చెన్నైలో ఓ ఉమెన్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్
సాక్షి ప్రతినిధి, చెన్నై/నాగర్‌కోయిల్: బెదిరింపులకు దిగితే ఏదైనా వ్యవస్థను హస్తగతం చేసుకుని, ఏదైనా రాష్ట్రాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని ప్రధాని మోదీ భావిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మోదీ అంచనాలు తప్పని, తమిళులపై ఎవరూ ఆధిపత్యం చెలాయించలేరని పేర్కొన్నారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ కాంగ్రెస్–డీఎంకే కూటమి ప్రచారాన్ని ప్రారంభించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తమిళనాడులో కూటమి కట్టిన అన్నాడీఎంకే–బీజేపీపై మండిపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ప్రధాని కార్యాలయంలో ఉందని ఎద్దేవా చేశారు. అబద్ధాలతోనే పాలన కొనసాగిస్తున్న మోదీని సత్యం జైలులో పెడుతుందని ఓ తమిళ సూక్తిని ఉటంకించారు. తరువాత చెన్నైలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాహుల్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేన్లు కల్పిస్తామని, జీఎస్టీ అమలులో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు.
ఢిల్లీ నుంచి తమిళనాడు పాలన..
మోదీ విధానాలు కేవలం తమిళ ప్రజలనే కాకుండా అన్ని రాష్ట్రాలు, భాషలపై దాడి చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్–డీఎంకే కూటమి కేవలం రాజకీయపరమైనదే కాదని, సైద్ధాంతికంగానూ రెండు పార్టీల మధ్య సారూప్యత ఉందని తెలిపారు. బీజేపీ హయాంలో తమిళ సంస్కృతిపై దాడి జరుగుతోందని డీఎంకే చేస్తున్న ప్రచారాన్ని సమర్థిస్తూ, తమిళనాడును తయారీ రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
మోదీనీ విచారించాలి..
చెన్నైలోని ఓ మహిళా కళాశాల విద్యార్థులతో రాహుల్ మాట్లాడుతూ..చట్టం అందరికీ ఒకే విధంగా అమలు కావాలని, మనీలాండరింగ్ కేసులో తన బావ రాబర్ట్ వాద్రాను విచారిస్తే, రఫేల్ కుంభకోణంలో ప్రధాని మోదీని కూడా ప్రశ్నించాలని అన్నారు. ప్రతికూల, భయానక వాతావరణంలో ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పరిస్థితిని మార్చేస్తుందని హామీ ఇచ్చారు.
21 మందితో రెండో జాబితా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ బుధవారం విడుదల చేసింది. పార్టీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ (మొరాదాబాద్), కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే (షోలాపూర్), మరో మాజీ మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ (కాన్పూర్), ప్రియా దత్ (ముబై ఉత్తర–మధ్య) తదితర ప్రముఖులు రెండో జాబితాలో టికెట్ దక్కించుకున్నారు. రెండో జాబితాలో మొత్తం 21 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా, వాటిలో 16 ఉత్తరప్రదేశ్‌లో, 5 మహారాష్ట్రలో ఉన్నాయి. రెండో విడతతో కలిపి ఇప్పటికి 36 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment