పాక్ వర్సిటీలో నరమేధం | University massacre in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్ వర్సిటీలో నరమేధం

Published Thu, Jan 21 2016 1:02 AM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

పాక్ వర్సిటీలో నరమేధం - Sakshi

పాక్ వర్సిటీలో నరమేధం

విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించిన తాలిబాన్ ఉగ్రవాదులు
20 మంది మృతి


 ఆర్మీ చేతిలో మొత్తం
♦ నలుగురు ఉగ్రవాదుల హతం
♦ దాడిని ఖండించిన ప్రణబ్, మోదీ
 
 పెషావర్: పాకిస్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో బుధవారం తాలిబాన్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. వర్సిటీలోకి చొరబడి.. విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దాడిలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ సహా కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందివరకు తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్‌కు సుమారు 50 కి.మీ.ల దూరంలో, వాయువ్య పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలోని చార్‌సద్దాలో ఉన్న ప్రఖ్యాత బాచాఖాన్ విశ్వవిద్యాలయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జాతీయ నేత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అలియాస్ బాచాఖాన్ పేరుమీద ఏర్పాటు చేసిన ఆ వర్సిటీలో దాదాపు 3 వేల మంది విద్యార్థులతో పాటు బచాఖాన్ వర్ధంతి సందర్భంగా అక్కడ జరుగుతున్న కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన 600 మంది అతిథులు కూడా ఉన్నారు.

గ్రెనేడ్లు, ఆధునిక ఆయుధాలతో వర్సిటీ గోడ దూకి లోపలకి వచ్చిన నలుగురు ఉగ్రవాదులు తరగతి గదుల్లో, హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.  సమాచారం అందగానే హుటాహుటిన యూనివర్సిటీకి చేరుకున్న సైనిక దళాలు, ప్రత్యేక శిక్షణ పొందిన కమెండో దళాలు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ప్రారంభించాయి. రెండు వేర్వేరు భవనాల్లో దాగి కాల్పులు జరుపుతున్న నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. వర్సిటీలోని భవనాలను జల్లెడ పట్టి, టైస్టులెవరూ మిగిలి లేరని నిర్ధారించుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

ఆపరేషన్ ముగిసిందని, నలుగురు టైస్టులను తమ దళాలు హతమార్చాయని ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ స్వయంగా యూనివర్సిటీకి వెళ్లి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ఉగ్రదాడి సమాచారం తెలియగానే భయాందోళనలతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వర్సిటీకి చేరుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ  ‘తెహరీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్’ తెలిపింది. ఏడాది క్రితం పెషావర్ సైనిక స్కూళ్లో దాడి అనంతరం భద్రతాదళాల చేతిలో తమవారెందరో హతమయ్యారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడ్డామని ఆ సంస్థ ప్రతినిధి మన్సూర్ చెప్పారు. పెషావర్‌లోని ఓ సైనిక స్కూళ్లో 2014, డిసెంబర్‌లో తాలిబాన్ ఇదే తరహాలో నరమేధం సృష్టించి 150 మంది చిన్నారుల ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దానికే  మన్సూరే సూత్రధారి.

 అంతు చూస్తాం: షరీఫ్
 పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్, విపక్షనేత ఇమ్రాన్ ఖాన్ తదితరులు దాడిని త్రీవంగా  ఖండించారు. అమాయక విద్యార్థులను అన్యాయంగా చంపేసిన హంతకులకు మతం లేదని, పాక్‌లో ఉగ్రవాదం అంతానికి కట్టుబడి ఉన్నామని నవాజ్ అన్నారు. జాలి లేకుండా విరుచుకుపడ్తామని ఉగ్ర సంస్థలను హెచ్చరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు జ్యూరిక్ వెళ్లిన షరీఫ్.. అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు.  యూకేలో ఉన్న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా సీఎం పర్వేజ్ ఖటాక్.. స్వదేశానికి పయనమయ్యారు. దాడిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
 
 విద్యార్థులకు తన ప్రాణం అడ్డేసిన అధ్యాపకుడు
 పెషావర్ ఘటనలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరమరణం
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ హమీద్ హుస్సేన్ (34), వారి కోసం ప్రాణాలను బలిచ్చాడు. విద్యార్థులను గదిలోనే ఉండమని చెప్పి.. తుపాకీ తీసుకుని.. ఉగ్రవాదులపై ఎదురుదాడి చేశాడు. బుల్లెట్లు దిగుతున్నా ఎదురుదాడి చేసి, అమరుడయ్యాడు.  బాచాఖాన్ వర్సిటీపై  మిలిటెంట్లు దాడి చేసినపుడు..  హుస్సేన్  పాఠం చెబుతున్నారు. కాల్పుల శబ్దం విన్న హుస్సేన్ విద్యార్థులెవరూ క్లాస్ వదిలి బయటకు రావొద్దని హెచ్చరించారు. తన తుపాకీని ఉగ్రవాదులపై గురిపెడుతూ బయటకెళ్లాడు. అంతలోనే ఓ బుల్లెట్ ఆయన శరీరంలోకి దూసుకెళ్లినా..  వెనక్కు తగ్గకుండా, వారిపై కాల్పులు జరిపాడు.

వారి దృష్టిని మరల్చి క్లాస్‌లోని విద్యార్థులను కాపాడాడు. ‘ఆయన  బయటికి వెళ్లగానే వర్సిటీ వెనకవైపున్న గోడదూకి పారిపోయాం’ అని ఓ విద్యార్థి తెలిపాడు. ‘ఉగ్రవాదులు గట్టిగా అరుస్తూ.. వర్సిటిలోకి దూసుకొచ్చారు. ప్రొఫెసర్‌ను చూసి ఆయనపై కాల్పులు జరిపారు. రిజిస్ట్రార్ గదిలోకి వారు వెళ్లగానే, మేం పారియాం’ అని మరో విద్యార్థి తెలిపాడు. 2014లో పెషావర్ స్కూలుపై దాడి తర్వాత ఉపాధ్యాయులు గన్ వెంట ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement