యుద్ధం... బహుకృత వేషం
ఇరాక్‌లోని విషపూరితమైన ఈ ఉగ్రవాద యుద్ధ కెరటాలు అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ల మీదుగా దక్షిణాసియా వైపునకు కదలడం అనివార్యం. సంక్లిష్టమైన ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం శత్రువులను విస్పష్టంగా గుర్తించి, విజ్ఞతతో మిత్రులను ఎంచుకోవడం అత్యావశ్యకం.
అమెరికా ఇక ఎంత మాత్రమూ ‘‘ప్రజాస్వామ్యానికి భంగం కలిగేలా సుస్థిరత కోసం ప్రయత్నించదు... సకల దేశాల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను’’ పెంపొందింపజేస్తుందంటూ 2005లో నాటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ విధాన ప్రకటనను చేశారు. యుద్ధ విధ్వంసానికి గురైన ఇరాక్‌లో మొదలైన ఆ విధానం మధ్య ప్రాచ్యాన్ని, నైలు నదిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని అరబ్బు దేశాలకు విస్తరించింది. ప్రజాస్వామ్యం పెంపొందడాన్ని మెచ్చే పౌరులు ‘సకల’ పద ప్రయోగాన్ని విస్మరించరాదు. 2005 నాటికి సద్దాం హుస్సేన్ వార్త కాకుండా పోయాడు. ప్రత్యేకించి యుద్ధ లక్ష్యంగా పేర్కొన్న ఇరాక్ అణ్వస్త్ర సామర్థ్యం విస్పష్టంగా అభూత కల్పన అని తేలిపోయాక ప్రశ్న ఏమిటి నుంచి ఎందుకు అనే దిశకు మళ్లింది. దానికి సమాధానంగా ముందుకు వచ్చినది ప్రజాస్వామ్యం. పేక మేడలు కూలడం ప్రారంభం కావడంతోనే సిరియా, ఈజిప్టు, లిబియా, ట్యునీషియాల వంటి కీలక దేశాల్లో సుస్థిరత పేరిట సైన్యం మద్దతుతో నిలిచిన వంశపారంపర్య పాలనలు పునాదుల నుంచి కదులబారాయి. బరాక్ ఒబామా పదవిలో కుదురుకునేసరికి సుస్థిరత అదృశ్యమైపోయింది. ముందే జోస్యం చెప్పినట్టుగా అయిష్టంగానే అయినా ప్రజాస్వామ్య ఆగమనం తప్పదనిపించింది.
రిపబ్లికన్ స్వేచ్ఛలనే బుష్-రైస్ సిద్ధాంతాలు అస్థిరమైన వైరుధ్యాలకు బందీలయ్యాయి. అంతవరకు సుస్థిరత పేరుతోనే సైన్యాధిపతులు సైనిక కు ట్రలకు సమంజసత్వాన్ని ఆపాదించారు. అయితే బుష్ యుద్ధాన్ని ప్రజాస్వామ్యానికి మంత్రసానిగా ఉపయోగించారు. లక్ష్యాలకు, సాధనాలకు మధ్య సునిశితమైన పొంతనలేనితనం అకడమిక్ చర్చకు మించిన ప్రాధాన్యం కలి గినదిగా మారగలిగింది. ప్రజాస్వామ్యం పునాదులకు తూట్లు పడి, భావజాలపరమైన శూన్యం విస్తరిస్తుండటంతో నూతనమైన, అనూహ్యమైన తరచు గా హానికరమైన శక్తులు పుట్టుకొచ్చాయి. 1979లో సోవియట్ యూనియన్ అఫ్ఘానిస్థాన్‌పై దురాక్రమణకు పాల్పడటం మిలీషియాలను సృష్టించింది. తొలుత వాటిని పెంచిపోషించినవారి గొప్ప లక్ష్యాలను దాటి వాటి స్వంత ఎజెండా విస్తరించింది. ఇరాక్‌లోని అమెరికా 21వ శతాబ్దపు యుద్ధం దేశంలో రాజకీయ, సంస్థాపరమైన నిర్మాణాలనేవే లేకుండా చేసింది. ప్రాంతీయ అధికారం కోసం పోరాటానికి బీజాలు వేసింది. అమెరికా ఉద్దేశాలతో సంబంధం లేని షియా-సున్నీ రాజకీయ భౌగోళిక సంఘర్షణను ప్రేరేపించింది.
పైగా ప్రధానంగా పరాయి సేనలే ఈ సంఘర్షణలలో పాల్గొన్నాయి. తొలుత వాటిని ఉపయోగించుకున్నవారికి సైతం అవి ఎన్నడూ విధేయంగా ఉన్నది లేదు. సున్నీ తీవ్రవాద మిలీషియా ఐఎస్‌ఐఎస్ లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ షామ్ (సిరియా) అందుకు మంచి ఉదాహరణ. అది ఐఎస్‌ఐఎల్‌గా (సిరియాకు బదులుగా లెవాంత్) అది మొదలైంది. ప్రస్తుత సరిహద్దులను గుర్తించదు. సిరియాలోని విశాలమైన సున్నీ మెజారిటీ ప్రాంతాలపై పాలన నెలకొల్పి, ఇరాక్‌లోని కుర్దుల ఉత్తరాదికి, షియాల మధ్య ఇరాక్‌కు మధ్య చీలికలను సృష్టించడమూ, దక్షిణ ఇరాక్‌ను ‘షేక్ ఒసామా బిన్ లాడెన్’ ప్రారంభించిన పవిత్ర యుద్ధానికి స్థావరంగా మార్చడమూ దాని తక్షణ లక్ష్యం. అల్ కాయిదా ఆ పవిత్ర యుద్ధం పట్ల నిబద్ధతను నీరుగార్చిందని అది భావిస్తుంది. ఇరాక్ పరిణామాల ప్రభావం నాటకీయమైనది. ప్రాంతీయ బలాబలాల పరిస్థితిని తలకిందులు చేసిన 1979 ఇరాన్ విప్లవం తదుపరి మొట్టమొదటిసారిగా యుద్ధరంగంలో అమెరికా, ఇరాన్‌లు ఒకే పక్షాన నిలవగలిగే పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రుహానీ... ఒబామాను దెప్పి పొడుస్తున్న మాట నిజమే. అయినా ‘ఎప్పుడు అమెరికా బలగాలు ఉగ్ర మూకలకు (ఐఎస్‌ఐఎస్ అనే అర్థం) వ్యతిరేకంగా’ సైనిక చర్య చేపట్టినా దానితో సహకరించే విషయాన్ని పరిశీలించడానికి సిద్ధమేనని ఆయన అన్నారు. ఒబామా ఇరాక్‌లో కాలిన గాయాలను చూస్తూ చేతులు మూడుచుకు కూర్చోలేరు. 300 మంది సైనిక సలహాదారులను పంపడం, ఐఎస్‌ఐఎస్‌పై వైమానికి దాడులు ప్రారంభించడం ప్రస్తుతానికి ఆయన ప్రతిస్పందన. అమెరికా ప్రధాన మిత్ర దేశమైన బ్రిటన్ టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచింది, తన ఎలైట్ ఎస్‌ఏఎస్ బలగాలను బాగ్దాద్‌కు పంపింది. ఇరాన్ బలగాలు ఇప్పటికే అక్కడున్నాయి. 67 మంది సలహాదారులు సహా ఇరాన్ కుద్స్ ఫోర్స్‌తో జనరల్ ఖాసిం సులేమని అక్కడే ఉన్నారు. మొసుల్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ఎదురుదాడికి అత్యావశ్యకమైన ఇరాక్ బలగాల పునర్నిర్మాణ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఇంతటితో ఈ సంఘర్షణ ముగిసిపోతుందని కాదు. నేటి ప్రముఖ షియా మత గురువు అయాతుల్లా ఆలీ ఆల్-సిస్తానీ సున్నీ మిలీషియాలకు వ్యతిరేకంగా తన సహోదరులంతా నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
చరిత్ర దర్పణాలు పరిహాసపు దరహాసాలను ప్రతిఫలిస్తున్నాయి. 1979లో బద్దలైపోయిన బలబలాల నిర్మాణాన్ని పునరుద్ధరించేలా ఉమ్మ డి శత్రువు వారిని ఒప్పిస్తున్నాడు. యుద్ధ బడలికతో అలసిపోయిన తమ సైనిక దళాలను అమెరికాకు తిరిగి రప్పించాలనే అంశంపై ఒబామా ఎంతగా దృష్టిని కేంద్రీకరించారంటే... తాము అక్కడే వదిలి వస్తున్న తీవ్రవాద పిండం విషయాన్ని విస్మరించారు. 2011 సెప్టెంబర్‌లో ఆయన ‘యుద్ధ కెరటం వెనుకపట్టు పట్టింది’ అని ప్రకటించారు. అది తిరిగి బలం పుంజుకోవడం మాత్రమే. గత ఏడాది ఆగస్టులో ఆయన ‘అల్‌కా యిదా కాళ్లకు బుద్ధి చెబుతోంది, బలహీనపడిపోయింది’ అన్నారు. అయితే అది అంతకంటే ప్రమాదకరమైన వారసులను ఆ స్థానంలోకి తీసుకొచ్చింది. జనవరిలో ఆయన లేకర్స్ (లాస్ ఏంజెలిస్ బాస్కెట్‌బాల్ టీం) యూనిఫాం వేసుకున్నంత మాత్రాన బాస్కెట్ బాల్ ఆటగాడు అయిపోడు అంటూ ఒబామా నవ్వుతూ ఐఎస్‌ఐఎస్‌ని తీసిపారేశారు. అల్‌కాయిదా అంటే స్థావ రమని ఒబామా మరచిపోయారు. అది తీవ్రవాద కిరణాలను... భావజాలపరమైన, ఉత్తేజకరమైన, ప్రమాదకరమైన కిరణాలను ప్రసరిస్తుంటుంది.
పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లలోని పేదరికం కారణంగా తమకు ఏ మాత్రం అంతుబట్టని ప్రాంతానికి చేరిన దురదృష్టవంతులైన భారతీయులు తాము ఏ పక్షానికి చెందకపోయినా బందీలయ్యారు. అనివార్యంగా మొసుల్‌పై భూతల, గగనతల దాడులను జరపడం అనివార్యం. ఫలితంగా మన వారిని వీలైనంత త్వరగా వెనక్కు రప్పించాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. మొసుల్ ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు పొందిన, బహుశా గుర్తుపట్టగల అధికారం కింద లేదు. కాబట్టి ఆ పని అంత సులువేమీ కాదు. విషపూరితమైన ఈ యుద్ధ కెరటాలు అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లలోని విష ప్రవాహాల గుండా దక్షిణాసియా వైపునకు కదలడం అనివార్యం. ఇది శత్రువులను విస్పష్టంగా గుర్తించి, విజ్ఞతతో మిత్రులను ఎంచుకోవాల్సిన సమయం.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎంజే అక్బర్