'తెలంగాణ' ప్రకటనకు నేను బాధ్యుడిని కాదు: చిదంబరం
ఢిల్లీ: తెలంగాణాపై డిసెంబర్ 9, 2009లో తాను చేసిన ప్రకటనకి సంబంధించిన పరిణామాలు, విపరిణామాలు వేటికైనా కేంద్ర యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలదే పూర్తి బాధ్యత అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. సదరు ప్రకటన తన సొంతమైనట్లు ప్రముఖ పాత్రికేయుడు ఎంజె అక్బర్ రాసిన ఒక కాలమ్‌లో వ్యాఖ్యానించడాన్ని ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకి రాసిన లేఖలో చిదంబరం ఖండించారు. "అటు ప్రధానీ, ఇటు పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా హోమ్ మంత్రి అటువంటి విధానపరమైన కీలక ప్రకటన చేయగలరా?" అని చిదంబరం ఎదురు ప్రశ్నించారు. అయితే, అక్బర్ తన వ్యాసంలో పేర్కొన్న ప్రధానాంశం గురించి చిదంబరం మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన అంశాన్ని అక్బర్ తన కాలమ్‌లో ప్రముఖంగా చర్చించారు. రాష్ట్రాల విభజన అనే విషయాన్ని మూలాల్లోంచి ఆయన చర్చకి పెట్టారు. ముఖ్యంగా తెలంగాణపై మాట్లాడుతూ, ఒక ఆర్థిక అంశాన్ని రాజకీయాంశంగా చూసి, కలగాపులగం చేయకూడదని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని ఆంటారు అక్బర్.
"ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన ముఖ్యమంత్రులు ఎందరో ఉన్నారు. కొందరు హీరోలు, మరికొందరు జీరోలు కూడా. కానీ, వారందరిలో తెలంగాణ సమస్య మూలాల్ని అర్థం చేసుకున్నది రాజశేఖర రెడ్డి ఒక్కరే. ఆయన ఆరేళ్ల హయాంలో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండు తలెత్తనే లేదు. ఎందుకంటే, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు," అన్నారు అక్బర్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో కన్నుమూశాక, రాష్ట్రం అరాచకమైపోయిందన్నారు.
ఆరిన కుంపటిని అప్పటి కేంద్ర హోమ్‌మంత్రి చిదంబరం మళ్లీ రాజేశారని, దాని వల్ల ఆత్మహత్యలకి ఆంధ్రప్రదేశ్ ఆలవాలమైపోయింద న్నారు. ఆ ప్రకటన వల్ల చిదంబరం బాగానే ఉన్నారని, రాష్ట్రమే రావణ కాష్ఠమయ్యిందని అక్బర్ తన వ్యాసంలో విమర్శించారు. రాష్ట్రం తగలబడిపోతుంటే, ప్రజలు రోడ్డెక్కి నినదిస్తున్నా కూడా యూపీఏ ప్రభుత్వం, సోనియా, రాహుల్ ..నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారన్నారు.
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా దిగ్విజయ సింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ మరొక గ్రహం అన్నట్టు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని అక్బర్ వ్యాఖ్యానించారు. చిదంబరం చేసిన ఆ తప్పిదానికి రాష్ట్రం నాలుగేళ్లుగా ఎంతో నష్టపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్తమానం మీద అక్బర్ చేసిన వ్యాఖ్యల గురించి విభేదించని చిదంబరం, దానికి తనని బాధ్యుడ్ని చేయడాన్ని మాత్రం ఖండించారు. తద్వారా, ఈ సంక్షోభ స్థితికి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని అక్బర్ చేసిన విమర్శని చిదంబరం పరోక్షంగా అంగీకరించారు.