ఆంటోనీజీ! మేల్కొంటారా? | Mr AK Antony.. wake up? | Sakshi
Sakshi News home page

ఆంటోనీజీ! మేల్కొంటారా?

Published Sat, Mar 8 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

ఆంటోనీజీ! మేల్కొంటారా?

ఆంటోనీజీ! మేల్కొంటారా?

 యూపీఏ ప్రభుత్వం రక్షణ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంతో  దేశ రక్షణ రంగ సన్నద్ధత కొరవడింది. గత 8 ఏళ్లుగా రక్షణమంత్రిగా కొనసాగుతున్న ఆంటోనీ ఒక అచేతనమైన నేతగా, స్తబ్దుగా వ్యవహరించి దేశ రక్షణావసరాలను గుర్తించకుండా గాఢనిద్రలో గడిపేశారు. ఆయన జమానాలో భారత రక్షణ సామర్థ్యం బాగా బలహీనపడింది.
 
 ఇరాక్‌పై అమెరికా యుద్ధం ప్రకటించిన సందర్భంగా అప్పటి అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫెల్డ్ ఒక మాట చెప్పారు. ‘‘నీ దగ్గర ఉన్న ఆర్మీతో నువ్వు యుద్ధం చేయాలి. అంతేగానీ సైనికదళం ఎలా ఉండాలో కోరు కోవద్దు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశ రక్షణమంత్రికి ఉండాల్సిన అసలు లక్షణమేమిటంటే ఎలాంటి ఘర్షణలు లేని ప్రశాంత సమయాలలో సైనిక సామర్థ్యా న్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి. యుద్ధాలు వచ్చేటప్పుడు ఇవి అక్కరకొస్తాయి.
 
 ప్రతి యుద్ధమూ కొత్త అనుభవాన్ని నేర్పుతుంది. సాధారణంగా వివిధ దేశాలు తమ సైన్యానికి ఎప్పటికప్పుడు కొత్త యుద్ధవిద్యలలో తర్ఫీదునిస్తాయి. ఎందుకంటే అంతకుముందు జరిగిన యుద్ధాలలో శత్రువులు ఉపయోగించిన ఎత్తుగడలనూ, వ్యూహాలనూ మళ్లీమళ్లీ ఉపయోగించరు కాబట్టి సైన్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
 
 తాలిబాన్‌లాంటి మతవాదశక్తులు కొన్ని దేశాలలో తమతో కలిసిపోరాడేవారిని కలుపుకొని దాడులకు తెగబడుతుంటాయి. ఈ శక్తులు తమకు సత్తువ ఉన్నప్పుడు దాడులు చేస్తాయి, లేనప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి. యుద్ధంలో ఇదోరకమైన ఘర్షణ. తాలిబాన్ వద్ద ఫిరంగులు, వైమానిక దళం వంటి వనరులు లేవు. అయితే తాలిబాన్ భావజాలాన్ని వంటబట్టించుకున్న తీవ్రవాదులూ, పోరాడాలన్న కాంక్ష, లక్ష్యం, అన్నింటికీ మించి అమూల్యమైన సమయం వారి వద్ద ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు తాలిబాన్లు ‘ధర్మయుద్ధం’ చేస్తున్నారు. అంతేకాదు క్రమంగా ఈ ప్రభావం పాకిస్థాన్ పొరుగున్న ఉన్న భారత భూభాగంలోని కాశ్మీరుకూ, చైనాలోని జింజియాంగ్‌కూ విస్తరించేలా చూడాలన్నది తాలిబన్ మతవాదుల పన్నాగం.
 
 పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో తమకు అనుకూల ప్రభుత్వాలను స్థాపించుకోవాలని కలలు కంటున్న తాలిబన్, లష్కరే తోయిబాలు ఇండియాతో ఘర్షణపడుతూ ఉగ్రవాద అనుబంధ సంస్థలుగా పనిచేస్తాయి. కాని వాటికి ఇవి ఒక సైద్ధాంతిక నాణేనికి రెండు పార్శ్వాలని చెప్పవచ్చు. దక్షిణ, సెంట్రల్ ఆసియా నుంచి నాటో దళాలను ఉపసంహరించుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే పత్రికలలో చూచాయిగా వార్తలొస్తున్నాయి. మతఛాందస శక్తులలో ఒకవిధమైన విజయగర్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మతఛాందస శక్తులు కొంతసేపు విరామం తీసుకుని మళ్లీ పుంజుకుని ‘ముస్లిం భూభాగాల’ ‘విముక్తి’ కోసం జరుగుతున్న సుదీర్ఘ మార్చ్ దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, చైనాలో ముస్లిమ్‌లకు లౌకిక వ్యవస్థను వారు ఎంతమాత్రం అంగీకరించరు.  
 
 అఫ్ఘానిస్థాన్ నుంచి 20 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ నిష్ర్కమించిన తర్వాత జమ్మూకాశ్మీర్‌లో శాంతిని కాపాడడం భారత సైన్యానికి ఎంత సవాల్‌గా మారిందో మనకు తెలుస్తూనే ఉంది. దక్షిణ రష్యా, సెంట్రల్ ఆసియా మాదిరిగా చైనాపై కూడా ఉగ్రవాదులు కన్నేశారు. చైనాలోని ఒక రైల్వే స్టేషన్‌లో ఇటీవలే కొంతమంది సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించి నరమేధం సృష్టించారు. చైనాలోని ఏకైక ముస్లిమ్ మెజారిటీ రాష్ట్రమైన జింజియాంగ్‌లో ఉగ్రవాదం పెచ్చుపెరిగింది. దీన్ని చైనా పాలకులు ఎంతగా దాచిపెట్టాలన్నా అది ఎప్పటికప్పుడు బయటపడిపోతోంది. ఉగ్రవాదులు భవిష్యత్తులో పాకిస్థాన్‌ను తమ కోటగా వాడుకోవడం కొనసాగిస్తే, పాక్‌తో తమ సంబంధాల వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో చైనా ఇప్పుడు పునస్సమీక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో భారత్ కూడా తన విధానాన్ని సమీక్షించుకోవాలి. ఉగ్రవాదులను అణచివేసేందుకు తీసుకునే కఠిన చర్యలు బహుముఖ పోరుకు దారితీస్తే దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పోరుకు ఇండియా సిద్ధంగా లేదని స్పష్టంగా తేలిపోతోంది.
 
 గత ఐదేళ్లుగా యూపీఏ ప్రభుత్వం రక్షణ రంగంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల భారత రక్షణ రంగ సన్నద్ధత కొరవడింది. గత 8 ఏళ్లుగా రక్షణమంత్రిగా కొనసాగుతున్న ఏకే ఆంటోనీ ఒక అచేతనమైన నాయకుడిగా, స్తబ్దుగా వ్యవహరించి దేశ రక్షణావసరాలను గుర్తించకుండా గాఢనిద్రలో గడిపేశారు. ఆయన జమానాలో భారత రక్షణ సామర్థ్యం గణనీయంగా బలహీనపడింది. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. అయినా ఆంటోనీగారు నిద్రమబ్బు వీడలేదు. భారత రక్షణ పరికరాలు నాసిరకంగా ఉన్నాయి. నావికాదళాన్ని పట్టిపీడిస్తున్న నిర్లక్ష్య వ్యాధి లక్షణాలకు నిదర్శనమే ఇటీవల నేవీలో వరుసగా జరుగుతున్న అనేక ప్రమాదాలని వేరే చెప్పనక్కర్లేదు. ఇది నావికాసిబ్బంది మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. నావికాదళంలో అనేక ప్రమాదాలు సంభవించినా రాజకీయ నాయకులు బాధ్యత వహించిన పాపాన పోలేదు.  శత్రువు మన తలుపు పక్కకు వచ్చి నక్కాడు. అయినా ఆంటోనీ ఇంకా మత్తులో జోగుతున్నాడు.
 
 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్‌నాటికల్లా కొత్త రక్షణ మంత్రి రావచ్చు. రక్షణ రంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికీ, పునర్‌నిర్మించడానికి ఎంతో వ్యవధి పడుతుంది. కాని మనకు అంత సమ యం లేదు. దక్షిణాసియాలో పరిస్థితులు వేగంగా మారి పోతున్నాయి. అవి మంచి మార్పులు అనుకోడానికి లేదు. కొత్త ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భారత విదేశాంగ విధానంలో కొత్త మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉంది. శత్రువుకు శత్రువు మనకు తప్పనిసరిగా మిత్రుడు కావల్సిన అవసరం ఏమీ లేదు. కాని యుద్ధక్షేత్రంలో అతను సహచరుడు కావచ్చు. భారత్, చైనా పరస్పరం అనుమానించుకోవడం కన్నా సహకరించుకుంటేనే మంచిది. సెంట్రల్ ఆసియాలో ఉన్న ప్రమాదాల గురించి రష్యాకు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తుపాకులు పట్టుకుని సంచరించే మతోన్మాదుల గురించి పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాల్సిందే.
 
 చైనా, పాకిస్థాన్ ఏం చేయాలో అవి తేల్చుకోవాలి. ఉగ్రవాదులను అణచివేయాలన్నా, ఇతర దేశాలపై యుద్ధం చేయాలన్నా అది భారతే చేయాల్సి ఉంటుంది. మన తరఫున మరో దేశం యుద్ధం చేయదని భారత్ గుర్తిస్తే మంచిది. ఇంకో విషయం... ఎప్పటికైనా సైన్యాలే యుద్ధాలు చేయాలి. యుద్ధంలో శత్రుదేశాన్ని మట్టికరిపించే సత్తాగల సైన్యం మనకు ఉందా? ఆలోచించాల్సిందే!    
 
 బైలైన్: ఎంజే అక్బర్ (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement