రాహుల్ జోరు.. నిరర్థక పోరు | m.j.akbar writes on rahul gandhi fighting with nda | Sakshi
Sakshi News home page

రాహుల్ జోరు.. నిరర్థక పోరు

Published Mon, Aug 17 2015 1:40 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

రాహుల్ జోరు.. నిరర్థక పోరు - Sakshi

రాహుల్ జోరు.. నిరర్థక పోరు

బైలైన్
 
ఇదేదో నమ్మశక్యం కాని ఆలోచన అనిపిస్తే అనిపించొచ్చుగానీ... ఇది భారంగా గడుస్తున్న కాలం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల పేరు మారిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రతి ఏటా  స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజునే వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. కాబట్టి వీటిని ‘ఆజాదీ సమావేశాలు’ అని పిలుచుకుంటే ఎలా ఉంటుంది?

అలా పేరు మారిస్తే, స్వతంత్ర భారతానికి పునాదులు వేసిన తరం జ్ఞాపకాలైనా... ప్రజాస్వామ్యా నికి గుండెకాయలాంటి సంస్థల విశ్వసనీయత తుడిచిపెట్టుకుపోయేలా గలాభాను సృష్టించడాన్నే నమ్ముకున్న వారికి నచ్చజెబుతాయేమో. మన తర్వాతి తరాలకు మనం ఇచ్చిపోవాలనుకుంటున్న వారసత్వం ఇదేనా? 1947 నాటి ఆ గొప్ప తరాన్ని మనం ఎంతో గౌరవంతో స్మరించుకుంటూ ఉంటాం. 2084 నాటి తరాలు కూడా 2015 నాటి నేటి తరాన్ని అలాగే గుర్తుకు తెచ్చుకుంటాయా?

మొత్తంగా చూస్తే ఇప్పటివరకు సాపేక్షికంగా ప్రశాంతంగా సాగినవి ఒక్క పార్లమెంటు సమావేశాలు మాత్రమే. ఇక్కడ ముఖ్యమైన పదం సాపేక్షికమైనదేగానీ, ప్రశాంతంగా కాదు. బడ్జెట్ క్రమాన్ని స్తంభింపజేస్తే ప్రభుత్వం ప్రతిష్టంభించిపోతుందని సభలోని అన్ని పక్షాలకూ తెలుసు. కాబట్టి ఎవ రూ ఆ సమావేశాలకు అంతరాయం కలిగించలేదు. గందరగోళం కొనసాగుతూ పోతే ప్రజాస్వామ్యమే స్తంభించిపోవచ్చని మనం గుర్తించే దెన్నడు? రంధ్రాన్వేషణతో రచ్చ చేసే రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ గత రాజ్యసభ సమావేశాల కార్యకలాపాలను ప్రతి రోజూ పాడు చేయాలని, లోక్‌సభ సమావేశాలను తీవ్రంగా దెబ్బతీయాలని నిర్ణయించింది.

అంతర్థాన మైపోతున్న ఓ ప్రతిపక్షం సుపరిపాలనతో, కోలుకున్న ఆర్థిక వ్యవస్థతో తలపడేటప్పుడు... ఆ పోరాటం సముచితత్వం కోసం చేసేదిగానే ఉండాలి. ఇది అర్థం చేసుకోగలిగినదే. కాకపోతే తల్లి సోనియాగాంధీ ప్రేరేపించగా రాహుల్‌గాంధీ అసహనాన్ని,  అపరిణతిని, అన్నిటినీ తప్పు పట్టేతత్వాన్ని, ప్రతికూలతత్వాన్ని ప్రదర్శించిన సన్నివేశమే అర్థంకానిది. ఇది ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుందని, కాంగ్రెస్‌ను క్షీణింపజేస్తుందని వారికి చెప్పేవా రెవరూ లేకపోయారు.

ఈ కథ ఈ ఏడాది మేలో మోదీ ప్రభుత్వ తొలి వార్షికోత్సవంతో మొద లైంది. తొలుత పరిస్థితి కాంగ్రెస్‌కే అనుకూలించింది. ప్రత్యేకించి, నూతన ప్రభుత్వ వ్యవస్థలో తమకు తగు పాత్రను ఇవ్వ నిరాకరించారని భావించిన ప్రముఖుల నుంచి దానికి అనూహ్యమైన మద్దతు లభించింది. మోదీవి అన్నీ మాటలే తప్ప, చేసి చూపేది ఏదీ లేదనే  అంశం చుట్టూనే వారి దాడి సాగింది. సంఘటితం కావడానికి ప్రభుత్వానికి కొంత సమయం పట్టిందే తప్ప, అది స్థిమితాన్ని కోల్పోలేదు.

ఇంతవరకయితే అది సాధారణంగానే ఉంది. మన వ్యవస్థలో ఐదేళ్ల పాలనకు సంబంధించి ఉన్న నియమాలు తార్కికమైనవి. మూడేళ్లపాటూ మీరు పోట్లాడుతూ గడిపేస్తే, ఆ తర్వాత... ప్రతి పదవీ కాలపు చివరి ఏడాదిలోనూ సాగే జీవన్మరణ పోరాటానికి సన్నద్ధం కావడాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. కానీ, రాహుల్‌గాంధీ ఇప్పుడు కాకపోతే మరెన్న డూ సాధ్యం కాదన్నట్టు ఆ పోరాటాన్ని ఇప్పుడే ప్రారంభించేశారు. తన దగ్గరున్న ఆయుధాలు ఏమంత ఘనమైనవి కావు, తమ మందుగుండంతా నిరర్థకమైనది అనే వాస్తవం అందుకు ప్రతిబంధకం కాలేదు.

ప్రధానిని తగినంత బలంగా దెబ్బతీసేస్తే, ఆయన మద్దతుదార్లైన ఓటర్ల పునాదిలో గండి ఏర్పడుతుందని, దాన్ని తానూ, తన బిహార్ మిత్రులు నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లూ కలసి అక్టోబర్ శాసనసభ ఎన్నికల్లో వాడుకోవ చ్చనేది ఆయన యోచన కావచ్చు. అలాంటి  సన్నివేశంలో వారు రాజకీయ అనుకూలతను కైవసం చేసుకోగలుగుతారు. తద్వారా దేశ ఆర్థిక పునర్వికాసాన్ని, మోదీ అభివృద్ధి కార్యక్రమాన్ని దెబ్బతీసి, మిగతా పదవీ కాలమంతటా ఆయన ప్రభుత్వం నిర్వీర్యమైపోయేలా చేయగలుగుతారు.

రాహుల్‌గాంధీ, నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌ల త్రయం రెండు తప్పులు చేసింది. వారు ప్రధాని కోలుకునే స్థితిని తక్కువగా అంచనా వేశారు. పైగా వాస్తవాలు తమ పక్షానికి వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించ నిరాకరించారు. రాజకీయ చర్చ ముగిసిపోయాక మిగిలేవి వాస్తవాలే. వాక్చాతుర్యం కంటే వాస్తవాలే ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎన్నికల క్రీడలో వాస్తవాలే పెద్ద క్రీడాకారులు. అందుకే మనం వాస్తవాలనే స్వయంగా మాట్లాడనివ్వాలి.

‘మింట్’ అనే ఇంగ్లిష్ స్వతంత్ర వ్యాపార పత్రిక ఆగస్టు 14న, ప్రధాని మోదీ తన తొలి 14 నెలల పదవీ కాలంలో ఏమి సాధించారో వాటి జాబితా ను పట్టికలతో నిష్పక్షపాతమైన ఆచరణాత్మక పద జాలంతో రెండు పేజీలలో విస్తరించి ప్రచురించింది. ద్రవ్య సమ్మిళితానిదే (ఫైనాన్షియల్ ఇంక్లూషన్) ఆ జాబితాలో అగ్రస్థానం. పేదల జీవన నాణ్య తను మెరుగు పరచడమే ఈ ప్రభుత్వపు మౌలిక కార్యక్రమం.

‘జన్ ధన్ యోజన’ ద్వారా దిగ్భ్రాంతికరంగా 17.45 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలను తెరిచారు. మొట్టమొదటి సారిగా, కోట్లాది మందికి బ్యాంకు సేవలు అందుబాటు లోకి వచ్చాయి. అవి, వారి భద్ర తకు, అవకాశాలకు వాహికలు కాగలుగు తాయి. ఆగస్టు 15న, ప్రధాని అవకాశానికి అర్థమేమిటో వివరిం చారు. ఆది వాసీలు, దళితులు, మహిళల యా జమాన్యంలో కొత్తగా ప్రారంభిం చే వ్యాపార సంస్థలకు తేలికపాటి షరతులతో రుణాలను మంజూ రు చేయాలని ఆయన దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,25,000  బ్యాంకు బ్రాంచీలను కోరారు. పేదల దృష్టిలో దీని అర్థం ఏమిటీ అని, కొత్త సంస్థలు, ఇప్పటికే అమలవుతున్న పథకాలు పునాది స్థాయిలో సృష్టించే ఉద్యోగాల సంఖ్య ఎంత అనీ ఆలోచించి చూడండి.  

‘ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకం’ కింద ఇప్పటికే 8 కోట్ల మంది ప్రజలు బీమా సౌకర్యాన్ని పొందారు. దాదాపు మూడు కోట్ల మంది కారుచౌకకు జీవిత బీమా పాలసీలను తీసుకున్నారు. అత్యవసరమైనవారి కోసం ప్రారంభించిన మొట్టమొదటి సామాజిక భద్రత పథకం ఇదే. ‘ముద్రా ప్లాన్’ ఇప్పటికే రూ.137 కోట్ల విలువైన నిధులను కూరగాయల బళ్లవారి వంటి స్వయం ఉపాధితో జీవిక సాగిస్తున్నవారికి పంపిణీ చేశారు. ఆర్థిక సాధికారత కోసం చేపట్టిన పథ కాలను అన్నిటినీ తిరిగి ఏకరువు పెట్టాలన్నా, లేదా కనీసం వాటి జాబితానంతా ఇవ్వాలన్నా ఈ కాలమ్ కంటే ఎక్కువ స్థలం పడుతుంది. అయితే, కనీసం వివిధ శీర్షికలనైనా చెప్పాల్సి ఉంది: ద్రవ్య సమ్మిళితం (ఫైనాన్షియల్ ఇంక్లూషన్), పోటీతత్వం, ఆరోగ్యం, పరిశుభ్రత, గ్రామీణ భారత పునరుజ్జీవం, సబ్సిడీల సంస్కరణలు, పట్టణ భారత పునరుజ్జీవం.

కపట రాజకీయాలు భారత ఓటరును ఏ మాత్రమూ మెప్పించలేకపో యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దెబ్బతీయాలని రాహుల్‌గాంధీ చేసే నిస్పృహపూరిత ప్రయత్నాలు కాంగ్రెస్‌కు చెరుపు చేశాయి. ఆ పార్టీకి, ఒక వంశం బాగే.. దేశం కోలుకోవడంకంటే మరింత ఎక్కువ ముఖ్యమైనది. ఏదో ఒక రోజున, బహుశా త్వరలోనే, భారత చరిత్రలోని చిట్టచివరి రాజ వంశం ఈ విషయాన్ని గుర్తిస్తుంది.    
 
 - ఎం.జె. అక్బర్
 సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement