ఒక కుల నాయకుని స్థాయికి జారిపోయారు. సంప్రదాయక ఓటు బ్యాంకులు క్షీణ ప్రతిఫలాలను ఇస్తున్నాయి. కుల లేదా జాతి విధేయత ఫలాలు కొందరికే పరిమితం. కాబట్టి ఆర్థిక వృద్ధి నేడు కులం లేదా జాతి విధేయతకంటే ముందు నిలుస్తోంది. ఊకదంపుడు మాటలు, దిశ మారాలని బిహార్ కోరుకుంటోంది. కంటికి కనిపించే ఫలితాల ఆశను కలిగించగల పార్టీ వెంటే బిహార్ నడుస్తుంది. శత్రువుల సహోదరత్వానికి కాలం చెల్లింది.
 
అమూల్ వెన్న వ్యాపార ప్రకటనలు పదే పదే ద్వంద్వార్థ పదప్రయోగం (శ్లేష) చేయడం చికాకే. కానీ అంతటి చమత్కార భరితమైన ప్రచార కార్యక్రమం దేన్నయినా శ్రద్ధగా పట్టించుకోవాల్సిందే. అమూల్ ప్రకటనల్లోని మాటలు ప్రజాభిప్రాయం నాడిని కచ్చితంగా అంచనా వేస్తాయి. కాబట్టే అవి అంతగా విజయవంతం అవుతుంటాయి.  

‘భజరంగీ భాయిజాన్’ రాజకీయాలు చేసిన లోతైన విభజనపై మానన ఆత్మ స్థయిర్యం సాధించిన  విజయోత్సవ వేడుక. ఆ సినిమాను ప్రశంసల్తో ముంచె త్తేవారిలో ఇప్పుడు అమూల్ వాళ్లు కూడా చేరారు. అంటే దీనర్థం, భారత, పాకిస్తాన్‌ల ప్రజలు తమ రెండు దేశాల మధ్య సమస్యలున్నాయని గుర్తిస్తున్నా, అత్యధికుల సెంటిమెంటు మాత్రం సంఘర్షణకంటే సయోధ్యనే కోరుకుంటోందని గ్రహించడం తేలికే. అలా అని అదేదో ఇప్పుడే జరిగి పోతుంద ని కాదు, ప్రజలు ఆశను కోల్పోలేదని మాత్రమే.

అమూల్ తన తదుపరి వ్యాపార ప్రకటన కు ‘భుజంగీ భాయ్‌జాన్’ శీర్షిక పెట్టి... బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన దీర్ఘకాల శత్రువు, నేటి ‘పెద్దన్న’ లాలూ ప్రసాద్ యాదవ్‌కు దండ వేస్తున్నట్టు చూపిస్తే బావుం టుందని నా సూచన. భుజంగ్ అంటే సంస్కృతంలో పాము అని, భాయ్‌జాన్ అంటే ఉర్దూలో అన్న అని అర్థం. అయితే దీనికి కొంత నేపథ్యాన్ని చెప్పడం ఉపయోగకరం.

అప్పుడే మరపున పడిపోయిన కొన్ని వారాల క్రితం, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్‌యాదవ్‌లు ఓ చిన్న మూకీ ప్రహసనాన్ని ప్రదర్శించారు. రాబోయే బిహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం కోసం పరస్పర విరుద్ధమైన తమ రెండు పార్టీల విలీనాన్ని ప్రకటించారు. ఇది, ఒంటరిగా అయితే తమ గెలుపునకు ఎలాంటి అవకాశమూ లేదని బహిరంగంగా అంగీకరించడమే. అలాంటి గత్యంతరం లేని పరిస్థితి సైతం...ఆ విలీనోత్సవ వేడుకల మేళతాళాలు పూర్తిగా సద్దుమణగక ముందే పెళ్లి పథకాలు విచ్ఛిన్నమైపోవడాన్ని  నివారించలేకపోయింది. అయితే పెళ్లికి బదులు కలిసి సహజీవనం సాగించడానికి అంగీకారం కుదిరింది.

ఎక్కువమంది మంచి కోసం ఎవరో ఒకరు హాలాహలాన్ని మింగక తప్పదంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఏర్పాటును గురించి తన అనుచరులకు వివరించారు. నితీష్ కుమార్ అప్పుడయితే ఏమీ అనలేదు గానీ, ఆయనకు ఆ వ్యాఖ్య చురుక్కున అంటుకుంది. గతవారం ఆయన ను వారి కూటమిలోని ఇబ్బందుల గురించి ప్రశ్నించగా ‘‘విష సర్పాలు చుట్టుకున్నంత మాత్రాన చందన వృక్షం పరిమళం క్షీణించిపోదు’’ అనే సుప్రసిద్ధ నానుడిని వల్లించారు. తద్వారా ఆయన... లాలూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఉండొచ్చు, అయినా నా సుగంధం మాత్రం అలాగే పరిమళిస్తుంటుంది అనే సందేశాన్ని పంపారు. దీనికి పర్యవసానంగా తొలుత లాలూ శిబిరం హోరెత్తి పోయింది. దాని పర్యవసానంగా ‘నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని ప్రకటించి, నితీష్ కుమార్ జూలై 23 అర్ధరాత్రి దాటాక లాలూప్రసాద్ యాదవ్‌తో సమావేశమయ్యారు. నితీష్, లాలూను తన అగ్రజునిగా అభివర్ణించడంతో సమావేశం ముగిసింది.

'భుజంగ’ సహోదరత్వమంటే ఇదే.
ప్రజా జీవితంలో మీరు ఏం చెబుతారనేది ముఖ్యమైనదే. కానీ ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారనేదే నిర్ణయాత్మకం. నాలుక జిత్తులమారిది. ఒక్కోసారి మెదడు మాటను విధేయంగా పాటిస్తుంది, ఒక్కోసారి హృదయం మాట వింటుంది, ఇంకొన్ని సార్లు అంతరాంతరాల్లోని సహజాతం మాట వింటుంది. సహజాతం ఉద్వేగపూరితమైన ముడి భావనలను భద్రపరచే గది. నితీష్, లాలూల మధ్య సంబంధం అనేక ఏళ్లుగా విషపూరితమై ఉంది. వ్యక్తిగత ఆశ, మద్దతుదార్ల పునాదులు ప్రత్యామ్నాయ ధ్రువాలు కావడం, రాజనీతి, శైలి, లక్ష్యాల వంటి పలు అంశాలు అందుకు కారణం. ఒకరు మరొకరి సహజాతాన్ని సైతం ద్వేషించుకుంటూనే ఉంటారు.

ఒక రాజకీయ కూటమిని ఏర్పరచడానికి మత్తెక్కి ఉద్వేగభరితులై ఉండాల్సిన అవసరమేమీ లేదు, నిజమే. కానీ ఇద్దరు ప్రబల ప్రత్యర్థుల శత్రువుల మధ్యన ఏర్పడే ఎలాంటి భాగస్వామ్యమైనాగానీ ఎన్నడూ స్థిరంగా ఉండదు. అలాంటి వారి మధ్య కూటమి ఏర్పాటంటే ఆందోళన కలగక తప్పదు. ఈ ఎన్నికలు జరగబోతున్నది అభివృద్ధి వాగ్దానం ప్రాతిపదికపైనే. సుస్థిరత అభివృద్ధికి ఆవశ్యమని బిహార్ ఓటర్లకు అర్థమవుతుంది. తొలి మాటల పోరే దాన్ని రుజువు చేసింది. జూలై 25న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్‌లు వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్స వాల సందర్భంగా ఒకే వేదికపై నుంచి మాట్లాడారు. గతంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలోని రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన నితీష్... వాజ్‌పేయి ప్రభుత్వం 2004లో మరో ఆరు నెలలు అధికారంలో ఉండివుంటే నేడు ప్రారంభిస్తున్న ఆ పథకం అప్పుడే సాకారమై ఉండేదని అన్నారు. వెంటనే ప్రధాని ఆ మాటను అంగీకరించేసి, ఓ చిన్న ప్రశ్న వేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడి చిందెవరు? సమాధానం లాలూ. సోనియాగాంధీ నేతృత్వంలోని మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా ఆయన పనిచేశారు.

కాబట్టి, బిహార్‌కు అభివృద్ధిని నిరాకరించిన వ్యక్తి సాంగత్యంతో నితీష్ కుమార్ ఏం చెస్తున్నట్టు?
బిహార్ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక ప్రధాన చర్చనీయాంశం అవుతుందని మీరు ఏ చింతా లేకుండా పందెం కాయొచ్చు కూడా. నితీష్ వ్యాఖ్యలు ఖండించాల్సిన వాటి కోవలోకి వచ్చేవి కావు. వాటిలో వ్యంగ్యోక్తి ఏమీ లేదు. పైగా పెద్ద ప్రజా సమూహం, మీడియా బృందం, టీవీ వీక్షకుల ముందు ఆయన మాట్లాడారు. చందన వృక్షం మీది భుజంగానికి ఇదే సాక్ష్యం. లాలూ ప్రసాద్ యాదవ్‌ను ‘‘జంగల్ రాజ్’’ ముఖ్యమంత్రిగా పదేపదే అభివర్ణించినది నితీష్ కుమారే. ఆ వాస్తవాన్ని ఆ ఇద్దరిలో ఎవరైనా మరచారంటే నాకు అనుమానమే. సీట్ల పంపకంతో అంతర్గత ఆధిపత్యం కోసం ఆ ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. ఇద్దరికిద్దరూ గెలవగలిగే సీట్లు తమకే ఎక్కువగా దక్కడానికి హామీ ఉండాలని ప్రయత్నిస్తారు.

రాజకీయ కలన గణితంలో, లాలూ ప్రసాద్ యాదవ్ బ్రాండ్ ప్రాభవం కూడా వసివాడి పోయింది. ఒక రాష్ట్ర నాయకుని హోదా నుంచి ఆయన నేడు ఒక ప్రత్యేక కుల నాయకుని స్థాయికి జారిపోయారు. స్థిర రూప పెట్టుబడులు నిష్ఫలమైనవిగా మారే విధంగానే సంప్రదాయక ఓటు బ్యాంకులు సైతం క్షీణ ప్రతిఫలాలను ఇస్తున్నాయి. కుల లేదా జాతి పరమైన విధేయతా కార్యక్రమం ఫలాలు ఉన్నత శ్రేణిలోని కొందరికే పరిమితం. కాబట్టి ఆర్థిక వృద్ధి నేడు కులం లేదా జాతి విధేయతకంటే ముందు నిలుస్తోంది. ఊకదంపుడు మాటలు, దిశ మారాలని బిహార్ కోరుకుంటోంది. కంటికి కనిపించే ఫలితాల ఆశను కలిగించగల పార్టీ వెంటే బిహార్ నడుస్తుంది. శత్రువుల సహోదరత్వా నికి కాలం చెల్లింది.

 




ఎంజె. అక్బర్
సీనియర్ సంపాదకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement