చరిత్రకు ఎవరైనా ఒక్కటే! | Scottish nationalism marches towards uncertain future | Sakshi
Sakshi News home page

చరిత్రకు ఎవరైనా ఒక్కటే!

Published Tue, Sep 16 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

చరిత్రకు ఎవరైనా ఒక్కటే!

చరిత్రకు ఎవరైనా ఒక్కటే!

స్కాట్లాండ్ జాతీయవాదులు ఆధిక్యంలో ఉన్నారంటూ గత వారాంతంలో నిర్వహించిన  ఒపీనియన్ పోల్ ఫలితం వెల్లడించడంతో ఇంగ్లండ్ ఉలిక్కిపడింది. నెల క్రితం నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో స్కాట్లాండ్ జాతీయవాదులు ఇరవై శాతం పాయింట్లు వెనకబడి ఉన్నారు. ఎటూ తేల్చుకోని ఓటర్లలో సగం మంది ఇప్పుడు విభజనకే మొగ్గు చూపుతున్నారని తేలింది.
 
 దేశ విభజన అంటే బ్రిటిష్ వాడి కత్తితో మనకు మనం చేసుకున్న లోతైన గాయమని నమ్మే భారతీయుడికి ఆ దేశం గురించిన ఓ ఆలోచన ఎంతో కొంత సంతృప్తిని కలిగించకుండా ఉండదు. సెప్టెంబర్ 18న అక్కడ జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్ రెండు ముక్కలుగా చీలిపోవచ్చునన్న ఆలోచన అది. చరిత్రకు న్యాయం జరిగిందని అనిపించడం అరుదే అయినా, ప్రతీకారం లాంటిది ప్రతిధ్వనిస్తున్నప్పటికీ అన్నింటినీ పక్కనపెట్టి జరుగుతున్నది చూసి మనం సంతోషించగలం.
 
 ఇంగ్లండ్‌తో మూడు శతాబ్దాలుగా సాగిస్తున్న ఐక్యతను కొనసాగించే విషయం మీద సెప్టెంబర్ 18న ఓటుతో స్కాట్లాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. ఈ భూమండలం మీద ఎక్కడైనా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఆవిష్కృతమైందా? బ్రిటన్ ఆత్మాతిశయంతో కూడిన ఒక సమష్టి మనస్తత్వం కలిగిన ఊహాప్రపంచం. రెండుమూడు పార్టీల ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్కాట్ ప్రాంత జాతీయవాదులకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు అవకాశం ఇవ్వడానికి అంగీకరించినందుకు చాలా ఆనందపడింది. స్కాట్లాండ్ వాసులు విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని సంపూర్ణంగా విశ్వసించడమే ఇందుకు కారణం. ఇలాంటి ధోరణి లండన్ నగరంలో మరీ విపరీతంగా ఉంది. ఎప్పుడూ దిలాసాగా ఉండే లండన్ మేయర్ బోరిస్ జాన్సన్‌కు ఇతర విషయాల కంటె గ్లాస్గో పబ్‌లలో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడడమే ఎక్కువ ఇష్టం.
 
  స్కాట్లాండ్‌లో తగినంత ప్రచారం చేయడం గురించి ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా ఒక వారం క్రితం వరకు పెద్దగా పట్టించుకోలేదు. సంప్రదాయ పంథాలో నడిచే ‘స్పెక్టేటర్’ పత్రిక (ఒకప్పుడు జాన్సన్ ఈ పత్రిక సంపాదకుడు) ప్రముఖ కాలమిస్టుల రచనల నుంచి కొన్ని భాగాలను తీసి ప్రచురించింది. ఆగస్టు మధ్యలో ప్రచురించిన ఈ భాగాలలో కేవలం ‘స్కాట్లాండ్ ముక్క’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు స్కాట్లాండ్‌లో ఇంకా డోలాయమాన స్థితిలో ఉన్నవారికి విభజనకే ఓటు వేయండి, అంటే ‘ఎస్’ అని చెప్పండి అంటూ ఇంగ్లిష్ ప్రముఖులు సంతకాలు చేసిన లేఖలు కూడా ఇవ్వగలరు. మీ సొంత బీరు, సొంత విమానయానం ఉంటే తప్ప మీది అసలు సిసలు దేశం కాలేదంటూ హాస్య చతురత అతిశయించిన ఆంగ్లేయులు తీర్మానించేశారు. స్కాట్లు స్కాచ్ అంటే ఇష్టపడతారు.
 
 అయితే స్కాట్లాండ్ జాతీయవాదులు మొదటిసారి ఆధిక్యంలో ఉన్నా రంటూ గత వారాంతంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితం వెలు వడడంతో ఇంగ్లండ్ ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ, ఒక నెల క్రితం నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో స్కాట్లాండ్ జాతీయవాదులు ఇరవై శాతం పాయింట్లు వెనకబడి ఉన్నారు. విభజనకు ఓటు వేయాలో, ఐక్యత వైపు మొగ్గాలో ఇంతవరకు తేల్చుకోని ఓటర్లలో సగం మంది, ఇప్పుడు విభజన దిశగానే చూస్తున్నారని తేలింది. అమెరికా కాలనీ నుంచి తిరిగి వచ్చిన కారన్‌వాలిస్ యుద్ధంలో జార్జి వాషింగ్టన్ గెలిచాడని చెప్పిన క్షణంలో అంతకు ముందెన్నడూ అంత తీవ్రంగా లండన్ బెదిరి ఉండకపోవచ్చు. దృఢమైన వాదనే ఒప్పించ గలిగింది. స్కాట్లాండ్ ఇంగ్లండ్‌ను వీడిపోలేదు. అది ప్రపంచంలో ఒకటైంది. నిజానికి 18న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు విభజనకు అనుకూలంగా ఓటు వేస్తారన్నది ఇప్పటికీ నిశ్చయమేమీ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం. గెలుపును నిర్ణయించే మార్జిన్ ఓట్లు అతి స్వల్పంగానే ఉంటాయి. కాగా, గ్రేట్ బ్రిటన్ బతికి బట్టకట్టగలిగినా కూడా ఒకింత రాజకీయ ఐక్యతతో ఉంటుందే తప్ప, భౌగోళిక ఐక్యతకు నోచుకోదు.
 
 స్కాట్లాండ్‌కు ఎప్పుడూ తనదైన ఒక ఫుట్‌బాల్ ఆటగాళ్ల బృందం ఉంది. అయితే ఈ బృందం ఇంగ్లండ్ బృందం కంటే ఎప్పుడూ మెరుగ్గా లేదన్నది నిజం. అయినా ఆ క్రీడ ద్వారా ఉనికిని చాటుకోవడానికి వారికి ఉన్న హక్కుకు నీళ్లు వదులుకోవడం మంచిద ని స్కాట్లాండ్‌ను ఒప్పించడానికి ఇంగ్లండ్ ఏనాడూ ప్రయత్నించలేదు. ఫుట్‌బాల్ ఆట పురాతనత్వానికి ప్రతీక. దానిని పాలన కోసం చేసుకున్న ఆధునిక ఏర్పాట్లు తుడిచిపెట్టలేవు. తీర్పు మాటెలా ఉన్నా, ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఒక స్ఫూర్తిని పునరుజ్జీవింప చేయవచ్చునని అనిపిస్తుంది. పౌండ్ అనే కరెన్సీతో కొనడం సాధ్యం కాని స్ఫూర్తి అది.
 
 కలిపి ఉంచాలన్న తమ ప్రయత్నాలు విఫలమైతే బ్రిటన్ అనుకూల లాబీ గుండె చెదరవచ్చు. ఒకవేళ విజయం ఆ లాబీని వరిస్తే, ఆ విజయాన్ని ఇంకా గుర్తించవలసి ఉన్నప్పటికి కూడా దానికి చాలా మూల్యం చెల్లించి బ్రిటన్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. అది బ్రిటన్ చిరకాలం పాటు భరించలేనంత మూల్యం. యాభై లక్షల సమూహంతో సాంస్కృతికంగా, ఆర్థికంగా బలంగా ఉండే ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలిగిన సామర్థ్యం తాము కలిగి ఉన్నామని ఇప్పటికే ఎక్కువ మంది స్కాట్లు నమ్మకానికి వచ్చారు. ఈ రెండు కూడా యునెటైడ్ కింగ్‌డమ్‌లో సాధ్యమేనని లండన్ నిర్ధారించవలసి ఉంది. ఇలాంటి స్కాట్లాండ్‌కు కావలసిన ముద్రను ఎవరు ఎంపిక చేయగలరు? ఒకే పతాకం కింద ఉండాలని ముందు నుంచి చెప్పిన ఇంగ్లిష్ భాషే.
 
 ఇక సెప్టెంబర్ 18, 2024న ఇంగ్లండ్‌లో ఇంగ్లిష్ స్వాతంత్య్రం కోసం బ్రిటన్ ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి ఇక అడ్డం ఏమిటి? ఈ ఆలోచనను కొట్టి పారేయవద్దు. పడుగుపేకల వంటి ఈ దేశాలలో ఇంకా విచిత్రమనిపించే సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్, స్కాట్లాండ్‌ల వైవాహిక జీవితం ఇక ముగిసిన అధ్యాయం. విడాకుల తతంగం విఫలమైతే, అందుకు కారణం ఒక భాగస్వామి దీర్ఘకాలం పాటు మనలేని ఆర్థిక షరతులు విధించడానికి ప్రయత్నిస్తూ ఉండడమే.
 
 ఒకప్పుడు ఈ వైవాహిక జీవితం సజావుగా సాగిన మాట నిజమే. ఎందుకంటే ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లు కలసి సంతానాన్ని సృష్టించాయి. ఆ సంతానాన్ని సాకాయి. ఆ సంతానం నుంచి ఆ రెండు ప్రాంతాలు కూడా విశేషంగా లబ్ధి పొందాయి. వాటినే కాలనీలు అని పిలిచారు. సంపద్వంతమైన భారత్ కూడా ఆ కుటుంబంలో ఒకటి. మిగిలిన సంతానం వలెనే భారత్ కూడా పెరిగి పెద్దదై, తన కాళ్ల మీద తాను నిలబడింది. ఈ సంతానం ఇప్పుడు చుట్టం చూపుగానే ఇంగ్లండ్‌ను చూస్తున్నది.

అంత వరకే. ఇప్పుడు భారతీయులు ఎలిజబెత్ అనే పేరు గల అమ్మను చూడ్డం కంటే అంకుల్‌ని చూడ్డానికి ఎక్కువ తహతహలాడుతున్నారు. ఆయన పేరు శామ్. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ బాగానే స్థిరపడ్డారు. కానీ ఒకరికి ఒకరు ఏమీ కానట్టు వ్యవహరిస్తున్నారు. సెంటిమెంట్ అంటే పెద్దగా పట్టింపు లేని స్కాట్లాండ్ ఇప్పుడు మరింత వాస్తవికంగా వ్యవహరించదలిచింది. విభజనకు వేళయిందని భావిస్తోంది. ఇంగ్లండ్ ఇప్పుడు ఎలాంటి భరణం లేకుండానే కొత్త హనీమూన్ కోసం బెదిరిస్తోంది. ఏం జరుగుతుందో మనం చూస్తాం. ప్రాథమికంగా చెప్పాలంటే బంధపు శ్వాస మాత్రం ఆగిపోయింది. దానిని ఇప్పుడు ఖననం చేయకుంటే, తరువాతైనా ఆ పని చేయక తప్పదు.
 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
 - ఎం.జె. అక్బర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement