claimate
-
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
అసలు ఇలా ఎందుకు జరుగుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : వాతావరణానికి సంబంధించి ఈసారి భారత్‌లో అసాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంది. వర్షాకాలం ఆలస్యమైంది. వర్షాలు అంత ఎక్కువగా లేకపోయినా అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ అకాల పరిస్థితలు వల్ల వేలాదిమంది మత్యువాత పడ్డారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? వర్షాకాలంలో ముందుగా ఈశాన్య రాష్ట్రమైన అస్సాంను వరదలు ముంచెత్తాయి. తర్వాత మహారాష్ట్ర, కేరళను వరదలు కమ్ముకున్నాయి. మధ్య ఆగస్టు నెల నాటికి మధ్య భారతాన్ని వరదలు చుట్టుముట్టాయి. 1950 నుంచి 2015 వరకు సంభవించిన వాతావరణ పరిస్థితులపై పుణెలోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మేనేజ్మెంట్’ అధ్యయనం చేసి 2017లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు అసాధారణ వరదల భారిన దాదాపు 82 కోట్ల మంది పడ్డారు. వారిలో 170 లక్షల మంది నిరాశ్రయులుకాగా, 69 వేల మంది మరణించారు. భూతాపోన్నతి ఒక డిగ్రీ సెల్సియస్ పెరగడం వల్ల కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు పడి, వరదలు వచ్చాయని ప్రపంచ వాతావరణ మార్పుల అధ్యయనం కోసం ఐక్య రాజ్య సమితి ఏర్పాటు చేసిన ‘ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ 2018లో విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం పెద్దగా పెరక్కపోయినా కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు పడి అసాధారణ వరదలు వచ్చాయని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘దివేచ సెంటర్ ఫర్ క్లైమేట్ ఛేంజ్’కు చెందిన ప్రొఫెసర్ జె. శ్రీనివాసన్ తెలిపారు. ఈసారి కేవలం ఒకే ఒక శాతం అధిక వర్షంతో వర్షాకాలం ముగుస్తుందని అంచనా వేసినప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదయింది. 2001లో దేశంలోని ప్రజలకు సగటున 1816 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉండగా, గత జూలై నెల నాటికి సగటున 1544 క్యూబిక్ మీటర్ల నీరే అందుబాటులో ఉందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభకు తెలిపారు. భారత్‌లాగా దిగువ మధ్య ఆదాయంగల ఇతర దేశాల ప్రజలకు సగటున 3,013 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉందంటే మన దేశం ఈ విషయంలో ఎంతగా వెనకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే ఎక్కువాదాయ దేశాల్లో ప్రజలకు సగటున 8,822 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉంది. జల వనరుల సంరక్షణ విధానం సక్రమంగా లేక పోవడం వల్లనే భారత్‌కు నేడు ఈ పరిస్థితి దాపురించిందని శ్రీనివాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌తోపాటు భారత్ ద్వీపకల్ప ప్రాంతాల్లో వర్షాలు పెరిగినప్పటికీ భారత్ మధ్యప్రాంతంలో వర్షాలు 1950 నుంచి తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. అప్పటి నుంచి దేశంలో జల వనరుల సంరక్షణపై భారత్ దష్టిని కేంద్రీకరించి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం జల సంరక్షణ దిశగా సరైన చర్యలు తీసుకోక పోయినట్లయితే భవిష్యత్‌లో పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఒకపక్క వర్షాభావం, మరో పక్క భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతుండం, అన్నార్థులు, అభాగ్యులు అకారణంగా మత్యువాత పడుతుండడం పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమని శాస్త్రవేత్తలు నెత్తి, నోరు మొత్తుకొని చెబుతున్న విషయం విషయం తెల్సిందే. ప్రధానంగా చెట్లను కాపాడుకోలేకపోవడం వల్ల దేశంలో అటవీ ప్రాంతం తగ్గిపోయి కార్బన్‌డై ఆక్సైడ్ పెరిగి భూతాపోన్నతి పెంచడం వల్ల ఈ అకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పర్యావరణ పరిస్థితుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నానని అంతర్జాతీయ వేదికల ముందు బాకా ఊది మరి చెబుతున్న భారత్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దొంగ లెక్కలూ ఉన్నాయి. భారత్‌లో 2005 నుంచి 2017 సంవత్సరాల మధ్య 2,152 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం (వక్ష సంపద) విస్తరించిందని ‘ది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ గతంలో ఓ డేటాను విడుదల చేసింది. వాస్తవానికి 2001 నుంచి 2018 సంవత్సరాల మధ్య భారత్‌లో 16 లక్షల హెక్టార్లలో వృక్ష సంపద నాశనం అయిందని యూనివర్శిటీ ఆఫ్ మేరిలాండ్, గూగుల్, యూఎస్ జియోలోజికల్ సర్వే, నాసాలు సేకరించిన డేటా, ఛాయా చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా లాభాపేక్ష లేని ‘వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా వెల్లడించింది. భారత్ ప్రభుత్వం దేశంలో వృక్ష సంపద పెరగిందంటే ‘వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ తగ్గిందని చెబుతున్నది ఇందులో ఏది సబబు, ఏది కాదు ? దేశంలో అటవి ప్రాంతం విస్తరించిందని చెబుతున్న అటవీ సర్వే మరోపక్క తరుగుతున్న అటవీ ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకోలేదా? గనులు, వివిధ ప్రాజెక్టుల కారణంగా దేశంలో వక్ష సంపద తగ్గిపోతోందంటూ ప్రజాందోళన పెరుగుతున్న నేపథ్యంలో వక్ష సంపద పెరిగిందనడం వారిని బుజ్జగించడం కోసమా? కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అలా ప్రకటించిందా ? ఇక్కడ మరో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏది వాస్తవమో, ఏది అబద్ధమో! ఇట్టే తెలిసిపోతుంది. 2030 సంవత్సరం నాటికల్లా భూవాతావరణంలో 250 టన్నుల నుంచి 300 టన్నుల వరకు కార్బన్‌డై ఆక్సైడ్‌ను తగ్గించేందుకు సరిపడా వృక్ష సంపదను పెంచుతామని, అందుకోసం అటవులను అభివద్ధి చేస్తామని 2015, డిసెంబర్లో పారిస్‌లో పర్యావరణ పరిస్థితులపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో తీర్మానంపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. ఇందుకోసం 2030 సంవత్సరం నాటికి 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామంటూ ఉదారంగా హామీ కూడా ఇచ్చింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు కేవలం 89.53 కోట్ల రూపాయలను, 2017–18 ఆర్థిక సంవత్సరానికి 47.8 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పార్లమెంటరీ కమిటీ నివేదికనే వెల్లడించింది. అంటే పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ మూడేళ్ల కాలంటో 136 కోట్లను మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం రానున్న 12 ఏళ్ల కాలంలో 60 వేల కోట్లలో ఎన్నికోట్లను కేటాయించగలదు? ఒకప్పుడు పండుగలకు, పబ్బాలకు, పిల్లలు పుడితే వారి మీద చెట్లను నాటి, వాటిని పిల్లలతో సమానంగా చూసుకునే సంస్కతి ప్రజల్లో ఉండేది. అది అంతరించడంతో చెట్లు నాటేందుకు ఎక్కడికక్కడ ప్రభుత్వాలే ముందుకు వచ్చాయి. వస్తున్నాయి. అన్నింట్లో అవినీతికి అలవాటుపడ్డ ప్రభుత్వాల వల్ల చెట్లు ఊపిరిపోసుకోవడం లేదు. ఇక అడవులను పెంచడం తమ వల్ల కాదన్న అభిప్రాయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అడవుల పెంపకం బాధ్యతలను కార్పొరేట్లకు ఇవ్వాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై విస్తృతంగా చర్చ జరపాలని కోరుకుంటోంది. -
వాతావరణ మార్పు ఆహ్లాదకరం
బైలైన్ ప్రజా చర్చలోకి భయాన్ని ప్రవేశపెట్టి, పరస్పర విద్వేషాగ్నిని రగిల్చే శక్తి యుద్ధోన్మాదులకు ఉంది. అదే భారత్-పాక్ చర్చలకు ప్రమాదకరమైన అడ్డంకి. మోదీ లాహోర్ సందర్శన ముందస్తు సన్నాహంతో వచ్చిన ‘వాతావరణంలోని మార్పు’ కావడంలోనే ఉన్నది అసలు నైపుణ్యమంతా. ఒక్కోసారి చరిత్రంటే కొన్ని ప్రాధాన్యంగల ఘటనల సమా హారమేననిపిస్తుంది. కాబూల్ నుంచి ఢిల్లీకి వెళ్తూ హఠాత్తుగా లాహోర్‌లో ‘‘దిగాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణ యించుకోవడం లాంటి అద్భుత ఘటనలు అతి కొన్నే ఉంటాయి. ఆయన పాకిస్తాన్లో దిగి, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటి శుభకార్యానికి వెళ్లిరావడం అక్షరాలా హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టే జరిగింది. ఈ వ్యక్తీకరణ ఆ ఘటనకున్న రాజకీయ పార్శ్వాన్ని కూడా చక్కగా వర్ణిస్తుంది. దీని ప్రభావం ఉపఖండాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణం... అది అనూహ్యమైనది, అసాధారణమైనది కావడమే కావచ్చు. అటూ ఇటూ కూడా ఎంతో ధైర్యం, ఊహాత్మకత, నైపుణ్యం అవసరమైన అద్భుత దౌత్య విజయం ఇది. లేకపోతే అనిశ్చితితో ఉండే పాక్ ప్రధాని నవాజ్ ఒక టెలిఫోన్ సంభాషణలో ఆహ్వానాన్ని ఇమిడ్చి ఉండేవారూ కారు, ఆత్మవిశ్వాసం కొరవడిన మన ప్రధాని మోదీ దాన్ని ఆమోదించి ఉండేవారు కారు. సమస్యాత్మకమైన భారత్-పాక్ సంబంధాల కథనంలో ఓ నూతనాధ్యా యాన్ని లిఖించడం ఒక్క రచయిత వల్ల కాని పని. ఇద్దరు రచయితల అవగాహనా ఒకేలా ఉండాల్సి ఉంటుంది. దీని ఫలితం తక్షణమే కనిపించింది. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉంటుందనే నమ్మకం ఇద్దరు నేతలకూ ఉండి ఉంటుందనడంలో అనుమానమే లేదు. కానీ దానికి లభించిన సానుకూల స్పందన స్థాయి ఇంతగా ఉంటుందని మాత్రం భావించలేదు. రెండు దేశాల మధ్య గత శతాబ్దిలో జరిగిన సంఘర్షణల ఫలితంగా ప్రజల జీవితాల్లో కొరవడ్డ పరస్పర సాంస్కృతిక, బంధుత్వ సంబంధాలను అది పునరావిష్కరించింది. ఎప్పుడో అరుదుగా తప్ప యుద్ధానికి సహేతుకమైన కారణమంటూ లేకపోవడం మానవ ప్రవృత్తిలోని వింత వాస్తవం. ఉపఖండంలోని ప్రజలు యుద్ధం అంటే విసిగిపోయారు. శాంతి వల్ల కలిగే అపార ప్రయోజనాలను గురించి చాలా మంది నేతలకంటే వారికే ఎక్కువ తెలుసు. శాంతి కావాలనే కాంక్ష ఉన్నంత మాత్రాన అది లభించేది కాకపోవడం విషాదకరం. యుద్ధం సాగించడాని కంటే శాంతిని నిలిపి ఉంచడం కోసం ఎక్కువ జాగ్రత్త వహించాల్సి ఉంటుందనేదీ నిజమే. 