దురదృష్టానికి ఆహ్వానమా? | is it need invitation to pakistan for debate | Sakshi
Sakshi News home page

దురదృష్టానికి ఆహ్వానమా?

Published Mon, Aug 24 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

దురదృష్టానికి ఆహ్వానమా?

దురదృష్టానికి ఆహ్వానమా?

పాక్‌తో చర్చలంటే ఎప్పుడూ అద్దం మీద నడకే. ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదు. మంచే జరగాలని ఆశిస్తూనే అతి కీడుకైనా సిద్ధంకావాలి. మోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిననాడే ఆయన వైఖరిని పాక్ ప్రభుత్వం అంగీకరించిందనేది ఇబ్బందికరమైన నిజం. మోదీ వచ్చే ఏడాది పాక్‌లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరుకావడానికి అంగీకరించారు. అది జరిగితే, సార్క్ చరిత్రలోనే శిఖరాయమానంగా నిలుస్తుంది. ఆలోగా జరిగే ఎన్‌ఎస్‌ఏల సమావేశం ఆ నిచ్చెనలోని మొదటి మెట్టు అనే ముఖ్య విషయాన్ని పాక్ మరిచిపోకూడదు.

 భారత్-పాకిస్తాన్ చర్చలు, 2001 ఆగ్రా సమావేశంలో తీవ్రంగా దెబ్బతిన్నప్పటి నుంచి అపస్మారస్థితిలోనే ఉన్నాయి. 2015లో పరిస్థితి మరింత ఘోరంగా దిగజారనుందా? ఉగ్రవాదమే ద్వైపాక్షిక సంబం ధాల్లోని కేంద్ర సమస్యని పాకిస్తాన్ అంగీకరించకపోవడం వల్లనే ఆగ్రా చర్చలు కుప్పకూలాయి. అలా అంగీకరించడమంటే తనపైన తానే నేరారోపణ చేసుకున్నట్టవుతుంది కాబట్టే పాక్ అందుకు నిరాకరిం చింది. చర్చల ఎజెండాపై తలెత్తే ప్రతి వివాదంలోనూ ‘కశ్మీర్ సమస్యను కూడా చర్చించాలి, లేకపోతే...!’ అనే మాట పాక్ నోట రావడమే దాని దాటవేత యత్నానికి విస్పష్టమైన రుజువు.

 గత 15 ఏళ్లుగా భాష పెద్దగా మారలేదేమో అనిపిస్తుంది. భారత్ కశ్మీర్ సమస్యను చర్చించకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో దానికి త్వరలోనే తెలిసివస్తుందని సాత్రాజ్ నవాజ్ పాక్‌లోని ఓ పత్రికా సమావేశంలో అన్నారు. మరోవిధంగా చెప్పాలంటే, హింసాకాండను ప్రజ్వరిల్ల చేసే మీట పాక్ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నదని, అది తన ఆదేశానుసారం ఎప్పుడు కావాలంటే అప్పుడు హింసాకాండ రేగడం లేదా ఆగడం అనేదాన్ని నియంత్రించగలదని అర్థం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్‌గానీ, పాక్‌గానీ 15 ఏళ్ల క్రితం ఎక్కడున్నాయో అక్కడ లేవు. నేటి పరిస్థితుల్లో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 భారత్‌తో వ్యవహరించేటప్పుడు పాక్ అనుసరించే వైఖరిని అలం కారికంగా పోలికకు తెచ్చే వెయ్యి తలల (హైడ్రా) వైఖరి సుపరిచితమైనదే. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమస్య కూడా అదే. ఇక్కడ ఆ పోలికకు ప్రాముఖ్యం ఉంది. గ్రీక్ పౌరాణిక గాథల్లో హైడ్రా అంటే ఒక తలను నరికితే రెండు తలలు పుట్టుకొచ్చే జల సర్పం. హెర్క్యులిస్ దీనికి పరిష్కారం కనిపెట్టాడు. ఆ పాము తలను తెగనరికి, దాని మెడను తగులబెట్టేశాడు. ఆ పని చేయగల హెర్క్యులిస్ ఎవరూ ఇప్పుడు అందుబాటులో లేరు. ఎందుకంటే నేటి ఈ ఉగ్రవాద సర్పం పాక్ సైన్యంలోని శక్తివంతమైన విభాగాలు పోసే పాలు తాగి బతుకుతోంది.

భారత్‌కు వ్యతిరేకంగా మరో రూపంలో యుద్ధం సాగిస్తున్న ఉగ్రవాద గ్రూపులకున్న విస్తారమైన మౌలికసదుపాయాల సురక్షిత స్థావరాల్లో అది హాయిగా నిదురించగలు గుతోంది. ప్రధానిగా గత పదవీకాలంలో నవాజ్ షరీ్‌ఫ్ చిత్తశుద్ధితోనే భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అటల్ బిహారీ వాజపేయితో లాహోర్ సమావేశం జరిపారు. అయితే దాని వెంబడే కార్గిల్ యుద్ధం వచ్చింది. రష్యాలోని ఉఫాలో జరిగిన సమావేశంలో అంతకంటే తక్కువ నాటకీయంగా కుదిరిన అవగాహనకు వ్యతిరేకంగా అదే ముఠా నేడు సీమాంతర ఉగ్రవాదం, కాల్పుల విరమణ ఉల్లంఘనలు తీవ్రమయ్యేలా రెచ్చగొడుతోంది.

 హైడ్రాను సంతృప్తిపరచే యత్నంలో భాగంగా నవాజ్ షరీఫ్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) సత్రాజ్ అజీజ్ ... భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌తో తన సమావేశం కోసం రూపొందించిన ఎజెండాలో క శ్మీర్‌ను కూడా పేర్కొన్నారంటూ వాస్తవాలను వక్రీకరించడానికి దిగజారారు. కానీ ఉఫా ఉమ్మడి ప్రకటన పాఠంలో ఎక్కడా కశ్మీర్ ప్రస్తావనే లేదు. ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని అంశాలను చర్చకు పెట్టడమంటే దాని అంతరార్థం కశ్మీర్ కూడా వాటిలో ఉంటుందనేనని పాక్ ఇప్పుడు అంటోంది. కానీ అలాంటి ఉమ్మడి ప్రకటనలను అంతరార్థాలతో కూడినవిగా ఎన్నడూ రూపొందించరు. వాటిలో ప్రయోగించే ప్రతి పదం స్పష్టంగా వ్యక్తం చేసే అర్థాన్నిచ్చేదే అయివుంటుంది. కాబట్టి ప్రతి పదంపైనా పోరాటం జరుగుతుంది. కశ్మీర్‌ను ఆ ప్రకటనలో పేర్కొనలేదూ అంటే అది ఎజెండాలో లేదనే.
 భారత్, పాకిస్తాన్‌ల విషయంలో ‘‘చర్చల’’కు కచ్చితమైన అర్థం ఉంది, ఇరుపక్షాలు ‘‘సమగ్ర’’ చర్చలుగా పిలిచే వాటికి అంగీకరించాయి. అలాంటి చర్చలు కశ్మీర్ సహా అన్ని సమస్యలను ఆవరించేవిగానే ఉంటాయి, నిజమే.

ఆ ఒప్పుదల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నడూ వెన క్కు తగ్గింది లేదు. కానీ అజిత్ దోవల్-సత్రాజ్ అజీజ్ సమావేశం ఆ సమగ్ర చర్చల్లో భాగం కాదు. అది ఒక అంతర్జాతీయ సమావేశం సందర్భంగా మోదీ, నవాజ్‌ల మధ్య విడిగా జరిగిన సంభాషణ నుంచి ఉత్పన్నమైనది. ఉగ్రవాదం పట్ల తీవ్ర ఆందోళన అనే నిర్దిష్ట అంశానికి పరిమితమైనది. కశ్మీర్ మరే మూడో శక్తి (అది విదేశమే అయినా లేదా తమను భారతీయులుగా భావించని ఇతరులు ఎవరైనా) ప్రమేయమూ లేని ద్వైపాక్షిక సమస్య మాత్రమే అనేదే భారత ప్రభుత్వ వైఖరి. ఎన్‌ఎస్‌ఏల మధ్య సమావేశం తిరిగి సమగ్ర చర్చలు జరగడానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి రూపొందించినది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో పాకిస్తాన్ నిజాయితీగా ఉన్నట్టయితే... ఉగ్రవాదాన్ని పెంపొందింపజేసేవారు లేదా దాని పట్ల సానుభూతి చూపేవారైన వేర్పాటువాదులకు మద్దతుగా అది సంకేతాలను పంపజాలదు. అలాంటి ధిక్కార విధానం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేదే తప్ప, ముందు జరగాల్సి ఉన్న విస్తృత చర్చలకు సానుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సన్నద్ధం చేయడానికి తోడ్పడేది కాదు. ఏ భారత ఎన్‌ఎస్‌ఏనో లేదా విదేశాంగశాఖ కార్యద ర్శో ఇస్లామాబాద్‌లో సమావేశానికి ముందు బలూచీ వేర్పాటువాదులను కలుసుకోవాలని పట్టుబడితే పాక్ దాన్ని హర్షిస్తుందా?

 ఇది రాస్తున్నప్పటికి దఢాలున తలుపులు కొట్టుకున్నాయే తప్ప పూర్తిగా మూసుకుపోలేదు. పాక్‌తో చర్చలంటే ఎప్పుడూ అద్దం మీది నడకే. ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదు. మంచే జరగాలని ఆశిస్తూనే అతి కీడు జరిగినా సరేనని సంసిద్ధం కావాలి. నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిననాడే ఆయన ప్రభుత్వపు ఈ వైఖరిని పాక్ ప్రభుత్వం అంగీకరించిందనే ఇబ్బందికరమైన నిజాన్ని చెప్పడానికి ఇది అనువైన సమయం కాకపోవచ్చు. భారత-పాక్ చర్చల్లో ఇది ఆందోళన కరమైన కీలక సమయం. ఉఫా సమావేశాల సందర్భంగా నవాజ్ షరీఫ్, నరేంద్ర మోదీని వచ్చే ఏడాది పాక్ లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరు  కావాలని ఆహ్వానించారు. మన ప్రధాని అందుకు అంగీకరించారు. ఆ పర్యటన జరిగితే, సార్క్ చరిత్రలోనే అదో అత్యున్నత శిఖరమవుతుంది.ఆ లోగా జరిగే ఎన్‌ఎస్‌ఏల మధ్య సమావేశం ఆ కష్టభరితమైన నిచ్చెనలోని మొదటి మెట్టు అనే ముఖ్య విషయాన్ని మరచిపోకూడదు.

ప్రతి మెట్టు గురించి జాగ్రత్తగా చర్చించాల్సి ఉంది. అతి కీలక వ్యక్తి దావూద్ ఇబ్రహీం సహా పాక్‌లోని ఉగ్రవాదులందరి పూర్తి సమాచారాన్ని భారత్ అందిస్తుంది. కాకపోతే భారత్ ఆందోళనలతో పాటూ, దాని సైన్యానికి నిధులను అందించే అమెరికా ఆందోళనలు సైతం ఉపశమించేలా అది కార్యాచరణకు దిగాలి.  ఇప్పటికి, 2016కు మధ్య పలుమార్లు కిందామీదా పడటం జరగొచ్చు. కానీ నిచ్చెన మొదటి మెట్టు మీది నుంచే జారి పడిపోతే మాత్రం అది దురదృష్టానికి   సాదరంగా ఆహ్వానం పలకడమే అవుతుంది.
 

(వ్యాసకర్త: ఎంజె అక్బర్, పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement