Sakshi News home page

పాక్‌లో సంకీర్ణం..! 

Published Sun, Feb 11 2024 2:18 AM

Can Pakistan form a new government on split election results - Sakshi

ఇస్లామాబాద్‌/లాహోర్‌: పాకిస్తాన్‌లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ జైలుపాలవడమే గాక పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఎ–ఇన్సాఫ్‌ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు 100 స్థానాల్లో నెగ్గి ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. అయితే 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని పీఎంఎల్‌ (ఎన్‌), 54 సీట్లొచ్చిన బిలావల్‌ భుట్టోకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ మరోసారి చేతులు కలిపాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఆ రెండింటికి కలిపి 127 స్థానాలున్నాయి. శుక్రవారం రాత్రే పలు దఫాలుగా చర్చోపచర్చలు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు చేతులు కలిపేందుకు పీఎంఎల్, పీపీపీ అంగీకారానికి వచ్చాయి. మెజారిటీ సాధనకు 28 స్థానాల్లో నెగ్గిన చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం శనివారమంతా జోరుగా మంతనాలు సాగాయి. నవాజ్‌ ప్రయత్నాలు ఫలిస్తే రికార్డు స్థాయిలో నాలుగోసారి పాక్‌ ప్రధాని అవుతారు. అయితే ప్రధానిగా బిలావల్‌కే అవకాశమివ్వాలని పలువురు పీపీపీ సీనియర్‌ నేతలు డిమాండ్‌ చేస్తుండటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది! కాకపోతే సైన్యం దన్ను నవాజ్‌కు కలిసొస్తుందంటున్నారు.

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన ఇచ్చిన పిలుపుకు ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ కూడా మద్దతు పలకడం విశేషం. ‘‘రాజకీయ సుస్థిరత పాక్‌కు తక్షణావసరం. అందుకు ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి’’ అని శనివారం ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు! నవాజ్‌ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్‌కు అవకాశమిచ్చేందుకు పీఎంఎల్‌ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. మధ్యేమార్గంగా మరోసారి నవాజ్‌ సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు. దీనికి సైన్యం నుంచి కూడా అభ్యంతరం ఉండకవపోచ్చన్నది రాజకీయ వర్గాల మాట. 

యథేచ్ఛగా అక్రమాలు! 
మొత్తం 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ముగిసి రెండు రోజులు దాటినా 10 చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి తమకే మెజారిటీ సమకూరిందని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. కానీ అక్రమంగా ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఫలితాల వెల్లడిలో జాప్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Advertisement

What’s your opinion

Advertisement