2014లో తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ (దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంస్థ) నేతలందరినీ ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ తన పదవీ బాధ్యతలను ప్రారంభించారు. తద్వారా ఆయన ఇలాంటి మరో పరిణామాత్మక ప్రాధాన్యంగల ఘటనకు కారకులయ్యారు. అయితే అది స్వార్థ ప్రయోజ నాల కింద సమాధైపోయింది. భారత్ -పాక్ సంబంధాల లో ఇంత త్వరగా మరో ఆరంభం సాధ్యం కావడం అద్భుతమే. ఈ ప్రక్రియకు ద్రోహం చేసేవారితో వ్యవహరి స్తూనే, ఈ సంబంధాలను పట్టిపీడిస్తున్న సంక్లిష్ట సమస్యల పై మధ్యంతరమైన అవ గాహననైనా ఏర్పరచుకోవడానికి కొంత సమయం, ఓపిక అవసరం. ఇప్పటికే ఒక తీవ్రవాదుల కూటమి నవాజ్‌ను కూలదోయాలని చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కలయిక వల్ల కలిగే ప్రమాదాలేమిటో ఆయనకు తెలుసు. అయితే, పాక్ సైన్యం కూడా ఆయన వెంట ఉన్నదని అనుకోవాల్సి ఉంటుంది. పాక్ ప్రధాన స్రవంతి పార్టీలన్నీ ఈ విషయంలో ఆయనకు మద్దతుగా ఉండటం కూడా అంతే ప్రోత్సాహదాయకమైన వాస్తవం. మన దేశంలో ప్రజలు ప్రధాని వెంటే ఉన్నా, కాంగ్రెస్ లాంటి పార్టీలు దురదృష్టవశాత్తూ జాతీయ ప్రయోజనాలకు, పక్షపాత పూరిత రాజకీయాలకు మధ్య రేఖను గీయలేక, యథా లాపంగా విమర్శిస్తున్నాయి. ఆ పార్టీల నేతల వ్యాఖ్యలు పూర్తి పిల్లతనంతో కూడినవి కావడంలో ఆశ్చర్యం లేదు. మార్క్సిస్టు పార్టీలు చూపిన పరిణతితో దీన్ని పోల్చి చూడండి. సీపీఐ, సీపీఎంలు రెండూ ఆయన చూపిన ఈ చొరవనూ, సంఘర్షణ అనే విషపూరితమైన ఊబి నుంచి తలెత్తిన అవకాశాన్నీ స్వాగతించాయి. ఇలాంటి ప్రాధాన్యంగల ఘటనలు జోస్యవేత్త చక్రం నుంచో ఇంద్రజాలికుని టోపీలోంచో బయటపడేవి కావు. సామెత చెప్పినట్టూ, ఆ జరగాల్సిన క్షణంలోనే అది హఠాత్తుగా ఫలిస్తుంది. అయితే అంతకు ముందే ఎప్పుడో విత్తనాలను నాటి, జాగరూకతతో కూడిన దౌత్యమనే ఎరువును వేసి ఉండాలి. ఈ ఏడాది జూలైలో ఇరువురు నేతలు రష్యాలోని ఊఫాలో సమావేశమైన ప్పుడే దీనికి సన్నాహక కృషి జరిగి ఉండాలి. నవంబర్ 30న పారిస్‌లో దానికి ఎరువు వేసి ఉంటారు. బ్యాంకాక్‌లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు కలుసుకున్నప్పుడే తొలి పచ్చదనం కనిపించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ డిసెంబర్లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన ‘‘హార్ట్ ఆఫ్ ఆసియా’’ మంత్రుల సదస్సు సందర్భంగా నవాజ్ షరీప్‌ను కలుసున్నప్పుడు అది మొలకెత్తింది. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పదవుల్లోకి వచ్చే రాజకీయవేత్తలు ప్రజల హృదయ స్పందనలను, మనోభా వాలను అర్థం చేసుకోవాలి. అదే వారి గొప్ప బలం. వాతావరణాన్ని పరిపక్వం చెందించాల్సిన ఆవశ్యకతను కూడా వారు అర్థం చేసుకుంటారు. ప్రజా చర్చలోకి భయా న్ని ప్రవేశపెట్టి, పరస్పర విద్వేషాల దావానలాన్ని రగల్చ గలిగే శక్తి యుద్ధోన్మాదులకు ఉంది. అదే భారత్-పాక్ చర్చలకు ప్రమాదకరమైన అడ్డంకిగా ఉంటూ వస్తోంది. ఇది ముందస్తు సన్నాహంతో వచ్చిన ‘వాతావరణంలోని మార్పు’ కావడంలోనే ఉన్నది అసలు నైపుణ్యమంతా. ఈ క్రమమంతా వచ్చే ఏడాది పాక్‌లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడంగా పరిణమిస్తుందని ఆశించవచ్చు. మనం ఓ విష వలయంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు ఏం చేయాలి? అనే చిరకాల ప్రశ్నకు పాత సూఫీ సమాధానం ఒకటుంది. సంప్రదాయకంగా చెప్పే జవాబైతే ఆ విషవలయాన్ని బద్దలుకొట్టి బయటపడాలంటుంది. సూఫీలది అందుకు భిన్నమైన వైఖరి. మరింత పెద్ద వలయాన్ని గీస్తే, యుక్తిగా కదిలే వెసులుబాటు మనకు లభిస్తుందని వారంటారు. సార్కే ఆ పెద్ద వృత్తం. (వ్యాసకర్త : ఎంజే అక్బర్ బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ)