పాకిస్థాన్‌లో మోదీ ప్రయోజనాలకు పెద్దపీట: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్‌లో మోదీ ప్రయోజనాలకు పెద్దపీట: ఇమ్రాన్ ఖాన్
Published Mon, Oct 31 2016 9:53 AM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయోజనాలకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పెద్దపీట వేస్తున్నారని పాక్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీని ప్రభుత్వం ఉక్కుపాదాలతో అణిచేసి, వందమందికి పైగా అనుచరులను అరెస్టుచేయడంతో ఆయన మండిపడ్డారు. నవాజ్ షరీఫ్ లండన్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకోడానికి వెళ్లినప్పుడు ఆయన ముందుగా తన తల్లి, పిల్లలకు కాకుండా నరేంద్రమోదీకి ఫోన్ చేశారని ఆయన అన్నారు. సమాచార శాఖ మంత్రి పర్వేజ్ రషీద్‌పై వేటు వేశారు గానీ, అత్యంత రహస్య సమాచారాన్ని ఆయన తనంతట తానుగా మీడియాకు లీక్ చేయలేరని, నవాజ్ చెబితేనే చేశారన్న విషయం అందరికీ తెలుసని ఇమ్రాన్ ఆరోపించారు. అవినీతిపరుడైన ప్రధానమంత్రిని కాపాడేందుకు ప్రభుత్వ యంత్రంఆగం మొత్తం పనిచేస్తోందని తెలిపారు. ఒక నిందితుడు ప్రధానమంత్రిగా ఉండేందుకు తాను ఒప్పుకోనన్నారు. తాను బతికున్నంత కాలం నవాజ్ షరీఫ్ అవినీతిపై పోరాడుతూనే ఉంటానని ఇమ్రాన్ (64) చెప్పారు.
కాగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అమీన్ గందాపూర్ అనే నాయకుడి కారులోంచి ఐదు కలష్నికోవ్ రైఫిళ్లు, ఒక పిస్టల్, ఆరు మ్యాగజైన్‌లు, ఒక బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్, మూడు టియర్ గ్యాస్ షెల్స్, కొంత మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అయిన అమీన్ కారును చెక్‌పోస్టు వద్ద ఆపి సోదా చేయగా.. అందులో ఈ ఆయుధాలు ఉన్నాయి. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలంటూ నవంబర్ రెండోతేదీన ఇస్లామాబాద్‌ను దిగ్బంధిస్తామని ఇమ్రాన్ పార్టీ ప్రకటించింది.
Advertisement
Advertisement