మనం చూడదలుచుకోని నిజం
1947లో ఎక్కడ ప్రారంభించామనే కొలబద్ధతో గాక, 2015కి ఎక్కడికి చేరి ఉండాల్సింది అనే కొలబద్ధతో దేశ ఆర్థిక ఆరోగ్యం, సామాజిక న్యాయం ప్రమాణాలను లెక్కించాల్సి ఉంది. అలా చూస్తే మనమిప్పుడున్నది సంక్షోభపు అంచున కాదు, మహా విపత్తుకు అంచున.
సావధానులుకండి. మన వైఫల్యం కషాయపు అడుగు అవశేషాల కటిక చేదు విషయమిది. దేశంలో సగ భాగం ఆకలికి, అర్ధాకలికి మధ్యన ఇరుక్కుని, శిఖరాగ్రానున్న ఐదో వంతు తమ సంతోషాల బుడగలో మహా ఉల్లాసంగా గడుపుతున్నారు. నడమన పీల్చిపిప్పయిపోతున్న మధ్య భాగం గందరగోళంతో, అనిశ్చితంగా... టీవీ సీరియళ్లు తినిపించే ఆశావహ దృక్పథానికి, వీధి తిరుగుబాటు వెల్లువలకు మధ్య తెగ ఊగిసలాడుతోంది.
2015నాటి భారతావని గురించిన ఈ సత్యాలు అత్యంత సమగ్రంగా నిర్వహించిన సామాజిక-ఆర్థిక గణన నుంచి తీసుకున్నవి. అవి సంతృప్తితో కళకళలాడే అతి సుసంపన్న వర్గీయుల సౌందర్యసాధనాలతో అలంకరించి చూపెడుతున్న భారతావని మొహానికి పెద్ద చెంపపెట్టు. దేశంలో ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నవారే. దీన్ని సబ్‌సహారా (సహారా ఎడారికి దక్షిణాన ఉన్న) దేశాల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరితో పోల్చి చూడండి.
మన దేశంలో 51%కి శారీరక శ్రమతో కుంగిపోవడమే ఏకైక ఆదాయ వనరు. శారీరక శ్రమంటే జీవనాధార స్థాయి మనుగడకు సమానార్థకం. కాబట్టే నేను ఉద్దేశపూర్వకంగానే శారీరక శ్రమ అన్నాను. 92%గ్రామీణ కుటుంబాలు నెలకు రూ.10,000 కంటే తక్కువతోనే జీవిస్తున్నాయి. వ్యక్తులు కాదు, కుటుంబాలే. మరీ నగ్నంగా చెప్పాలంటే ఇంచుమించు 75 శాతం కుటుంబాలు నెలకు రూ. 5,000 లేదా అంతకంటే తక్కువతోనే బతుకుతున్నాయి.
ఈ సర్వే పొడవునా ఒకదాన్ని మించి మరొకటి మరింతగా ఎక్కువ ఆందోళనకరమైన ఇలాంటి గణాంకాల మరకలే ఉన్నాయి. కావాలనుకుంటే, పిల్లల్లో పోషకాహార లోపం 45.1% నుంచి 30.7%కి తగ్గిందని మీరు ఉపశమమంపొందొచ్చు. కానీ దైన్యం నిండిన తల్లుల కళ్లు నిస్సహాయంగా చూస్తుండగానే దారిద్య్రానికి హరించుకుపోతున్న ప్రతి మూడో శిశువు ముందు ఇలాంటి ప్రలాపనలను చేయడం మూర్ఖత్వం. బహుశా ఆ తల్లులు సైతం అప్పటికే తమ పిల్లలంత దుర్బలంగా ఉండి ఉంటారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం దేశంలో 30% మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నదంటూ ఒక బూటకపు అంచనాను చలామణి చెయ్యాలని యత్నించింది. ఎన్నికల రాజకీయల సేవలో దారిద్య్ర రేఖను మరికాస్త మింగుడుపడేలా చేయడం కోసం ప్రదర్శించిన గణాంకాల గారడీ అది.
1947లో మనం ఎక్కడ ప్రారంభించామనే కొలబద్ధతో గాక, 2015కి మనం ఎక్కడికి చేరి ఉండాల్సింది అనే కొలబద్ధతో మన దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని సామాజిక న్యాయం ప్రమాణాలను లెక్కించాల్సి ఉంది. అలా చూస్తే మనమిప్పుడున్నది సంక్షోభపు అంచున కాదు, మహా విపత్తుకు అంచున. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఉపాధుల కోసం తమ హక్కుల పట్ల విశ్వాసంతో ఉన్న ప్రజలు తరాలతరబడి ఇంకా ఎదురు చూడ లేరు. ఆగ్రహావేశానికి అత్యంత శక్తివంతమైన కారణం ఆకలి.
కోట్లాది మంది ప్రజలు ఇంకా తలదాచుకోను గూడూ, ఎలాంటి గౌరవమూ, ఏ ఆశా లేక బతుకుతున్నారు. పేదరిక సూచికకు కొలబద్ధగా ప్రపంచం సబ్ సహారన్ ఆఫ్రికాను స్వీకరించింది. కానీ అదొక భ్రమ. మన దక్షిణ ఆసియా ఉపఖండమే నిజానికి పేదరికానికి సరైన నమూనా. అదేపనిగా ఇతరుల్ని చూడటమంటే మనకు మహా ఇష్టం. ఒక్కసారి అద్దంలో మనల్ని మనం తేరిపార చూసుకోవడం అవసరం.
మనకది చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. మీకు అంతరాత్మంటూ ఉంటే ఆందోళన కూడా కలుగుతుంది. అయినా మనకు సంతృప్తి కలగడానికి రెండు కారణాలున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వాస్తవాలను మీడియా ముందుంచేటప్పుడు కుంటిసాకులతో వాటిని సుతి మెత్తగా మార్చే ప్రయత్నించలేదు. పరిష్కారం దిశగా వేసే తొలి అడుగు సమస్యను గుర్తించడమే. నాటకీయతకు ప్రాధాన్యం ఇచ్చి వాస్తవాలను బలిపీఠంపైకి ఎక్కించేస్తుందని మీడియా అతి తరచుగా విమర్శలను ఎదుర్కొంటుంది. కానీ అది ఈ చే దు వాస్తవాల విస్తృతిని, లోతును అర్థం చేసుకున్నాయి. దినపత్రికలు మొదటి పేజీ బ్యానర్ హెడ్డింగులు పెట్టాయి.
ఆలోచించదగిన ఈ పోలికను చూడండి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఈ సర్వేపై పలు కథనాలను ప్రచురించిన రోజున లోపలిపేజీల్లో అది ‘‘భారతీయ టీనేజర్లలో పెరిగిపోయిన ఊబకాయం’’ అనే నివేదికను కూడా ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గత ఐదేళ్ల కాలంలో స్థూలకాయులైన టీనేజర్లు 13% నుంచి 15%కి పెరిగింది. ఆ కథనంలోని ఈ రెండు వాక్యాలను చూడండి : ‘‘భారత పట్టణాల్లో 1.5 కోట్ల మంది పిల్లలు అధిక బరువుగలవారని అంచనా. అయితే గ్రామీణ భారతంలో ఇది బాగా తక్కువే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.’’ ఇదేంటిలా అని ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. పట్టణాల స్థాయిలో హామ్‌బర్గర్లను తినగలిగేటంత మిగులు ఆదాయం గ్రామీణ భారతం వద్ద లేదు, అంతే.
పేదరికానికి జవాబు వాగాడంబరం కాదు, కావాల్సింది పరిష్కారం. కేంద్రం తలపెట్టిన మూడు పథకాలు ఆశలను రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున చేపట్టిన గృహనిర్మాణం, పట్టణ పునరుజ్జీవం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు దేశంలోని పట్టణాల పటం రూపు రేఖలను మార్చడం కోసం మాత్రమే కాదు. అవి భారీ ఉపాధి కర్మాగారాలు కూడా. నిర్మాణ రంగం పేదలకు భారీ ఎత్తున ఉపాధిని కల్పించగలుతుంది. ఏడాదికి రూ.12 అతి తక్కువ ప్రీమియంతో బీమా పాలసీలు ఎక్కువగా అవసరమైన వారికే సహాయాన్ని అందించడం కోసం ఉద్దేశించిన సానుకూల ప్రభుత్వ జోక్యం. మరుగుదొడ్ల నిర్మాణ కృషి వంటి ఆత్మగౌరవ పథకాలు జీవన నాణ్యతలో తక్షణమే మార్పును తేగలిగినవి. మన ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం లేదా చొరబడిపోయేదిగా ఉండటం మాత్రమే ఎక్కువ. అది సమ్మిళితమైనదిగా మారాలి.
గత ప్రభుత్వాలు పేదరికాన్ని సవాలు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఎవరూ అనరు. అవి ఆ ప్రయత్నాలు చేశాయి. కాకపోతే ఆ తక్షణ ఆవశ్యకతను గుర్తించడంలో, స్థాయిలో తేడా ఉంది. పేదరికాన్ని తగ్గించడం, నిర్మూలించడం అనే లక్ష్యాల్లో తేడా ఉంది. ఆకలితో ఉన్నవారు బాగా ఎక్కువ కాలమే వేచి చూశారు, చాలు. కొద్దిమంది భారీ సంపన్నుల చేతుల్లో సంపద పోగుబడటం పెరిగిపోతుండటం ప్రజల అసంతృప్తిని కుతకుతలాడే ఆగ్రహమయ్యేలా వేడెక్కించేస్తోంది. నేటి పెద్దగా ఖర్చులేని కమ్యూనికేషన్ల కాలంలో అసమానతను, అన్యాయాన్ని కప్పిపుచ్చలేరు. చరిత్ర వేచి చూసే గదిలో పేదలు సుదీర్ఘంగానే నిరీక్షించారు. వారికిక ఉద్యోగాలు, విద్య, న్యాయం, గౌరవం కావాలి. లేదంటే వారి ఆగ్రహం పెల్లుబుకుతుంది.
(వ్యాసకర్త: ఎంజే అక్బర్, సీనియర్ సంపాదకులు)