వాతావరణ మార్పు ఆహ్లాదకరం
బైలైన్
ప్రజా చర్చలోకి భయాన్ని ప్రవేశపెట్టి, పరస్పర విద్వేషాగ్నిని రగిల్చే శక్తి యుద్ధోన్మాదులకు ఉంది. అదే భారత్-పాక్ చర్చలకు ప్రమాదకరమైన అడ్డంకి. మోదీ లాహోర్ సందర్శన ముందస్తు సన్నాహంతో వచ్చిన ‘వాతావరణంలోని మార్పు’ కావడంలోనే ఉన్నది అసలు నైపుణ్యమంతా.
ఒక్కోసారి చరిత్రంటే కొన్ని ప్రాధాన్యంగల ఘటనల సమా హారమేననిపిస్తుంది. కాబూల్ నుంచి ఢిల్లీకి వెళ్తూ హఠాత్తుగా లాహోర్‌లో ‘‘దిగాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణ యించుకోవడం లాంటి అద్భుత ఘటనలు అతి కొన్నే ఉంటాయి. ఆయన పాకిస్తాన్‌లో దిగి, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటి శుభకార్యానికి వెళ్లిరావడం అక్షరాలా హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టే జరిగింది. ఈ వ్యక్తీకరణ ఆ ఘటనకున్న రాజకీయ పార్శ్వాన్ని కూడా చక్కగా వర్ణిస్తుంది. దీని ప్రభావం ఉపఖండాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణం... అది అనూహ్యమైనది, అసాధారణమైనది కావడమే కావచ్చు.
అటూ ఇటూ కూడా ఎంతో ధైర్యం, ఊహాత్మకత, నైపుణ్యం అవసరమైన అద్భుత దౌత్య విజయం ఇది. లేకపోతే అనిశ్చితితో ఉండే పాక్ ప్రధాని నవాజ్ ఒక టెలిఫోన్ సంభాషణలో ఆహ్వానాన్ని ఇమిడ్చి ఉండేవారూ కారు, ఆత్మవిశ్వాసం కొరవడిన మన ప్రధాని మోదీ దాన్ని ఆమోదించి ఉండేవారు కారు. సమస్యాత్మకమైన భారత్-పాక్ సంబంధాల కథనంలో ఓ నూతనాధ్యా యాన్ని లిఖించడం ఒక్క రచయిత వల్ల కాని పని. ఇద్దరు రచయితల అవగాహనా ఒకేలా ఉండాల్సి ఉంటుంది.
దీని ఫలితం తక్షణమే కనిపించింది. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉంటుందనే నమ్మకం ఇద్దరు నేతలకూ ఉండి ఉంటుందనడంలో అనుమానమే లేదు. కానీ దానికి లభించిన సానుకూల స్పందన స్థాయి ఇంతగా ఉంటుందని మాత్రం భావించలేదు. రెండు దేశాల మధ్య గత శతాబ్దిలో జరిగిన సంఘర్షణల ఫలితంగా ప్రజల జీవితాల్లో కొరవడ్డ పరస్పర సాంస్కృతిక, బంధుత్వ సంబంధాలను అది పునరావిష్కరించింది. ఎప్పుడో అరుదుగా తప్ప యుద్ధానికి సహేతుకమైన కారణమంటూ లేకపోవడం మానవ ప్రవృత్తిలోని వింత వాస్తవం. ఉపఖండంలోని ప్రజలు యుద్ధం అంటే విసిగిపోయారు. శాంతి వల్ల కలిగే అపార ప్రయోజనాలను గురించి చాలా మంది నేతలకంటే వారికే ఎక్కువ తెలుసు.
శాంతి కావాలనే కాంక్ష ఉన్నంత మాత్రాన అది లభించేది కాకపోవడం విషాదకరం. యుద్ధం సాగించడాని కంటే శాంతిని నిలిపి ఉంచడం కోసం ఎక్కువ జాగ్రత్త వహించాల్సి ఉంటుందనేదీ నిజమే. 2014లో తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ (దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంస్థ) నేతలందరినీ ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ తన పదవీ బాధ్యతలను ప్రారంభించారు. తద్వారా ఆయన ఇలాంటి మరో పరిణామాత్మక ప్రాధాన్యంగల ఘటనకు కారకులయ్యారు.
అయితే అది స్వార్థ ప్రయోజ నాల కింద సమాధైపోయింది. భారత్ -పాక్ సంబంధాల లో ఇంత త్వరగా మరో ఆరంభం సాధ్యం కావడం అద్భుతమే. ఈ ప్రక్రియకు ద్రోహం చేసేవారితో వ్యవహరి స్తూనే, ఈ సంబంధాలను పట్టిపీడిస్తున్న సంక్లిష్ట సమస్యల పై మధ్యంతరమైన అవ గాహననైనా ఏర్పరచుకోవడానికి కొంత సమయం, ఓపిక అవసరం. ఇప్పటికే ఒక తీవ్రవాదుల కూటమి నవాజ్‌ను కూలదోయాలని చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కలయిక వల్ల కలిగే ప్రమాదాలేమిటో ఆయనకు తెలుసు.
అయితే, పాక్ సైన్యం కూడా ఆయన వెంట ఉన్నదని అనుకోవాల్సి ఉంటుంది. పాక్ ప్రధాన స్రవంతి పార్టీలన్నీ ఈ విషయంలో ఆయనకు మద్దతుగా ఉండటం కూడా అంతే ప్రోత్సాహదాయకమైన వాస్తవం. మన దేశంలో ప్రజలు ప్రధాని వెంటే ఉన్నా, కాంగ్రెస్ లాంటి పార్టీలు దురదృష్టవశాత్తూ జాతీయ ప్రయోజనాలకు, పక్షపాత పూరిత రాజకీయాలకు మధ్య రేఖను గీయలేక, యథా లాపంగా విమర్శిస్తున్నాయి. ఆ పార్టీల నేతల వ్యాఖ్యలు పూర్తి పిల్లతనంతో కూడినవి కావడంలో ఆశ్చర్యం లేదు. మార్క్సిస్టు పార్టీలు చూపిన పరిణతితో దీన్ని పోల్చి చూడండి. సీపీఐ, సీపీఎంలు రెండూ ఆయన చూపిన ఈ చొరవనూ, సంఘర్షణ అనే విషపూరితమైన ఊబి నుంచి తలెత్తిన అవకాశాన్నీ స్వాగతించాయి.
ఇలాంటి ప్రాధాన్యంగల ఘటనలు జోస్యవేత్త చక్రం నుంచో ఇంద్రజాలికుని టోపీలోంచో బయటపడేవి కావు. సామెత చెప్పినట్టూ, ఆ జరగాల్సిన క్షణంలోనే అది హఠాత్తుగా ఫలిస్తుంది. అయితే అంతకు ముందే ఎప్పుడో విత్తనాలను నాటి, జాగరూకతతో కూడిన దౌత్యమనే ఎరువును వేసి ఉండాలి. ఈ ఏడాది జూలైలో ఇరువురు నేతలు రష్యాలోని ఊఫాలో సమావేశమైన ప్పుడే దీనికి సన్నాహక కృషి జరిగి ఉండాలి. నవంబర్ 30న పారిస్‌లో దానికి ఎరువు వేసి ఉంటారు. బ్యాంకాక్‌లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు కలుసుకున్నప్పుడే తొలి పచ్చదనం కనిపించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ డిసెంబర్‌లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన ‘‘హార్ట్ ఆఫ్ ఆసియా’’ మంత్రుల సదస్సు సందర్భంగా నవాజ్ షరీప్‌ను కలుసున్నప్పుడు అది మొలకెత్తింది.
ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పదవుల్లోకి వచ్చే రాజకీయవేత్తలు ప్రజల హృదయ స్పందనలను, మనోభా వాలను అర్థం చేసుకోవాలి. అదే వారి గొప్ప బలం. వాతావరణాన్ని పరిపక్వం చెందించాల్సిన ఆవశ్యకతను కూడా వారు అర్థం చేసుకుంటారు. ప్రజా చర్చలోకి భయా న్ని ప్రవేశపెట్టి, పరస్పర విద్వేషాల దావానలాన్ని రగల్చ గలిగే శక్తి యుద్ధోన్మాదులకు ఉంది. అదే భారత్-పాక్ చర్చలకు ప్రమాదకరమైన అడ్డంకిగా ఉంటూ వస్తోంది. ఇది ముందస్తు సన్నాహంతో వచ్చిన ‘వాతావరణంలోని మార్పు’ కావడంలోనే ఉన్నది అసలు నైపుణ్యమంతా.
ఈ క్రమమంతా వచ్చే ఏడాది పాక్‌లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడంగా పరిణమిస్తుందని ఆశించవచ్చు. మనం ఓ విష వలయంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు ఏం చేయాలి? అనే చిరకాల ప్రశ్నకు పాత సూఫీ సమాధానం ఒకటుంది. సంప్రదాయకంగా చెప్పే జవాబైతే ఆ విషవలయాన్ని బద్దలుకొట్టి బయటపడాలంటుంది. సూఫీలది అందుకు భిన్నమైన వైఖరి. మరింత పెద్ద వలయాన్ని గీస్తే, యుక్తిగా కదిలే వెసులుబాటు మనకు లభిస్తుందని వారంటారు. సార్కే ఆ పెద్ద వృత్తం.
(వ్యాసకర్త : ఎంజే అక్బర్ బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ)