
ICC Champions Trophy 2025: వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో క్రేజీ ఈవెంట్ క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. దాదాపు ఏడేళ్ల రీఎంట్రీ ఇవ్వనున్న ఈ ఐసీసీ టోర్నీ పాకిస్తాన్‌లో జరుగనుంది. 2017లో ట్రోఫీ గెలిచిన పాక్.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
అఫ్గనిస్తాన్ చేతిలో తొలి ఓటమి
అయితే, గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో బాబర్ ఆజం జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాక్ నిష్క్రమించింది. అంతేకాదు.. తమ వన్డే చరిత్రలో మొట్టమొదటిసారి అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమిని చవిచూసింది.
పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగా
ఈ నేపథ్యంలో దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు మళ్లీ పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వన్డే, టీ20 జట్ల పగ్గాలు చేపట్టాడు. కానీ పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగా.. పసికూన అమెరికా చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా చేరకుండానే పాక్ ఇంటిబాట పట్టడం గమనార్హం.
సంచలన విజయాలతో అఫ్గన్ సెమీ ఫైనల్‌కు
మరోవైపు.. అఫ్గనిస్తాన్ సంచలన విజయాలతో ఏకంగా సెమీ ఫైనల్‌కు చేరడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దిగ్గజ జట్లకు షాకిచ్చి టాప్-4లో నిలిచింది. అయితే, సెమీస్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగినా.. ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది.
చాంపియన్‌గా చాంపియన్‌గా
ఇక ఈ పొట్టి వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ తర్వాత జరుగబోయే తొలి ఐసీసీ ఈవెంట్ కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సెమీస్ చేరే జట్లు ఇవే
చాంపియన్స్‌ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవేనంటూ అఫ్గనిస్తాన్‌తో పాటు.. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ పేర్లను చెప్పాడు. గత కొన్నాళ్లుగా వరుస వైఫల్యాలతో చతికిల పడ్డ ఆతిథ్య పాకిస్తాన్ పేరును షాహిది పక్కనపెట్టడం గమనార్హం. కాగా అఫ్గన్ ఇటీవలే తొలిసారిగా సౌతాఫ్రికాపై వన్డే విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న జోష్‌లో ఉంది.
ఇదిలా ఉంటే.. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న చాంపియన్స్‌ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. తమకు తటస్థ వేదికలు కేటాయించాలని బీసీసీఐ కోరగా.. ఐసీసీ నుంచి ఇంత వరకు ఎలాంటి హామీ రాలేదని సమాచారం.
చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment