కేంద్ర బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి రూ.6,81,210 కోట్లు కేటాయించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ భద్రతా భూభాగంలో సాయుధ దళాలను ఆధునీకరించడానికి వ్యూహాత్మక నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. రక్షణ సామర్థ్యాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
రక్షణ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు
మూలధన వ్యయం: రూ.1,92,387 కోట్లు
మూలధన వ్యయంలో కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక హార్డ్‌వేర్లలో పెట్టుబడులు పెడుతారు. 2024-25లో మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లు కాగా, సవరించిన అంచనాలు రూ.1,59,500 కోట్లుగా ఉన్నాయి.
రెవెన్యూ వ్యయం: రూ.4,88,822 కోట్లు
ఇందులో రోజువారీ నిర్వహణ ఖర్చులు, జీతాలు, పింఛన్లు ఉంటాయి. సైనిక పింఛన్లకు రూ.1,60,795 కోట్లు కేటాయించడం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతోందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
ఆధునీకరణపై దృష్టి
పెంచిన బడ్జెట్ కేటాయింపులు భారత సాయుధ దళాలలో ఆధునికీకరణ అవసరాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి. ఆపరేషనల్ సంసిద్ధతను పెంపొందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై పెట్టుబడి పెట్టనున్నారు. సైనిక స్థావరాలు, శిక్షణ సౌకర్యాలు, లాజిస్టిక్స్‌తో సహా రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయి. పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్ధారించడానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, విమానాలు, నౌకాదళ నౌకలను కొనుగోలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment