న్యూఢిల్లీ వేదికగా టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. బుమ్రా (4/39), హార్దిక్ (2/43), శార్దూల్ (1/31), కుల్దీప్ (1/40) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను నామమాత్రపు స్కోర్‌కు కట్టడి చేశారు.
అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో టీమిండియా సునాయాస విజయం సాధించింది. విరాట్ కోహ్లి (55 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి గల ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. బరిలోకి దిగే ముందు 300కు పైగా పరుగులు సాధించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండింది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాపై ఒత్తిడి తేవాలనుకున్నాం. ఈ విషయంలో మేం విఫలమయ్యాం. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాం.
63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన అజ్మతుల్లాకు డాట్ బాల్స్ గురించి ఆలోచించకు, క్రీజ్‌లో కుదురుకున్నాక పరుగులు వాటంతటవే వస్తాయని చెప్పాను. మేమిద్దం కుదురుకోవడంతో మేం ఓ మోస్తరు స్కోర్ చేయగలిగాం. అయితే తాము చేసిన స్కోర్‌ను డిఫెండ్ చేసుకునే అవకాశాన్ని రోహిత్ మా నుంచి లాగేసుకున్నాడు. రోహిత్ మా బౌలర్లపై ఎదురుదాడికి దిగి మా ఆశలను నీరుగార్చడు. ఈ ఓటమిని ఇక్కడితో వదిలి జరుగబోయే మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. టోర్నీలో మాకు ఇంకా ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో విజయాల కోసం ప్రయత్నిస్తాం. గతంలో జరిగిన తప్పిదాలు మున్ముందు పునరావృతం కాకుండా చూసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment