దార్శనికతతోనే ఈ ముందడుగు
బైలైన్
భారత్-పాకిస్తాన్ సంబంధాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగానూ, ముందు జాగ్రత్తతోనూ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రెండవది అత్యంత కీలకమైనది. శాంతి ప్రక్రియకు వెన్నుపోటు పొడిచేవారు ప్రస్తుతం తాత్కాలిక మౌనం పాటిస్తున్నారంతే. సరిహద్దులు నెత్తురోడుతుంటే మొత్తంగా వాతావరణమే పాడైపోతుంది. రెండు దేశాలూ దీన్ని గుర్తించాయి. ఇరుదేశాలు ఇలా శాంతి వైపు మొగ్గడానికి ప్రధాన కారణం భారత్, పాక్‌ల ప్రజాభిప్రాయం అందుకు బ్రహ్మాండమైన మద్దతును తెలుపుతుండటమే.
చరిత్ర, భౌగోళికత, భావజాలం, విద్రోహం, అనిశ్చితి, తప్పుడు అంచనాలలో ప్రతి ఒక్కటీ భారత్-పాకిస్తాన్ సంబంధాలను దుర్బలం చేయగలుగుతాయి. 1947లో, స్వాతంత్య్రం లభించిన పది వారాల్లోగానే పాకిస్తాన్ కశ్మీర్ కోసం మొదటి యుద్ధాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి సమరోత్సాహులు ఇరు దేశాల సదుద్దేశాల శవాన్ని విద్వేషపూరిత వస్త్రంలో చుట్టి, పదేపదే కప్పెట్టేస్తూనే ఉన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రకటిత, అర్ధ ప్రకటిత, అప్రకటితమైనవనే సూక్ష్మ ప్రమాణాలలో యుద్ధం సాగుతూనే ఉంది. అది సత్సంకల్పాలతో కూడిన ప్రయత్నాలను సైతం దుర్బలపరచి, యథాతథ స్థితికి తిరోగమించేలా చేసింది.
భారత్, పాకిస్తాన్‌ల భావజాలాలు ఒకదానికొకటి హానికరమైనవి కాకు న్నా, ఒకరి లక్ష్యాలు మరొకరికి అర్థమయ్యేవి కావు. ఇరు దేశాల మధ్య సంఘ ర్షణపైనే ఆశలు పెట్టుకున్నవారు ద్వైపాక్షిక సమాచార సంబంధాల బాట పొడవునా మందు పాతరలను ఉంచారు. అనిశ్చితి తప్పుడు అంచనాలకు తల్లి. వారసత్వంగా సంక్రమించే సమస్య లెప్పుడూ ప్రమాదపూరితమైనవి గానే ఉంటాయి. వ్యూహాత్మక పర్యావరణ వ్యవస్థకు భవిత బందీగా ఉంటుం ది. కాబట్టే ఒక దేశ రక్షణ మంత్రి అంతటివారే యాథాలాపంగా అణ్వాయు ధాల గురించి ప్రస్తావించేస్తారు. బహుశా అందుకూ సమంజ సమైన కారణమే ఉండొచ్చు. అధినేత శాంతి కపోతం అన్వేషణకు ప్రాధాన్యాన్నిస్తున్న ప్పుడు యుద్ధోన్మాదుల ఆకలిని తీర్చడానికి భీకర సమర నినాదాలను ఉపయోగిస్తుంటారు.
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆచితూచి వ్యవహరిస్తుండటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. క్రితంసారి ఆయన భారత్‌తో శాంతి కోసం ప్రయత్నించినప్పుడు అధికారాన్ని కోల్పోయారు. అంతేకాదు, సైనిక తిరుగు బాటులో ప్రాణాలు పోయినంత పనైంది. ఆయన తదుపరి అధికారంలోకి వచ్చిన జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ కొంత సమరోత్సాహాన్ని ప్రదర్శించినా, ఆ తర్వాత శాంతి ప్రక్రియ కొనసాగేలా చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆగ్రాలో జరిగిన భారత్-పాకిస్తాన్ శిఖరాగ్ర చర్చల కీలక ఘట్టంలో ఆఖరు నిమిషంలో ధైర్యాన్ని చూపలేకపోయారు. నవాజ్ రాజకీయాలు, దూరదృష్టి ఆయనకు రెండో అవకాశాన్ని ఇచ్చాయి. మరో ప్రయత్నం చేసే సాహసాన్ని ఆయన చూపారు. ఆ వైఫల్యం అనుభవం పాకిస్తాన్, భారత ప్రభుత్వాలు రెంటికీ సాఫల్యం దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో బాగా ఉపయోగపడ్డాయి.
ప్రజాస్వామిక లాంఛనాల పటాటోపం సద్దుమణిగాక, భారత ప్రజాభి ప్రాయమనే మహా తెలివైన ధర్మాసనం ఇంకా ఒక కీలక ప్రశ్నకు సమాధానాన్ని కోరుతూనే ఉంటుంది: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో ఇలా చొరవ చూపడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుందన్న విశ్వాసం ఆయనకు ఉండటం వల్లనేనా? పరస్పర శాంతియుత వాతావరణం లో పేదలకు సౌభాగ్యాన్ని అందించగలిగే విధంగా ‘సార్క్’ను పునరుజ్జీవింప జేయాలనేది ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక యోచన. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు ఈ కలను సాకారం చేయడానికి కావాల్సిన చివరిదీ, కీలకమై నదీ అయిన మౌలిక భాగం. ఢిల్లీలో జరిగిన తన ప్రమాణ స్వీకారానికి సార్క్ నేతలందరినీ ఆహ్వానించడంతోనే మోదీ అందుకు పునాదులను వేశారు. ఆయన చూపిన ఈ చొరవకు నవాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి చెంది ఉంటారు. కానీ, ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. మునుపు కూడా జరిగినట్టే శాంతిప్రక్రియకు విఘాతం కలిగించేవారు ఈసారీ జోక్యం చేసుకుంటున్నారు. కానీ మోదీ ఈ విషయంలో తన దృక్పథానికే దృఢంగా అంటిపెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అపూర్వ కృషితో సుస్థిర వేగంతో ఆయన ఇతర సార్క్ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేశారు. మోదీ నేపాల్, బంగ్లాదేశ్ పర్యటనలు మన దౌత్యచరిత్రలో ముఖ్య మలుపులుగా మిగిలిపో తాయి.
పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించకుండా ఉండి ఉండ దు. ఇరుగుపొరుగులను భారత్‌కు శత్రువులుగా మార్చి చుట్టిముట్టేయ డం అనే దాని పాత దుష్ట వ్యూహం నేడు తలకిందులైంది. దాని స్థానే ‘‘ఒకటి మినహా సార్క్ దేశాలన్నీ’’ అనే గుసగుస నెలకొంది. భారత ప్రభుత్వంలో సైతం ఈ వైఖరికి కొందరు సమర్థకులున్నారు. మనం పాక్ చేసే మరో సాహసాన్ని ఎదుర్కొనడం కంటే ఇప్పుడున్న యథాతథ స్థితిని కొనసాగిస్తేనే పాకిస్తాన్‌మనకు సురక్షితమైనదిగా ఉంటుందని వారి వాదన. కానీ ప్రధాని సార్క్, ఉపఖండాల భవిత గురించిన కలను వదులుకోడానికి సిద్ధంగా లేరు.
అయితే చేతల్లోకి దిగడానికి ముందే పాకిస్తాన్ నుంచి సానుకూల ప్రతిస్పందన ఉంటుందనే నమ్మకం కలగాలనే ముందు జాగ్రత్త వహించాల నేది వివేచన విధించే ముందు షరతు. జనవరి చివరి వారంలో సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను విదేశాంగశాఖ కార్యదర్శిగా నియమిం చారు. ముమ్మరంగా ఉన్న పలు కార్యక్రమాల నడుమ ఆయన చడీ చప్పుడు లేకుండా ఇస్లామాబాద్‌కు వెళ్లి వచ్చారు. అక్కడ ఏం జరిగిందనేది మనం తెలుసుకోజాలమనేది సుస్పష్టమే. కానీ ఆ తర్వాతి నుంచే తిరిగి ఈ క్రమం ముందుకు కదులుతోం దని ఉహించడానికి పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు.
ఆగ్రా శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదాన్ని నిర్వచించే దగ్గరనే చర్చలు విఫలమయ్యాయి. ఉగ్రవాదానికి అర్థంపై ఏకాభిప్రాయం చాలా కీలకమై నది. దాన్ని నేడు సాధించగలిగారు. పర్యవసానంగా, 2008 ముంబై ఉగ్ర దాడులకు సూత్రధారులుగా ఆరోపణలను ఎదుర్కొంటున్నవారి విచారణను వేగవంతం చేయడానికి పాకిస్తాన్ అంగీకరించింది.
అయితే మొత్తంగా ఈ ప్రయత్నాలనన్నిటినీ ఒక కొలిక్కి తెచ్చింది మాత్రం.. ప్రధాని మోదీ 2016 సార్క్ శిఖరాగ్ర సమావేశాలకు పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించడమే. ఇప్పుడు రష్యాలోని ఉఫాలో జరిగిన మోదీ-నవాజ్ చర్చలను, 2014నాటి ప్రమాణ స్వీకారంతో ముడిపెట్టేది అదే. విస్తరిస్తున్న సంఘర్షణలకు నిలయంగా ఉన్న ఉపఖండాన్ని ఆర్థిక వృద్ధితో శక్తివంతమైన నూతన ఉపఖండంగా మార్చాలనే మోదీ లక్ష్యంతో ముడిపడిన నిర్ణయమే ఇది. సమస్యలన్నీ పరిష్కారం కాగలవని మతి సరిగా ఉన్నవారెవరూ అనరు. పరస్పర అంగీకారయోగ్యమైన యంత్రాంగాల ద్వారా వాటిని పరిష్కరిం చుకోవచ్చు. వాజ్‌పేయి 2004లో తిరిగి ఎన్నికై ఉంటే ఆగ్రా శిఖరాగ్ర సమావేశం తదుపరి చేపట్టాల్సిన చర్యగా మరో సమావేశం జరిగి ఉండేదే.
జాగ్రత్తగా ఉండటం మాత్రమే సరిపోదు. భారత్-పాకిస్తాన్ సంబం ధాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగానూ, ముందు జాగ్రత్తతోనూ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రెండవది అత్యంత కీలకమైనది. ఈ శాంతి ప్రక్రియకు వెన్నుపోటు పొడిచేవారు ప్రస్తుతం ఉపాయంగా తాత్కాలిక మౌనం పాటిస్తున్నారే తప్ప మరణించలేదు. సరిహద్దుల్లో సుస్థిరత నెలకొనడమే ఈ క్రమానికి కీలక పరీక్ష అవుతుంది. సరిహద్దులు నెత్తురోడుతుంటే మొత్తంగా వాతావరణమే పాడైపోతుంది. రెండు దేశాలూ దీన్ని గుర్తించాయి. సరిహద్దు ల్లోని ఉద్రిక్తతలను, ఘటనలను కనిష్టం చేయడం కోసం జాతీయ భద్రతా సంస్థల స్థాయిలోనూ, సైనిక స్థాయిలోనూ సమావేశాలకు కార్యక్రమం సిద్ధమైంది. అయితే తీవ్ర స్థాయి ఉగ్రవాద చర్యలు ఈ పరిస్థితిని అంతటినీ అస్థిరతకు గురిచేయగల పర్యవసానాలకు దారితీయగలిగినవి. పైకి చెప్పక పోయినా, ఉన్న అతి పెద్ద ముప్పు అదే. ఇరు దేశాలు ఇలా శాంతి దిశగా ఇలా శక్తియుక్తులను పెద్ద ఎత్తున బదలాయిచడానికి ప్రధాన కారణం భారత్, పాకిస్తాన్‌లలోని ప్రజాభిప్రాయం అందుకు బ్రహ్మాండమైన మద్దతును తెలుపుతుండటమే.గతాన్ని అధిగమించి ప్రజలు ఎదిగారు. ఎందుకంటే ఇదే భవితను మార్చడానికి ఉన్న ఏకైక మార్గమని వారికి తెలుసు.
ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు