biline
-
వాతావరణ మార్పు ఆహ్లాదకరం
బైలైన్ ప్రజా చర్చలోకి భయాన్ని ప్రవేశపెట్టి, పరస్పర విద్వేషాగ్నిని రగిల్చే శక్తి యుద్ధోన్మాదులకు ఉంది. అదే భారత్-పాక్ చర్చలకు ప్రమాదకరమైన అడ్డంకి. మోదీ లాహోర్ సందర్శన ముందస్తు సన్నాహంతో వచ్చిన ‘వాతావరణంలోని మార్పు’ కావడంలోనే ఉన్నది అసలు నైపుణ్యమంతా. ఒక్కోసారి చరిత్రంటే కొన్ని ప్రాధాన్యంగల ఘటనల సమా హారమేననిపిస్తుంది. కాబూల్ నుంచి ఢిల్లీకి వెళ్తూ హఠాత్తుగా లాహోర్‌లో ‘‘దిగాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణ యించుకోవడం లాంటి అద్భుత ఘటనలు అతి కొన్నే ఉంటాయి. ఆయన పాకిస్తాన్లో దిగి, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటి శుభకార్యానికి వెళ్లిరావడం అక్షరాలా హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టే జరిగింది. ఈ వ్యక్తీకరణ ఆ ఘటనకున్న రాజకీయ పార్శ్వాన్ని కూడా చక్కగా వర్ణిస్తుంది. దీని ప్రభావం ఉపఖండాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణం... అది అనూహ్యమైనది, అసాధారణమైనది కావడమే కావచ్చు. అటూ ఇటూ కూడా ఎంతో ధైర్యం, ఊహాత్మకత, నైపుణ్యం అవసరమైన అద్భుత దౌత్య విజయం ఇది. లేకపోతే అనిశ్చితితో ఉండే పాక్ ప్రధాని నవాజ్ ఒక టెలిఫోన్ సంభాషణలో ఆహ్వానాన్ని ఇమిడ్చి ఉండేవారూ కారు, ఆత్మవిశ్వాసం కొరవడిన మన ప్రధాని మోదీ దాన్ని ఆమోదించి ఉండేవారు కారు. సమస్యాత్మకమైన భారత్-పాక్ సంబంధాల కథనంలో ఓ నూతనాధ్యా యాన్ని లిఖించడం ఒక్క రచయిత వల్ల కాని పని. ఇద్దరు రచయితల అవగాహనా ఒకేలా ఉండాల్సి ఉంటుంది. దీని ఫలితం తక్షణమే కనిపించింది. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉంటుందనే నమ్మకం ఇద్దరు నేతలకూ ఉండి ఉంటుందనడంలో అనుమానమే లేదు. కానీ దానికి లభించిన సానుకూల స్పందన స్థాయి ఇంతగా ఉంటుందని మాత్రం భావించలేదు. రెండు దేశాల మధ్య గత శతాబ్దిలో జరిగిన సంఘర్షణల ఫలితంగా ప్రజల జీవితాల్లో కొరవడ్డ పరస్పర సాంస్కృతిక, బంధుత్వ సంబంధాలను అది పునరావిష్కరించింది. ఎప్పుడో అరుదుగా తప్ప యుద్ధానికి సహేతుకమైన కారణమంటూ లేకపోవడం మానవ ప్రవృత్తిలోని వింత వాస్తవం. ఉపఖండంలోని ప్రజలు యుద్ధం అంటే విసిగిపోయారు. శాంతి వల్ల కలిగే అపార ప్రయోజనాలను గురించి చాలా మంది నేతలకంటే వారికే ఎక్కువ తెలుసు. శాంతి కావాలనే కాంక్ష ఉన్నంత మాత్రాన అది లభించేది కాకపోవడం విషాదకరం. యుద్ధం సాగించడాని కంటే శాంతిని నిలిపి ఉంచడం కోసం ఎక్కువ జాగ్రత్త వహించాల్సి ఉంటుందనేదీ నిజమే. 2014లో తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ (దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంస్థ) నేతలందరినీ ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ తన పదవీ బాధ్యతలను ప్రారంభించారు. తద్వారా ఆయన ఇలాంటి మరో పరిణామాత్మక ప్రాధాన్యంగల ఘటనకు కారకులయ్యారు. అయితే అది స్వార్థ ప్రయోజ నాల కింద సమాధైపోయింది. భారత్ -పాక్ సంబంధాల లో ఇంత త్వరగా మరో ఆరంభం సాధ్యం కావడం అద్భుతమే. ఈ ప్రక్రియకు ద్రోహం చేసేవారితో వ్యవహరి స్తూనే, ఈ సంబంధాలను పట్టిపీడిస్తున్న సంక్లిష్ట సమస్యల పై మధ్యంతరమైన అవ గాహననైనా ఏర్పరచుకోవడానికి కొంత సమయం, ఓపిక అవసరం. ఇప్పటికే ఒక తీవ్రవాదుల కూటమి నవాజ్‌ను కూలదోయాలని చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కలయిక వల్ల కలిగే ప్రమాదాలేమిటో ఆయనకు తెలుసు. అయితే, పాక్ సైన్యం కూడా ఆయన వెంట ఉన్నదని అనుకోవాల్సి ఉంటుంది. పాక్ ప్రధాన స్రవంతి పార్టీలన్నీ ఈ విషయంలో ఆయనకు మద్దతుగా ఉండటం కూడా అంతే ప్రోత్సాహదాయకమైన వాస్తవం. మన దేశంలో ప్రజలు ప్రధాని వెంటే ఉన్నా, కాంగ్రెస్ లాంటి పార్టీలు దురదృష్టవశాత్తూ జాతీయ ప్రయోజనాలకు, పక్షపాత పూరిత రాజకీయాలకు మధ్య రేఖను గీయలేక, యథా లాపంగా విమర్శిస్తున్నాయి. ఆ పార్టీల నేతల వ్యాఖ్యలు పూర్తి పిల్లతనంతో కూడినవి కావడంలో ఆశ్చర్యం లేదు. మార్క్సిస్టు పార్టీలు చూపిన పరిణతితో దీన్ని పోల్చి చూడండి. సీపీఐ, సీపీఎంలు రెండూ ఆయన చూపిన ఈ చొరవనూ, సంఘర్షణ అనే విషపూరితమైన ఊబి నుంచి తలెత్తిన అవకాశాన్నీ స్వాగతించాయి. ఇలాంటి ప్రాధాన్యంగల ఘటనలు జోస్యవేత్త చక్రం నుంచో ఇంద్రజాలికుని టోపీలోంచో బయటపడేవి కావు. సామెత చెప్పినట్టూ, ఆ జరగాల్సిన క్షణంలోనే అది హఠాత్తుగా ఫలిస్తుంది. అయితే అంతకు ముందే ఎప్పుడో విత్తనాలను నాటి, జాగరూకతతో కూడిన దౌత్యమనే ఎరువును వేసి ఉండాలి. ఈ ఏడాది జూలైలో ఇరువురు నేతలు రష్యాలోని ఊఫాలో సమావేశమైన ప్పుడే దీనికి సన్నాహక కృషి జరిగి ఉండాలి. నవంబర్ 30న పారిస్‌లో దానికి ఎరువు వేసి ఉంటారు. బ్యాంకాక్‌లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు కలుసుకున్నప్పుడే తొలి పచ్చదనం కనిపించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ డిసెంబర్లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన ‘‘హార్ట్ ఆఫ్ ఆసియా’’ మంత్రుల సదస్సు సందర్భంగా నవాజ్ షరీప్‌ను కలుసున్నప్పుడు అది మొలకెత్తింది. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పదవుల్లోకి వచ్చే రాజకీయవేత్తలు ప్రజల హృదయ స్పందనలను, మనోభా వాలను అర్థం చేసుకోవాలి. అదే వారి గొప్ప బలం. వాతావరణాన్ని పరిపక్వం చెందించాల్సిన ఆవశ్యకతను కూడా వారు అర్థం చేసుకుంటారు. ప్రజా చర్చలోకి భయా న్ని ప్రవేశపెట్టి, పరస్పర విద్వేషాల దావానలాన్ని రగల్చ గలిగే శక్తి యుద్ధోన్మాదులకు ఉంది. అదే భారత్-పాక్ చర్చలకు ప్రమాదకరమైన అడ్డంకిగా ఉంటూ వస్తోంది. ఇది ముందస్తు సన్నాహంతో వచ్చిన ‘వాతావరణంలోని మార్పు’ కావడంలోనే ఉన్నది అసలు నైపుణ్యమంతా. ఈ క్రమమంతా వచ్చే ఏడాది పాక్‌లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడంగా పరిణమిస్తుందని ఆశించవచ్చు. మనం ఓ విష వలయంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు ఏం చేయాలి? అనే చిరకాల ప్రశ్నకు పాత సూఫీ సమాధానం ఒకటుంది. సంప్రదాయకంగా చెప్పే జవాబైతే ఆ విషవలయాన్ని బద్దలుకొట్టి బయటపడాలంటుంది. సూఫీలది అందుకు భిన్నమైన వైఖరి. మరింత పెద్ద వలయాన్ని గీస్తే, యుక్తిగా కదిలే వెసులుబాటు మనకు లభిస్తుందని వారంటారు. సార్కే ఆ పెద్ద వృత్తం. (వ్యాసకర్త : ఎంజే అక్బర్ బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ) -
దురదృష్టానికి ఆహ్వానమా?
పాక్‌తో చర్చలంటే ఎప్పుడూ అద్దం మీద నడకే. ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదు. మంచే జరగాలని ఆశిస్తూనే అతి కీడుకైనా సిద్ధంకావాలి. మోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిననాడే ఆయన వైఖరిని పాక్ ప్రభుత్వం అంగీకరించిందనేది ఇబ్బందికరమైన నిజం. మోదీ వచ్చే ఏడాది పాక్‌లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరుకావడానికి అంగీకరించారు. అది జరిగితే, సార్క్ చరిత్రలోనే శిఖరాయమానంగా నిలుస్తుంది. ఆలోగా జరిగే ఎన్ఎస్ఏల సమావేశం ఆ నిచ్చెనలోని మొదటి మెట్టు అనే ముఖ్య విషయాన్ని పాక్ మరిచిపోకూడదు. భారత్-పాకిస్తాన్ చర్చలు, 2001 ఆగ్రా సమావేశంలో తీవ్రంగా దెబ్బతిన్నప్పటి నుంచి అపస్మారస్థితిలోనే ఉన్నాయి. 2015లో పరిస్థితి మరింత ఘోరంగా దిగజారనుందా? ఉగ్రవాదమే ద్వైపాక్షిక సంబం ధాల్లోని కేంద్ర సమస్యని పాకిస్తాన్ అంగీకరించకపోవడం వల్లనే ఆగ్రా చర్చలు కుప్పకూలాయి. అలా అంగీకరించడమంటే తనపైన తానే నేరారోపణ చేసుకున్నట్టవుతుంది కాబట్టే పాక్ అందుకు నిరాకరిం చింది. చర్చల ఎజెండాపై తలెత్తే ప్రతి వివాదంలోనూ ‘కశ్మీర్ సమస్యను కూడా చర్చించాలి, లేకపోతే...!’ అనే మాట పాక్ నోట రావడమే దాని దాటవేత యత్నానికి విస్పష్టమైన రుజువు. గత 15 ఏళ్లుగా భాష పెద్దగా మారలేదేమో అనిపిస్తుంది. భారత్ కశ్మీర్ సమస్యను చర్చించకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో దానికి త్వరలోనే తెలిసివస్తుందని సాత్రాజ్ నవాజ్ పాక్‌లోని ఓ పత్రికా సమావేశంలో అన్నారు. మరోవిధంగా చెప్పాలంటే, హింసాకాండను ప్రజ్వరిల్ల చేసే మీట పాక్ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నదని, అది తన ఆదేశానుసారం ఎప్పుడు కావాలంటే అప్పుడు హింసాకాండ రేగడం లేదా ఆగడం అనేదాన్ని నియంత్రించగలదని అర్థం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్‌గానీ, పాక్‌గానీ 15 ఏళ్ల క్రితం ఎక్కడున్నాయో అక్కడ లేవు. నేటి పరిస్థితుల్లో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌తో వ్యవహరించేటప్పుడు పాక్ అనుసరించే వైఖరిని అలం కారికంగా పోలికకు తెచ్చే వెయ్యి తలల (హైడ్రా) వైఖరి సుపరిచితమైనదే. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమస్య కూడా అదే. ఇక్కడ ఆ పోలికకు ప్రాముఖ్యం ఉంది. గ్రీక్ పౌరాణిక గాథల్లో హైడ్రా అంటే ఒక తలను నరికితే రెండు తలలు పుట్టుకొచ్చే జల సర్పం. హెర్క్యులిస్ దీనికి పరిష్కారం కనిపెట్టాడు. ఆ పాము తలను తెగనరికి, దాని మెడను తగులబెట్టేశాడు. ఆ పని చేయగల హెర్క్యులిస్ ఎవరూ ఇప్పుడు అందుబాటులో లేరు. ఎందుకంటే నేటి ఈ ఉగ్రవాద సర్పం పాక్ సైన్యంలోని శక్తివంతమైన విభాగాలు పోసే పాలు తాగి బతుకుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా మరో రూపంలో యుద్ధం సాగిస్తున్న ఉగ్రవాద గ్రూపులకున్న విస్తారమైన మౌలికసదుపాయాల సురక్షిత స్థావరాల్లో అది హాయిగా నిదురించగలు గుతోంది. ప్రధానిగా గత పదవీకాలంలో నవాజ్ షరీ్‌ఫ్ చిత్తశుద్ధితోనే భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అటల్ బిహారీ వాజపేయితో లాహోర్ సమావేశం జరిపారు. అయితే దాని వెంబడే కార్గిల్ యుద్ధం వచ్చింది. రష్యాలోని ఉఫాలో జరిగిన సమావేశంలో అంతకంటే తక్కువ నాటకీయంగా కుదిరిన అవగాహనకు వ్యతిరేకంగా అదే ముఠా నేడు సీమాంతర ఉగ్రవాదం, కాల్పుల విరమణ ఉల్లంఘనలు తీవ్రమయ్యేలా రెచ్చగొడుతోంది. హైడ్రాను సంతృప్తిపరచే యత్నంలో భాగంగా నవాజ్ షరీఫ్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) సత్రాజ్ అజీజ్ ... భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌తో తన సమావేశం కోసం రూపొందించిన ఎజెండాలో క శ్మీర్‌ను కూడా పేర్కొన్నారంటూ వాస్తవాలను వక్రీకరించడానికి దిగజారారు. కానీ ఉఫా ఉమ్మడి ప్రకటన పాఠంలో ఎక్కడా కశ్మీర్ ప్రస్తావనే లేదు. ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని అంశాలను చర్చకు పెట్టడమంటే దాని అంతరార్థం కశ్మీర్ కూడా వాటిలో ఉంటుందనేనని పాక్ ఇప్పుడు అంటోంది. కానీ అలాంటి ఉమ్మడి ప్రకటనలను అంతరార్థాలతో కూడినవిగా ఎన్నడూ రూపొందించరు. వాటిలో ప్రయోగించే ప్రతి పదం స్పష్టంగా వ్యక్తం చేసే అర్థాన్నిచ్చేదే అయివుంటుంది. కాబట్టి ప్రతి పదంపైనా పోరాటం జరుగుతుంది. కశ్మీర్‌ను ఆ ప్రకటనలో పేర్కొనలేదూ అంటే అది ఎజెండాలో లేదనే. భారత్, పాకిస్తాన్ల విషయంలో ‘‘చర్చల’’కు కచ్చితమైన అర్థం ఉంది, ఇరుపక్షాలు ‘‘సమగ్ర’’ చర్చలుగా పిలిచే వాటికి అంగీకరించాయి. అలాంటి చర్చలు కశ్మీర్ సహా అన్ని సమస్యలను ఆవరించేవిగానే ఉంటాయి, నిజమే. ఆ ఒప్పుదల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నడూ వెన క్కు తగ్గింది లేదు. కానీ అజిత్ దోవల్-సత్రాజ్ అజీజ్ సమావేశం ఆ సమగ్ర చర్చల్లో భాగం కాదు. అది ఒక అంతర్జాతీయ సమావేశం సందర్భంగా మోదీ, నవాజ్‌ల మధ్య విడిగా జరిగిన సంభాషణ నుంచి ఉత్పన్నమైనది. ఉగ్రవాదం పట్ల తీవ్ర ఆందోళన అనే నిర్దిష్ట అంశానికి పరిమితమైనది. కశ్మీర్ మరే మూడో శక్తి (అది విదేశమే అయినా లేదా తమను భారతీయులుగా భావించని ఇతరులు ఎవరైనా) ప్రమేయమూ లేని ద్వైపాక్షిక సమస్య మాత్రమే అనేదే భారత ప్రభుత్వ వైఖరి. ఎన్ఎస్ఏల మధ్య సమావేశం తిరిగి సమగ్ర చర్చలు జరగడానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి రూపొందించినది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో పాకిస్తాన్ నిజాయితీగా ఉన్నట్టయితే... ఉగ్రవాదాన్ని పెంపొందింపజేసేవారు లేదా దాని పట్ల సానుభూతి చూపేవారైన వేర్పాటువాదులకు మద్దతుగా అది సంకేతాలను పంపజాలదు. అలాంటి ధిక్కార విధానం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేదే తప్ప, ముందు జరగాల్సి ఉన్న విస్తృత చర్చలకు సానుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సన్నద్ధం చేయడానికి తోడ్పడేది కాదు. ఏ భారత ఎన్ఎస్ఏనో లేదా విదేశాంగశాఖ కార్యద ర్శో ఇస్లామాబాద్‌లో సమావేశానికి ముందు బలూచీ వేర్పాటువాదులను కలుసుకోవాలని పట్టుబడితే పాక్ దాన్ని హర్షిస్తుందా? ఇది రాస్తున్నప్పటికి దఢాలున తలుపులు కొట్టుకున్నాయే తప్ప పూర్తిగా మూసుకుపోలేదు. పాక్‌తో చర్చలంటే ఎప్పుడూ అద్దం మీది నడకే. ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదు. మంచే జరగాలని ఆశిస్తూనే అతి కీడు జరిగినా సరేనని సంసిద్ధం కావాలి. నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిననాడే ఆయన ప్రభుత్వపు ఈ వైఖరిని పాక్ ప్రభుత్వం అంగీకరించిందనే ఇబ్బందికరమైన నిజాన్ని చెప్పడానికి ఇది అనువైన సమయం కాకపోవచ్చు. భారత-పాక్ చర్చల్లో ఇది ఆందోళన కరమైన కీలక సమయం. ఉఫా సమావేశాల సందర్భంగా నవాజ్ షరీఫ్, నరేంద్ర మోదీని వచ్చే ఏడాది పాక్ లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. మన ప్రధాని అందుకు అంగీకరించారు. ఆ పర్యటన జరిగితే, సార్క్ చరిత్రలోనే అదో అత్యున్నత శిఖరమవుతుంది.ఆ లోగా జరిగే ఎన్ఎస్ఏల మధ్య సమావేశం ఆ కష్టభరితమైన నిచ్చెనలోని మొదటి మెట్టు అనే ముఖ్య విషయాన్ని మరచిపోకూడదు. ప్రతి మెట్టు గురించి జాగ్రత్తగా చర్చించాల్సి ఉంది. అతి కీలక వ్యక్తి దావూద్ ఇబ్రహీం సహా పాక్‌లోని ఉగ్రవాదులందరి పూర్తి సమాచారాన్ని భారత్ అందిస్తుంది. కాకపోతే భారత్ ఆందోళనలతో పాటూ, దాని సైన్యానికి నిధులను అందించే అమెరికా ఆందోళనలు సైతం ఉపశమించేలా అది కార్యాచరణకు దిగాలి. ఇప్పటికి, 2016కు మధ్య పలుమార్లు కిందామీదా పడటం జరగొచ్చు. కానీ నిచ్చెన మొదటి మెట్టు మీది నుంచే జారి పడిపోతే మాత్రం అది దురదృష్టానికి సాదరంగా ఆహ్వానం పలకడమే అవుతుంది. (వ్యాసకర్త: ఎంజె అక్బర్, పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) -
మనం చూడదలుచుకోని నిజం
1947లో ఎక్కడ ప్రారంభించామనే కొలబద్ధతో గాక, 2015కి ఎక్కడికి చేరి ఉండాల్సింది అనే కొలబద్ధతో దేశ ఆర్థిక ఆరోగ్యం, సామాజిక న్యాయం ప్రమాణాలను లెక్కించాల్సి ఉంది. అలా చూస్తే మనమిప్పుడున్నది సంక్షోభపు అంచున కాదు, మహా విపత్తుకు అంచున. సావధానులుకండి. మన వైఫల్యం కషాయపు అడుగు అవశేషాల కటిక చేదు విషయమిది. దేశంలో సగ భాగం ఆకలికి, అర్ధాకలికి మధ్యన ఇరుక్కుని, శిఖరాగ్రానున్న ఐదో వంతు తమ సంతోషాల బుడగలో మహా ఉల్లాసంగా గడుపుతున్నారు. నడమన పీల్చిపిప్పయిపోతున్న మధ్య భాగం గందరగోళంతో, అనిశ్చితంగా... టీవీ సీరియళ్లు తినిపించే ఆశావహ దృక్పథానికి, వీధి తిరుగుబాటు వెల్లువలకు మధ్య తెగ ఊగిసలాడుతోంది. 2015నాటి భారతావని గురించిన ఈ సత్యాలు అత్యంత సమగ్రంగా నిర్వహించిన సామాజిక-ఆర్థిక గణన నుంచి తీసుకున్నవి. అవి సంతృప్తితో కళకళలాడే అతి సుసంపన్న వర్గీయుల సౌందర్యసాధనాలతో అలంకరించి చూపెడుతున్న భారతావని మొహానికి పెద్ద చెంపపెట్టు. దేశంలో ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నవారే. దీన్ని సబ్‌సహారా (సహారా ఎడారికి దక్షిణాన ఉన్న) దేశాల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరితో పోల్చి చూడండి. మన దేశంలో 51%కి శారీరక శ్రమతో కుంగిపోవడమే ఏకైక ఆదాయ వనరు. శారీరక శ్రమంటే జీవనాధార స్థాయి మనుగడకు సమానార్థకం. కాబట్టే నేను ఉద్దేశపూర్వకంగానే శారీరక శ్రమ అన్నాను. 92%గ్రామీణ కుటుంబాలు నెలకు రూ.10,000 కంటే తక్కువతోనే జీవిస్తున్నాయి. వ్యక్తులు కాదు, కుటుంబాలే. మరీ నగ్నంగా చెప్పాలంటే ఇంచుమించు 75 శాతం కుటుంబాలు నెలకు రూ. 5,000 లేదా అంతకంటే తక్కువతోనే బతుకుతున్నాయి. ఈ సర్వే పొడవునా ఒకదాన్ని మించి మరొకటి మరింతగా ఎక్కువ ఆందోళనకరమైన ఇలాంటి గణాంకాల మరకలే ఉన్నాయి. కావాలనుకుంటే, పిల్లల్లో పోషకాహార లోపం 45.1% నుంచి 30.7%కి తగ్గిందని మీరు ఉపశమమంపొందొచ్చు. కానీ దైన్యం నిండిన తల్లుల కళ్లు నిస్సహాయంగా చూస్తుండగానే దారిద్య్రానికి హరించుకుపోతున్న ప్రతి మూడో శిశువు ముందు ఇలాంటి ప్రలాపనలను చేయడం మూర్ఖత్వం. బహుశా ఆ తల్లులు సైతం అప్పటికే తమ పిల్లలంత దుర్బలంగా ఉండి ఉంటారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం దేశంలో 30% మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నదంటూ ఒక బూటకపు అంచనాను చలామణి చెయ్యాలని యత్నించింది. ఎన్నికల రాజకీయల సేవలో దారిద్య్ర రేఖను మరికాస్త మింగుడుపడేలా చేయడం కోసం ప్రదర్శించిన గణాంకాల గారడీ అది. 1947లో మనం ఎక్కడ ప్రారంభించామనే కొలబద్ధతో గాక, 2015కి మనం ఎక్కడికి చేరి ఉండాల్సింది అనే కొలబద్ధతో మన దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని సామాజిక న్యాయం ప్రమాణాలను లెక్కించాల్సి ఉంది. అలా చూస్తే మనమిప్పుడున్నది సంక్షోభపు అంచున కాదు, మహా విపత్తుకు అంచున. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఉపాధుల కోసం తమ హక్కుల పట్ల విశ్వాసంతో ఉన్న ప్రజలు తరాలతరబడి ఇంకా ఎదురు చూడ లేరు. ఆగ్రహావేశానికి అత్యంత శక్తివంతమైన కారణం ఆకలి. కోట్లాది మంది ప్రజలు ఇంకా తలదాచుకోను గూడూ, ఎలాంటి గౌరవమూ, ఏ ఆశా లేక బతుకుతున్నారు. పేదరిక సూచికకు కొలబద్ధగా ప్రపంచం సబ్ సహారన్ ఆఫ్రికాను స్వీకరించింది. కానీ అదొక భ్రమ. మన దక్షిణ ఆసియా ఉపఖండమే నిజానికి పేదరికానికి సరైన నమూనా. అదేపనిగా ఇతరుల్ని చూడటమంటే మనకు మహా ఇష్టం. ఒక్కసారి అద్దంలో మనల్ని మనం తేరిపార చూసుకోవడం అవసరం. మనకది చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. మీకు అంతరాత్మంటూ ఉంటే ఆందోళన కూడా కలుగుతుంది. అయినా మనకు సంతృప్తి కలగడానికి రెండు కారణాలున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వాస్తవాలను మీడియా ముందుంచేటప్పుడు కుంటిసాకులతో వాటిని సుతి మెత్తగా మార్చే ప్రయత్నించలేదు. పరిష్కారం దిశగా వేసే తొలి అడుగు సమస్యను గుర్తించడమే. నాటకీయతకు ప్రాధాన్యం ఇచ్చి వాస్తవాలను బలిపీఠంపైకి ఎక్కించేస్తుందని మీడియా అతి తరచుగా విమర్శలను ఎదుర్కొంటుంది. కానీ అది ఈ చే దు వాస్తవాల విస్తృతిని, లోతును అర్థం చేసుకున్నాయి. దినపత్రికలు మొదటి పేజీ బ్యానర్ హెడ్డింగులు పెట్టాయి. ఆలోచించదగిన ఈ పోలికను చూడండి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఈ సర్వేపై పలు కథనాలను ప్రచురించిన రోజున లోపలిపేజీల్లో అది ‘‘భారతీయ టీనేజర్లలో పెరిగిపోయిన ఊబకాయం’’ అనే నివేదికను కూడా ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గత ఐదేళ్ల కాలంలో స్థూలకాయులైన టీనేజర్లు 13% నుంచి 15%కి పెరిగింది. ఆ కథనంలోని ఈ రెండు వాక్యాలను చూడండి : ‘‘భారత పట్టణాల్లో 1.5 కోట్ల మంది పిల్లలు అధిక బరువుగలవారని అంచనా. అయితే గ్రామీణ భారతంలో ఇది బాగా తక్కువే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.’’ ఇదేంటిలా అని ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. పట్టణాల స్థాయిలో హామ్బర్గర్లను తినగలిగేటంత మిగులు ఆదాయం గ్రామీణ భారతం వద్ద లేదు, అంతే. పేదరికానికి జవాబు వాగాడంబరం కాదు, కావాల్సింది పరిష్కారం. కేంద్రం తలపెట్టిన మూడు పథకాలు ఆశలను రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున చేపట్టిన గృహనిర్మాణం, పట్టణ పునరుజ్జీవం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు దేశంలోని పట్టణాల పటం రూపు రేఖలను మార్చడం కోసం మాత్రమే కాదు. అవి భారీ ఉపాధి కర్మాగారాలు కూడా. నిర్మాణ రంగం పేదలకు భారీ ఎత్తున ఉపాధిని కల్పించగలుతుంది. ఏడాదికి రూ.12 అతి తక్కువ ప్రీమియంతో బీమా పాలసీలు ఎక్కువగా అవసరమైన వారికే సహాయాన్ని అందించడం కోసం ఉద్దేశించిన సానుకూల ప్రభుత్వ జోక్యం. మరుగుదొడ్ల నిర్మాణ కృషి వంటి ఆత్మగౌరవ పథకాలు జీవన నాణ్యతలో తక్షణమే మార్పును తేగలిగినవి. మన ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం లేదా చొరబడిపోయేదిగా ఉండటం మాత్రమే ఎక్కువ. అది సమ్మిళితమైనదిగా మారాలి. గత ప్రభుత్వాలు పేదరికాన్ని సవాలు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఎవరూ అనరు. అవి ఆ ప్రయత్నాలు చేశాయి. కాకపోతే ఆ తక్షణ ఆవశ్యకతను గుర్తించడంలో, స్థాయిలో తేడా ఉంది. పేదరికాన్ని తగ్గించడం, నిర్మూలించడం అనే లక్ష్యాల్లో తేడా ఉంది. ఆకలితో ఉన్నవారు బాగా ఎక్కువ కాలమే వేచి చూశారు, చాలు. కొద్దిమంది భారీ సంపన్నుల చేతుల్లో సంపద పోగుబడటం పెరిగిపోతుండటం ప్రజల అసంతృప్తిని కుతకుతలాడే ఆగ్రహమయ్యేలా వేడెక్కించేస్తోంది. నేటి పెద్దగా ఖర్చులేని కమ్యూనికేషన్ల కాలంలో అసమానతను, అన్యాయాన్ని కప్పిపుచ్చలేరు. చరిత్ర వేచి చూసే గదిలో పేదలు సుదీర్ఘంగానే నిరీక్షించారు. వారికిక ఉద్యోగాలు, విద్య, న్యాయం, గౌరవం కావాలి. లేదంటే వారి ఆగ్రహం పెల్లుబుకుతుంది. (వ్యాసకర్త: ఎంజే అక్బర్, సీనియర్ సంపాదకులు)