దళిత సాధికారత ఎంత దూరం?
బైలైన్
గాంధీకి గానీ, కాంగ్రెస్ నేతలకు గానీ మొట్టమొదటి రాష్ట్రపతిగా అంబేడ్కర్ అనే ఆలోచన రాకపోవడం ఆసక్తికరం. వైస్రాయి రాజప్రాసాదంలో ఒక దళితుడు ఉండటానికి మించి కుల వ్యవస్థ మానసిక పునాదులను శిథిలం చేసే చర్య మరేదీ ఉండదు.
మహాత్మా గాంధీ 1947 మేలో తీవ్ర వ్యక్తిగత విషాదానికి గురయ్యారు. 1935లో సేవాగ్రామ్ ఆశ్రమాన్ని స్థాపించినప్పటి నుంచి అక్కడ సేవలందించిన ఆయన యువ దళిత శిష్యుడు చక్రయ్య, మెదడులోని కణతి కారణంగా మరణించారు. గాంధీ ఆయనను కుటుంబ సభ్యునిగానే భావించేవారు. అందువలన మహాత్ముని దుఃఖం బహిరంగంగానే వ్యక్తమౌతుండేది. జూన్ 2న గాంధీజీ తన ప్రార్థనా సమావేశాన్ని ఒక విప్లవాత్మక సూచనతో ప్రారంభించారు.
మొదటగా ఆయన, భారతదేశపు మకుటంలేని మహారాజుగా జవహర్‌లాల్ నెహ్రూ పేరును ప్రకటిం చారు. బారిస్టర్ కావ డానికి ముందు నెహ్రూ హారో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నందున ఇంగ్లిష్ వారితో బేరసారాలకు ఆయన అవసరమన్న గాంధీ వాదన ఏమంత పస ఉన్నదేమీ కాదు. అయినా స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిగా నెహ్రూ పాత్ర గురించి ఆలోచించాల్సిన పనే లేదనే విషయాన్ని ఆయన ఆ ప్రకటన ద్వారా చెప్పదలుచుకున్నారు. అయితే రెండో పదవి ఇంకా ఖాళీగానే ఉంది. సాంకేతికంగా అది నూతన రాజకీయ వ్యవస్థలో ప్రధాన మంత్రి కంటే కూడా ఉన్నత స్థాయిది.
ఆ పదవికి సంబంధించి గాంధీజీ ఇలా అన్నారు: భారత రిపబ్లిక్ ప్రథమ రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన సమయం వేగంగా సమీపిస్తోంది. చక్రయ్య బతికి ఉండివుంటే నేనాయన పేరును సూచించి ఉండేవాడిని. ధైర్యవంతురాలు, నిస్వార్థపరురాలు, పరిశుద్ధ హృదయి అయిన (గాంధీ ప్రయోగించిన ఈ పదానికి నేడు కాలదోషం పట్టిపోయి, అక్కడక్కడా దాన్ని మార్చేస్తున్నారు కూడా) దళిత యువతి మన దేశ ప్రథమ రాష్ట్రపతి కావాలని ఆశిస్తున్నాను. ఇదేమీ నిష్ఫల స్వప్నం కాదు...మన భావి రాష్ట్రపతికి ఇంగ్లిష్ రావాల్సిన అవసరమేమీ లేదు. రాజకీయ వ్యవహారాల్లో నిష్ణాతులై, విదేశీ భాషలను కూడా తెలిసిన వారు సహాయకులుగా తోడ్పడతారు. అయితే, ఈ కలలు నిజం కావాలంటే మనం ఒకరిని ఒకరం చంపుకోవడంపై కంటే గ్రామాలపై పూర్తి శ్రద్ధను చూపగలగాలి (కలెక్టెడ్ వర్క్స్, వాల్యూం 95).
ఈ ఆలోచన గురించి గాంధీ జూన్ 6న రాజేంద్రప్రసాద్‌తో జరిపిన సంభాషణలో కూడా చర్చను కొనసాగించారు. అయితే ఆయనే ప్రథమ రాష్ట్రపతి అయ్యారనుకోండి. గాంధీ తన ప్రతిపాదనను ఇలా రూపొందించారు: నాయకులంతా మంత్రివర్గంలో చేరి పోతే ప్రజలతో విస్తృత సంబంధాలను కొనసాగించడం చాలా కష్టమౌతుంది.... అందువల్లనే నేను నా ప్రార్థనా సమావేశ ప్రసంగంలో చక్రయ్యలాంటి దళితుడిని లేదా దళిత యువతిని దేశ ప్రథమ రాష్ట్రపతిగాను, జవహర్‌లాల్‌ను ప్రధానిగాను సూచించాను... చక్రయ్య చనిపోయారు కాబట్టి ఒక దళిత మహిళకు ఆ గౌరవం దక్కాలి. కాంగ్రెస్ నేతలకు గాంధీజీ సూచన రుచించలేదు.
ఆ చక్రయ్య పేరును కాంగ్రెస్ నేతలలో ఏ ఒక్కరూ తమ గాంధీ స్మృతులలో ఎక్కడా ప్రస్తావించకపోవడం (కనీసం నాకు తెలిసినంతలో) ఆసక్తికరం. బహుశా వారు గాంధీజీ ఆలోచనను ఉన్నత పదవీ బాధ్యతల అవసరాలకు నానాటికీ దూరం అవుతున్న సాధుపుంగవుని విప్లవతత్వంగా కొట్టిపారేసి ఉండవచ్చు. గాంధీ, అలాంటి దళిత సాధికారత గురించి ప్రచారం సాగిస్తూనే వచ్చారు. మనకు దళితుల పాలన కావాలి.
దళితుల సేవలు అత్యున్నతమైనవి కాబట్టి వారే అందరిలోకీ అత్యున్నతులు వంటి వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. గాంధీగానీ, లేదా కాంగ్రెస్ నేతలలో ఎవరైనాగానీ అంబేడ్కర్ మొట్టమొదటి రాష్ట్రపతి కావడమనే ఆలోచనను ఎన్నడూ పరిగణనలోకి తీసుకోకపోవడం ఆసక్తికరం. అంబేడ్కర్‌కు అందుకు కావాల్సిన అర్హతలే కాదు, ప్రతిష్ట కూడా ఉంది. స్వాతంత్య్రోద్యమంలో స్వతంత్ర పాత్రను నిర్వహించాలని బాబాసాహెబ్ తీసుకున్న నిర్ణయం నాటి కాంగ్రెస్ నేతలకు కోపం కలిగించి ఉండవచ్చు. బాబాసాహెబ్ వారిలో ఒకరు కారు. ఆయనను ఒక స్థాయికి మించి విశ్వసించడానికి నిరాకరించారు.
గాంధీ, అంబేడ్కర్‌లు ఇద్దరికీ దళిత సాధికారతే అత్యున్నత ప్రాధాన్యాంశం. కాకపోతే గాంధీ స్వాతంత్య్రా నికి ప్రథమ స్థానం ఇస్తే, అంబేడ్కర్ దళిత విముక్తికి ప్రథమ స్థానం ఇవ్వడమే వారి మధ్య ఉన్న విభేదం. 1940ల నాటికి, స్వాతంత్య్రం కనుచూపు మేరలోకి వచ్చేసరికి ఆ విభేదం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. హిందువులకు, ముస్లింలకు కూడా ఆమోదయోగ్యమైన రాజకీయ వ్యవస్థను రూపొందించే ప్రతిపాదనలను జాగ్రత్తగా రూపొందిం చడంపై అంబేడ్కర్ తన మేధోపరమైన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించారు. దేశవిభజనకు అర్థం ఏమిటనే విషయం గురించి కూడా ఆయన లోతుగా ఆలోచించారు. 1940 డిసెంబర్ నాటికే ‘పాకిస్తాన్’ అనే పదం శీర్షికలో భాగంగా ఉన్న మొట్టమొదటి పుస్తకాన్ని ప్రచురించారు.
థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే ఆయన పుస్తకం ఆశ్చర్యకరమైన రీతిలో భవిష్యత్ పరిణామాలను ముందుగానే తెలిపింది. వాయవ్య సరిహద్దు, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి భౌగోళిక- రాజకీయ అజెండా గల ఇస్లామిక్ జీహాద్ ముప్పు పెంపొందడం గురించి అంబేడ్కర్ తప్ప మరెవరూ నాడు ఊహించలేకపోయారు. అదే నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన ముప్పు కావడం విశేషం. సురక్షితమైన సరిహద్దు కంటే సురక్షితమైన సైన్యం మెరుగనే అంబేడ్కర్ సిద్ధాంతం చెప్పుకోదగినది.
ఒక్కసారి పాకిస్తాన్ నిజమయ్యాక, ఆయన దృష్టి అంతర్గత సవాళ్లపైకి మళ్లింది. హేయమైన కుల వ్యవస్థ అనే శాపాన్ని చ ట్టరీత్యా నిషేధించగలంగానీ, నిజజీవితం నుంచి నిర్మూలించడం అందుకు భిన్నమైనది. ఉల్లంఘనలకు పరిష్కారాలు లేనిదే హక్కులూ ఉండవు అనే సుప్రసిద్ధ సూత్రీకరణను అంబేడ్కర్ చేశారు. అదే మన రాజ్యాంగానికి క్రియాశీల సూత్రమైంది. రాజ్యాంగాన్ని చూడగలిగేటంత కాలం గాంధీ జీవించలేదు. కానీ ఆయన రాజకీయ సంకేతాత్మకవాదపు శక్తిని గుర్తించగలిగారు.
రాజప్రతినిధుల రాజప్రాసాదంలో ఒక దళితుడు ఉండటానికి మించి కులాల అంతస్తుల వ్యవస్థ మానసిక పునాదులను శిథిలం చేసే చర్య మరేదీ ఉండదు. గాంధీ కలను నిజం చేయడానికి మనకు దశాబ్దాలు పట్టింది. ఏమాటకామాటే చెప్పాలి, 1947 నుంచి మనం చాలా దూరమే వచ్చేశాం. అయినా సుప్రసిద్ధ కవి అన్నట్టు, ఇంకా మైళ్ల దూరం వెళ్లాల్సే ఉంది. నాయ కులు కూడా మనుషులే. వారంతా ఏదో ఒక రోజు సుదీర్ఘ నిద్రలోకి పోవాల్సినవారే. కానీ దేశం మాత్రం ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది. దళిత విముక్తి, ఆర్థిక సాధికారతలను పూర్తిగా సాధించిన నాడే భారతదేశం ఉన్నతిని సాధించగలుగుతుంది.
వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు
పార్లమెంట్ సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి